కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బుధవారం సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె.
ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్‌లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. అంతేగాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఉద్ధేశిస్తూ ‘ వారు రాష్ట్రానికి వస్తున్నారు. కనీసం దీనిపై మాకు సమాచారం ఇచ్చే మర్యాద వారికి లేదు’అని మండిపడ్డారు.
కాగా లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఖర్గే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగమే. ప్రస్తుతం ఎన్నికల కోసం కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతా తాజాగా ప్రకటన చేయడం అధికార బీజేపీని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.
అయితే మమతా బెనర్జీ అవకాశవాది అంటూ, ఆమె సహాయం లేకుండానే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ సీఎంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన మరుసటి రోజే మమతా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
Comments
Please login to add a commentAdd a comment