కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ పార్టీకి సంబంధించిన మైనార్టీ విభాగాన్ని రద్దు చేయాలని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్‌కా సాత్ సబ్‌కా వికాశ్ నినాదం చేయవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కోల్‌కతాలో జరిగిన రాష్ట్ర బీజేపీ ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒక కొత్త నినాదాన్ని చేశారు. జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్ ( ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం)అని అన్నారు.
‘జాతీయవాద ముస్లీంల గురించి నేను మాట్లాడితే.. మీరంతా సబ్‌కా సాత్, సబ్‌గా వికాస్ అని నినాదాలు చేసేవారు. కానీ ఇక నుంచి ఆ నినాదాన్ని నేను పలకను. ఇప్పుడు నేను మరో నినాదాన్ని పలకుతాను. అదేంటి అంటే.. ‘జో హమారే సాత్, హమ్ ఉన్కే సాత్’. మీరు కూడా సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనటం మానేయండి. ఇక నుంచి మనకు మైనార్టీ మోర్చా అవసరం లేదు’అని అన్నారు. లోక్ సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనివాళ్ల కోసం ఓ పోర్టల్‌ను సువేందు అధికారి ప్రారంభించారు.
మరోవైపు.. ‘సుమారు 50 లక్షల మంది హిందూ ఓటర్లను లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయటానికి అనుమతించలేదు. అదేవిధంగా ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలో సైతం సుమారు 2 లక్షల హిందూ ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించలేదు’ అని ‘ఎక్స్’లో తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ఎంపీ స్థానాలు గెలచుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఇటీవల జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో మొత్తం అధికారం టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికల్లో తమ బీజేపీ గెలుపునుకు ముస్లీం ఓటు బ్యాంక్ అడ్డంకిగా మారిందని బీజేపీ నేత సువేందు అధికారి భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక.. కులం, మతాలకు అతీతంగా భారతీయులంతా అభివృద్ధి చెందాలని ప్రధాని మోదీ 2014లో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు ముస్లిం ఓట్లు ఆశించినంత పడకపోవటంపై సువేందు అధికారి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment