
లక్నో: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి(Rahul Gandhi Citizenship) సంబంధించిన కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ వ్యవహారం తేల్చే విషయంలో కేంద్రానికి నాలుగు వారాల గడువు విధించింది అలహాబాద్ హైకోర్టు.
రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన విగ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(ఏ) ప్రకారం ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. తాజాగా..
జరిగిన విచారణ సందర్భంగా సంచలన విషయాల పేరిట కోర్టు ముందు కొన్ని విషయాలు ఉంచారు. ‘‘రాహుల్ గాంధీ పౌరసత్వంపై యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన మెయిల్ సమాచారం మా దగ్గర ఉంది. అక్కడి పౌరసత్వ జాబితాలో రాహుల్ గాంధీ పేరు ఉంది. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మేం కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వం చెల్లదు. వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే.. భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది’’ అని శిశిర్ అంటున్నారు.
ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది నవంబర్‌లోనే ద్విసభ్య ధర్మాసనం కేంద్ర హోం శాఖ నుంచి ఈ పిటిషన్‌పై వివరణ కోరింది. అయితే అందుకు సమగ్ర వివరాల సేకరణకు గడువు కావాలని కేంద్రం కోరడంతో అనుమతించింది. తాజా విచారణలోనూ 8 వారాల గడువు కోరగా.. అందుకు నిరాకరిస్తూ 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. మరోవైపు..
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలతో 2019లోనే ఓ పిటిషన్ వేశారు. 2003లో స్థాపించబడిన ఓ బ్రిటిష్ కంపెనీ రికార్డుల్లో రాహుల్ గాంధీ పేరు యూకే పౌరుడిగా ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతకు నాలుగేళ్ల ముందే.. 2015లో అప్పటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ టీఆర్ గెడెలకు ఈ అంశంపై సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. అయితే ఆ టైంలో ప్రతిస్పందన రాలేదు. తాజాగా.. అలహాబాద్ హైకోర్టులోనూ ఒకే తరహా పిటిషన్ ఫైల్ కావడాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.
మరోవైపు.. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఆయన భారతీయుడేనంటూ చెబుతోంది. మరోవైపు ఇది తన ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నమేనని రాహుల్ గాంధీ, తన సోదరుడు పుట్టింది.. పెరిగింది ఈ గడ్డ మీదేనంటూ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంతకు ముందే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment