
కోల్‌కతా: తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలు పాల్గొని మమత మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారు. అలా అయితే మోదీ తనకోసం ఒక దేవాలయం కట్టించుకొని అందులో కూర్చోవాలి. అంతేగాని దేశాన్ని ఇబ్బందుల పాలుచేయటం మానుకోవాలని సీఎం మమత ఎద్దేవా చేశారు.
‘‘ఒక నేత మోదీని దేవుళ్లకే దేవుడు అంటారు.. మరో నేత పూరీ జగన్నాథ్ స్వామినే మోదీ భక్తుడు అంటారు. ఒకవేళ మోదీ దేవుడు అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. దేవుడు ఎప్పడు అల్లర్లను ప్రేరేపంచడు’’ అని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
‘‘అటల్ బిహారీ వాజ్‌పయి వంటి ఎంతోమంది ప్రధాన మంత్రులతో నేను కలిసి పనిచేశాను. వాళ్లు అందరూ నాతో ప్రేమగా మెలిగేవారు. మన్మోహన్‌సింగ్, రాజీవ్ గాందీ, పీవీ, దేవేగౌడ వంటి ప్రధానులతో పని చేశాను కానీ, మోదీ వంటి ప్రధానిని నేను చూడలేదు. ఇటువంటి ప్రధాని భరతదేశానికి అవసరం లేదు’’ అని మోదీపై సీఎం మమత ధ్వజమెత్తారు.
ఇటీవల ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భౌతికంగా జన్మించలేదు. తనను భూమిపైకి దేవుడే పంపాడన్న విషయం తెలిసిందే. అదేవిధంగా బీజేపీ పూరీ పార్లమెంగ్ నియోజకవర్గ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడని వ్యాఖ్యానించిన సంగతి విధితమే.
Comments
Please login to add a commentAdd a comment