ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగకుండా పీఎం మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఎంసీ. కేంద్ర ప్రభుత్వ నిధులతో మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపణలు చేసింది.
తాజాగా టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ మార్చి 15 తేదీన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాల సంబంధించి ఓటర్లకు ఫోన్ సందేశం పంపారని మండిపడ్డారు. బీజేపీ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని అడ్డుపెట్టుకొని ఓటర్లను ప్రలోభపెడుతోందని దుయ్యబట్టారు.
‘ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉపయోగించుకొని.. బీజేపీ ప్రభుత్వ ధనంతో ఓటర్లకు ఫోన్‌లో సందేశాలు పంపింది. మోదీకి అనకూలంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్యలకు పాల్పడి మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు’అని డెరెక్ ఓబ్రియన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానిమోదీ, బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి అందించిన లేఖలో డెరెక్ కోరారు.
ఈ సందేశాలు పంపడాకి అయ్యే ఖర్చును కూడా బీజేపీ, నరేంద్రమోదీ ఎన్నికల ఖర్చులో భాగం చేయాలని డెరెక్ ఓబ్రియన్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. అయితే డెరెక్ ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండించింది. డెరెక్ ఈసీ, సుప్రీంకోర్టు వద్దకు వెళ్లిన అవి అసత్య ఆరోపణలని మండిపడింది. ఇలా చేయటం వల్ల టీఎంసీ వాళ్లు బెంగాల్ ప్రజల హృదయాలను గెలుచుకోలేరని ఎద్దేవా చేసింది. మోదీ పేరుతో పంపిన వాట్సాప్ సందేశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment