![Lok Sabha Election 2024: Sujata Mondal will contest against her former husband Soumitra Khan from Bishnupur](/styles/webp/s3/article_images/2024/05/11/bishnupur.jpg.webp?itok=MkpyK0U1)
బిష్ణుపూర్ లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోటీ
పశ్చిమబెంగాల్‌లోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం మాజీ భార్యాభర్తల మధ్య రాజకీయ యుద్ధానికి వేదికగా మారింది! బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ సౌమిత్రఖాన్‌పై ఆయన మాజీ భార్య సుజాత మోండల్ బరిలో దిగారు. ఆమె టీఎంసీ తరఫున పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సౌమిత్ర విజయం కోసం అన్నీ తానై కష్టపడ్డ సుజాత, ఈసారి తన గెలుపు గ్యారంటీ అంటున్నారు. ఈ మాజీ దంపతుల దంగల్‌లో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. బిష్ణుపూర్‌లో మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది...
రాజకీయ విడాకులు...!
సౌమిత్ర ఖాన్ 2014లో తృణమూల్ పార్టీ తరఫున విజయం సాధించి బిష్ణుపూర్‌పై వామపక్షాల పట్టును బద్దలు కొట్టారు. తరువాత బీజేపీలో చేరి 2019లోనూ గెలిచారు. అనంతరం ఆయన వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు వచ్చాయి. ఉద్యోగాల ఆశ చూపి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రపై కేసు నమోదైంది.
బీజేపీలోకి మారినందునే మమత సర్కారు తనను తప్పుడు కేసులో ఇరికించిందని ఆయన ఆరోపించారు. ఈ కేసు కారణంగా 2019 ఎన్నికలప్పుడు ఆయన బంకురా జిల్లాలోకి ప్రవేశించకుండా కలకత్తా హైకోర్టు నిషేధించింది. దాంతో భర్త కోసం సుజాత అన్నీ తానై బిష్ణుపూర్‌లో ప్రచారం చేశారు. ఆమె కారణంగానే 2019లో ఖాన్ విజయం సాధించారంటారు. అయితే బీజేపీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ సుజాత 2020లో పార్టీని వీడారు.
ఈ విషయంలో భర్త తనకు మద్దతుగా నిలవడం లేదని ఆయనకూ దూరమయ్యారు! ఆమె టీఎంసీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరంబాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సౌమిత్ర విడాకులిచ్చారు. ఆ వెంటనే సుజాత తన పేరు నుంచి ఖాన్‌ను తొలగించుకున్నారు. స్థానిక ఎన్నికల బరిలో దిగి బంకురా జిల్లా పరిషత్ సభ్యురాలిగా గెలిచారు.
ఒకప్పుడు సీపీఎం కంచుకోట
బిష్ణుపూర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. 2014 దాకా సీపీఎంకు కంచుకోట. దీని పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి! తృణమూల్ రెండింట్లోనే గెలిచింది. ఈసారి సీపీఎం శీతల్ కెబర్టా అనే టీచర్‌ను బరిలో దింపింది. ఆమెకు కూడా నియోజకవర్గంలో మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాను గొప్ప పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడంతో పాటు నిరుద్యోగం, నీటి కొరత సమస్యలను పరిష్కరిస్తానన్న హామీలకు ప్రజలు బాగా స్పందిస్తున్నారు.
సౌమిత్రపై అసంతృప్తి...
తాగునీటి ఎద్దడి, రోడ్ల దుస్థితి బిష్ణుపూర్‌లో ప్రధాన సమస్యలు. ఎంపీగా ఇచ్చిన హామీలేవీ సౌమిత్రా నెరవేర్చలేదనే విమర్శ ఉంది. ఎన్నికల తర్వాత ఆయన కని్పంచనే లేదన్నది స్థానికుల ఆరోపణ. రోడ్ల దుస్థితికి తోడు నేత కార్మికుల దుస్థితి కూడా ఈ చారిత్రాత్మక పట్టణంలో మరో పెద్ద సమస్య. బిష్ణుపూర్ పట్టు చీరలకు ప్రసిద్ధి. కానీ చేనేత ఉత్పత్తులను సేకరణకు ఏర్పాట్లే లేవని కారి్మకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు తనదేనని సుజాత విశ్వాసంతో ఉన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment