భుజాన సంచి. అందులో జాగ్రఫీ పుస్తకం, ఒక జత బట్టలు. మెడలో ఎర్ర కండువా. ముఖాన చెరగని చిరునవ్వు. మండే ఎండల్లోనూ అలుపెరుగని ప్రచారం. వయసు 30 ఏళ్లు. పేరు దీప్సితా ధర్. బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం. సీపీఎం సానుభూతిపరురాలిగా మొదలై, ఢిల్లీలో విద్యార్థి నాయకురాలిగా ఎదిగి ఇప్పుడు సొంత బెంగాల్‌లో శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానం అభ్యరి్థగా బరిలోకి దిగారు. ‘ఖేలా హోబ్’ (గేమ్ ఈజ్ ఆన్) అన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా దీదీ ఇచ్చిన నినాదానికి బదులుగా ‘నేను సైతం సిద్ధం’ అంటూ తలపడుతున్నారు...
టామ్ బోయ్...
దీప్సిత పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో 1993లో జన్మించారు. తండ్రి పీయూష్ ధర్. తల్లి దీపికా ఠాకూర్ చక్రవర్తి. తాత పద్మనిధి ధర్. అంతా సీపీఎం రాజకీయాల్లో ఉన్నారు. బాల్యం నుంచి టామ్ బోయ్‌లా పెరిగిన దీప్సితకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని చూసి రాజకీయాలు చేస్తే కుటుంబానికి సమయం ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత అభిప్రాయం మారింది. దక్షిణ కోల్‌కతాలోని అశుతోష్ కాలేజీలో జియాలజీ చదివాక ఢిల్లీ జేఎన్‌యూలో జాగ్రఫీలో పీజీ, ఎంఫిల్ చేశారు. పాపులేషన్ జాగ్రఫీలో పీహెచ్‌డీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలతో అరంగేట్రం...
కోల్‌కతాలో కాలేజీ రోజుల నుంచీ దీప్సిత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ జేఎన్‌యూ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పనిచేశారు. రోహిత్ వేముల మృతి సందర్భంగా జరిగిన ఉద్యమంలో, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంగ్లి‹Ù, హిందీ, బెంగాలీల్లో అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడే దీప్సిత జాతీయ చానళ్లలో రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొంటారు. 2011లో బెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోవడం ఆమెను బాధించింది. అదే పదేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాలవైపు నడిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో సీపీఎం తరఫున రాజకీయ ఉద్ధండులతో పోరాడుతున్నారు.
మిస్టర్ ఇండియా వర్సెస్ మిస్ యూనివర్స్
రెండు నెలల ముందునుంచే దీప్సిత ప్రచారం మొదలుపెట్టారు. తృణమూల్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తృణమూల్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమే. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక బీజేపీలో చేరారు. సీపీఎం నుంచి మాత్రం ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదు. ‘‘మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వాచ్ పెట్టుకుంటే మాయమైపోయేవాడు. మన ఎంపీలదీ అదే పరిస్థితి. గెలుస్తారు, మాయమైపోతారు’’ అంటూ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కళ్యాణ్ కౌంటరిస్తూ దీప్సితను మిస్ యూనివర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘దేశమంతా పర్యటించి వచ్చారు. ఇప్పుడు మిస్టర్ ఇండియాను చూసేందుకు శ్రీరాంపూర్ వచ్చారు’ అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర సీపీఎం తీవ్రంగా మండిపడుతోంది.
బాధించిన ‘రంగు’
తన బాల్యం కాస్త బాధాకరంగానే గడిచిందంటారు దీప్సిత. తల్లిదండ్రులిద్దరిదీ మంచి రంగు. తాను మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో ఇరుగుపొరుగు మొదలు అందరూ ‘అమ్మాయేంటి ఇంత నల్లగా ఉం’దని అడిగేవారట. బయటికి వెళ్లినా అదే పరిస్థితి. దాంతో నలుగురికిలోకి వెళ్లాలంటే ఒక రకమైన భయం! ఒకసారి చూసిన వారు మళ్లీ పరికించి చూస్తే తన రంగు గురించేమోననే బాధ తెలియకుండానే కలిగేది. తర్వాత ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడ్డారామె. ఇప్పుడు బెంగాల్‌లో భయంకరమైన ఎండలు. అయినా ప్రచారంలో దీప్సిత కళ్లజోడు కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే, ‘‘అందరూ నా కళ్లలోకి చూడగలగాలి. నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలగాలి. కళ్లను అద్దాలతో మూసేస్తే ఎలా?’’ అని ప్రశి్నస్తారామె.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment