Srirampur
-
Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
భుజాన సంచి. అందులో జాగ్రఫీ పుస్తకం, ఒక జత బట్టలు. మెడలో ఎర్ర కండువా. ముఖాన చెరగని చిరునవ్వు. మండే ఎండల్లోనూ అలుపెరుగని ప్రచారం. వయసు 30 ఏళ్లు. పేరు దీప్సితా ధర్. బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం. సీపీఎం సానుభూతిపరురాలిగా మొదలై, ఢిల్లీలో విద్యార్థి నాయకురాలిగా ఎదిగి ఇప్పుడు సొంత బెంగాల్లో శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానం అభ్యరి్థగా బరిలోకి దిగారు. ‘ఖేలా హోబ్’ (గేమ్ ఈజ్ ఆన్) అన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా దీదీ ఇచ్చిన నినాదానికి బదులుగా ‘నేను సైతం సిద్ధం’ అంటూ తలపడుతున్నారు... టామ్ బోయ్... దీప్సిత పశ్చిమబెంగాల్లోని హౌరాలో 1993లో జన్మించారు. తండ్రి పీయూష్ ధర్. తల్లి దీపికా ఠాకూర్ చక్రవర్తి. తాత పద్మనిధి ధర్. అంతా సీపీఎం రాజకీయాల్లో ఉన్నారు. బాల్యం నుంచి టామ్ బోయ్‌లా పెరిగిన దీప్సితకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని చూసి రాజకీయాలు చేస్తే కుటుంబానికి సమయం ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత అభిప్రాయం మారింది. దక్షిణ కోల్‌కతాలోని అశుతోష్ కాలేజీలో జియాలజీ చదివాక ఢిల్లీ జేఎన్‌యూలో జాగ్రఫీలో పీజీ, ఎంఫిల్ చేశారు. పాపులేషన్ జాగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అరంగేట్రం... కోల్‌కతాలో కాలేజీ రోజుల నుంచీ దీప్సిత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తర్వాత ఎస్ఎఫ్ఐ జేఎన్‌యూ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పనిచేశారు. రోహిత్ వేముల మృతి సందర్భంగా జరిగిన ఉద్యమంలో, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంగ్లి‹Ù, హిందీ, బెంగాలీల్లో అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడే దీప్సిత జాతీయ చానళ్లలో రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొంటారు. 2011లో బెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోవడం ఆమెను బాధించింది. అదే పదేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాలవైపు నడిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో సీపీఎం తరఫున రాజకీయ ఉద్ధండులతో పోరాడుతున్నారు. మిస్టర్ ఇండియా వర్సెస్ మిస్ యూనివర్స్ రెండు నెలల ముందునుంచే దీప్సిత ప్రచారం మొదలుపెట్టారు. తృణమూల్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తృణమూల్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమే. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక బీజేపీలో చేరారు. సీపీఎం నుంచి మాత్రం ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదు. ‘‘మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వాచ్ పెట్టుకుంటే మాయమైపోయేవాడు. మన ఎంపీలదీ అదే పరిస్థితి. గెలుస్తారు, మాయమైపోతారు’’ అంటూ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కళ్యాణ్ కౌంటరిస్తూ దీప్సితను మిస్ యూనివర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘దేశమంతా పర్యటించి వచ్చారు. ఇప్పుడు మిస్టర్ ఇండియాను చూసేందుకు శ్రీరాంపూర్ వచ్చారు’ అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర సీపీఎం తీవ్రంగా మండిపడుతోంది. బాధించిన ‘రంగు’ తన బాల్యం కాస్త బాధాకరంగానే గడిచిందంటారు దీప్సిత. తల్లిదండ్రులిద్దరిదీ మంచి రంగు. తాను మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో ఇరుగుపొరుగు మొదలు అందరూ ‘అమ్మాయేంటి ఇంత నల్లగా ఉం’దని అడిగేవారట. బయటికి వెళ్లినా అదే పరిస్థితి. దాంతో నలుగురికిలోకి వెళ్లాలంటే ఒక రకమైన భయం! ఒకసారి చూసిన వారు మళ్లీ పరికించి చూస్తే తన రంగు గురించేమోననే బాధ తెలియకుండానే కలిగేది. తర్వాత ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడ్డారామె. ఇప్పుడు బెంగాల్లో భయంకరమైన ఎండలు. అయినా ప్రచారంలో దీప్సిత కళ్లజోడు కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే, ‘‘అందరూ నా కళ్లలోకి చూడగలగాలి. నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలగాలి. కళ్లను అద్దాలతో మూసేస్తే ఎలా?’’ అని ప్రశి్నస్తారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
శ్రీరాంపూర్‌లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్‌ను సీపీఎం రంగంలోకి దింపింది... హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్డౌన్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్‌ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి.బెనర్జీది దిగజారుడుతనం: బోస్.. కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.తక్షణావసరం ‘భారత్ బచావో’ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్‌యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రెడ్ వాలంటీర్‌గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు. ‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్‌కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెప్టెంబర్‌లో సింగరేణి లాభాలు ప్రకటిస్తాం: డైరెక్టర్ ఎన్.బలరాం
శ్రీరాంపూర్: ఆర్థిక సంవత్సరం 2021–22లో సింగరేణి సాధించిన లాభాలను సెప్టెంబర్‌లో ప్రకటిస్తామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడు లాభాలు పెరిగాయని సంస్థ డైరెక్టర్ (పీపీ, ఫైనాన్స్) ఎన్.బలరాం తెలిపారు. మంచిర్యాల జిల్లా సీసీసీలోని సింగరేణి ఎస్సీఓఏ క్లబ్ ఆవరణలో రూ.55 లక్షలతో నిర్మించిన ఏసీ హాల్‌ను ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ సంస్థ లాభాలపై సెంట్రల్ ఆడిట్ కావాల్సి ఉందని, సెప్టెంబర్‌లో లాభాల లెక్క తేలుస్తామన్నారు. 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 200 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మల్లన్నసాగర్లో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒడిశాలోని నైనీబొగ్గు బ్లాక్‌ను ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పలేదని, ఓబీ పనులు, కోల్ ఆపరేషన్స్ అవుట్ సోర్సింగ్‌తో చేస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల, అధికారుల పిల్లలకోసం 15 శాతం సీట్లు కేటాయించాలని ఆరోగ్యశాఖను కోరామన్నారు. సింగరేణికి వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ డైరెక్టర్ రవిప్రసాద్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదిర్, ఏరియా ఇన్చార్జి ఎస్‌ఓటూ జీఎం గోపాల్‌సింగ్, క్లబ్ సెక్రెటరీ సంతోష్‌కుమార్, డీజీఎంలు శివరావు, గోవిందరాజు, ఓసీపీ పీవో రాజేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ సత్యనారాయణ, ఎస్టేట్స్ అధికారి స్వప్న పాల్గొన్నారు. -
మార్పు కోరిన తనయుడిని హతమార్చిన తండ్రి.. కొలువు ఇస్తాడనుకుంటే..
సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల): తాగుడు మాని, తల్లిని మంచిగా చూసుకో.. ఇప్పటికైనా మారవా...? అని కోరిన కొడుకును తండ్రి హతమార్చాడు. ఈ సంఘటన మంచిర్యాల శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి కొత్తరోడ్ రాజీవ్‌నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. సింగరేణి కార్మికుడు కనుకుంట్ల కొమురయ్య తన ఏకైక కుమారుడు రాజ్‌కుమార్(35)ను దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్కే6గనిలో పని చేస్తున్న కొమురయ్యకు భార్య కమల, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రాజ్‌కుమార్ ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా.. కుమారుడు ఐటీఐ పూర్తి చేశాడు. తల్లిదండ్రులతోపాటు ఇంట్లోనే ఉంటున్నాడు. కొమురయ్య కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచు భార్యతో గొడవ పడుతూ ఆమెకు వివాహేతర సంబంధం అంటగడుతూ వేధించేవాడు. ఈ విషయంలో కొడుకు తండ్రి నిర్వాహకాన్ని ప్రశ్నించే వాడు. దీంతో కొమురయ్య తన కొడుకుపై కూడా కోపం పెంచుకొని తరచూ తిట్టేవాడు. ఎదిగిన తన కొడుకు చెప్పినా మారకుండా వేధింపులకు గురి చేయడంతో ఇబ్బందులు తాళలేక కమల కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తండ్రికొడుకులు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం కొమురయ్య తాగివచ్చి తల్లికి మద్దతు ఇస్తున్నావంటూ కొడుకుతో గొడవపడ్డాడు. రాజ్‌కుమార్ మంచంపై పడుకుని సెల్‌ఫోన్ చూస్తుండగా కొమురయ్య కర్రతో తలపై చితకబాధాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాజ్‌కుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు. కొద్ది సేపటికి కొమురయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై మానస కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొలువు చేద్దామన్న కోరిక తీరలే... రాజ్‌కుమార్ ఐటీఐ చేయగా.. సింగరేణిలో తండ్రి స్థానంలో వచ్చే కారుణ్య ఉద్యోగం చేస్తానని కలలుగన్నాడు. రెండేళ్ల సర్వీసు కూడా దగ్గరగా వచ్చింది. గతంలోనే కొమురయ్య మెడికల్ బోర్డుకు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని రోజుల్లో బోర్డు పిలుస్తుందని, అన్‌ఫిట్ అవుతాడని, ఇక తాను తండ్రి స్థానంలో సింగరేణి కొలువు చేస్తానని రాజ్‌కుమార్ ఎంతో ఆశపడ్డాడు. కొలువు ఇస్తాడనుకున్న తండ్రే కాటికి పంపడం తీవ్ర విషాదం నింపింది. -
బొగ్గు బ్లాకుల వేలం ఆపాలి..
శ్రీరాంపూర్/బెల్లంపల్లి/మందమర్రి రూరల్: సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం ఆపాలని మంచిర్యాల జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బుధవారం రణ దీక్ష చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే దివాకర్‌రావు శ్రీరాంపూర్‌లో, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రిలో రణ దీక్ష చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్‌లలోని దీక్షా శిబిరాలను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారికి సఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామన్నారు. సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందన్న మంత్రి, కేంద్రం ఏక పక్షంగా గనులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేలంలో పెట్టిన బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. దీక్షల్లో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్, టీబీజీకేఎన్ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. -
సింగరేణి గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
-
మహిళలకు క్రీడాపోటీలు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్): ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్లందు క్లబ్లో బుధవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను సేవా సమితి అధ్యక్షురాలు, ఏరియా జీఎం సతీమణి సుజాత రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సింగరేణిలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి అభినందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబే బ్లాస్ట్, పాటలు, నృత్యాలు, స్కిట్స్, హాస్యవల్లరి తదితర పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం రోజున ఏరియా జీఎం రాఘవులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా డీవైపీఎం తిరుపతి, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఎకౌంట్స్ ఆఫీసర్ సుధారాణి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ సకినాల రాజేశ్వర్రావ్, నెల్సన్, గ్రౌండ్ ఇన్చార్జి తిరుపతి, స్విమ్మింగ్ కోచ్ పప్పు నారాయణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్(మంచిర్యాల): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం నస్పూర్ కాలనీలోని సేవా భవన్ వద్ద పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సేవా అధ్యక్షురాలు ఆస్మాసుభాని ప్రారంభించారు. త్రోబాల్, బాల్ ఇన్ బాస్కెట్, టగ్ ఆఫ్ వార్, బాంబ్ బ్లాస్ట్ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పీఎం తుకారాం, స్పోర్ట్స్ సూపర్వైజర్ సీహెచ్ అశోక్, జనరల్ కేప్టెన్ గోపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్ రమేశ్, సేవా కార్యకర్తలు రత్నకళ, మంజుల, కొట్టె జ్యోతి, సునీత, స్వప్న, లలిత, తిరుమల, శంకరమ్మ పాల్గొన్నారు. -
మారకుంటే డిస్మిస్సే..
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఉద్యోగాల లేక నిరుద్యోగులు పడరాని పాట్లు పడుతుంటే ఉన్న ఉద్యోగాలను లెక్కచేయకుండా కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు కొందరు కార్మికులు. నిర్ణీత మస్టర్లు నింపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొంత మంది కార్మికులు డిస్మిస్ అంచులకు వెళ్లారు. కంపెనీలోనే అతిపెద్ద ఏరియా శ్రీరాంపూర్. ఇంత పెద్ద ఏరియాలో గైర్హాజరు కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతీ కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు నింపాలి. ఇలా మూడేళ్లు వరుసగా 100 మస్టర్లు నిండకుంటే వారిని కంపెనీ డిస్మిస్ చేస్తోంది. గతంలో వేలాది మంది కార్మికులు ఇలాగే డిస్మిస్ అయ్యారు. 2003 వరకు మూడేళ్లు చూసి వెంటనే డిస్మిస్ చేసింది. కాలక్రమేణా వచ్చిన మార్పులతో చాలామంది డ్యూటీల బాటపట్టారు. కానీ ఇంకొందరు గైర్హాజరు అవుతూనే ఉన్నారు. వారి పట్ల యాజమాన్యం సీరియస్‌గా స్పందించాల్సి ఉన్పప్పటికీ కొత్త రాష్ట్రంలో డిస్మిస్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, కౌన్సెలింగ్ పేరుతో డ్యూటీలు చేయాలని కోరుతూ వచ్చింది. గడిచిన ఐదేళ్లుగా కార్మికులను పలుమార్లు పిలిచి కౌన్సెలింగ్ చేస్తూ రావడంతో ఇందులో కొంత సత్ఫలితాలు వచ్చింది. కాగా, ఏరియాలో గడిచిన 5 ఏళ్లుగా 100 మస్టర్ల కంటే తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారిపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారు. ఇంక్రిమెంట్లు కూడా కట్ చేసిన వారు మారడం లేదు. దీంతో వారికి చివరిసారిగా ఈ నెల 20న కౌన్సెలింగ్ నిర్వహించారు. తీవ్ర గైర్హాజరు ఉన్న 38 మందిని గుర్తించి అధికారులు పిలిచారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్‌చేసి వారిని వెంట తీసుకొని కౌన్సెలింగ్‌కు రమ్మని కోరారు. ఇందులో కేవలం 17 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు రాలేదు. వారికి చివరి సారిగా నోటీసులు ఇచ్చి చర్యలకు సిద్ధమైంది. వీరు డిస్మిస్ అయ్యేఅవకాశం కూడా ఉందని తెలుస్తుంది. నెలకు 22 మస్టర్లు చేస్తే సరి కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో చాలా మందికి యాజమాన్యం చివరి అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం డిసెంబర్, జనవరీ, ఫిబ్రవరిలో ప్రతీ నెల 22 మస్టర్లు తగ్గకుండా పనిచేయాలని జీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇలా 3 నెలలు పనిచేసి గాడిన పడాలని, ఈ 3 నెలల్లో కూడా మార్పు రాకుంటే వారిని డిస్మిస్ కోసం కార్పొరేట్‌కు సిఫార్సు చేయడానికి యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. వ్యసనాలతో చాలా మంది ఎగనామం చాలా మంది గైర్హాజరు కార్మికులు వ్యసనాల కారణంగా డ్యూటీలు సక్రమంగా చేయకుండా గైర్హాజరు కార్మికులుగా మారారు. ఇందులో యువ కార్మికులు కూడా ఉండటం అశ్చర్యానికి గురిచేస్తోంది. కుటుంబ బాధ్యత మరిచి జులాయి తిరుగుళ్లు తిరుగూ డ్యూటీలు రావడం లేదని ఇలాంటి వారిని ఇక ఉపేక్షించేది లేదని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా చివరి అవకాశంగా వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. సేవా సమితి ద్వారా మహిళలు కూడా కార్మికుల కుటుంబాల్లోని మహిళలను పిలిచి వారి సమక్షంలో కార్మికునికి కౌన్సెలింగ్ ఇచ్చి డ్యూటీలు సక్రమంగా చేసుకొని కుటుంబానికి పోషించుకోవాలని తెలిపారు. ఫిబ్రవరి నాటికి వీరు మారకుంటే డిస్మిస్ కావడం ఖాయమని పేర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డుపై పడకుండా ఉద్యోగం నిలుపుకోవాల్సిన బాధ్యత సదరు కార్మికులపై ఉంది. -
కూతురు ఆత్మహత్య.. ఇంటి ఆవరణలో పాతిపెట్టిన తండ్రి
శ్రీరాంపూర్(మంచిర్యాల) : కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కన్న తండ్రే ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు వచ్చి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని బుధవారం ఉదయం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా బయటకు తీయించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన జి.గజేంద్రన్ ఇక్కడి సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఉన్న సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇక్కడ కాంప్లెక్స్‌లోని ఓ క్వార్టర్లో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. భార్య దేవిక, కూతురు గౌరీ ఉన్నారు. కుమారుడు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దేవిక కొద్ది రోజులుగా భర్తతో కలిసి ఉండడం లేదు. గౌరీకి కొద్ది నెలల క్రితం గోదావరిఖనికి చెందిన రామస్వామితో వివాహామైంది. ఇద్దరి మధ్య గొడవలతో గోదావరిఖనిలో గృహ హింస కేసు నడుస్తోంది. దీంతో గౌరీ తండ్రితో ఉంటోంది. భర్త తీసుకెళ్లడం లేదని తన కూతురు గౌరీ(27) మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంట్లోనే ఉరి వేసుకుందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత చూసే సరికి మృతిచెంది ఉందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తానే క్వార్టర్ ఆవరణలో గోతి తీసి పూడ్చిపెట్టినట్లు గజేంద్రన్ మంగళవారం ఎస్సై ఉమాసాగర్కు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని బుధవారం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, రూరల్ సీఐ ప్రమోద్‌రావు సందర్శించారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. కుటుంబ సభ్యులు, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ శ్రీనివాస్ సమక్షంలో నస్పూర్ తహసీల్దార్ జ్యోతి, వైద్యులు శేఖర్‌రావు, కీర్తిలు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. కాగా, గౌరీ మృతి అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసాడనేది విచారణలో తేలాల్సి ఉంది. మీడియా సిబ్బంది సీఐఎస్ఎఫ్ కాంప్లెక్స్‌లో వెళ్లడానికి ప్రయత్నించగా కాపలా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై అధికారుల ఆదేశాలు అంటూ లోపలికి వెళ్లనీయలేదు. -
దొరకని ఆచూకీ
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ డివిజన్లోని యువ సంక్షేమ అధికారులందరు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆర్కే 5 గని సంక్షేమ అధికారి ఎం.రాజేశ్ అదృశ్యం అయిన కేసులో వీరు ఈ నిరసన తెలిపారు. రాజేశ్ ఆ గని మేనేజర్ వేధింపులు తాళలేక విధుల పట్ల విరక్తి చెంది తన కోసం చూడద్దు, మేనేజర్ తీవ్రంగా వేధిస్తున్నాడని అందుకే తాను వెళ్లిపోతున్నానని, ధైర్యం ఉంటే చనిపోతా లేకుంటే పారిపోతా తప్ప ఇక తిరిగిరాను అని భార్య సుభాషిణి మెస్సేజ్ పెట్టి సెల్ ఫోన్‌ను కార్యాలయంలోనే వదిలేసి అదృశ్యం అయ్యాడు. అంతకు కొద్ది సేపు ముందు తండ్రికి కూడా ఇదే తరహా మేనేజర్ వేధిస్తున్నాడని మెస్సేజ్ పెట్టి పెట్టాడు. దీనిపై గురువారం రాత్రి శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్ అదృశ్యం అయినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఆయన ఆచూకి లభించలేదు. దీంతో రాజేశ్ అదృశ్యం ఘటనపై ఆయన బ్యాచ్‌కు చెందిన యువ సంక్షేమ అధికారులంతా కలిసి ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం రాజేశ్ భార్య, తండ్రి శ్రీనివాస్‌ను తీసుకొని శ్రీరాంపూర్ జీఎం సుభానిని కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనేజర్ వేధింపుల వల్లే రాజేశ్ అధృశ్యం అయ్యాడని తెలిపారు. అన్ని గనుల్లో అధికారులు తమను వేధిస్తున్నారని సంక్షేమ అధికారులు వాపోయారు. చీటికి మాటికి ఇష్టం వచ్చినట్లు దుర్భషలాడుతున్నారని పని చేసిన కూడా తిట్టుతున్నారని వాపోయారు. ఎంత పని చేసిన గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. ఇదిలా ఉంటే తన కొడుకు రాజేశ్ మేనేజర్ వేధింపులు తాళలేకనే అదృశ్యం అయ్యాడని అతనికి ఏదైన జరిగితే యాజమాన్యందే బాధ్యత వహించాలని డిమాండ్ తండ్రి శ్రీనివాస్ చేశారు. తన భర్త అదృశ్యం అయిన తరువాత కూడా యాజమాన్యం సరిగా స్పందించలేదని రాజేశ్ భార్య సుభాషిణి ఆరోపించింది. తన భర్తను వెంటనే వెతికి తమకు అప్పగించాలని కోరింది. ఈ కార్యక్రమంలో ఎ‹స్ఓటుజీఎం పివి సత్యనారాయణ, టీబీజీకేఎస్ బ్రాంచీ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డీజీఎం(పర్సనల్) జే కిరణ్, పీఎం అనిల్‌కుమార్, డైవైపీఎం తుకారాం, పలువురు సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. దొరకని ఆచూకి.. రాజేశ్ కోసం పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది వెతుకుతన్న అతని ఆచూకి ఏమాత్రం దొరకడం లేదు. గని నుంచి నేరుగా నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్‌కు వెళ్లి అక్కడ తన స్నేహితుడు అభిషేక్‌ను బైక్‌పై మంచిర్యాల బస్‌స్టేషన్‌లో దించమనడంతో అతని దింపు వచ్చాడు. దీంతో బస్ స్టేషన్నుంచి ఎటూ వెళ్లిందో పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. తోటి సంక్షేమ అధికారులు కూడా రాజేశ్ స్నేహితులకు, క్లాస్‌మేట్స్‌కు సమాచారం అందించిన ఎలాంటి అచూకి లభించలేదు. రాజేశ్వెంట సెల్‌ఫోన్ లేకపోవడంతో అతని ఆచూకి కనుకోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. రాజేశ్ ఆచూకి తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
సింగరేణి నిప్పుల కొలిమి
► ఓసీపీపై 48 డిగ్రీలు నమోదు ► బెంబేలెత్తుతున్న కార్మికులు ► ఓసీపీల్లో మారిన పని వేళలు శ్రీరాంపూర్ (మంచిర్యాల): భానుడి ప్రతాపా నికి సింగరేణి కార్మికులు బెంబేలెత్తుతున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉండ టంతో బొగ్గుబాయిలపై దీని ప్రభావం పడింది. మధ్యాహ్నం డ్యూటీలకు వెళ్లి పనిచే యడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. క్వారీల్లో 2 రోజులుగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవు తోంది. కార్మికులు ఎండబారిన పడకుండా ఉండేందుకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీ పీ)లో ఈ నెల 7వ తేదీ నుంచే షిఫ్ట్ వేళలు మార్చా రు. ఉదయం షిఫ్ట్ ఇంతకు ముందు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే దాన్ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కుదించారు. 2వ షిఫ్ట్‌లో కూడా గంట సమయం కుదించి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తు న్నారు. పని చేసేటప్పుడు ప్రతి కార్మికుడికి మస్టర్ పడే సమయంలో మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. నీరసంగా ఉందన్న కార్మి కులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. -
లారీ ఢీకొని ఒకరు మృతి
శ్రీరాంపూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాతపడగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీరాంపూర్ మండలానికి చెందిన నాగరాజు, సుచిత దంపతులు తమ నాలుగు నెలల కుమార్తెతో బైక్‌పై మంచిర్యాలకు బయలుదేరారు. సీసీ కాంప్లెక్స్ సమీపంలో వారి బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే చనిపోగా సుచిత తీవ్రంగా గాయపడింది. చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన రూ. 10 కోసం
తాగిన మైకంలో బండరాయితో కొట్టి చంపిన తోటి కూలీ శ్రీరాంపూర్: పది రూపాయల కోసం జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి దొరగారిపల్లెలో శనివారంరాత్రి జరిగింది. గ్రామపరిధిలోని మన్నెవాడకు చెందిన కుమ్మరి పోశం(30), కొడిపె లక్ష్మణ్(25) కూలీ పనులు చేస్తుంటారు. శనివారం ఇద్దరు వేర్వేరుగా గుడుంబా తాగి, పాన్‌షాప్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోశంను ఉద్దేశించి కొడిపె లక్ష్మణ్ ‘పది రూపాయలు ఇవ్వరా’ అంటూ అడిగాడు. ‘ఇంతలేనోనివి నువ్వు నన్ను పది రూపాయలు అడిగేటోనివా?, ఇంకా రా అంటవా..’ అంటూ పోశం ప్రశ్నిం చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి లక్ష్మణ్‌ను పోశం కింద పడేసి కొట్టాడు. తర్వాత తేరుకున్న లక్ష్మణ్ కోపంతో బండరాయి తీసుకొని పోశం ఛాతీపై బలంగా కొట్టగా, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. -
వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిన ఉత్పత్తి
మంచిర్యాల (ఆదిలాబాద్) : వర్షం కారణంగా ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురియడంతోపాటు, శుక్రవారం కూడా వర్షం కొనసాగడంతో మధ్యాహ్నం వరకూ ఉత్పత్తికి వీలు కాలేదు. దీంతో సుమారు మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగినట్టు సమాచారం. -
రక్తార్పణం
శ్రీరాంపూర్ : సింగరేణి గనులు ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. అనేక ప్రమాదాలు పైకప్పు కూలడం వల్ల జరుగుతున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కాగా, కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ లోపలికి వెళ్తున్న కొద్ది పైకప్పు కూలకుండా సపోర్టు పెడతారు. గతంలో చెక్కదిమ్మలు కట్టేవారు. ఇటీవలి కాలంలో రూఫ్బోల్టులు వేస్తున్నారు. ఇవి కూడా ఆరు ఫీట్ల పైనుంచి పొర విడుచుకుంటూ వచ్చినా రక్షణ ఇవ్వడం లేదు. ఒత్తిడి ఒక్కసారి పెరిగితే రూఫ్‌బోల్టు ఊడివచ్చి రూఫ్పాల్గా మారుతుంది. రూఫ్పాల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం సింగరేణి వద్ద లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందబాటులోకి రాలేదు. కూలడానికి కొన్ని సెకన్ల ముందు వచ్చే శబ్దాలు విని కార్మికులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే మార్గం. క్షణ కాలంలో జరిగే ఈ ప్రమాదాల్లో కొద్ది మంది మాత్రమే బతికే అవకాశం ఉంది. అయితే అక్కడ ప్రమాదంగా మారుతుందని ఇండికేషన్ ఇచ్చే పరికరాలు ఉన్నాయి. లోడ్సెల్ అనే పరికరం ద్వారా పైకప్పు ఒత్తిడి ఎంత ఉందో కొలుస్తారు. ఒత్తిడి పెరుగుతూ వస్తే ప్రమాద స్థలంగా(ఫాల్ట్ ఏరియా)గా గుర్తించి ప్రత్యేక రక్షణ చర్యలు చేపడతారు. ప్రధానంగా పర్యవేక్షణ లోపం ప్రమాద స్థలంలో పని చేసేటప్పుడు కార్మికులు స్వీయ రక్షణ తీసుకోవడం అవసరం. అలాగే కార్మికులను ప నులకు పురమాయించేటప్పుడు సింగరేణి అధికారులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అలా చేయడం లేదు. ప్రమాదకరంగా ఉన్న పనిస్థలాల్లో బొగ్గు వెలికితీత నిపుణులైన అధికారుల సమక్షంలో జరగాలి. దీనికి సరిపడా సూపర్వైజర్లు ఉండాలి. కానీ సింగరేణి వ్యాప్తంగా 600 ఓవర్‌మెన్, సర్దార్ల కొరత ఉంది. దీనికితోడు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం అధికారులు పోటీపడుతూ పనులు చేయిస్తున్నారు. రేజింగ్ తక్కువగా వస్తే పరుగెత్తించి పనులు చేయిస్తున్నారు. అంతేకాకుండా రక్షణ కోసం సేఫ్టీ సిబ్బందిని, సూపర్వైజర్లను ఇవ్వమని అడిగితే అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. సేఫ్టీ ఆఫీసర్లు, మేనేజర్లు గనిలోకి దిగి పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదు. సేఫ్టీ సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఫేస్ వర్కర్లకు స్థానం కల్పించాల్సిన చోట ఎక్కడో సర్ఫేస్‌లో పని చేసే నాయకులు సేఫ్టీ కమిటీల్లో ఉంటున్నారు. కార్పొరేట్ స్థాయి సేఫ్టీ సమావేశం జరగక రెండేళ్లు అవుతుంది. సేఫ్టీ వీక్ కూడా నిర్వహించడం లేదంటే యాజమాన్యానికి కార్మికులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నష్టపరిహారాల చెల్లింపుల్లో అన్యాయం ఎంత నష్టపరిహారం ఇచ్చిన చనిపోయిన కార్మికుడు లేని లోటు ఆ కుటుంబానికి పూడ్చనిది. అయితే వారికి ఆదుకోవడానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా అధ్వానంగా ఉంది. గని ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి యాజమాన్యం రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంది. ఇది కూడా విధుల్లో ఉన్నప్పుడు ప్ర మాదం జరిగితేనే. అదే గుండెపోటుతో, గాలి అందక ఊపిరి ఆగి చనిపోతే ఇవ్వడం లేదు. గాయాలై చనిపోతేనే ఎక్స్‌గ్రేషియా అంటున్నారు. ఈ వివక్ష దేశంలో ఎక్కడ లేదని కార్మికులు మండి పడుతున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంటులో బాయిలర్ పేలి కార్మికులు చనిపోయిన ఘటనలో యాజమాన్యం ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించింది. హెచ్పీసీఎల్లో రూ. కోటి నష్టపరిహారం చెల్లించారు. ఏటా రూ.400 కోట్ల లాభాలు సాధించి పెడుతున్న కార్మికులకు ఇచ్చేది కేవలం రూ.6లక్షలే. కార్మికుడు మృతిచెందినప్పుడు కార్మిక సంఘాలు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శవంతో బైఠాయించి శవరాజకీయాల చేయడానికి యూనియన్ నేతలు పనికి వస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుడు చనిపోయిన తరువాత మరుసటి రోజు వెళ్లి కనీసం ఆ కుటుంబ బాగోగులు కూడా తెలుసుకోరు. ఎన్నికల్లో తాము గెలిస్తే వైజాగ్ త రహాలో ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ నేతలు బీరాలు పలికారు. తీరా గెలిచిన తరువాత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి మాత్రమే యాజమాన్యం ముందుకు వచ్చింది. దీనికి ప్రాతినిధ్య సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్లు అడ్డుపడ్డాయి. కార్మికుల నుంచి సగం డబ్బులు వసూలు చేసి ఇస్తే యాజమాన్యం సగం కలిపి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ వద్దని ఎక్స్‌గ్రేషియానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జాతీయ సంఘాలని చెప్పుకొనే సంఘాలు దీనిపై కోలిండియాలో ఎందుకు సాధించుకురావడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌గ్రేషియా ఇచ్చే అధికారం సింగరేణికి ఉందని.. కాదు ప్రభుత్వమే ఆదేశించాలని.. కాదు ఇది దీనికి కోలిండియాలోనే ఒప్పందం చేసుకోవాలని ఒక సంఘంపై మరో సంఘం ఆరోపించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాయి. ఎంత సేపు ఇతర సంఘాన్ని వైఫల్యం చెందించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలన్నదే అన్ని సంఘాల ఎత్తుగడ తప్ప ఐక్యంగా పోరాడి ఎక్స్‌గ్రేషియా సాధించాలని చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. ఏది ఏమైన అటు యాజమాన్యం కార్మికుల ప్రాణాలకు రక్షణ ఇవ్వకపోవడం, ఇటు సంఘాలు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో నల్లసూర్యుల కుటుంబాలు చీకటి మయం అవుతున్నాయి. -
కార్మికుడి హఠాన్మరణం
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5బి గనిలో ఓ కార్మికుడు హఠాన్మరణం పాలయ్యాడు. నస్పూర్ గ్రామానికి చెందిన గరిగే లింగయ్య (57) ఆర్కే 5బిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఉదయం వేళ మొదటి షిఫ్ట్ విధులకు హాజరయ్యాడు. గని భూగర్భంలోని 23 ఎల్ఎన్ 21 డిప్ 2ఏ సీం వద్ద జంక్షన్లో లైనింగ్ పనులు చేస్తున్నాడు. కీలకొట్టి చెక్క దాటుతుండగా అదే చెక్కలపై ఒక్కసారిగా కూలిపడ్డాడు. దీన్ని గమనించిన తోటి కార్మికులు ఊడె లింగయ్య (టింబర్‌మెన్), రాంటెంకి లింగయ్య (ట్రామర్) ఇతర కార్మికులను పిలిచి లింగయ్యను చూడగా అప్పటికే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న గని మేనేజర్ త్రీనాథ్, సెక్షన్ ఇన్చార్జి సంతోష్‌కుమార్ గనిలోకి దిగారు. తదుపరి మృతదేహాన్ని ఉపరితలానికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అన్ని యూనియన్ల నాయకులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీరాంపూర్ సీజీఎం సీహెచ్ వెంకటేశ్వర్రావు, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏరియా రక్షణాధికారి బి.శ్రీనివాస్, ఏజెంటు వెంకటేశ్వర్లు హుటాహుటిన అక్కడికి వచ్చారు. అధికారులు శవాన్ని తొందరగా అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్ మల్లయ్య వర్గం నేతలు అడ్డుకున్నారు. కంపెనీ వైద్యుడు వచ్చి మరణధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడి కార్మికులను పిలిచి ప్రత్యక్ష సాక్షులుగా వాంగ్మూలం తీసుకున్నారు. గనిలో పనిచేస్తూ పడి చనిపోయాడని అధికారులు రిపోర్టు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య యశోధ, కొడుకులు శేఖర్, సాగర్, కూతుళ్ల పద్మ, గంగ ఉన్నారు. ఈ విషయం తెలిసి గని వద్దకు చేరుకున్న వారు బోరున విలపించారు. సర్పంచ్ వేల్పుల రాజేశ్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం.. మృతుని కుటుంబానికి కంపెనీ నుంచి చెల్లించే నష్టపరిహారాలు త్వరగా ఇప్పిస్తామని, యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి డిపెండెంట్ ఉద్యోగం కూడా త్వరగా ఇప్పించేందుకు కృషి చేస్తామని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ తెలిపారు. గనుల్లో కార్మికులు చనిపోకుండా అన్నిరకాల పగడ్బందీ చర్యలు తీసుకోవడానికి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. వారి వెంట కేంద్ర చర్చల ప్రతినిధి గోవర్ధన్, డివిజన్ కార్యదర్శి పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, నాయకులు కె.సురేందర్‌రెడ్డి, నీలం సదయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. మృతిని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గనిలో పై కప్పు కూలి చనిపోతేనే గని ప్రమాదంగా భావించి రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తున్నారని.. అదే కార్మికుడు జారిపడ్డా, ఆలసట చెంది కింద పడి చనిపోయినా సహజ మరణం అంటూ గుండెపోటు అంటూ నష్టపరిహారం ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు. అపస్మారక స్థితిలో గని లోపలి నుంచి కార్మికున్ని తీసుకువస్తే వారిని ఏరియా ఆస్పత్రికి తీసుకుపోవడానికి అంబులెన్సుల్లో కనీసం ఆక్సిజన్ వెంటిలేటరు ఉండటం లేదని, ప్రాథమిక చికిత్స చేయడానికి వైద్యుడు కూడా ఉండటం లేదని మండిపడ్డారు. టీబీజీకేఎస్ మల్లయ్య వర్గం నుంచి బంటు సారయ్య, కానుగంటి చంద్రయ్య, హెచ్ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేష్, నాయకులు అర్జున్, రాజేంద్రప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి బాజీసైదా, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, ఐఎన్టీయూసీ డివిజన్ ఉపాధ్యక్షుడు డి.అన్నయ్య కార్యదర్శులు కాశీరావు, గంగయ్య, టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు మోతె రాఘవరెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
ఆగని అంతర్గత కుమ్ములాటలు
శ్రీరాంపూర్ : సింగరేణిలో మొదటిసారి గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఇంకా ఆగడం లేదు. రెండేళ్ల కాలంలోనే అధికారం కోసం రెండు గ్రూపులుగా విడిపోయిన ఆ యూనియన్‌లో కోర్టు తీర్పు తరువాత అన్నీ చక్కబడ్డాయి అనుకున్న తరుణంలో మళ్లీ అంతర్గత పోరు మొదలైంది. రాజిరెడ్డి వర్గానికి సర్వాధికారాలు కట్టబెట్టుతూ జూన్ 12న హైకోర్టు తీర్పిచ్చింది. కానీ ఇప్పటికి నెల గడుస్తున్నా ఇంకా కమిటీల నిర్మాణం జరుగలేదు. దీంతో యాజమాన్యంతో కార్మిక సమస్యలపై జరుగాల్సిన స్ట్రక్చరల్ సమావేశాల జాడ లేకుండా పోయింది. పదవుల కోసం పోటీ ఒక పక్క కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మరో పక్క గెలిచిన వర్గం నేతలు వారి అనుచరులకు పదవులు ఇప్పించేందు పోటీ పడుతున్నారు. డివిజన్ ఉపాధ్యక్ష పదవులు, డివిజన్ 6మెన్ కమిటీల్లో తమ అనుచరులకు స్థానం కల్పించుకోవడం కోసం జరుగుతున్న పోటీ చివరికి నేతల మధ్య విభేదాల దారితీసింది. సింగరేణివ్యాప్తంగా 11 డివిజన్లలో రామగుండం, కొత్తగూడెం రీజియన్లలో డివిజన్ ఉపాధ్యక్షుల నియామకం దాదాపు పూర్తయింది. 6 మెన్ కమిటీలు ఇంకా పూర్తికాలేదు. ఇక జిల్లాలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌లో కూడా అదే పరిస్థితి. బెల్లంపల్లి ఉపాధ్యక్షుడిగా సదాశివం, మందమర్రి ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి సంపత్‌ను ప్రకటించారు. శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడిగా పోశెట్టి పేరును అధ్యక్షుడు కనకరాజు ప్రకటించిన రెండు రోజులకే ఆ పేరు కాదని ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ప్రకటించారు. దీనికి తోడు 6 మెన్ కమిటీల కూర్పు జరుగలేదు. శ్రీరాంపూర్ ఉపాధ్యక్ష పదవి కోసం శ్రీరాంపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా యూనియన్ అంతర్గత ఎన్నికల్లో రాజిరెడ్డి ప్యానల్ కోసం పనిచేసిన వారిలో ఎవరో ఒకరికి ఉపాధ్యక్ష పదవి దక్కుంతుందని ప్రచారం జరిగింది. ఈ డివిజన్లో మొదటి నుంచి పనిచేస్తున్న కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఏనుగు రవిందర్‌రెడ్డి కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా వెళ్తున్నారు. కోర్టు తీర్పు రాకముందు డివిజన్ ఉపాధ్యక్షులుగా పానుగంటి సత్తయ్య, పోశెట్టి, లెక్కల విజయ్, నెల్కి మల్లేశ్ వంటి పేర్లు వినిపించాయి. కానీ కోర్టు తీర్పు వచ్చిన తరువాత మల్లయ్య వర్గం నుంచి రాజిరెడ్డి వర్గంలోకి వలసలు పెరిగాయి. దీంతో గంద రగోళం మొదలైంది. బెల్లంపల్లి డివిజన్ గోలేటీలో పనిచేసిన ఎన్నం గోవర్ధన్ కొన్ని నెలల క్రితం జైపూర్ ఎస్టీపీపీకి బదిలీ అయ్యి శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. మిర్యాల రాజిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటం, మొదటి నుంచి ఆ వర్గంలో పనిచేయడంతో ఆయన్ను కూడా కార్పొరేట్ చర్చల ప్రతినిధిగా తీసుకున్నారు. ఇక్కడ యూనియన్ వ్యవహారాలు మొదటి నుంచి నిర్వహిస్తున్న వస్తున్న ఏనుగు రవిందరెడ్డికి కొత్తగా వచ్చిన గోవర్ధన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. రవిందర్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు యూనియన్‌లోని కొందరు గోవర్ధన్‌కు ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని తెరపైకి తెస్తున్నారని ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మల్లయ్య వర్గానికి చెందిన కె.సురేందర్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మల్లయ్య ఓడిపోయిన తరువాత ఆయన సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి అరవిందరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఇదిలా ఉంటే ఇటీవల అరవిందరెడ్డికి అనుచరులుగా ఉన్న బండి రమేశ్ కూడా ఉపాధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉన్న వీరు టీబీజీకేఎస్‌లో ఎలా పదవులు ఆశిస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజిరెడ్డి వర్గం గెలుపునకు కారణం అయిన తమను పక్కన ప్రత్యర్థి మల్లయ్య వర్గానికి చెందిన వారికి ఇందులో పదవులెలా ఇస్తారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. 6మెన్ కమిటీలో కూడా చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలు మిర్యాల రాజిరెడ్డికి ఏనుగు రవిందర్‌రెడ్డి మధ్య సఖ్యతను దెబ్బతీశాయని తెలిసింది. కార్మికుల్లో ఆందోళన కోర్టు ఉత్తర్వులు రావడంతో హమ్మయ్యా.. ఇక పంచాయతీ తెగిందని, ఇక స్ట్రక్చరల్ సమావేశాలు జరిగి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూసిన కార్మికులు జరుగుతున్న పరిణామాలు చూసి ఆందోళన చెందుతున్నారు. డిపెండెంట్ హక్కు, సమ్మె కాలం వేతనం, లాభాల్లో వాటా, గని ప్రమాదాల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటి ఎన్నో అత్యవరం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి. నెల రోజులుగా కాలం వెల్లదీస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కార్మికులు నేతలపై మండిపడుతున్నారు. కమిటీలు వేసుకోవడంలోనే ఇంత ఆపసోపాలు పడుతున్న వీరు రేపు పదవుల్లోకి వచ్చిన తరువాత ఏమాత్రం పని చేస్తారని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా తమ సమస్యలు తీర్చాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
భద్రతలేని బతుకులు
శ్రీరాంపూర్ : సింగరేణిలో సర్వీస్ అండ్ ప్రొటక్షన్ క్రాప్స్(ఎస్అండ్పీసీ) డిపార్టుమెంట్లో పనిచేసే సిబ్బంది తీవ్ర ఇబ్బందుల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ వ్యాప్తంగా 11 ఏరియాల్లో 1900 మంది సెక్యూరిటీ గా ర్డులు ఈ డిపార్టుమెంటులో పని చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డు, సీనియర్ సెక్యూరిటీ గార్డు, జమేదారు, జూనియ ర్ ఇన్స్పెక్టర్, సీనియర్ ఇన్స్పెక్టర్ వంటి పలు డిజిగ్నేష న్లు ఇందులో ఉంటాయి. ఇందులో కిందిస్థాయిలో పనిచే సే గార్డులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గనులపై మొయిన్ గేట్ల వద్ద, మ్యాగ్జిన్ కేంద్రాలు ఓసీపీలు, సీహెచ్స్పీ, స్టోర్స్, వర్క్‌షాప్, గ్యారేజీలతోపాటు కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో బొగ్గు లారీలను చెక్‌పోస్టుల వద్ద ఉండి కాపాడుతారు. వీరి వేతనాలు, పదోన్నతులు అ ధ్వానంగా ఉంటున్నాయి. భయం భయంతో ఏలాంటి రక్షణ లేకుండా పని చేయాల్సి వస్తుంది. కనీసం విధులు నిర్వర్తించే చోట కనీస సౌకర్యాలు లేకున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. గనుల వద్ద కాపలాగా ఉండే వారికి డస్టు మాస్కులు ఇవ్వకపోవడంతో నిత్యం బొగ్గు లారీలు వల్లే వచ్చే విపరీతమైన దుమ్మును పీల్చుతూ డ్యూటీలు చేస్తున్నారు. వర్షాకాలం రెయిన్ కోట్లు, చలి కాలం వార్మ్ కోట్లు ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లుగా సరఫరా చేయడం లేదు. దీంతో వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ డ్యూటీ చేస్తున్నారు. అరచేతిలో ప్రాణాలు కొన్ని రిస్క్ ప్రాంతాల్లో డ్యూటీలు చేయాలంటే గార్డులు భయపడుతున్నారు. కనీసం లాఠీలు కూడా ఇవ్వకుండా విధులకు పంపిస్తున్నారు. స్వీయ రక్షణ కోసం చేతిల్లో లాఠీలు ఉండాలి. ఒకటో రెండో ఉంటే అవి మ్యూజి యంలో వస్తువులుగా కార్యాలయాల్లో మాత్రమే ఉంటా యి. కాపర్ తీగల కోసం దొంగతనాలు ఎక్కువగా జరిగే ఓసీపీలు, ప్రహారీ గోడలు సరిగ్గా లేని గనుల వద్ద డ్యూ టీ చేసే గార్డులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూ టీలు చేస్తున్నారు. స్క్రాప్ దొంగలు ఒక్క సారిగా వారిపై రాళ్లవర్షం కురిపిస్తూ దాడి చేసి గనుల్లోకి దూరుతారు. వారికి అడ్డంగా వెళ్లారంటే ప్రాణాలు పోవాల్సిందే. దొంగల రాళ్ల దాడులు, బంధించి కొట్టిన సందర్భాల్లో చాలా మంది గార్డులు గాయాల పాలైన సంఘటనలు కోకొల్లాలు. శ్రీరాంపూర్ ఓసీపీ, ఎస్సార్పీ 3, ఆర్కే 6 గనులపై గతంలో జరిగిన పలు ఘటనలే ఇందులకు ఉదాహరణ. కనీసం స్టోన్ గార్డులు కూడా ఇవ్వకుంటే ఎలా దొంగలను ప్రతిఘటిస్తామని ప్రశ్నిస్తున్నారు. హెల్మెట్లు కూడా ఇవ్వడం లేదు. రాత్రి వేళ ఎదురుగా వచ్చేది దొం గో, దొరో తెలుసువడానికి టార్చీ లైట్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. పాముల, తేళ్ల నుంచి రక్షణ కోసం కొందరు సొంత డబ్బులు పెట్టి కొనుక్కొంటున్నామని పేర్కొంటున్నారు. షూష్ కూడా క్రమం తప్పకుం డా ఇవ్వడం లేదు. ఓసీపీల వద్ద తడకల షెడ్లే వీరు డ్యూ టీ చేసే చెక్ పోస్టులుగా ఉంటున్నాయి. రోడ్లపై ఉంటే లారీల చెక్‌పోస్టుల వద్ద లారీలను ఆపడం కోసం గేట్లు పెట్టడానికి ప్రభుత్వ నిబంధలను ఒప్పుకోవు. కనీసం టార్చి లైటు చూపి ఆపాలన్న అవి కూడా ఇవ్వడం లేదు. దొంగ బొగ్గు లారీలు ఆపకుండా స్పీడ్‌గా వెళ్లిన చేయగలిగింది ఏమి లేదు. తప్పించుకొని పోయిన లారీ ఎక్కడై న పట్టుబడితే అక్కడి నుంచి ఎలా వెళ్లనిచ్చారని ముం దున్న చెక్‌పోస్టు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉంటే చెక్‌పోస్టులకు వెళ్లాలంటే వారే సొంత వాహనాల్లో వెళ్లాలి. కంపెనీ ఎలాంటి వాహనం సమకూర్చడం లేదు. జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని డ్యూటీలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నా రు. ఇక చెక్ పోస్టుల దుస్థితి చూస్తే మరి అధ్వానంగా ఉంది. కనీసం వారికి కూర్చోవడానికి కుర్చీలు, గాలికి ప్యాన్లు ఉండవు. ఏన్నో ఏళ్ల కిత్రం కట్టిన చెక్‌పోస్టులు కావడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. తలుపులు కిటికీలు ఊడిపోయాయి. రాసుకోవడానికి ప్యాడ్ కూడా ఇవ్వరు. వర్షం వస్తే సైకిల్ షెడ్లలోకి దూరం డ్యూటీలు చే యాల్సి వస్తుందని సెక్యూరిటీ గార్డులు వాపోతున్నారు. కోలిండియా పదోన్నతుల పాలసీ అమలు చేయాలి.. సింగరేణిలో కోలిండియాలో ఉన్న మాదిరిగా ప్రమోషన్ల పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీలు ఉంటే టెస్టు పెట్టి ప్రమోషన్లు ఇస్తున్నారు. అది కూడా సీనియారిటీని, టెస్టులో వచ్చిన మార్కుల ప్రాతిపధికగా చేసుకుంటున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా కొన్ని సంవత్సరాల నిర్ధిష్ట కాలపరిమితి సర్వీసు చేయగానే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోలిండియాలో సెక్యూరిటీ గార్డుగా చేరితే అతనికి ఈ గ్రేడ్ ఇస్తున్నారు. అదే సింగరేణిలో మాత్రం జీ గ్రేడ్ ఇస్తున్నారు. ఇక్కడ జీ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్‌కు పోవాలంటే 14 ఏళ్ల సర్వీసు చేయాలి. దీంతో ఎదుగుబొదుగు లేకుండా పోతోంది. గార్డు నుంచి సీనియర్ గార్డు అయిన వారికి రెండు పట్టీలు ఇస్తున్నారు తప్ప రూపా యి జీతం పెంచడం లేదని వాపోతున్నారు. ప్రమోషన్ పాలసీ మార్చాలని తీవ్ర విమర్శలు రావడంతో యాజ మాన్యం దీనిపై కొన్ని నెలల క్రితం కమిటీ వేసి కోలిండియాలో అమలవుతున్న ప్రమోషన్ పాలసీని పరిశీలించాల్సిందిగా పంపించింది. వెళ్లి వచ్చిన కమిటీ రిపోర్టు ఇచ్చిన కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్ని అవస్థలు పడుతున్న అటు యాజమాన్యం పట్టించుకోకుండా ఇటు తాము గెలిపించిన గుర్తింపు సంఘం టీ బీజీకేఎస్ కూడా పట్టించుకోకపోవడంతో తాము ఎవరికి చెప్పుకొనేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైన యాజమాన్యం స్పందించి వారి సమస్యలు పరిస్కరించాల్సి అసవరం ఉంది. -
తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నర్సింగరావు!
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి మాజీ సీ అండ్ ఎండీ, ప్రస్తుత కోలిండియా చైర్మన్ ఎస్.నర్సింగరావు తెలంగాణ కొత్త రాష్ట్రంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను పరిపాలనలో కీలక పాత్ర పోషించే సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించడం దాదాపు ఖరారైందని విశ్వసనీయ సమాచారం. సోమవారం కేసీఆర్ గవర్నర్ భేటీకి ఆయనను వెంటబెట్టుకుని వెళ్లినట్లు తెలిసింది. కోలిండియా చైర్మన్‌గా కొనసాగుతున్న నర్సింగరావును తెలంగాణ రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై పంపాలని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ఉద్యోగుల ఆప్షన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ, ఇంకా ఇతర పాలనాపరమైన అంశాలపైనా నర్సింగరావుతో కలిసి కేసీఆర్ గవర్నర్‌తో చ ర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్వీసులో ఉన్నప్పుడూ కేసీఆర్, నర్సింగ్‌రావు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కోలిండియాలో చేరిన తర్వాత అక్కడ కంపెనీ లాభాలను గణనీయంగా పెంచారు. లాభాల నుంచి మొదటిసారి డివిడెంట్ ఇప్పించి ఆయన తన మార్కును చాటుకున్నారు. సింగరేణిలో చెరగని ముద్ర.. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణిలో నర్సింగరావు చెరగని ముద్ర వేశారు. ఆయన 2006 సెప్టెంబర్ 18 నుంచి 2012 ఏప్రిల్ 23 వరకు సింగరేణి సీఅండ్ఎండీగా పనిచేశారు. ఐదేళ్లపాటు సింగరేణిలో పనిచేసిన చైర్మన్ అయనొక్కడే కావడం విశేషం. ఆయన హయాంలోనే సింగరేణి ఎంతో అభివృద్ధి గడించి, మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించింది. కంపెనీలో మానవ వనరుల అభివృద్ధికి పాటుపడినట్లు ఆయనకు పేరుంది. కంపెనీ 50 మిలియన్ టన్నుల భారీ లక్ష్యాన్ని దాటి 53 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. కంపెనీలో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అవినీతిని అరికట్టడం నుంచి సింగరేణి ప్రక్షాళన అంతా ఆయన హయాంలోనే జరిగింది. రూ.4 వేల కోట్లతో జైపూర్ మండల కేంద్రంలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు ఆయన కలల స్వప్నంగా పేరుంది. ఆయన చొరవతోనే కేంద్రం ఏర్పాటు సాధ్యమైంది. ఈ ప్రాజెక్టుతో కంపెనీని విద్యుత్ రంగంలోకి కూడా తీసుకువచ్చి మరింత ఆర్థిక భద్రతకు బాట వేశారు. సింగరేణికి ముందు ఆయన రూరల్ డెవలప్మెంట్లో కమిషనర్‌గా, ఐటీ కమ్యూనికేషన్ శాఖ డెరైక్టర్‌గా, వైజాగ్, చిత్తూర్ కలెక్టర్‌గా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇంతటి పాలన దక్షకుడిగా పేరుండడంతో కేసీఆర్ మరీ పట్టుబట్టి ఆయనను తెలంగాణకు డెప్యుటేషన్‌పై తీసుకువస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆయనను సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తోంది. -
కొత్త రాష్ర్టంలో విద్యుత్ లోటు
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : జూన్ 2న అవతరిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సింగరే ణి జీవగర్ర కానుంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఎదుర్కొనే మొదటి సమస్య విద్యుత్. తెలంగాణలోని విద్యుత్ సంస్థల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ర్ట అవ సరాలకు సరిపోవడం లేదు. 4 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతుందని రాష్ట్ర విభజన సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ లోటు తీర్చాల్సిన బాధ్యత సింగరేణిపై పడింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి ముడిసరుకైన బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఏర్పడే 4 వేల మెగావాట్ల లోటు తీరాలంటే సింగరేణి అదనంగా ఏడాదికి సుమారు మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ బొగ్గు కొత్త విద్యుత్ సంస్థలతోపాటు, కెపాసిటీ పెంచే పాత సంస్థలకు అవసరం పడుతుంది. ఇదిలాఉంటే గడిచిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 54.3 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న అందులో కేవలం 50.4 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఏటా వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం బొగ్గు విద్యుత్ సంస్థలకే సరఫరా చేయడం జరుగుతున్నది. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన సింగరేణిలో 35 భూగర్భ గనులు, 15 ఓసీపీలు ఉన్నాయి. 65 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సాలీనా 50 మిలియన్ టన్నుల పైబడి బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. 2012-13లో 53.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. తరువాత సంవత్సరం తగ్గింది. కారణం గనులు పాతపడటంతో బొగ్గు నిక్షేపాలు లోతుల్లోకి వెళ్లి ఉత్పత్తికి ప్రతికూలంగా మారుతున్నాయి. అంతేకాకుండా కొత్త భూగర్భ, ఓసీపీలకు అనుమతుల్లో జాప్యం జరుగడం వల్ల బొగ్గు ప్రాజెక్టులు మొదలు కాక ఉత్పత్తి క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 55 మిలియన్ టన్నుల లక్ష్యం ఉంది. కొత్త రాష్ట్రంలో 18 మిలియన్ టన్నుల బొగ్గును అధనంగా సరఫరా చేయడం తప్పని సరైంది. ఇంత భారీ మొత్తం ఉత్పత్తి చేయాలంటే కొత్త గనులు తవ్వాల్సిందే. దీని కోసం యాజమాన్యం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. విద్యుత్ సమస్య వాకిట్లో ఉన్న దృష్ట్యా త్వరితగతిన బొగ్గు ఉత్పత్తి పెంచాలంటే ఓసీపీలకే ప్రాధాన్యత ఇవాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కనీసం 6 నుంచి 8 కొత్త ఓసీపీలు ఏర్పాటు చేయడానికి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న ఓసీపీలు.. తాడిచెర్ల, భూపాలపల్లి ఓసీపీ-2, శ్రావణ్‌పల్లి, మహేదేవ్‌పూర్, ఆర్జీ ఓసీపీ 3 ఫేజ్ 2, జీవీఆర్ ఓసీపీ 2 వంటి పలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. మరి కొన్ని భూగర్భ గనులు ఇదిలా ఉంటే దీనితోపాటు మరి కొన్ని భూగర్భ గనులు కూడా అవసరం ఉంది. శాంతిఖని, మందమర్రి షాఫ్ట్‌బ్లాక్, ఆర్కేపీ షాఫ్ట్‌బ్లాక్, కేకే 5 విస్తరణ, కాసిపేట 2 ఇంక్లైన్, గుండాల వంటి గనులు వేగవంతంగా తవ్వాలని భావిస్తున్నారు. కొత్తగా మొదలైన అడ్రియాల ప్రాజెక్టు నుంచి కూడా బొగ్గు ఉత్పత్తిని ఘననీయంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. భవిష్యత్‌లో సింగరేణి మరిన్ని ప్లాంట్లు కొత్త రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు విద్యుత్ సమస్యలు తీరాలంటే సింగరేణి కూడా రాబోయే రోజుల్లో మరికొన్ని పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి కొత్త ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్టు తప్పని సరి అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సొంతంగా జైపూర్‌లో 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నది. ఇకపై దీని సామర్థ్యం పెంచుకోవాల్సి ఉందని యాజమాన్యం భావిస్తుంది. అదే విధంగా రామగుండం బీ పవర్హౌజ్నుంచి 60 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాజెక్టులకు కెపాసిటి పెంచుతూ అదనపు యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎన్టీపీసీ, భూపాలపల్లి, పాల్వంచ ఇంకా ఇతర జెన్కో పరిధిలోని ప్లాంట్లను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రాజెక్టులు తప్పని సరి తెలంగాణలో 4 వేల మెగావాట్ల లోటు ఉంది. ఈ లోటు తీరాలంటే ఉన్న విద్యుత్ కంపెనీలకు, కొత్త వాటికి డిమాండ్‌కు తగ్గట్లు బొగ్గు ఉత్పత్తిని పెంచాలి. ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి కంటే మరో 18 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అధనంగా చేయాలి. దీనికి 6 నుంచి 8 ఓసీపీలు త్వరితగతిన మొదలు పెట్టాలి. మరికొన్ని భూగర్భ గనులు తవ్వాల్సి ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టితేనే డిమాండ్‌కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతాము. -
ఆర్కే-5బీ సెక్షన్ మూసివేత!
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 ఇంక్లయిన్ పరిధిలోని 5బీ సెక్షన్‌ను ఈ నెల 15 నుంచి మూసివేయడానికి యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి శనివారం గనిపై నోటీస్‌ను కూడా వేశారు. ఇక ఆర్కే-5 ఇంక్లయిన్ నుంచే వర్క్ డిస్ట్రిబూషన్ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో ఆర్కే-5 ఇంక్లయిన్ ఒక్కటే ఉండేది. గని లోపలికెళ్లిన కొద్ది పనిస్థలాలు దూరం అయ్యాయి. దీంతో పదమూడేళ్ల క్రితం యాజమాన్యం మరో టన్నెల్ తవ్వి దానికి 5బీ సెక్షన్‌గా నామకరణం చేసి నడిపిస్తూ వస్తోంది. ఆర్కే-5 ఇక్లయిన్ మేనేజర్ పరిధిలోనే వ్యహారాలు ఉన్న ఈ సెక్షన్‌కు ప్రత్యేక అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు ఉన్నారు. ల్యాంప్‌రూం, మ్యాగ్జిన్ కూడా వేరువేరుగా ఉన్నాయి. రెండు మ్యాన్వేలు, రెండు హాలేజీ వేల ద్వారా బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. ఆర్కే-5 గని పరిధిలో మొత్తం 2,100 మంది ఉంటే అందులో 5బీ సెక్షన్లో 700 మంది కార్మికులు.. అధికారులు, సూపర్వైజర్ సిబ్బంది 60 మంది వరకు పని చేస్తున్నారు. ఎక్కడికక్కడే వర్క్డిస్ట్రిబూషన్లు జరుగుతాయి. ఆర్కే-5 ఇక్లయిన్కు మేనేజర్ ఉన్న 5బీ సెక్షన్ కోసం ప్రత్యేక ఇన్చార్జి ఉన్నారు. ఈ రెండింటిలో ఎస్డీఎల్, హ్యాండ్ సెక్షన్ ద్వారా బొగ్గు తీస్తున్నారు. పైన రెండు వేరువేరుగా ఉన్న లోపల మాత్రం పనిస్థలాలు అనుసంధాన మయ్యే ఉంటాయి. అయితే గతేడాది ఉత్పత్తి లక్ష్యం 6.35 లక్షలు ఉందని, ఈ యేడు కొత్త పనిస్థలాలకు అనుమతి లేకపోవడంతో ఉత్పత్తి లక్ష్యాన్ని 4 లక్షలకు త గ్గించి పెట్టారని ఇంతదానికి రెండింటి నుంచి వ్యవహారాలు నడిస్తే నష్టం వస్తుందని పేర్కొంటు 5బీ సెక్షన్‌ను మూసి వేస్తున్న అధికారులు పేర్కొంటున్నారు. ఆర్కే-5 నుంచే పనులు ఇక 5బి సెక్షన్ కార్మికులంతా ఈ నెల 15 నుంచి ఆర్కే 5 నుంచే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆర్కే 5గని లోపల నుంచే 5బీ సెక్షన్లో ఉండే పనిస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా దూరం అవుతుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఐతే ఈ రెండు గనులను కలుపుతు లెవల్మ్యాన్ ైరె డింగ్ ఇప్పటికే వేసి ఉందని, 5బీ సెక్షన్ నుంచి దిగి వెళ్లిన 5 ఇంక్లయిన్ నుంచి దిగి వెళ్లిన కార్మికులు నడక ప్రయాస ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. పాలన పరమైన సర్దుబాటే తప్ప కార్మికులకు నష్టం ఏమి లేద ని అధికారుల వాదన. వ్యూహాత్మకంగానే మూసివేత గనిలో ప్రస్తుతం హ్యాండ్ సెక్షన్, ఎస్డీఎల్ రెండు సెక్షన్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఇకపై హ్యాండ్ సెక్షన్‌ను బంద్ చేయనున్నారని తెలిసింది. కారణం కొత్త హ్యాండ్ సెక్షన్ పనిస్థలాలకు అనుమతులు లేవనే కారణంతో ఈ సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం గత యేడు కంటే 2.3 లక్షల టన్నులు తక్కువగా పెట్టారు. దీంతో కార్మికుల సంఖ్యను కుదించడంలో భాగంగా ఇప్పటికే 150 మందిని ఇతర గనులకు బదిలీ చేశారు. ఈ నెల 15 తరువాత 5బీ సెక్షన్ మూసివేస్తే మరో 300 మందిని బదిలీ చేస్తారని తెలిసింది. హ్యాండ్ సెక్షన్ నుంచే ఈ బదిలీలు జరుగుతాయని అంటున్నారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. హ్యాండ్ సెక్షన్ మూసి వేసి గనిని పూర్తిగా ఎస్డీఎల్స్ ద్వారానే నడుపాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. భవిష్యత్‌లో కంటిన్యూయస్ మైనర్ ఆలోచనతోనే యాజమాన్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని వినిపిస్తుంది. దీని కోసంమే 5బీ సెక్షన్‌ను మూసేస్తున్నారు. పని వేళలు కూడా మార్పు కొన్ని నెలల నుంచి 5బి సెక్షన్లో పాత పని వేళలు తీసేసి కొత్త పనివేళలు పెట్టారు. జనరల్ షిఫ్ట్‌ను ఉదయం 5 గంటల నుంచి షిఫ్ట్‌ను 8 గంటల నుంచి పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేక వచ్చిన అధికారులు పట్టించుకోకుండా ఈ పని వేళలే కొనసాగిస్తున్నారు. ఇదే పనివేళలను కొద్ది రోజుల క్రితం ఆర్కే 5గనిలో పెట్టాలని చూస్తే తీవ్ర వ్యతిరేక రావడంతో యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఇప్పుడు 5బీ సెక్షన్ మూసి వేసిన తరువాత ఈ ఆర్కే 5గనిలో కూడా కొత్త పనివేళలు పెట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు తమ సొంత ప్రాపకాన్ని పూర్తి స్థాయి అధికారులకు చూపేందుకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తు గనిని నాశనం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైన 15వ తేదీ తరువాత ఆర్కే 5గనిలో చోటు చేసుకొనే పరిస్థితులు ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంది. ఉత్పత్తి లక్ష్యం తక్కువగా ఉందని.. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే 2.3 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం తక్కువగా పెట్టారు. రెండు గనుల నుంచి డిస్ట్రిబూషన్, రెండు ల్యాంప్‌రూం వంటి అన్ని రెండు చోట్ల నుంచి నిర్వాహణ అవసరం లేదని భావించాం. 15 నుంచి ఒకే చోటు నుంచి వర్క్డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించాం. ఇంకా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా ఫైనల్ కావాల్సి ఉంది. -
ఎన్నికల వేళ టీఆర్ఎస్కు షాక్
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి గట్టిషాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వివేక్ ఆయన సోదరుడు వినోద్‌లు సోమవారం టీఆర్ఎస్ విడిచి సొంత గూటికి చేరారు. డిల్లీలో దిగ్విజయ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకర్గంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. పార్టీకి ఎదురుదెబ్బ త గలడమే కాకుండా ఆయనతోపాటు గతంలో కాంగ్రెస్ విడిచి టీఆర్ఎస్లోకి వచ్చిన నేతలకు ఇప్పడు ఎన్నికల వేళ ఎటూ వెళ్లాలనే సందిగ్ధం నెలకొంది. వివేక్ వర్గీయులు చాలా మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొందరు ఆయనను నమ్మి పోటీలో ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారింది. ఎన్నికల వేళ ఏం చేయాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వివేక్ వెంట వెళ్లాలనుకున్న ఇప్పడికిప్పుడు సాధ్యం కాదు. కారణం టీఆర్ఎస్ బీ-ఫామ్‌లతో పోటీలో ఉండి పార్టీ మారితే గెలుపు గల్లంతే. ఎన్నికల వేళ వివేక్ తమను విడిచిపోవడం బాధగా ఉందని ఆయన వర్గీయ నేత ఒకరు న్యూస్‌లైన్‌కు వాపోయారు. గడ్డు పరిస్థితులే.. వివే క్ పార్టీ మారడంతో రాచకొండ కుటుంబం గడ్డు పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తున్నది. మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు కుటుంబం కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్ల పని చేసింది. వివేక్ తండ్రి వెంకటస్వామి నుంచి వివేక్ వరకు వారిని అంటిపెట్టుకొని రాజకీయంగా ఎదుగు తూ వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్‌లో ది వాకర్‌రావు, ఎంపీ వివేక్, ప్రేంసాగర్‌రావు మూ డు గ్రూపులు ఉన్నప్పుడు వారు వివేక్ బలంలో రాణించారు. కొద్దికాలం క్రితం వివేక్ కాంగ్రెస్ ను విడిచి టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతోపాటు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్లీ కాం గ్రెస్‌లోకి వివేక్ చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణారావు భార్య మంజుల మం చిర్యాల 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ లో ఉంది. ఆమె గెలిచి, టీఆర్ఎస్ ఎక్కువ స్థా నాలను కైవసం చేసుకొంటే మున్సిపల్ చైర్మన్ పదవి ఆమెకే ఇస్తానని ముందే వివేక్ వారికి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే ప్యానల్ సిద్ధం చేసి పెట్టుకున్నారు. కృష్ణారావు తమ్ముడు వెంకటేశ్వర్రావు కూడా ఆయన భార్య ఆశలతను మంచిర్యాల జెడ్పీటీసీగా బరి లో ఉంది. ఈ టిక్కెట్ పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న మండల అధ్యక్షుడు వంగ తిరుప తి, యువజన విభాగం తూర్పు జిల్లా అధ్యక్షు డు బేర సత్యనారాయణను కాదని ఎంపీ వివేక్ ఒత్తిడితో ఆశలతకే టిక్కెట్ ఇచ్చారు. ఆశలత గెలిస్తే ఆమెకు జెడ్పీ చైర్మన్ ఇప్పించడానికి సన్నాహాలు చేశారు. కొన్ని ఎంపీటీసీ స్థానాలు వివేక్ ఒత్తిడితో ఇవ్వడం జరిగింది. నేడు ఆ అభ్యర్థులతో పాటు పార్టీ నాయకత్వం కూడా ఆందోళన చెందుతుంది. వివేక్ మనుషులుగా ముద్ర పడ్డ అభ్యర్థులు ఇప్పడు వివేక్ వెంట పోయే పరిస్థితి లేకుండా చట్రంలో ఇరుక్కున్నారు. పోటీలో లేని కొందరు నాయకులు ఆయన వెంట నడిస్తే ఎన్నికల్లో అభ్యర్థులకు ఎదురీత తప్పదని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైన వివేక్ పార్టీ మారడంతో టీఆర్ ఎస్ పార్టీకి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైర్మన్ పదవులు దక్కేనా.. ఇదిలా ఉంటే ఎంపీ ఆశీస్సులతో మున్సిపల్, జెడ్పీ చైర్మన్ పదవులు అలంకరించవచ్చనుకు న్న వారికి ఇప్పుడు ఒక్క సారిగా సీన్ మారింది. వివేక్ వర్గీయులుగా ఉన్న వీరు గెలిచిన తరువాత చైర్మన్ పదవులకు దివాకర్‌రావు సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
ఆ 48 గంటలు..
'బాబాయ్.... డాడీ... మమ్మీ...చెల్లి ఎక్కడ.... ఇంకా నాన్న లేవలేదా... ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారు. నాకు మమ్మీ....డాడీ...చెల్లిని చూపించండి...' అంటూ శ్రీనివాస్ కుమారుడు అజయ్ రామ్ అనటంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. బాలుడి ఆవేదన చూసి దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ రామ్ ను తండ్రికి దహన సంస్కారాలు చేసేందుకు రొంపికుంట తీసుకు వచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అజయ్ రామ్ చేత తలకొరివి పెట్టించాడు. సాక్షి, మంచిర్యాల/మందమర్రి: అది మందమర్రి-శ్రీరాంపూర్ రహదారి. మందమర్రి దాటిన తర్వాత మధ్యలో పాలవాగు బ్రిడ్జి. దానికి 15 అడుగుల కింద రెండు మృతదేహాలు.. వాటిపక్కనే రెండు జీవచ్ఛవాలు. అలా ఒకటికాదు, రెండుకాదు.. 48గంటలు. బ్రిడ్జి పైనుంచే నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ బ్రిడ్జి కిందనున్న శవాలను.. జీవచ్ఛవాలను ఎవరూ గమనించలేదు. రక్తగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి.. మెలకు వ వచ్చినప్పుడల్లా క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. తమవారికి ప్రమాదం జరిగిందని తెలిసినా బంధువులు, పోలీసులు రెండు రోజులకు గానీ సంఘటన స్థలాన్ని గుర్తించలేదు. చివరకు వారివద్ద ఉన్న సెల్‌ఫోనే వారి ఆచూకీని చూపెట్టింది. కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కుందారపు శ్రీనివాస్, భార్య శ్రీలత, కుమారుడు అజయ్‌రామ్, కుమార్తె దీక్షిత గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి బంధువుల ఇంట్లో జరిగిన దశదినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి 7గంటలకు ద్విచక్ర వాహనంపై రొపింకుంటకు బయల్దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా..’ అని బెల్లంపల్లిలోనే ఉండే శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత అమ్మమ్మ చేయి పట్టుకుని వదల్లేదు. ‘వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు’ అని రోదించుకుంటూ చెప్పింది లక్ష్మి. ఇంతలోనే ఘోరం.. శ్రీనివాస్ కుటుంబసభ్యులు మందమర్రి దాటి పాలవాగు వద్దకు చేరుకోగానే కల్వర్టు వద్ద పాము అడ్డుగా వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు దీక్షిత కూర్చుంది. డాడీ పాము అనగానే శ్రీనివాస్ భయంతో కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కిందనున్న పదునైన బండలపై పడడంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్ర తీవ్రగాయాలయ్యాయి. పడడంతోనే శ్రీనివాస్ చనిపోగా, దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది. రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని కాలు విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండడంతో ఎవరూ కనిపించలేదు. ఆమె అరుపులు ఎవరూ వినలేదు. ఆమె కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు అజయ్‌రామ్‌కు మెలుకువ వచ్చింది. వినిపించని ఆర్తనాదాలు.. చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటునుంచి వస్తుందోనని బాలుడి భయం.. కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే మళ్లీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది. శుక్రవారం వేల వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. ఎవరూ గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలతకు మెలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబసభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్పూర్లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర అని.. సృ్పహ కోల్పోయింది. వెతికి వెతికి వేసారి.. కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబసభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పైనుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శ బ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-శ్రీరాంపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్టు కింద శనివారం రాత్రి 10 గంటలకు వారిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.