
శ్రీరాంపూర్(మంచిర్యాల) : కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కన్న తండ్రే ఇంటి ఆవరణలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్‌కు వచ్చి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని బుధవారం ఉదయం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా బయటకు తీయించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన జి.గజేంద్రన్ ఇక్కడి సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఉన్న సీఐఎస్‌ఎఫ్ క్యాంప్‌లో జవాన్‌గా పని చేస్తున్నాడు. ఇక్కడ కాంప్లెక్స్‌లోని ఓ క్వార్టర్‌లో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. భార్య దేవిక, కూతురు గౌరీ ఉన్నారు. కుమారుడు గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దేవిక కొద్ది రోజులుగా భర్తతో కలిసి ఉండడం లేదు. గౌరీకి కొద్ది నెలల క్రితం గోదావరిఖనికి చెందిన రామస్వామితో వివాహామైంది.
ఇద్దరి మధ్య గొడవలతో గోదావరిఖనిలో గృహ హింస కేసు నడుస్తోంది. దీంతో గౌరీ తండ్రితో ఉంటోంది. భర్త తీసుకెళ్లడం లేదని తన కూతురు గౌరీ(27) మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంట్లోనే ఉరి వేసుకుందని, డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత చూసే సరికి మృతిచెంది ఉందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తానే క్వార్టర్ ఆవరణలో గోతి తీసి పూడ్చిపెట్టినట్లు గజేంద్రన్ మంగళవారం ఎస్సై ఉమాసాగర్‌కు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలాన్ని బుధవారం మంచిర్యాల ఏసీపీ గౌస్‌బాబా, రూరల్ సీఐ ప్రమోద్‌రావు సందర్శించారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. కుటుంబ సభ్యులు, సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ శ్రీనివాస్ సమక్షంలో నస్పూర్ తహసీల్దార్ జ్యోతి, వైద్యులు శేఖర్‌రావు, కీర్తిలు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. కాగా, గౌరీ మృతి అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను ఎందుకు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసాడనేది విచారణలో తేలాల్సి ఉంది. మీడియా సిబ్బంది సీఐఎస్‌ఎఫ్ కాంప్లెక్స్‌లో వెళ్లడానికి ప్రయత్నించగా కాపలా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై అధికారుల ఆదేశాలు అంటూ లోపలికి వెళ్లనీయలేదు.
Comments
Please login to add a commentAdd a comment