
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు శేఖర్ .. ఆ..అయింది..కానీ దానికి మార్కులు సరిపోవట.. దాని అంచనాకు సరిపడా రాలేదని ఏడుస్తూ బెడ్ రూములో కూర్చుంది.. ఎంత చెప్పినా వినదాయే మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ వంటింట్లోంచి చెప్పింది పావని..
ఓహ్.. అలాగా అనుకుంటూ చిన్నారి స్వీటీ.. ఏం చేస్తున్నావ్.. మంచి మార్క్స్ వచ్చాయి కదా మరి నీ సేవింగ్స్‌తో నాకు పార్టీ ఇస్తాను అన్నావు మరి రెడీనా అన్నాడు శేఖర్..
ఆ మీరు నన్ను వెక్కిరిస్తున్నారు.. నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు..నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను.. ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బుగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్ళు కారుస్తోంది స్వీటీ.. అదేంటి తల్లీ నైన్టీ పర్సెంటేజీ వచ్చింది..అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే..ఇంకెందుకు బాధ..అంతకన్నా పైన క్లాస్ లేదుగా నువ్వు మంచిగా పెర్ఫార్మ్ చేశావు తల్లి.. ఆమాత్రం చాలు.. డోంట్ వర్రీ అంటూ తలనిమిరాడు.. లేదు నాన్నా నాకు అవమానంగా ఉంది..నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి.. ఇది నాకు చాలా ఇన్స్టాలింగ్ ..రేపు నేను వాళ్లకు ఎలా మొహం చూపాలి..ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ..
బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు..అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్ గా మాట్లాడింది అనుకుంటూ..అదేం లేదు నాన్నా..నేను చెబుతాగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు. ఆ చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ .. పావనీ ఆ సూట్కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు.. తెస్తున్నా అంటూ ఈ తండ్రికూతుల్లకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతోంది అనుకుంటూనే ఫైల్ తెచ్చి ఇచ్చింది.
కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చెయ్యి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక ఇదేంటి నాన్నా బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ.. అది నా టెన్త్ మార్కుల లిస్ట్..చూడు అన్నాడు .. చూసింది.. బొటాబొటి 38 మార్కులతో అన్నీ పాసైనట్లు ఉంది. చివర్న పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి నాన్నా మీరు జస్ట్ పాస్..థర్డ్ క్లాసులో పాసయ్యారా అని అబ్బురంగా.. అవునమ్మా అన్నాడు శేఖర్.. నెక్స్ట్ చూడు అన్నాడు.. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి.. అందులో 52 శాతం మార్క్స్.. అంటే సెకండ్ క్లాస్ వచ్చింది.. నాన్నా ఈసారి ఈ ప్రోగ్రెస్ పెరిగింది సుమీ అంది కూతురు మెచ్చుకోలుగా .. తరువాత చూడు అన్నాడు.. అందులో బీకాం..ఫస్ట్ క్లాస్ అని ఉంది.. నాన్నా ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ.. అవునమ్మా అన్నాడు శేఖర్..
చూసావా బుజ్జి నేను థర్డ్ క్లాసులో పాసైనా నేను నీలాగా అవమానం అనుకోలేదు.. బతకడం వేస్ట్ అనుకోలేదు.. ఇంకా బాగా కష్టపడ్డాను..ఇంటర్లో సెకండ్ క్లాసు..డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను. బ్యాంక్ పరీక్షలు రాసి ఆఫీసర్ అయ్యాను... నాకన్నా అప్పట్లో టెన్త్ ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచిలోనే క్లర్క్ గా చేస్తున్నారు ..
దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు తల్లీ అన్నాడు.. ఆలోచించింది స్వీటీ.. మార్కులు ముఖ్యం కాదు.. కష్టపడి చదవాలి.. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళ్తే నీలాగే మంచి పొజిషన్ కు చేరుకోవచ్చు.. అంది కాస్త స్థిమిత పడుతూ.. మరి ఇప్పుడేం చేద్దాం అంటావ్..అన్నాడు శేఖర్.. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు, అమ్మకు మంచి పార్టీ ఇస్తాను..ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీట్ కొడతాను..సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్ గా.. ఎస్..అదీ లెక్క.. ఆ స్పిరిట్ ఉండాలి.. పదా మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని..భార్యను తీసుకుని బయటకు బయల్దేరాడు..
::సిమ్మాదిరప్పన్న