
మార్చండి ప్లీజ్.. ఊరివాళ్ళ మొర
తమ ఊరికి మంచి పేరు తేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఊరి పేరే తమకు చెడ్డ పేరు తెస్తోందని ఆ ఊరివాళ్లు వాపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో తమ తాతల కాలం నాడు వాడుకలోకి వచ్చిన ఆ పేరు ఇప్పుడు తమ పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కూడా అడ్డంకిలా పరిణమించిందని ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుండడం విశేషం. ఆ ఊరు ఏంటి? ఆ ఊరి పేరు ఎందుకు ఆ ఊరివాళ్ల పాలిట గుదిబండలా మారింది అనే వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఉన్నాయి పక్కపక్కనే ఉన్న రెండు ఊర్లు. ప్రస్తుతం ఆ ఊరి పేర్లే మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అసభ్యకరంగా ఉన్న ఆ పేర్లను చెప్పడానికి ఇబ్బందిగా ఉందని తాము సభ్యతగా జీవిస్తున్నా తమ ఊరి పేరు మాత్రం తమను దిగజారుస్తోందనేది వీరి ఆవేదన. ఆ ఊర్లకు అలాంటి పేర్లు రావడానికి కూడా గత చరిత్ర దోహదం చేసిందని ఆ ప్రాంతంలోని పాత తరం వారు చెబుతున్నారు. ఈ రెండు గ్రామాలు కొండల్ని ఆనుకుని ఏర్పడ్డాయి చాలా కాలం క్రితం సంపన్నులైన పర్లాఖిమిండి రాజవంశీయుల ప్రాపకంతో ఆ ఊర్లు ఏర్పడ్డాయట. సదరు రాజ వంశంలోని మగవారు తమ ఆధీనంలోని ఉంపుడుగత్తెలను ఉంచడం కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నారట. అంతేకాకుండా వారికి కొన్ని భూములను కూడా బహుమతులుగా ఇచ్చారట. ఈ కారణంగానే ఆ ఊర్లకు అలాంటి పేర్లు వచ్చాయని ఆ ఊరి చరిత్ర గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అక్కడ ఉంపుడుగత్తెలను ఉంచేవారు కాబట్టి ఆ ఊర్లను సానిపాలెం, సవర సానిపాలెం అంటూ పిలిచేవారట.
అలా అలా అదే పేర్లు రికార్డులలోకి కూడా ఎక్కాయట. ఆ ఊర్లలోని ఒకటైన సానిపాలెంలో దాదాపు 220 కుటుంబాలు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎస్టీ కులాల వారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. కొంత కాలం పాటు ఆ పేర్లు అలాగే కొనసాగినా... ప్రస్తుతం ఆ ఊర్లలో అనేక మంది విద్యావంతులుగా , అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుండడంతో ఆ ఊరి పేర్లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో గ్రామస్తులు తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతున్నారు.

ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లలో ఆ ఊరి పేర్లు ఉండటంతో అవమానంగా ఉందని, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపధ్యంఓ తమ ఊర్ల పేరు మార్చాలని కోరుతూ ఈ రెండు గ్రామాల ప్రజలు తహసీల్దార్, డీఆర్వోలకు అలాగే శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో కూడా . వినతిపత్రాలు అందజేశారు. సానిపాలెం పేరును రామయ్యపాలెంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, గ్రామాల పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆ ఊరివాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.
చాలా సందర్భాల్లో తమ ఊరి పేరు చెప్పాలంటేనే సిగ్గుగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.. తమ గ్రామం పేరు చెప్పి అవమానాలు కూడా పడ్డామంటున్నారు. కొందరు ఊరి పేరు చెప్పగానే నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రాజుల కాలం నాటి పేర్లు అలాగే ఉన్నాయని.. వాటిని ఇప్పుడైనా మార్చాలని కోరుతున్నారు. వీరి వినతికి స్పందించి ప్రభుత్వం పేరు మార్పు ఎప్పుడు చేస్తుందో...చూడాలి.