స్ఫూర్తి
‘ఓ పక్షీ! నీ పాట ఇక్కడ పాడబోకు ఎగిరిపో... నీ వనాలెక్కడున్నాయో వెతుక్కుంటూ’ అనేది కవి వాక్యం. బీటెక్ చదువుతున్న మహాలక్ష్మి టెక్ దారిలో వెళ్లకుండా... బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు ఎంపికైంది. తెనాలి అయితానగర్ అమ్మాయి మహాలక్ష్మి ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సగర్వంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది..
ఎన్‌సీసీలో చేరిన రోజుల్లో ఎంతోమంది సాహసికులైన సైనికుల గురించి తెలుసుకునే అవకాశం మహాలక్ష్మికి వచ్చింది. ఆ సమయంలోనే ‘నేను సైతం సైన్యంలోకి’ అనే లక్ష్యానికి బీజం మహాలక్ష్మి మదిలో పడింది. మహాలక్ష్మి తల్లి వెంకాయమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సు, తండ్రి రాజుది పెయింటింగ్ వృత్తి.
చాలీచాలని సంపాదనైనా ఆ దంపతులు బిడ్డలిద్దరినీ చదివించారు. మహాలక్ష్మి చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపేది. ఎన్‌సీసీ మాస్టారు బెల్లంకొండ వెంకట్ ప్రోత్సాహంతో ఎన్‌సీసీలో చేరింది. రెండు జాతీయ శిబిరాలకు హాజరయ్యే అవకాశం వచ్చింది. కాలేజి గ్రౌండులో వ్యాయామం చేసేందుకు వస్తుండే బాలయ్య అన్నయ్య రన్నింగ్, హైజంప్‌లో అథ్లెటిక్స్‌లో సాధన చేయించాడు.
జోనల్ అథ్లెటిక్ మీట్‌లో రన్నింగ్‌లో ఫస్ట్ వచ్చింది. చదువే లోకం అనుకునే అమ్మాయికి ఎన్‌సీసీ, ఆటలు పరిచయం కావడంతో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. తనలోని శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకునే అవకాశం వచ్చింది. టెన్త్ తర్వాత సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజిలో పాలిటెక్నిక్‌లో చేరిన మహాలక్ష్మి, తర్వాత అదే కాలేజిలో బీటెక్ సెకండియర్‌లో చేరింది.
ప్రస్తుతం ఫైనలియర్‌లో ఉండాల్సింది. ఈలోగా 2022లో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. 2023లో బీఎస్‌ఎఫ్‌కు ఎంపికైంది. పశ్చిమబెంగాల్ బైకాంతపూర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంపులో 11 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. గత అక్టోబరు 28న పశ్చిమబెంగాల్‌లోని బీఎస్‌ఎఫ్ 93 బెటాలియన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అదే రాష్ట్రంలో ఇండో–బంగ్లాదేశ్ బోర్డర్‌లోని జపర్సల వద్ద మహాలక్ష్మి సైనికురాలిగా ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది.
ప్రస్తుతం క్రిస్మస్ సెలవులకని సొంతూరు తెనాలికి వచ్చింది. శిక్షణ రోజుల గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పింది.... ‘బైకాంతపూర్‌లోని క్యాంపులో శిక్షణ చాలా కఠినంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఆడిన ఆటలు, చేసిన వ్యాయామాల వల్ల కష్టం అనిపించేది కాదు. తెల్లవారుజాము నాలుగు గంటల్నుంచే రన్నింగ్, ఇతర వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తరగతులు ఉంటాయి.
ఏకే 47తో సహా రకరకాల వెపన్‌లు విడగొట్టటం, నిర్ణీత వ్యవధిలో అమర్చటం, బుల్లెట్లను లోడు చేయడం, ఫైరింగ్... మొదలైనవి ఎన్నో సాధన చేయించేవారు. సాయంత్రం 5 గంటల నుంచి సరిహద్దులో డ్యూటీ చేయాలి.
కష్టమే అయినా ఇష్టంగా చేయగలిగాను’‘సైన్యంలో పనిచేస్తున్నావట కదా... మంచి విషయం అమ్మా’ అని అభినందించే వారే కాదు... ‘సరిహద్దుల్లో ఉద్యోగమా! అంత కష్టమెందుకమ్మా. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా!’ అని సలహా ఇచ్చేవారు ఉన్నారు. సైన్యంలో జెండర్ బారియర్స్ తొలగిపోతున్న కాలం ఇది. పురుషులతో సమానంగా అమ్మాయిలు సత్తా చాటుతున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో.... నిరాశపరిచే మాటలు వారి హృదయాలను చేరవు. దేశభక్తి ఉన్న హృదయాలకు భయాలతో పనేమిటి!
కమాండర్ స్థాయికి చేరుకోవాలని...
ఎన్‌సీసీలో ఉన్నప్పుడు ఎంతోమంది గొప్ప సైనికుల గురించి, వారి త్యాగాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆ వీరులు, త్యాగధనుల గురించి వింటున్న క్రమంలో ‘ఏదో ఒకరోజు నేను కూడా సైన్యంలో పనిచేస్తాను’ అనుకునేదాన్ని.అయితే అదెంత కష్టమో నాకు తెలియంది కాదు. ప్రోత్సహించేవారి కంటే నిరూత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు.
కష్టాన్ని ఇష్టపడేవారే విజేతలు అవుతారు. శిక్షణ కాలంలో బైకాంతపూర్ క్యాంప్‌లో ‘ఇంత కష్టమా’ అనిపించలేదు. ‘ఇన్ని విషయాలు తెలుసుకున్నాను కదా’ అనుకున్నాను. దేశభక్తి గురించి అధికారులు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని కలించాయి. ఆ స్ఫూర్తితోనే దేశ సరిహద్దుల రక్షణకు అంకితమయ్యాను. బాగా కష్టపడి బీఎస్‌ఎఫ్‌లో కమాండర్ స్థాయికి చేరుకోవాలనేది నా కల.
– వై.మహాలక్ష్మి
– బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment