Central Reserve Police Force
-
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
పవార్‌కు ‘జడ్ ప్లస్’ భద్రత
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎప్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పించింది. వీఐపీ భద్రతలో జడ్ ప్లస్ అత్యధిక రక్షణ కవచం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన 83 ఏళ్ల శరద్ పవార్‌కు జడ్ ప్లస్ రక్షణను కలి్పంచాలని కేంద్ర హోంశాఖ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కోరింది. జడ్ ప్లస్ కేటగిరీ కింద 55 మంది సాయుధ సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణ కలి్పస్తారు. కేంద్ర ఏజెన్సీలు ముప్పును అంచనా వేసి.. శరద్ పవార్‌కు అత్యంత పటిష్టమైన భద్రతను కలి్పంచాలని సిఫారసు చేశాయి. -
ప్రపంచ స్థాయి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్ఎస్), యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. రాఫెల్‌లు.. హెలికాప్టర్లు.. యాంటీ డ్రోన్లు దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్ఎస్జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న విమానం, క్వాడ్కాప్టర్లు నిర్వహణను నిషేధించారు. -
తుది దశకు మావోయిస్టులపై పోరు
జగదల్పూర్: దేశంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. రేపో మాపో ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది చేస్తున్న ఆత్మత్యాగాలే ఈ పోరాటంలో అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 84వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా నక్సలిజంపై భద్రతా సిబ్బంది పోరాటం చేస్తున్నారని విజయం సాధించే దిశగా ముందడుగు వేశారని అన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించడంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర ప్రశంసనీయమని కితాబునిచ్చారు. -
సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఓ మహిళ సీఆర్పీఎఫ్ బంకర్‌పై పెట్రో బాంబుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ముందు మంగళవారం సాయంత్రం ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో బుర్ఖా ధరించిన ఓ మహిళ చేతిలో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగి తన బ్యాగులోంచి బాంబును తీసి దానికి నిప్పటించి సీఆర్పీఫ్ క్యాంప్ మీదకు విసిరింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. కాగా మహిళ విసిరిన బాంబు సెక్యూరిటీ క్యాంపు బయట పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళను గుర్తించినట్లు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం #WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir (Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY — ANI (@ANI) March 30, 2022 -
స్త్రీ శక్తి.. మరో అడుగు
సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) స్త్రీసాధికారత, శక్తియుక్తులకు సంబంధించి మూడు చారిత్రక అద్భుతాలకు వేదిక అయింది. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నక్సల్స్‌ను ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ‘కోబ్రా కమాండో’లో మహిళల ప్రాతినిధ్యం లేదు. అయితే 34 మంది మహిళలతో ‘కోబ్రా’ దళాన్ని ఏర్పాటు చేసి మహిళలు లేని లోటును పూరించారు. ‘కోబ్రా’కు ఎంపికైన వారియర్స్ మూడు నెలల పాటు అడవుల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్‌గ్రామ్ కదార్‌పుర్‌లో కోబ్రా వుమెన్ వారియర్స్ ప్రదర్శించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అభినందనలు తెలియజేస్తూ ‘హిస్టరీ ఇన్ మేకింగ్’ అని ట్విట్ చేసింది సీఆర్పీఎఫ్. 2012లో వరల్డ్స్ ఫస్ట్ ‘ఆల్– ఉమెన్ పారామిలటరీ పైప్‌బ్యాండ్’ను ఏర్పాటు చేసింది సీఆర్పీఎఫ్. ఇక తాజా విషయానికి వస్తే... సీఆర్పీఎఫ్ జడ్–ప్లస్ కేటగిరి కోసం విధులు నిర్వహించడానికి ఎంపికైన 32 మంది ఉమెన్ వారియర్స్ వివిధ విభాగాల్లో పదివారాల పాటు శిక్షణ పొందారు. ఈ నెలలోనే కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్... మొదలైన వారికి రక్షణగా నిలవనున్నారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో వీఐపీ రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. గతంలో జడ్–ప్లస్ కమాండో విభాగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. తాజా అడుగుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సీఆర్పీఎఫ్. -
వీవీఐపీ భద్రతకు మహిళా కమెండోలు
న్యూఢిల్లీ: సుశిక్షితులైన కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్పీఎఫ్)కు చెందిన తొలి మహిళా కమెండోల బృందం దేశంలోని వీవీఐపీలకు త్వరలో భద్రత కల్పించనుంది. హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ దంపతులు సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్పీఎఫ్ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు. వీవీఐపీలు ఇంట్లో ఉన్నపుడు రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అగ్రనేతలు పర్యటించినపుడు మహిళా కమెండోలు వీరి వెన్నంటే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తంగా 32 మందితో సిద్ధమైన కమెండోల దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఆయుధాలు లేకుండానే శత్రువుతో పోరాడటం, అన్ని రకాల ఆయుధాలను వాడే నైపుణ్యం, డేగ కళ్లతో చుట్టూరా చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసికట్టడం, భద్రత కల్పించడం తదతర అంశాల్లో వీరంతా 10 వారాల కఠోర శిక్షణను పూర్తిచేశారు. వచ్చే ఏడాది జనవరిలో వీరిని విధుల్లోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముందుగా ఢిల్లీలో జెడ్+ కేటగిరీలో ఉన్న అమిత్, మన్మోహన్ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు వీవీఐపీలు బస చేసిన ఇంట్లో తనిఖీ బాధ్యతలు వీరివే. -
సీఆర్పీఎఫ్ వీర జవాన్ల కుటుంబాలకు పరిహారం పెంపు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉండగా అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో లేదా విధుల్లో ఉండగా ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం..క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో నేలకొరిగిన జవాన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.21.5 లక్షల పరిహారాన్ని రూ.35 లక్షలకు పెంచారు. ఎవరైనా జవాను ప్రమాదం, అనారోగ్యం, తదితర ఏ ఇతర కారణాలతోనైనా విధి నిర్వహణలో ఉండగా చనిపోతే ఆయన కుటుంబానికిచ్చే పరిహారాన్ని రూ.16.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెప్టెంబర్‌లో జరిగిన వార్షిక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
సీఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ సస్పెండ్
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ), అంతర్జాతీయ మాజీ స్విమ్మర్ ఖజాన్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఖజాన్తోపాటు మరో కోచ్, ఇన్స్పెక్టర్ సుర్జీత్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి వెల్లడించారు. గత డిసెంబర్లో ఖజాన్పై మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని బాబా హరిదాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై ఖజాన్, సుర్జీత్ అత్యాచారం చేశారని, సీఆర్పీఎఫ్లోని పలువురు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేయగా... విచారణ లో వారిద్దరూ దోషులుగా తేలారు. దీంతో ఖజాన్, సుర్జీత్ సస్పెన్షన్‌కు గుర య్యారు. 56 ఏళ్ల ఖజాన్ సింగ్ 1986 సియోల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో రజత పతకం సాధించాడు. పతకంతో దేశానికి పేరుతెచ్చిన అతనికి సీఆర్పీఎఫ్లో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగమిచ్చారు. 1984లో ‘అర్జున’ అవార్డు పొందిన ఖజాన్ 1988 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1988 వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో రజతం, 1989 దక్షిణాసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు సాధించాడు. 1986 ఆసియా క్రీడల్లో రజత పతకంతో ఖజాన్ సింగ్ -
కోబ్రా దళంలో మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) తొలిసారిగా తన కమెండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్(కోబ్రా) కమెండో యూనిట్లో మహిళా కమెండోలను రంగంలోకి దించనుంది. ఈ కమెండోలు వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్లోని మొత్తం 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేసి వారికి కఠిన కమాండో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ మహిళా కోబ్రా కమెండోలను బరిలోకి దింపుతారు. 2008–09లో సీఆర్పీఎఫ్లో అంతర్గతంగా రెండు కోబ్రా బెటాలియన్లను ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2009–10 సంవత్సరంలో ఈ బెటాలియన్ల సంఖ్యను నాలుగుకు పెంచారు. 2010–11లో మరో 4 బెటాలియన్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఉన్న 246 బెటాలియన్లలో 208 ఎగ్జిక్యూటివ్, 6 మహిళల, 15 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్), 10 కోబ్రా, 5 సిగ్నల్స్, ఒక స్పెషల్ డ్యూటీ గ్రూప్, ఒక పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లు ఉన్నాయి. సీఆర్పీఎఫ్లో మొదటి మహిళా బెటాలియన్ 1986లో ఏర్పడింది. ఇటీవల మహిళా బెటాలియన్ 35వ రైజింగ్ డే సందర్భంగా కోబ్రా శిక్షణకు మహిళా జవాన్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం కోబ్రా యూనిట్లో కమెండో శిక్షణ కోసం ఎంపికైన 34 మంది మహిళా జవాన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది మహిళా జవాన్లు కోబ్రా యూనిట్లో చేరేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం. కమాండో శిక్షణలో భాగంగా మహిళా జవాన్ల శారీరక ధారుఢ్యం, సాంకేతిక అవగాహనను పెంచడమే కాకుండా ఫైరింగ్, ప్రత్యేక ఆయుధాల వినియోగం, శత్రువులను ఎదుర్కొనేందుకు ప్రణాళికల రూపకల్పన, ఫీల్డ్ క్రాఫ్ట్, పేలుడు పదార్థాల ఏరివేత, అడవుల్లో మనుగడకు సంబంధించిన నైపుణ్యాలను అందిస్తారు. కోబ్రా కమాండో శిక్షణ పూర్తయిన తర్వాత పురుష కమాండోలతో కలిసి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో మహిళా కమెండోలను మొహరిస్తారని అధికారులు తెలిపారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్లోని కోబ్రా యూనిట్లను నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో పాటు, కొన్ని యూనిట్లను ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు చర్యల అణిచివేతకు వినియోగిస్తున్నారు. -
సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీఆర్పీఎఫ్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో హెడ్ క్వార్టర్స్‌ను అధికారులు ఆదివారం సీలు వేశారు. శానిటేషన్ కోసం బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ భవనంలోకి ఎవరినీ అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకిగా, ఈ బెటాలియన్‌కు చెందిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఇటీవలే కరోనాతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా 39,000మంది కరోనా బారినపడిగా 1300మంది మరణించారు. (సీఆర్పీఎఫ్: 122 మంది జవాన్లకు కరోనా) -
135 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్ సోకి సప్థర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
సైనాకు సీఆర్పీఎఫ్ డీజీ ప్రశంసలు
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియా ప్రశంసించారు. ‘ సైనా మీ ఆలోచనా విధానానికి మేం కృతజ్ఞులం. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం మీరు చేసిన పని చాలా గొప్పది. మీ చర్యతో మేము కదిలిపోయాం. జవాన్ల కుటుంబాలపై మీరు చూపించిన ప్రేమ... దేశభక్తులందరికీ స్ఫూర్తినిస్తుంది’ అని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మార్చి 11న జరిగిన నక్సల్స్ దాడిలో విధుల్లో ఉన్న పలువురు పోలీసులు ప్రాణాలొదిలారు. దీంతో అమర జవాన్ల కుటుంబాల కోసం సైనా తన పుట్టినరోజు (మార్చి 17) సందర్భంగా రూ. 6 లక్షలు విరాళంగా ఇచ్చింది. -
ఉద్యోగాలు
సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది ఖాళీల సంఖ్య: 600 అర్హత: సెంట్రల్/స్టేట్ బోర్డు నుంచి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయసు: 18-25 ఏళ్లు దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 06 రిజిస్ట్రేషన్ ముగింపు: మే 5 రాత పరీక్ష తేదీ: జూన్ 26 మరిన్ని వివరాలకు: www.crpf.nic.in ఐఆర్ఈడీఏలో 46 పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియన్ రెన్యు బుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఈడీఏ) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్ సర్వీస్,ఎఫ్ అండ్ ఏ), సీనియర్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా), అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ అండ్ ఏ, లా, హెచ్ఆర్), మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ), అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ. ఖాళీలు: 46 వయసు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 8 వివరాలకు: www.ireda.gov.in అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం బెంగళూరులోని అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ.. ఎల్ఎల్ఎం ఇన్ లా అండ్ డెవలప్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వ్యవధి: ఏడాది అర్హత: లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 31 వెబ్సైట్: www.azimpremjiuniversity.edu.in ట్రిపుల్ ఐటీ- వడోదరలో ఎంటెక్ ప్రోగ్రాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- వడోదర.. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలు: సీఎస్, ఐటీ, ఈసీ, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ (లేదా) సీఎస్, ఐటీ, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్‌లో ఎమ్మెస్సీ గేట్ (సీఎస్/ఈసీ)లో అర్హత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: మే 27 వెబ్సైట్: pgadmissions.iiitvadodara.ac.in -
సీఆర్పీఎఫ్లో 197 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
హైదరాబాద్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) చాంద్రాయణగుట్ట కేశవగిరి గ్రూప్ సెంటర్లో 197 కానిస్టేబుల్ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనున్నట్లు సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుధీర్ దివాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో కానిస్టేబుల్(టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్) పోస్ట్‌లకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 10వ తేదీ వరకు అర్హులైనవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. సీఆర్పీఎఫ్ఇండియా.కామ్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్పీఎఫ్.ఎన్ఐసీ.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ ఉద్యోగావకాశాలకు సంబంధించిన నోటీస్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఆర్పీఎఫ్.ఎన్ఐసీ.ఇన్‌లో కూడా ఉంచినట్లు తెలిపారు. ఉద్యోగ ఖాళీలివే..: పురుష డ్రైవర్లు: 37, పురుష ఫిట్టర్లు: 14, పురుష బగ్లర్: 15, పురుష టైలర్లు: 6, పురుష కోబ్లర్: 3, పురుష గార్డెనర్: 1, పురుష బ్రాస్ బ్యాండ్: 1, పురుష కార్పెంటర్: 1, పురుష కుక్‌లు : 19, పురుష వాటర్ క్యారియర్: 10, పురుష వాషర్మెన్: 3, పురుష సఫాయి కరమ్చారి: 8, పురుష బార్బర్: 4, మహిళా బగ్లర్: 1, మహిళా కుక్‌లు : 2, మహిళా హెయిర్ డ్రెస్సెర్: 1, మహిళా సఫాయి కరమ్చారి: 1 -
మావోల వేటకు ‘లాడెన్ శునకాలు’
సాక్షి, హైదరాబాద్: అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో అమెరికన్ నేవీ సీల్స్కు ఎంతగానో సహకరించిన మేలుజాతి శునకం ‘బెల్జియం మలినాయిస్’ మావోయిస్టు ప్రభావిత అడవుల్లో పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రతిపాదనలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఏ) ఆమోదం తెలపడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అందుకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించింది. విఫలమవుతున్న జర్మన్ షెపర్డ్ శునకాలు సీఆర్పీఎఫ్ బలగాలు.. ప్రస్తుతం జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ జాతి శునకాలను వినియోగిస్తున్నాయి. వేడి ఎక్కువగా ఉండే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్స్‌లో ఈ జాతుల శునకాలు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేకపోతున్నాయని సీఆర్పీఎఫ్ గుర్తిం చింది. వాటికి వాసన పసిగట్టే శక్తి ఉండట్లేదు. దీంతో కొన్ని నెలల పాటు ఇక్కడి పరిస్థితులకు అనువైన శునకాలను గుర్తించడానికి బలగాలు అధ్యయనం చేశాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం మలినాయిస్ సీఆర్పీఎఫ్ దృష్టిని ఆకర్షించింది. ఏకధాటిగా 30 కి.మీ నడిచే మలినాయిస్ ఎలాంటి పరిస్థితుల్లో ఏకధాటిగా 30 కి.మీ నడవగలగటం బెల్జియం మలినాయిస్ జాతి శునకాలకు ఉన్న ప్రధాన లక్షణం. ఇతర శునకాల కంటే 40 రెట్లు ఎక్కువగా వాసన పసిగట్టే శక్తి ఈ శునకాల సొంతం. ప్రస్తుతం బెంగళూరులోని డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్లో ఈ శునక సంతతిని వృద్ధి చేయడంతో పాటు 20 వారాల పాటు శిక్షణ ఇస్తున్నారు. మరో ఏడాదిలో వీటిని సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు వినియోగించుకోనున్నాయి. -
మావోయిస్టుల దాడి: ఇద్దరు జవాన్ల మృతి
హైదరాబాద్ : చత్తీస్ ఘడ్ లో పెట్రోలింగ్ నిర్వహిస్టున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మంగళవారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని హలామూలా సంఘం ఈ సంఘటన చోటుచేసుకుంది. మావోల దాడిలో ఆసీఓం సింగ్, తిలక్ రాజ్‌లు మృతి చెందినట్లుగా సీఆర్పీఎఫ్ అధికారులు ప్రకటించారు. -
సాహస యువతకు ‘సాయుధ’ స్వాగతం
దేశ రక్షణ వ్యవస్థలో గ్రూప్-ఏ కేడర్ పోలీస్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు కేంద్ర సాయుధ పోలీసు దళం (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు తాజా నోటిఫికేషన్ (సీఏపీఎఫ్-2015) వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు.. కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ హోదాతో సరితూగే అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల నియామకానికి యూపీఎస్సీ సిద్ధమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్... ఇలా అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వెలువడిన నోటిఫికేషన్లో 304 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు యూపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. దళాల వారీగా పోస్టుల వివరాలు బీఎస్ఎఫ్ 28 సీఆర్పీఎఫ్ 94 సీఐఎస్ఎఫ్ 37 ఐటీబీపీ 107 ఎస్ఎస్బీ 38 మొత్తం 304 మూడంచెల ఎంపిక ప్రక్రియ: సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎంపిక ప్రక్రియ మూడంచెల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష; దేహ దారుఢ్య-వైద్య పరీక్ష(ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్); పర్సనల్ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య-వైద్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ మూడు అంశాల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్: ఈ పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలుంటాయి. హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత ఉంటుంది. ఓఎంఆర్ షీట్స్‌లో జవాబులు నల్ల బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. వర్తమాన అంశాలపై పట్టు: సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్‌ను పరీక్షించే విధంగా ఈ పేపర్లోని ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నల్లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం-జీవ వైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్లో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. దీనివల్ల అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలు, ఫార్ములాలపై అవగాహన ఏర్పడుతుంది. వర్తమాన అంశాల కోసం ఆర్థిక-రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది. దీంతోపాటు చరిత్రలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం.. అందులోని ముఖ్య ఘట్టాలు-వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ-భద్రతకు సంబంధించి పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై పూర్తి అవగాహన పొందడం మేలు చేస్తుంది. పేపర్-2: ఎస్సే, ప్రెసిస్ రైటింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్: ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు ఉన్న ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. వీటిని హిందీ/ఇంగ్లిష్‌లో రాయవచ్చు. ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ప్రిపరేషన్ టిప్స్: ఈ విభాగంలో రాణించాలంటే అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాన్ని క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. రెండో దశ: దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్): శారీరక ప్రమాణాలు: పురుషులు స్త్రీలు ఎత్తు 165 సెం.మీ 157 సెం.మీ బరువు 50 కిలోలు 46 కిలోలు నిర్దేశించిన విధంగా ఎత్తుకు తగిన బరువు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నాలుగు విభాగాల్లో (వంద మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్) ఉంటుంది. వీటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. ఈ పరీక్షలు పురుషులు, మహిళలకు వేరువేరుగా ఉంటాయి. విభాగం పురుషులు మహిళలు 100 మీటర్లు 16 సెకండ్లు 18 సెకండ్లు 800 మీటర్లు 3ని॥45 సెకండ్లు 4 ని॥45 సెకండ్లు లాంగ్ జంప్ 3.5 మీటర్లు 3 మీటర్లు షాట్‌పుట్ (7.26 కేజీలు) 4.5 మీటర్లు -- లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాల్లో గరిష్టంగా మూడు సార్లు పోటీ పడే అవకాశం ఉంటుంది. షాట్‌పుట్ నుంచి మహిళలకు మినహాయింపు ఉంది. సన్నద్ధత: ఇందులో రాణించడానికి అభ్యర్థులు రాత పరీక్ష ప్రిపరేషన్ దశ నుంచే ఆ దిశగా కృషి చేయాలి. ప్రతి రోజు కనీసం రెండు గంటలు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో పేర్కొన్న అంశాలపై తర్ఫీదు పొందాలి. ఇవి ఉదయం వేళల్లో చేస్తే శారీరక అలసటకు దూరంగా ఉండొచ్చు. పర్సనల్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించి; దేహ దారుఢ్య-వైద్య పరీక్షలలో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించే దృక్పథాన్ని పరీక్షిస్తారు. తుది జాబితాలో నిలిస్తే.. సర్వీసులు.. శిక్షణ: మూడు దశల ఎంపిక ప్రక్రియలో రాణించి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు తాము పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా శాఖను కేటాయిస్తారు. తర్వాత దశలో సుమారు ఏడాది వ్యవధిలో ఆయా దళాల్లో శిక్షణ ఉంటుంది. అది కూడా పూర్తి చేసుకుంటే గ్రూప్-ఎ గెజిటెడ్ హోదాలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పర్మనెంట్ విధుల్లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ - 2015 వివరాలు: మొత్తం ఖాళీలు: 304 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయో పరిమితి: ఆగస్ట్ 1, 2015 నాటికి 20 నుంచి 25 ఏళ్లు. గరిష్ట వయో పరిమితిలో ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.దరఖాస్తు విధానం: ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ ద్వారా ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తమ సర్వీస్ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాలి. మహిళా అభ్యర్థులకు ఐటీబీపీకి అర్హత లేదు. కాబట్టి మిగతా నాలుగు సర్వీసుల నుంచే తమ ప్రిఫరెన్స్‌ను పేర్కొనాలి.దరఖాస్తు రుసుం: రూ. 200. దీనిని ఆన్లైన్/ఆఫ్లైన్లలో చెల్లించొచ్చు. పార్ట్-2 రిజిస్ట్రేషన్‌లో ‘పే బై క్యాష్’ మోడ్ ద్వారా ఎస్బీఐలో చలానా రూపంలో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2015, మే 14. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంది. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు: 2015, ఏప్రిల్ 25 నుంచి 2015, మే 15 పరీక్ష తేదీ: 2015, జూలై 12 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: జూన్ మూడో వారం సీఏపీఎఫ్ - 2014 కటాఫ్స్ సీఏపీఎఫ్ 2014లో 450 మార్కులకు నిర్వహించిన రాత పరీక్ష; 150 మార్కులకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు. 2014 జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫైనల్ కటాఫ్ 294 296 253 262 రాత పరీక్ష 190 190 180 174 ఇంటర్వ్యూ 104 106 73 89 2013 జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఫైనల్ కటాఫ్ 279 283 253 253 రాత పరీక్ష 171 165 151 143 ఇంటర్వ్యూ 108 118 102 110 ఉపయోగపడే వ్యూహాలు గత ప్రశ్న పత్రాల సాధన రైటింగ్ ప్రాక్టీస్ వొకాబ్యులరీపై పట్టు. ప్రిపరేషన్ పూర్తి చేశాక ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపకల్పన మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం. సిలబస్‌ను పరిశీలించి తమకు కష్టమైన అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించడం. ఈ కష్టమైన అంశాల ప్రిపరేషన్‌కు సుదీర్ఘ సమయం కేటాయించడం సరికాదు. రిఫరెన్స్ బుక్స్ సీపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామ్- అరిహంత్ బుక్స్ సీపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ప్రాక్టీస్ వర్క్‌బుక్ - కిరణ్ ప్రకాశన్ ఆరు నుంచి 12 తరగతుల వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - ఆర్.ఎస్. అగర్వాల్ జనరల్ స్టడీస్ మాన్యువల్ - టాటా మెక్‌గ్రాహిల్ -
మందు పాతర పేలుడులో జవాన్‌కు గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ఓ సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందజేస్తున్నట్లు సుకుమా జిల్లా ఎస్పీ డి.శ్రావణ్ వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం... ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టుల కోసం చింతలనార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన మావోయిస్టులు అప్పటికే ఆ పరిసరాల్లో అమర్చిన మందుపాతరను పేల్చివేశారు. దాంతో సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషయాన్ని జవాన్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మావోయిస్టులు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. -
నేడే తీర్పు మనమే కీలకం!
సాక్షి, ముంబై: లోక్‌సభ ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలపై సర్వత్రా చర్చలు జోరందుకున్నాయి. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మరాఠాలవైపు మళ్లింది. ఏ కూటమి అత్యిధిక స్థానాల్లో గెలుపొందినా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో రాష్ట్రం నుంచి గెలుపొందినవారు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి 35 స్థానాలను దక్కించుకునే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఈ కూటమి తరఫున రాష్ట్రంలో పోటీ చేసినవారికి కీలక మంత్రిపదవులు దక్కే అవకాశముందంటున్నారు. మంత్రిపదవులపై పెరిగిన ఆశలు... సర్వేలన్ని మహాకూటమికి అధిక సీట్లు వస్తాయని చెబుతుండడంతో రాష్ట్రంలోని కీలక నాయకుల్లో కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందన్న ఆశలు చిగురించాయి. మహాకూటమిలో ఈ విషయమై ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభమైనట్టు తెలిసింది. మహాకూటమిలోని భాగస్వామ పక్షమైన శివసేన 12 నుంచి 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సర్వేలు స్పష్టం చేస్తుండడంతో ఆ పార్టీకి కనీసం ఓ కేబినెట్ మంత్రి పదవితోపాటు మరో రెండు మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో శివసేనలోని ఆ ముగ్గురు ఎవరనే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అనంత్ గీతేకు కేంద్ర కేబినెట్ పదవి లభించే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రకాంత్ ఖైరే, ఆనందరావ్ అడసూల్, అనీల్ దేశాయ్, శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సంజయ్ రావుత్ బలమైన నాయకుడుగా భావించినప్పటికీ ఇటీవలే గుజరాతీ సమాజంపై విమర్శలు గుప్పిస్తూ సామ్నాలో సంపాదకీయం రాసినందుకుగాను ఆయనకు మంత్రిమండలిలో చోటుదక్కే అవకాశాలు సన్నగిల్లాయంటున్నారు. బీజేపీ ధీమా.. రాష్ట్రంలో 15కుపైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశముందని బీజేపీ నేతలు ధీమాగాఉన్నారు. దీంతో ఆ పార్టీకి ఐదుకు తగ్గకుండా మంత్రిపదవులు దక్కే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేకు వ్యవసాయశాఖ దక్కే అవకాశముందని, నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ లేదా రైల్వేశాఖ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పార్టీలో కీలక నేతలుగా చెప్పుకునే కిరీట్ సోమయ్య, హంసరాజ్ ఆహిర్, హీనా గావిత్ తదితరులకు కూడా మంత్రిపదవులు దక్కవచ్చని చెబుతున్నారు. దళితనాయకుడైన ఆర్పీఐ అధ్యక్షులు రామ్‌దాస్ ఆఠవలేకు సహాయక మంత్రి పదవిని ఇవ్వొచ్చని, రాజు శెట్టి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని చెబుతున్నారు. దిగ్గజాల్లో దిగులు.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన దిగ్గజాల్లో కూడా గెలుపోటములపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీరి భవితవ్యం ఎలా ఉండనుందనేది రేపు తేలనుంది. వీరిలో సుశీల్‌కుమార్ షిండే, ప్రఫుల్ పటేల్, ముకుల్ వాస్నిక్, మిలింద్ దేవరా, గురుదాస్ కామత్, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ, బాలానాంద గావ్కర్ తదితరుల గెలుపు అవకాశాలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. -
సైనికుల కోసం కలం పట్టిన జావెద్
ముంబై: దేశరక్షణకు అమూల్యమైన సేవలు అందిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) జవాన్ల కోసం ప్రముఖ సినీకవి జావెద్ అఖ్తర్ ప్రత్యేకంగా పాట రాసిపెట్టారు. ఈ సంస్థ వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ గేయాన్ని సృష్టించారు. రాజుసింగ్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. ‘దేశ్ కే హమ్ హై రక్షక్, జాన్ భీ దే దే బిషక్, దేశ్ కీ రక్షా మే, వీర్ జియా లే హమ్ హై, శస్త్ర సంభాలే హమ్ హై, దేశ కీ రక్షా మే, జైజై భారత్, జై సీఆర్పీఎఫ్’ అంటూ ఈ గేయం సాగుతుందని సంస్థ ప్రజాసంబంధాల అధికారి బీసీ ఖండూరీ తెలిపారు. సీఆర్పీఎఫ్ వవజ్రోత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ఈ నెల 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పాటను ఆవిష్కరిస్తారు. దీని గురించి అఖ్తర్ మాట్లాడుతూ ‘సీఆర్పీఎఫ్ కొన్ని నెలల క్రితమే నన్ను ఈ విషయమై అడిగింది. పాట రాయడం సులువే అనుకున్నా గానీ పెన్ను పట్టినప్పుడల్లా ఇది వరకు రాసిన పాటల మాదిరే ఉందనిపించేది. నేను ఇప్పటికే ఇండియన్ మిలిటరీ అకాడమీ, సీఐఎస్ఎఫ్కు కూడా పాటలు రాశాను. ఇది మూడోది. పెరైండింటికి విభిన్నంగా ఉండేలా రాయడం సవాల్. ఎట్టకేలకు రచన ముగించాను. రాజు దీనికి మంచి సంగీతం అందించాడు. అందరూ ఈ గేయాన్ని మెచ్చుకున్నారు’ అని అఖ్తర్ వివరించారు. పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సీఆర్పీఎఫ్ ఈ కవిని ఆహ్వానించింది. సీఆర్పీఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు తగ్గట్టుగా పాడడానికి ఎంతో శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందని జావెద్ అలీ అన్నాడు. ‘ఈ పాట రికార్డింగుకు దాదాపు 20 రోజులు పట్టింది. సీఆర్పీఎఫ్ పాట పాడినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అయితే రికార్డింగ్ తరువాత నా గాత్రం కూడా దెబ్బతింది’ అని అలీ వివరించాడు. -
షోపియాన్‌లో కొనసాగుతోన్న కర్ప్యూ
శాంతిభద్రతల దృష్ట్యా షోపియాన్, కుల్గం, జమ్మూ కాశ్మీర్‌లోని పలు పట్టణాల్లో విధించిన నిరవధిక కర్ప్యూను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అయితే షోపియన్ పట్టణంలో అందోళనలు అదుపులోకి వచ్చాయన్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రంలో కర్ప్యూను పాక్షికంగా సడలిస్తామన్నారు. బుధవారం గగరన్ ప్రాంతంలోని సీఆర్పీఎప్ శిబిరం వద్ద జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ ఘటనను జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ జిలానీ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన అనంతరం నిరసన తెలపాలని ఆయన ముస్లిం మతస్థులకు పిలుపునిచ్చారు. అలాగే గగరన్ ఘటనకు నిరసనగా జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు మహ్మమద్ యాసిన్ మాలిక్ శుక్రవారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే జమ్ముకాశ్మీర్‌లో గగరన్ ప్రాంతంలో ఈ నెల 7, 11 తేదీల్లో జరిగిన కాల్పుల ఘటనపై ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే గగరన్లోని సీఆర్పీఎఫ్ శిబిరాన్ని మరోక చోటుకు తరలించాలని అబ్దుల్లా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. -
షోపియాన్ పట్టణంలో నిరవధిక కర్ప్యూ
గగరన్ క్యాంప్ వద్ద సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం అనంతరం జరిగిన ఆందోళనల నేపథ్యంలో షోపియాన్ పట్టణంలో నేటి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి గురువారం ఇక్కడ వెల్లడించారు. మృతుడు ముహ్మద్ రాఫి రాథర్ (28)గా గుర్తించినట్లు తెలిపారు. అతడు బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిలో బాలిక కూడా ఉందని తెలిపారు. ఆమెకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయన్నారు. వారిరువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అలాగే శుక్రవారం గగరన్ వద్ద కాల్పుల ఘటనలో నలుగురు మరణించారని, వారిలో ముగ్గురు నగర పౌరులు కాగ, ఓ తీవ్రవాది కూడా ఉన్నాడు తెలిపారు. అయితే తీవ్రవాది కాదని బీహార్ నుంచి వచ్చి అతడు ఇక్కడ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తమ దర్యాప్తులో వెల్లడించారు. కాగా తమకు అందిన సమాచారం మేరకు అతడు తీవ్రవాదీ అని రూఢీ అయిందని పేర్కొన్నారు. ఆ ఘటనపై కూడా విచారణ జరుగుతుందన్నారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఓ స్థానికుడు మరణించడంతో కాశ్మీర్ వ్యాలీ, చినాబ్ వ్యాలీలతోపాటు కిష్ట్వారా, దోడ, రామ్‌బన్ జిల్లాల్లో గురువారం బంద్‌కు వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ పిలుపునిచ్చారు. షోపియాన్ పట్టణంలో నెలకొన్న పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం సాయంత్రం ఉన్నతాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.