సైనికుల కోసం కలం పట్టిన జావెద్
సైనికుల కోసం కలం పట్టిన జావెద్
Published Sun, Feb 23 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
ముంబై: దేశరక్షణకు అమూల్యమైన సేవలు అందిస్తున్న కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) జవాన్ల కోసం ప్రముఖ సినీకవి జావెద్ అఖ్తర్ ప్రత్యేకంగా పాట రాసిపెట్టారు. ఈ సంస్థ వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఈ గేయాన్ని సృష్టించారు. రాజుసింగ్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ పాడాడు. ‘దేశ్ కే హమ్ హై రక్షక్, జాన్ భీ దే దే బిషక్, దేశ్ కీ రక్షా మే, వీర్ జియా లే హమ్ హై, శస్త్ర సంభాలే హమ్ హై, దేశ కీ రక్షా మే, జైజై భారత్, జై సీఆర్‌పీఎఫ్’ అంటూ ఈ గేయం సాగుతుందని సంస్థ ప్రజాసంబంధాల అధికారి బీసీ ఖండూరీ తెలిపారు. సీఆర్‌పీఎఫ్ వవజ్రోత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో ఈ నెల 28న ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పాటను ఆవిష్కరిస్తారు.
దీని గురించి అఖ్తర్ మాట్లాడుతూ ‘సీఆర్‌పీఎఫ్ కొన్ని నెలల క్రితమే నన్ను ఈ విషయమై అడిగింది. పాట రాయడం సులువే అనుకున్నా గానీ పెన్ను పట్టినప్పుడల్లా ఇది వరకు రాసిన పాటల మాదిరే ఉందనిపించేది. నేను ఇప్పటికే ఇండియన్ మిలిటరీ అకాడమీ, సీఐఎస్‌ఎఫ్‌కు కూడా పాటలు రాశాను. ఇది మూడోది. పెరైండింటికి విభిన్నంగా ఉండేలా రాయడం సవాల్. ఎట్టకేలకు రచన ముగించాను. రాజు దీనికి మంచి సంగీతం అందించాడు. అందరూ ఈ గేయాన్ని మెచ్చుకున్నారు’ అని అఖ్తర్ వివరించారు. పాట ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సీఆర్‌పీఎఫ్ ఈ కవిని ఆహ్వానించింది. సీఆర్‌పీఎఫ్ జవాన్ల ధైర్యసాహసాలకు తగ్గట్టుగా పాడడానికి ఎంతో శక్తిని ఉపయోగించాల్సి వచ్చిందని జావెద్ అలీ అన్నాడు. ‘ఈ పాట రికార్డింగుకు దాదాపు 20 రోజులు పట్టింది. సీఆర్‌పీఎఫ్ పాట పాడినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అయితే రికార్డింగ్ తరువాత నా గాత్రం కూడా దెబ్బతింది’ అని అలీ వివరించాడు.
Advertisement
Advertisement