న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్‌ఎస్‌జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.
అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్‌ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్‌ఎస్‌జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్‌లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment