national security guard
-
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
ఎన్ఎస్జీ చీఫ్‌గా నళిన్ ప్రభాత్
న్యూఢిల్లీ: దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి కేబినెట్లోని నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2028 ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎన్ఎస్జీ చీఫ్‌గా ఆయన కొనసాగుతారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రపంచ స్థాయి భద్రత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్ఎస్), యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. రాఫెల్‌లు.. హెలికాప్టర్లు.. యాంటీ డ్రోన్లు దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్ఎస్జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, చిన్న విమానం, క్వాడ్కాప్టర్లు నిర్వహణను నిషేధించారు. -
ప్రాంక్ కాల్.. ఆపై కటకటాల పాలు..
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీపై దాడులు జరుగుతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ప్రాంక్ కాల్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల కాశీనాథ్ మండల్ ముంబైలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్ సేకరించాడు. ఆపై ఎన్ఎస్జీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ప్రధాని మోదీపై దాడి జరుగుతుందని సమాచారం ఇచ్చాడు. కెమికల్ దాడి జరిగే అవకాశం ఉందని, తన వద్ద సమాచారం ఉందని ఎన్ఎస్జీని నమ్మించాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాశీనాథ్‌ను సెంట్రల్ ముంబైలోని డీబీ మార్గ్ పోలీసులు జూలై 27న అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నరేంద్ర మోదీని కలుసుకోవడమే తన ఉద్దేశమని కాశీనాథ్ విచారణలో వెల్లడించాడు. ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో తన స్నేహితుడు చనిపోయాడని.. ఈ విషయంపై ప్రధాని మోదీని కలుసుకుని మాట్లాడాలని భావించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
ఎన్ఎస్జీ డీజీగా సుదీప్ లఖ్టాకియా
న్యూఢిల్లీ: అత్యంత ప్రముఖుల వ్యక్తిగత భద్రత బాధ్యతలు చేపట్టే నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్(డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్టాకియా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన ఉన్న క్యాబినెట్ నియామకాల కమిటీ శుక్రవారం ఆమోదించింది. ప్రస్తుతం ఎన్ఎస్జీ డీజీగా ఉన్న ఎస్పీ సింగ్ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనుండగా కేంద్రం తాజా నియామకం చేపట్టింది. 1984 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లఖ్టాకియా ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.‘బ్లాక్ క్యాట్స్’ గా పిలిచే ఎన్ఎస్జీ గుర్గావ్లోని మనేసర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. -
బాంబు పేలుళ్లు ఇండియాలోనే ఎక్కువ
న్యూఢిల్లీ: భారతదేశంలోనే ఎక్కువగా బాంబులు పేలుతున్నాయి. గడిచిన రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఈ విస్మయకర విషయం బయటపడింది. గత రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇండియాలో బాంబు పేలుడు ఘటనలు నమోదయ్యాయి. ప్రతి నిత్యం బాంబులు, పేలుళ్లతో దద్దరిల్లుతాయని భావించే పాకిస్తాన్, ఇరాక్ కన్నా ఇండియాలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జీ) పరిధిలో నేషనల్ బాంబు డాటా సెంటర్ (ఎన్బీడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ లోనే అత్యధికంగా బాంబులు పేలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని తీవ్రవాద సంస్థలు పాల్పడే పేలుళ్ల ఘటనల వివరాలను ఎన్బీడీసీ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషిస్తుంది. తీవ్రవాదులు అనుసరిస్తున్న పంథా, ఉపయోగిస్తున్న పేలుడు పదార్థాలను, విద్రోహా ఘటనలను విశ్లేషించి వాటికి కౌంటర్ గా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎన్బీడీసీ ప్రభుత్వానికి సూచిస్తుంది. భారతదేశంలో గత ఏడాది 337 పేలుడు (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైసెస్ - ఐఈడీ ఉపయోగించిన) ఘటనలు నమోదయ్యాయి. 2015 లో 268 మొత్తంగా పేలుళ్లు జరిగితే, 2014లో 190, 2013 లో 283, 2012లో 365 పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఇండియా తర్వాత ఇరాక్ రెండో స్థానంలో ఉంది. ఇరాక్ లో గతేడాది 221 బాంబు పేలుడు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అఫ్ఘానిస్తాన్ లో 132, టర్కీలో 71, థాయిలాండ్ లో 63, సోమాలియా, సిరియాలో కలిపి 56 ఘటనలు జరిగాయి. 2015 లో ఇరాక్ లో 170 పేలుళ్లు, పాకిస్తాన్ లో 208, అఫ్టానిస్తాన్ లో 121, సిరియా 41 సంఘటనలు జరిగాయి. ఇక ఇండియాలో రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా చత్తీస్‌గఢ్‌లో నమోదయ్యాయి. గతేడాదిలో చత్తీస్‌గఢ్‌లో 60, జమ్ము కశ్మీర్లో 31, కేరళలో 33, మణిపూర్ లో 40, ఒడిశాలో 29, తమిళనాడులో 32, పశ్చిమ బెంగాల్ లో 30 సంఘటనలు రికార్డయ్యాయి. గతేడాది జూలై 18 న బీహార్ లో చేటుచేసుకున్న బాంబు పేలుడు ఘటనలో అత్యధికంగా సీఆర్పీపీఎఫ్ బెటాలియన్ కు చెందిన 10 మంది కమెండోలు మృత్యువాత పడ్డారు. ఔరంగాబాద్-గయ అటవీ ప్రాంతంలో సీఆర్పీపీఎఫ్ స్వ్కాడ్ ను దాదాపు 200 మావోయిస్టులు చుట్టుముట్టి 22 ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. కొన్ని సంఘటనలు ఆగస్టు 24 - (జమ్మూ కశ్మీర్) పుల్వామా వద్ద బాంబు దాడి చేసిన ఘటనలో 9 మంది పోలీసులు గాయపడ్డారు. జనవరి 27 - (జార్ఘండ్) పాలము వద్ద కాన్వాయ్ వెళుతుండగా, ల్యాండ్ మైన్ పేలుడు ఘటనలో ఐదుగురు పోలీసులతో పాటు మొత్తం ఏడుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. మార్చి 30 - (చత్తీస్ గఢ్) దంతెవాడ సమీపంలో మావోయిస్టుల మందుపాతర పేలుడు ఘటనలో ఏడుగురు భద్రత సిబ్బంది మరణించారు. మే 22 - (మణిపూర్) పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పాల్పడిన పేలుడు ఘటనలో అస్సోం రైఫిల్స్ కు చెందిన 29వ బెటాలియన్ లోని ఆరుగురు మరణించారు. నవంబర్ 19 - (అస్సోం) ఆర్మీ క్యాంపుపై ఉల్ఫా మిలిటెంట్లు పేల్చిన ఐఈడీ ఘటనలో ముగ్గురు సైనికులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎన్బీడీసీ గణాంకాల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2007-2016) మధ్య కాలంలో సగటున 277 పేలుఘటనలు చోటుచేసుకోగా, అందులో 223 మంది మరణించగా, 724 మంది గాయపడ్డారు. - హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన బుర్హన్ వని మరణం తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఈ ఘటనలు పెరిగాయి - గతేడాదితో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్ (40), అసోం (11) సంఘటనల్లో 15 శాతం పెరిగాయి. - మొత్తం ఘటనల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 47శాతం చోటుచేసుకున్నాయి. - దేశంలోని మిగతా ప్రాంతాలను పరిశీలిస్తే కేరళ (33), తమిళనాడు (32)ల్లో అధికంగా నమోదయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బాంబు పేలుడు ఘటన ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో 2016 లో సిరియాలో జరిగిందే అతిపెద్దది. సిరియాలోని మెడిటెర్రెనియన్ తీరంలో ఉన్న జబ్లే, టార్టోస్ ల్లో మే 23 న ఐఎస్ తీవ్రవాదులు రెండు కార్లలో బాంబులు అమర్చి తమకు తాముగా ఆత్మాహుతికి పాల్పడటం ద్వారా పేల్చిన ఘటనలో 150 మంది మరణించగా, 200కు పైగా గాయపడ్డారు. ప్రపంచంలో తీవ్రమైన ఘటనలు లిబియా - జనవరి 7, తీవ్రవాదులు బాంబులు పెట్టి ఒక లారీనీ పేల్చిన ఘటనలో 60 మంది పోలీసు అధికారులు బలికాగా, ఇందులో 127 మంది గాయపడ్డారు. ఇరాక్ - ఫిబ్రవరి 28, సదర్ మార్కెట్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడిలో 70 మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికిపైగా గాయపడ్డారు. పాకిస్తాన్ - మార్చి 27, గుల్షన్ ఏ ఇక్బాల్ పార్క్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 300లకుపైగా గాయాలపాలయ్యారు. ఇరాక్ - మే 11, జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 64 మందిని పొట్టనపెట్టుకోగా 87 మంది గాయపడ్డారు. ఇరాక్ - జూలై 3, కరడా జిల్లాలో ఆత్మాహుతి దాడిలో 115 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 200 మందికిపైగా గాయపడ్డారు. ఇరాక్ - నవంబర్ 24, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పాల్పడిన పేలుడు ఘటనలో వంద మంది షియా పర్యాటకులు మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అదే తీరు తీవ్రవాదులు ప్రజా సమూహాల్లోనే ఎక్కువగా బాంబులు పెడుతున్నారు. గతేడాది జరిగిన ఇలాంటి ఘటనల్లో 73శాతం ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలను టార్గెట్ చేసుకోగా ఆ తర్వాత తీవ్రవాదులు సంచరించే ప్రాంతాల్లో రెండో టార్గెట్ భద్రతా బలగాలు. తాజాగా గురువారం పాకిస్తాన్ సింధ్ రాష్ట్రంలోని సెహ్వాన్ పట్టణంలో ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 70మంది మరణించగా 160 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు అదే రోజు ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో కారు బాంబు పేలుడులో 51 మంది మృత్యువాత పడగా 60మందికి పైగా గాయపడ్డారు.