సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకులు హాజరవుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9, 10వ తేదీల్లో జరుగనున్న శిఖరాగ్ర సదస్సుకు 20 దేశాల అధినేతలు సహా 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. సదస్సు సందర్భంగా 80,000 మంది ఢిల్లీ పోలీసులతో సహా దేశ రాజధానికి సుమారు 1,30,000 మంది భద్రతా సిబ్బంది రక్షణ కలి్పస్తారని కేంద్రం వెల్లడించింది.
సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సహా, విదేశీ నేతలకు సంబంధించిన భద్రత కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) కమెండోలను నియమించారు. వీరికి అదనంగా పారామిలిటరీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సైతం భద్రతా చర్యల్లో పాలుపంచుకోనున్నాయి. అదనంగా, ప్రపంచ నాయకుల జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతను సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) దళాలకు అప్పగించారు. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ), చైనా భద్రతా శాఖ (ఎంఎస్‌ఎస్), యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఎంఐ–6, ఇతర విదేశీ గూఢచార సంస్థలు సైతం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి.
రాఫెల్‌లు.. హెలికాప్టర్‌లు.. యాంటీ డ్రోన్‌లు
దేశాధినేతల భద్రతా వ్యవస్థలో బాగంగా గగనతల దాడులను సైతం సమర్థంగా ఎదుర్కొనేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీఎస్), ఇతర ఏజెన్సీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఎన్‌ఎస్‌జీ కమెండోలు, ఐఏఎఫ్ సిబ్బందిని తరలించేలా హెలికాప్టర్లను మోహరించింది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలలో సమగ్ర ఏరోస్పేస్ రక్షణ కోసం ఇప్పటికే పారాగ్లైడర్లు, పారామోటర్లు, హ్యాంగ్–గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్‌లు, చిన్న విమానం, క్వాడ్‌కాప్టర్లు నిర్వహణను నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment