న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉండగా అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో లేదా విధుల్లో ఉండగా ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం..క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో నేలకొరిగిన జవాన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.21.5 లక్షల పరిహారాన్ని రూ.35 లక్షలకు పెంచారు. ఎవరైనా జవాను ప్రమాదం, అనారోగ్యం, తదితర ఏ ఇతర కారణాలతోనైనా విధి నిర్వహణలో ఉండగా చనిపోతే ఆయన కుటుంబానికిచ్చే పరిహారాన్ని రూ.16.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెప్టెంబర్‌లో జరిగిన వార్షిక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment