Duty management
-
సీఆర్పీఎఫ్ వీర జవాన్ల కుటుంబాలకు పరిహారం పెంపు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉండగా అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో లేదా విధుల్లో ఉండగా ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం..క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో నేలకొరిగిన జవాన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.21.5 లక్షల పరిహారాన్ని రూ.35 లక్షలకు పెంచారు. ఎవరైనా జవాను ప్రమాదం, అనారోగ్యం, తదితర ఏ ఇతర కారణాలతోనైనా విధి నిర్వహణలో ఉండగా చనిపోతే ఆయన కుటుంబానికిచ్చే పరిహారాన్ని రూ.16.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెప్టెంబర్‌లో జరిగిన వార్షిక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
పెళ్లికి కూడా సెలవు తీసుకోని ఐఏఎస్
గువాహటి: కోవిడ్–19 విధుల్లో బిజీగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితం కంటే విధి నిర్వహణనే ఆమె మిన్నగా భావించారు. అందుకే, ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన తన వివాహానికి కూడా సెలవు తీసుకోలేదు. దీంతో వరుడే వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ ఘటనలో వధువుది హైదరాబాద్ కాగా, వరుడు పుణే వాసి. హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న చచర్ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్ వెళ్లాడు. కోవిడ్–19 ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడ క్వారంటైన్లో గడిపాకే వివాహ తంతు జరిపించారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్ వీడియో యాప్ ద్వారా 800 మంది చూశా రు. ‘హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మానాన్నలకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది’అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. పెళ్లి రోజు బుధవారం కూడా ఫోన్ ద్వారా బాధ్యతలు కొనసాగించారు. -
కారుణ్య నియామకాల్లో కనీస విద్యార్హత రద్దు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో చనిపోయిన, వైద్య కారణాలతో పదవీవిరమణ చేసిన ఉద్యోగుల భార్యలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సిన కనీస విద్యార్హతను రద్దుచేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం లెవల్–1 లేదా గ్రూప్–డి విభాగంలో కారుణ్య నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. కారుణ్య నియామకాల విషయం లో చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడాన్ని పలు రైల్వే జోన్లు తమ దృష్టికి తీసుకొచ్చాయని రైల్వేబోర్డు తెలిపింది. దీంతో కనీస విద్యార్హత నిబంధనను రద్దుచేశామంది. కొద్దిపాటి శిక్షణతో ఈ మహిళలు విధులు నిర్వర్తించగలరని ఉన్నతాధికారులు సంతృప్తి చెందితే కారుణ్య నియామకాలు చేపట్టవచ్చంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఏప్రిల్ 6న అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది. -
పంతుళ్లకు పరీక్ష
ఖమ్మం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక గడ్డు పరిస్థితి ఎదుర్కొనే రోజులు వచ్చాయి. సక్రమంగా పాఠశాలకు వెళ్లకున్నా.. వెళ్లినా ఏమీ బోధించకుండా కాలం గడిపే పంతుళ్లకు ప్రభుత్వం ఇప్పుడు ‘పరీక్ష’ పెట్టింది. విద్యార్థులు సాధించిన ప్రగతే పనితీరుకు కొలమానంగా ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేలా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నడుం భిగించారు. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉపాధ్యాయుల పనితీరు మెరుగు పర్చి తద్వారా విద్యాప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోమారు అంటే సంవత్సరంలో నాగులు సార్లు విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసి రేటింగ్ ద్వారా ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తారు. ఇలా పాఠశాల మొత్తం విద్యార్థుల ప్రగతితో ప్రధానోపాధ్యాయుల పనితీరును కూడా లెక్కిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ప్రాధాన్యతా అంశాలు...: విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుడి పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా లెక్కించాలి. ఉపాధ్యాయులకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో అభ్యసన అనుభవ ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన జ్ఞానం, అవగాహన స్థాయి. అభ్యసనం కల్పించడం, అవలంభిస్తున్న విధానం, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమైన తీరు, వృత్తి పరమైన అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, పాఠశాలకు హాజరైన తీరు మొదలైన ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఒక్కో అంశంలో పలు ఉప అంశాలు పొందుపరిచారు. మొత్తం 54 అంశాల వారీగా ఉపాధ్యాయుడి పనితీరును లెక్కిస్తారు. ‘ఈ అంశాలలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాను.. నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాను.. లక్ష్యాన్ని మించి ఉన్నాను.’ అని ఉపాధ్యాయులకు ఒక్కో అంశానికి ఒక పారామీటరు పెట్టారు. దీనిని ఆసరాగా చేసుకొని ఉపాధ్యాయుడే తన ప్రగతి నివేదికను పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన పత్రాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీఈవోలు పరిశీలించాలి. సదరు ప్రధానోపాధ్యాయుడు, ఇతర అధికారుల పర్యవేక్షణలో తెలిసిన అంశాలతో సరిచూసి ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రగతి పత్రాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్లో నమోదు...: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును ప్రతి మూడునెలలకోమారు ఆన్లైన్లో నమోదు చేయాలి. దీనిని అధారంగా చేసుకొని పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పొందుపరిచిన పార్టు-ఏలో పాఠశాల స్థితిగతులు, పార్టు-బిలో ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరైన రోజులు, ప్రతిభ, గ్రేడిండ్, పార్టు -సీలో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు వివరాలు, రేటింగ్‌లో వచ్చిన మార్కులు మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. విద్యార్థులకు ఇచ్చిన ఐడీ నంబర్లు, ఉపాధ్యాయుడి వేతనం ఐడీ నంబర్ల ఆధారంగా ఏ పాఠశాలలో, ఏ పాఠ్యాంశంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారు.. కనీస అభ్యాసనా స్థాయిని కూడా చేరుకోలేక పోతున్నారా.. అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. విద్యార్థి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల వివరాలు, ఉపాధ్యాయుడి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల పేరు, సబ్జెక్టు తెలుస్తుందని, దీంతో ఉపాధ్యాయుల పనితీరు హైదరాబాద్ నుంచే అంచనా వేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదేశించారు. దీనికి తోడు కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవో, సర్వశిక్ష అభియాన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచితే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందుతుందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చేయడంతో ఉపాధ్యాయుల్లో అంకితభావం పెరగడంతో పాటు మెరుగైన ప్రమాణాలు సాధించే అవకాశం ఉందని విద్యా నిపుణులు చెపుతున్నారు. -
తరుణ్‌జోషీ బదిలీ
నిజామాబాద్ క్రైం : ఎస్పీ తరుణ్‌జోషీ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే ఎస్పీగా ఉన్న ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి ని జిల్లా ఎస్పీగా నియమించింది. తరుణ్ జోషీ బదిలీతో జిల్లాలోని కొందరు ప్ర జాప్రతినిధులు తమ పంతాన్ని నెగ్గించుకున్నట్లయ్యింది. 2013 అక్టోబరు 31న జిల్లాకు వచ్చిన తరుణ్‌జోషీ యేడాది తిరగక ముందే బదిలీ అయ్యారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన తీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కంటగింపుగా మారింది. గత ఎన్నికల సందర్బంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడిపై చేయి చేసుకోవటం మొదలుకుని మొన్నటి ఎస్ఐల బది లీ వ్యవహరం వరకు ఎమ్మెల్యేలకు నచ్చలేదు. దాంతో ఆయనను బదిలీ చేయాలని జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. తరుణ్జోషీని హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయవలసిందిగా ఆదేశాలు వచ్చాయి. చంద్రశేఖర్‌రెడ్డి సీనియర్ అధికారి కొత్త ఎస్పీగా నియమితులైన ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు 1 అధికారిగా పోలీస్‌శాఖలో అడుగుపెట్టారు. 1993-94 బ్యాచ్‌కు చెందిన ఈయన తొలి పోస్టింగ్ వరంగల్ జిల్లా జనగాం డీఎస్పీగా. అక్కడి నుంచి మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా పనిచేశారు. అడిషనల్ ఎస్పీగా ప్రకాశం జిల్లాలో, తిరుపతిలో పనిచేశారు. నాన్ కేడర్‌లో హైదరాబాద్ ట్రాఫీక్ డీసీపీగా బదిలీ అయ్యారు. 2011లో ఐపీఎస్ కన్ఫర్మేషన్‌తో ఎస్పీగా క ర్నూల్ జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. -
అవార్డులు ఆయన సొంతం
మహానంది: విధి నిర్వహణ ఆయన ప్రాణం. పేదలకు న్యాయం చేయాలి...వారికి అండగా నిలవాలన్న తపనే ఆయనకు గుర్తింపు తెచ్చింది. కష్టపడితే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. పోలీస్ కావాలనే లక్ష్యంతో శ్రమించి అనుకున్నది సాధించాడు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయని నమ్మిన వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. ఎక్కడ పనిచేసిన అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇప్పటి వరకు ఆయన 366 రివార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. అంతేకాకుండా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డుకు ఎంపికైనట్లు 2013 గణతంత్ర వేడుకల్లో ఆయన పేరు ప్రకటించారు. ఈ అవార్డును శుక్రవారం కర్నూలులో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీఐ అందుకోనున్నారు. శ్రీనివాసులు విజయ గాధపై సాక్షి కథనం... మహానంది మండలం ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకటసుబ్బయ్య అలియాస్ మోజెస్, మద్దమ్మ దంపతుల కుమారుడు బుక్కా శ్రీనివాసులు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలన్న సంకల్పంతో శ్రమించాడు. గ్రామంలోని జెడ్పీ స్కూల్లో 10 వరకు చదివాడు. కర్నూలులోని కోల్స్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్, సిల్వర్‌జూబ్లీలో డిగ్రీ, ఎస్కే యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు. జులై 15, 1991లో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. ఎస్ఐగా అనంతపురం జిల్లా పెనుగొండ, ఎల్కే పల్లి, రామగిరి, కూడేరు, తాడిపత్రి, ధర్మవరం, తదితర ప్రాంతాల్లో పనిచేసి అన్ని వర్గాల ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. తిరుమల ట్రాఫిక్, నక్సల్స్ ప్రభావిత, సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. అనంతరం 2005 ఫిబ్రవరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన శ్రీనివాసులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్గా, 2005 నుంచి 2008 వరకు కల్యాణదుర్గం సర్కిల్లో, 2009-10లో చిత్తూరు డీటీసీ, ఆ తర్వాత ధర్మవరం, హిందూపురం, ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు పనిచేశారు. 2014 జనవరిలో హిందూపురం టౌన్ నుంచి కడప అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సీఎం చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోనుండటంతో శ్రీనివాసులు కుటుంబ సభ్యులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసముండాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలవుతున్న దాఖ లాలు కనిపించడం లేదు. జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 22 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 630, మునిసిపల్ పాఠశాలల్లో 666, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 4,422, మండల పరిషత్ పాఠశాలల్లో 6,552, ఎయిడెడ్ పాఠశాలల్లో 801, ఏపీఆర్‌ఎస్‌లో 106, ఏపీఎస్డబ్ల్యూలో 190, ఏపీటీడబ్ల్యూలో 65, కేజీబీవీలో 413, ట్రైబల్ వెల్ఫేర్‌లో 63, నవోదయ పాఠశాలల్లో 24 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.40 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రార్థనా సమయానికి ముందే ప్రధానోపాధ్యాయులు, ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. కానీ సగం మంది ఉపాధ్యాయులు ప్రార్థనా సమయం దాటిన తర్వాత విధులకు హాజరవుతున్నారు. పది శాతం మంది ఉపాధ్యాయులు విధులకే రాకుండా సొంత పనులను చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరికొందరు పాఠశాలకు ఆలస్యంగా వచ్చి, మధ్యాహ్నం 2 గంటలకే ఇళ్లకు బయలుదేరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు మరీ ఎక్కువగా ఉంది. అధికారులు ఆయా పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయకపోవడంతో వారిని అడిగే వారు కరువయ్యారు. జిల్లాలోని 53 మండలాల్లో కేవలం 13 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన చోట సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఇన్చార్జి ఎంఈవోలుగా నియమించారు. దీనికితోడు అనేక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులు లెక్కచేయని పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లోనూ కొందరు ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. డిప్యూటీ డీఈవోలకు వాహన సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలను పర్యవేక్షించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎంఈవోలు చెప్పిందే వాస్తవమని నమ్మాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.