పంతుళ్లకు పరీక్ష | teachers test is student talent | Sakshi
Sakshi News home page

పంతుళ్లకు పరీక్ష

Published Mon, Oct 6 2014 2:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM

teachers test is student talent

ఖమ్మం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక గడ్డు పరిస్థితి ఎదుర్కొనే రోజులు వచ్చాయి. సక్రమంగా పాఠశాలకు వెళ్లకున్నా.. వెళ్లినా ఏమీ బోధించకుండా కాలం గడిపే పంతుళ్లకు ప్రభుత్వం ఇప్పుడు ‘పరీక్ష’ పెట్టింది. విద్యార్థులు సాధించిన ప్రగతే పనితీరుకు కొలమానంగా ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేలా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నడుం భిగించారు.

దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉపాధ్యాయుల పనితీరు మెరుగు పర్చి తద్వారా విద్యాప్రమాణాలు పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోమారు అంటే సంవత్సరంలో నాగులు సార్లు విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేసి రేటింగ్ ద్వారా ఉపాధ్యాయుల పనితీరును పరిశీలిస్తారు. ఇలా పాఠశాల మొత్తం విద్యార్థుల ప్రగతితో ప్రధానోపాధ్యాయుల పనితీరును కూడా లెక్కిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు.

 ప్రాధాన్యతా అంశాలు...: విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లో పొందుపరిచిన అంశాలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుడి పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా లెక్కించాలి. ఉపాధ్యాయులకు కూడా గ్రేడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో అభ్యసన అనుభవ ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన జ్ఞానం, అవగాహన స్థాయి. అభ్యసనం కల్పించడం, అవలంభిస్తున్న విధానం, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమైన తీరు, వృత్తి పరమైన అభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, పాఠశాలకు హాజరైన తీరు మొదలైన ఏడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు.

ఇందులో ఒక్కో అంశంలో పలు ఉప అంశాలు పొందుపరిచారు. మొత్తం 54 అంశాల వారీగా ఉపాధ్యాయుడి పనితీరును లెక్కిస్తారు. ‘ఈ అంశాలలో నిర్దేశించిన  లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నాను.. నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాను.. లక్ష్యాన్ని మించి ఉన్నాను.’ అని ఉపాధ్యాయులకు ఒక్కో అంశానికి ఒక పారామీటరు పెట్టారు. దీనిని ఆసరాగా చేసుకొని ఉపాధ్యాయుడే తన ప్రగతి నివేదికను పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన పత్రాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీఈవోలు పరిశీలించాలి. సదరు ప్రధానోపాధ్యాయుడు, ఇతర అధికారుల పర్యవేక్షణలో తెలిసిన అంశాలతో సరిచూసి ఉపాధ్యాయుడు ఇచ్చిన ప్రగతి పత్రాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది.

 అంతా ఆన్‌లైన్‌లో నమోదు...: మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పని తీరును ప్రతి మూడునెలలకోమారు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దీనిని అధారంగా చేసుకొని పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పొందుపరిచిన పార్టు-ఏలో పాఠశాల స్థితిగతులు, పార్టు-బిలో ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరైన రోజులు, ప్రతిభ, గ్రేడిండ్, పార్టు -సీలో ఉపాధ్యాయుల పనితీరు, హాజరు వివరాలు, రేటింగ్‌లో వచ్చిన మార్కులు మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు.

విద్యార్థులకు ఇచ్చిన ఐడీ నంబర్లు, ఉపాధ్యాయుడి వేతనం ఐడీ నంబర్ల ఆధారంగా ఏ పాఠశాలలో, ఏ పాఠ్యాంశంలో విద్యార్థులు వెనకబడి ఉన్నారు.. కనీస అభ్యాసనా స్థాయిని కూడా చేరుకోలేక పోతున్నారా.. అనే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. విద్యార్థి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల వివరాలు, ఉపాధ్యాయుడి ఐడీ నెంబర్ ఆధారంగా పాఠశాల పేరు, సబ్జెక్టు తెలుస్తుందని, దీంతో ఉపాధ్యాయుల పనితీరు హైదరాబాద్ నుంచే అంచనా వేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదేశించారు. దీనికి తోడు కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవో, సర్వశిక్ష అభియాన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచితే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందుతుందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా చేయడంతో ఉపాధ్యాయుల్లో అంకితభావం పెరగడంతో పాటు మెరుగైన ప్రమాణాలు సాధించే అవకాశం ఉందని విద్యా నిపుణులు చెపుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement