కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసముండాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలవుతున్న దాఖ లాలు కనిపించడం లేదు.
జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 22 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 630, మునిసిపల్ పాఠశాలల్లో 666, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 4,422, మండల పరిషత్ పాఠశాలల్లో 6,552, ఎయిడెడ్ పాఠశాలల్లో 801, ఏపీఆర్‌ఎస్‌లో 106, ఏపీఎస్‌డబ్ల్యూలో 190, ఏపీటీడబ్ల్యూలో 65, కేజీబీవీలో 413, ట్రైబల్ వెల్ఫేర్‌లో 63, నవోదయ పాఠశాలల్లో 24 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.40 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు కొనసాగించాల్సి ఉంటుంది.
ప్రార్థనా సమయానికి ముందే ప్రధానోపాధ్యాయులు, ప్రార్థనా సమయంలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలి. కానీ సగం మంది ఉపాధ్యాయులు ప్రార్థనా సమయం దాటిన తర్వాత విధులకు హాజరవుతున్నారు. పది శాతం మంది ఉపాధ్యాయులు విధులకే రాకుండా సొంత పనులను చక్కబెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరికొందరు పాఠశాలకు ఆలస్యంగా వచ్చి, మధ్యాహ్నం 2 గంటలకే ఇళ్లకు బయలుదేరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు మరీ ఎక్కువగా ఉంది. అధికారులు ఆయా పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయకపోవడంతో వారిని అడిగే వారు కరువయ్యారు. జిల్లాలోని 53 మండలాల్లో కేవలం 13 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు.
మిగిలిన చోట సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమించారు. దీనికితోడు అనేక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులను ఉపాధ్యాయులు లెక్కచేయని పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లోనూ కొందరు ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. డిప్యూటీ డీఈవోలకు వాహన సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలను పర్యవేక్షించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎంఈవోలు చెప్పిందే వాస్తవమని నమ్మాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.