exgratia increase
-
సీఎం చలించిపోయారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైల్వే ప్రమాదంలో గాయపడ్డవారి పరిస్థితిని చూసి చలించిపోయారు. తొలుత రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డవారిని సోమవారం స్వయంగా పరామర్శించిన అనంతరం ఎక్స్‌గ్రేషియాను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రూ.2.59 కోట్ల మొత్తాన్ని మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కులను గాయపడ్డ 30 మందికి మంగళవారం విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి అందజేశారు. అనంతరం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రైలు ప్రమాదంలో 13 మంది మృతుల కుటుంబాలకు సంబంధించిన ఎక్స్‌గ్రేషియాను వారి ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రైల్వే ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందజేస్తామని చెప్పారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, 30 మంది గాయపడ్డ వారి గాయాల తీవ్రతను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందని వివరించారు. స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్న 12 మందికి రూ. 2 లక్షల చొప్పున, తీవ్ర గాయాలతో నెలకు మించి చికిత్స అవసరమైన 15 మందికి రూ. 5 లక్షల చొప్పున మంజూరైనట్టు వివరించారు. తీవ్ర గాయాలతో వైకల్యం పొందిన ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచారని వెల్లడించారు. వారి పరిస్థితిని చూసి సీఎం ఎంతో చలించిపోయారని, పరిహారం విషయంలో ఎంతో ఉదారంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిలా సునందని, డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ బి.గౌరీశంకర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మలీల తదితరులు పాల్గొన్నారు. -
AP: రైలు ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత
సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్యలు, బాధితుల చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మంత్రి బొత్సను పంపించి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షింపజేశారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు. విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని నేరుగా వెళ్లి మరీ పరామర్శించారాయన. ఈ క్రమంలో వాళ్ల పేదరికానికి ఆయన చలించిపోయారు. మానవత్వంతో మరింత పరిహారం పెంచి.. అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా ఆ పరిహారం బాధితులకు అందింది. బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే నష్టపరిహారం చెక్‌లు అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. 10 మందికి రూ. 5 లక్షలు, ముగ్గురుకి రూ. 10లక్షలు, మిగతా వారికి రూ. 2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలు అందచేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ. 2 కోట్ల 62 లక్షలు అందచేశారు. విజయనగరం రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. సహాయక చర్యల్లో రైల్వే అధికారులతో సమన్వయం కావాలని ఆదేశిస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబానికి పది లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు చొప్పున ప్రకటించారాయన. అయితే.. బాధితుల్లో పేదవాళ్లు ఉండడంతో.. అంగవైకల్యం చెందిన వారికి రూ. 10లక్షలు, కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యే వాళ్లకి రూ. 5లక్షలు చొప్పున పరిహారం పెంచి ఇచ్చారు. సంబంధిత వార్త: రైల్వే ప్రమాద బాధితులకు జగనన్న భరోసా -
సీఆర్పీఎఫ్ వీర జవాన్ల కుటుంబాలకు పరిహారం పెంపు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉండగా అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో లేదా విధుల్లో ఉండగా ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం..క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో నేలకొరిగిన జవాన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.21.5 లక్షల పరిహారాన్ని రూ.35 లక్షలకు పెంచారు. ఎవరైనా జవాను ప్రమాదం, అనారోగ్యం, తదితర ఏ ఇతర కారణాలతోనైనా విధి నిర్వహణలో ఉండగా చనిపోతే ఆయన కుటుంబానికిచ్చే పరిహారాన్ని రూ.16.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెప్టెంబర్‌లో జరిగిన వార్షిక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియా పెంపునకు కృషి
- అబ్కారీ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని అబ్కారీ, మద్యనిషేధ శాఖ మంత్రి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికుల కుటుంబాలకు సోమవారం రవీంద్రభారతిలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గీత కార్మికులకు ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రూ. 2 లక్షలు నుంచి రూ. 5 లక్షలు పెంచేందుకు కృషిచేస్తానన్నారు. ఎక్స్‌గ్రేషియా 15 రోజుల నుంచి 30 రోజుల్లో బాధితుల చేతికి అందేలా చేస్తామన్నారు. కల్లు దుకాణాలు తెరవడంతో నగరంలో 50 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. కల్లు దుకాణాల్లో పనిచేసే వారికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తాటి, ఈత చెట్లకు పన్ను విధానం రద్దు చేయాలని చెప్పారు. వీరికోసం ఓ సంక్షేమ బోర్డు అవసరమన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ తాటి చెట్టు డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీకి దక్కేలా గీత కార్మికులందరూ అండగా నిలవాలన్నారు. త్వరలో ఈ కార్మికుల సమస్యలపై ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులపై గతంలోలాగా తెలంగాణ పాలనలో దౌర్జన్యాలు ఉండవని తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గీతకార్మికుల కోసం ఒకేసారి రూ. 7.70 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనివల్ల 3,236 మంది గీత కార్మికులకు ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాజలింగంగౌడ్, రెవెన్యూ విభాగం ప్రభుత్వ కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ టి.ప్రసాద్, అదనపు కమిషనర్ ఎంఎంఎ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.