సాక్షి, విజయనగరం: కంటకాపల్లి రైలు ప్రమాద ఘటన తర్వాత సహాయక చర్యలు, బాధితుల చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మంత్రి బొత్సను పంపించి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షింపజేశారు. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ వచ్చారు.
విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని నేరుగా వెళ్లి మరీ పరామర్శించారాయన. ఈ క్రమంలో వాళ్ల పేదరికానికి ఆయన చలించిపోయారు. మానవత్వంతో మరింత పరిహారం పెంచి.. అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. తాజాగా ఆ పరిహారం బాధితులకు అందింది.
బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే నష్టపరిహారం చెక్‌లు అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. 10 మందికి రూ. 5 లక్షలు, ముగ్గురుకి రూ. 10లక్షలు, మిగతా వారికి రూ. 2 లక్షలు చొప్పున.. మొత్తం క్షతగాత్రులకు కోటి 32 లక్షలు అందచేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. 13 మంది మృతులకు రూ. 10 లక్షలు చొప్పున.. రూ. 2 కోట్ల 62 లక్షలు అందచేశారు.
విజయనగరం రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం సత్వరమే స్పందించింది. సహాయక చర్యల్లో రైల్వే అధికారులతో సమన్వయం కావాలని ఆదేశిస్తూనే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబానికి పది లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు చొప్పున ప్రకటించారాయన. అయితే.. బాధితుల్లో పేదవాళ్లు ఉండడంతో.. అంగవైకల్యం చెందిన వారికి రూ. 10లక్షలు, కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితం అయ్యే వాళ్లకి రూ. 5లక్షలు చొప్పున పరిహారం పెంచి ఇచ్చారు.
సంబంధిత వార్త: రైల్వే ప్రమాద బాధితులకు జగనన్న భరోసా
Comments
Please login to add a commentAdd a comment