ఆదోనిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద అధికారులతో మాట్లాడుతున్న పార్టీ నాయకులు
వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు అక్కసు
ఎక్కడికక్కడ కూల్చేయాలని కుట్ర
పాత తేదీతో నోటీసు ఇస్తామన్న విజయవాడ కార్పొరేషన్ అధికారులు
ఒప్పుకోక పోవడంతో తాజాగా నోటీసు
విజయనగరం, ఆదోని పార్టీ కార్యాలయాలకూ హెచ్చరికలు
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/ఆదోని టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి పావులు కదుపుతోంది.
ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘విద్యాధరపురం లేబర్‌కాలనీ పార్టీ ఆఫీసుకు పాత తేదీలతో (గత నెలలో) నోటీసులు ఇస్తాం. దాని వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒప్పుకుంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చి వెళిపోతా. అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అని కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది ఒకరు పార్టీ కార్యాలయం సంబంధికునికి ఫోన్ చేశారు.
ఇందుకు ఇటు వైపు నుంచి సమాధానమిస్తూ ‘అలా ఎలా తీసుకుంటాం.. మీరు ఎప్పుడు నోటీస్ ఇస్తే ఆ రోజు తేదీ వేసి ఇవ్వండి. అది కూడా సైట్ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తే తీసుకుంటాం. ఆ విషయాన్ని మాపై వారికి తెలియజేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్.. అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని సోమవారం నోటీస్ జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన మురికి కుంటను పూడ్చేసి, అధికారుల అనుమతితోనే నిర్మాణం చేపట్టినప్పటికీ టీడీపీ సర్కారు కక్షగట్టి వ్యవహరిస్తోంది.
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహారాజుపేటలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం అక్రమమని టౌన్ ప్లానింగ్ అధికారి ఫిలిప్ సోమవారం నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నందున తక్షణమే పనులు ఆపేసి, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్‌సీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమని బీజేపీ నాయకుడు నాగరాజుగౌడ్, టీడీపీ నేత ఉమ్మి సలీంతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తగిన సమాధానం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పార్టీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment