corporation officers
-
కొనసాగుతున్న కక్ష సాధింపు
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/ఆదోని టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘విద్యాధరపురం లేబర్‌కాలనీ పార్టీ ఆఫీసుకు పాత తేదీలతో (గత నెలలో) నోటీసులు ఇస్తాం. దాని వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒప్పుకుంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చి వెళిపోతా. అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అని కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది ఒకరు పార్టీ కార్యాలయం సంబంధికునికి ఫోన్ చేశారు.ఇందుకు ఇటు వైపు నుంచి సమాధానమిస్తూ ‘అలా ఎలా తీసుకుంటాం.. మీరు ఎప్పుడు నోటీస్ ఇస్తే ఆ రోజు తేదీ వేసి ఇవ్వండి. అది కూడా సైట్ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తే తీసుకుంటాం. ఆ విషయాన్ని మాపై వారికి తెలియజేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్‌వీ ప్రసాద్.. అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని సోమవారం నోటీస్ జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన మురికి కుంటను పూడ్చేసి, అధికారుల అనుమతితోనే నిర్మాణం చేపట్టినప్పటికీ టీడీపీ సర్కారు కక్షగట్టి వ్యవహరిస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహారాజుపేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం అక్రమమని టౌన్ ప్లానింగ్ అధికారి ఫిలిప్ సోమవారం నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నందున తక్షణమే పనులు ఆపేసి, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమని బీజేపీ నాయకుడు నాగరాజుగౌడ్, టీడీపీ నేత ఉమ్మి సలీంతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తగిన సమాధానం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పార్టీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. -
హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ సీజ్
తిరుపతి తుడా: శ్రీనివాస సేతు పిల్లర్లపై నిబంధనల కు విరుద్ధంగా అతికించిన వాల్ పోస్టర్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. వాల్ పోస్టర్లు అతికించిన సంస్థకు భారీ జరిమానా విధించారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. లీలామహల్ సర్కి ల్ నుంచి మంగళం వైపు ఉన్న శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ స్తంభాలపై అనులతులు లేకుండా చేన్నైస్ అమ్రిత ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ వాల్ పోస్టర్లను అతికించింది. ఫిర్యాదులు అందడంతో ఆయన సిబ్బందితో కలిసి సదరు హోటల్‌ను సీజ్ చేశారు. పిల్లర్లపై అతికించిన వాల్ పోస్టర్లను తొలగించారు. సంస్థ కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.50 వేల జరిమానా విధించినట్టు తెలిపారు. -
నడిరోడ్డుపై తిష్ట.. రహదారిలో వెళ్లేదెట్ట..?
సాక్షి, కడప: రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారులు పనులు ముగించుకొని హడావుడిగా ఇళ్లకు వెళ్లే సమయంలో కడప నగర వాసులకు ప్రతి రోజు ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్లైన ఆర్టీసీ బస్టాండు, ఏడురోడ్లు, అప్సర సర్కిల్, ఐటీఐ, చిన్నచౌక్లలో రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట దగ్గరికి వచ్చినంత వరకు పశువులు పడుకున్నది అర్థం కాని పరిస్థితి. వాహనాలు రాత్రిపూట కొద్దిగా వేగంగా వెళుతున్న సమయంలో పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరికలు సరే.. చర్యలేవీ? రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే కార్పొరేషన్ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి రోజుకు రూ.50 అపరాద రుసం వసూలు చేస్తామని, 15 రోజుల్లోపు బంధించిన పశువులను యజమానులు వచ్చి తోలుకెళ్లకపోతే వాటిని అడవులకు తరలిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్పొరేషన్ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు. -
నిర్లక్ష్యానికి నిదర్శనం..!
గోదావరిఖనిటౌన్: అభివృద్ధి పేరిట చేసే ఏ పని అయినా, ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినపుడే అది అభివృద్ధి అనిపించుకుంటుంది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా చేసే పనులు ఏవైనా సబబు కాదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లో పలురకాల అభివృద్ధి పనుల కోసం కార్పొరేషన్ అధికారులు ఇటీవల వేసిన సీసీ రోడ్లను తవ్వారు. అయితే నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతు చేయక పోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగు నీరు, మరుగు దొడ్లు, రోడ్డు వెడల్పు, ఇతర పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి పునః నిర్మాణం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ప్రతినిత్యం రోడ్ల వెంబడి నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం.. అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్డును తిరిగి రెండు నెలల్లో పూర్తి చేసి యథావిధిగా ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యవంతంగా నిర్మించాలి. అయితే సంవత్సరాలు గడిచినా పునః నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతీ నిత్యం నడవడానికి, వాహనాలను తీసుకుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామని ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులను ముందే ఆలోచించి నిర్మించకపోవడంతో కోట్ల రూపాలయతో వేసిన రోడ్డు మధ్యంతరంగా చెరిపి తిరిగి వేయడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెగుతున్న ఇంటర్నెట్ తీగలు.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లను తవ్వడంతో రోడ్డు క్రింద ఉన్న ఇంటర్నెట్, బీఎస్ఎన్ఎల్ వైర్లు తెగి నెట్ వినియోగదారులకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు, విద్యార్థులు, యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉద్యోగాల కోసం, విద్యాపరంగా ఉండే అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వారు వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నామని పేర్కొంటున్నారు. తాగునీటిలో మలిన పదార్థాలు.. అయితే రోడ్లను తవ్వే సమయంలో వాటి కింద ఉండే తాగు నీటి పైపులు పగిలి నీటిలో మట్టి, ఇసుక, ఇతర మలిన పదార్థాలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లను బాగు చేయాలి స్థానికంగా వివిధ అభివృద్ధి పనుల కోసం తవ్విన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి. ఇంటి ఎదుట నుంచి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో మరింత ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించాలి. – నరేశ్, స్థానికుడు కలుషితం అవుతున్న తాగునీరు మరమ్మతుల కోసం రోడ్లను తవ్వడంతో తాగు నీటి పైపులు పగలడంతో తాగు నీరు కలుషితం అవుతోంది. దీంతో వ్యాధుల బారిన పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగు నీరు కలుషితం కాకుండా చూడాలి. – మురళి, స్థానికుడు -
బ్యాంకర్లపై అట్రాసిటీ కేసులు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేదలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల గ్రౌండింగ్‌లో బ్యాంకర్లు అవలంబిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశ మందిరంలో డీఎల్ఆర్సీ, డీసీసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుండి 2018 వరకు ప్రభుత్వం నుండి వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలు, గ్రౌండింగ్, సబ్సిడీలు విడుదలపై బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు, వాటి గ్రౌండింగ్, అమలులో సమస్యలపై ఆరా తీశారు. బ్యాంకర్లు రుణాల మంజూరుపై అవలంభిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని, ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నదర్పల్లిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే సమావేశం లో ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ బ్యాంకర్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లపై కేసులను చిన్నదర్పల్లి నుండే ప్రారంభించాలని సూచించారు. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. యూనిట్లు లేకున్నా ఉన్నట్లు బ్యాంకర్లు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేస్తుందని, జిల్లాలో 70 శాతం యూనిట్లు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, బ్యాంకర్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను ధ్రువీకరించాలని కలెక్టర్ సూచించారు. కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్సు బిజినెస్ వద్దు ‘ప్రభుత్వం మంజూరు చేసి యూనిట్లకు కాన్సెంట్ అవసరమే లేదు.. కాన్సెంట్ ఎందుకు అడుగుతున్నారు.. మండల స్థాయిలోని ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మద్దతు పథకాలకు సంబందించిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఉండి ఈ విషయం తెలియకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల గ్రౌండింగ్‌కు డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారముందని, అంతేకాకుండా రుణాలు విడుదల చేస్తూ ఇన్సూరెన్సు కోత విధిస్తున్నట్లు తెలిసిందని. ఇకనైనా కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్స్‌ల పేరుతో బిజినెస్‌లు చేయొద్దని హెచ్చరించారు. లక్ష్యం మేరకు పంట రుణాలు జిల్లాలో రబీ కంటే ఖరీఫ్ సాగు ఎక్కువగా వేస్తారని, వర్షాలు కురుస్తున్నందున పంట రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. టార్గెట్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు భూ ప్రక్షాళన కార్యక్రమం తప్పొప్పుల సవరణ పూర్తి కానుందని, త్వరలో ధరణి లింక్‌ను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వనుందని తెలిపారు. ఆన్లైన్లో భూ రికార్డులు పక్కాగా అందుబాటులోకి రానున్నాయని, అప్పటివరకు తాము ఇచ్చే బ్యాంకు వారీగా రైతులు, ఖాతాలు, భూ వివరాల నివేదిక ఆధారంగా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్, పరిగి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, ఎల్డీఎం ప్రభాకర్ శెట్టి, నాబార్డు ఏజీఎం అమితాబ్ భార్గవ్, ఆర్బీఐ అధికారులు, కార్పొరేషన్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నిపా వైరస్‌పై అప్రమత్తం
సాక్షి, నెల్లూరు సిటీ : తిరుపతిలో నిపా వైరస్ కలకలం రేగడంతో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. పందుల కారణంగా నిపా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వాటిని పట్టివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులు పందుల యజమానులకు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గురువారం నుంచి కార్పొరేషన్ పరిధి లోని పందులను ఇతర ప్రాంతాలకు తరలిం చడం, కాల్చివేయడం చేయనున్నారు. నగరంలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పందుల యజమానులను అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేదు. కార్పొరేషన్ అధికారులు అప్పుడప్పుడు తూతూమంత్రంగా పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. కార్పొరేషన్ పరిధిలో పందుల పెంపకందారులు సుమారు 200మందికి పైగా ఉన్నారు. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డికాలనీ, బీవీనగర్, కొండాయపాళెంగేటు, కుక్కలగుంట, తదితర ప్రాంతాల్లో పందుల పెంపకం చేపడుతున్నారు. నగరంలో దాదాపు 5వేలకు పైగా పందులు సంచరిస్తున్నాయి. పందుల యజమానులకు నోటీసులు పందుల పెంపకందారులకు కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మంగళవారం నోటీసులు జారీ చేశారు. గతంలో పందులను తరలించే క్రమంలో పెద్ద ఎత్తున పందుల యజమానులు అడ్డుకోవడం, నాయకుల ఒత్తిళ్లతో అధికారులు వెనక్కుతగ్గడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం నిపా వైరస్ కలకలంతో అధికారులు చెన్నైకు చెందిన ప్రత్యేక బృందాలతో పందుల పట్టివేత కార్యక్రమం చేపట్టనున్నారు. పందుల యజమానులు అడ్డుకోకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పందుల యజమానులు పందుల పట్టివేతను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సిందే. -
ఎట్టకేలకు కదిలారు
ఆదెమ్మదిబ్బ కబ్జాపై స్పందించిన అధికారులు కంచె వేసిన కొద్ది ప్రాంతంలో హెచ్చరిక బోర్డు హోలీ ఏంజెల్స్ స్కూల్ ప్రాంతం కార్పొరేష¯ŒSదంటూ వివరణ సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని కంబాల చెరువు సమీపంలో రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల భూ కబ్జాపై నగరపాలక సంస్థ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ కోలమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు.. 50 ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఖాళీ చేయించడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్–730లోని స్థలం ప్రైవేటు వ్యక్తులదంటూ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇది ప్రభుత్వం సేకరించిందా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆ స్థలం తమదేనని పేర్కొన్నారు. ‘సాక్షి’ తనవద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నించగా.. ఆ భూమిని తాము ప్రభుత్వ సేకరణకు ఇవ్వలేదని తోసిపుచ్చారు. ప్రభుత్వం తమ పినతండ్రి సత్యవోలు లింగమూర్తి, సత్యవతి దంపతుల వాటా సేకరించిందని చెప్పారు. మొత్తం స్థలం 4 ఎకరాల 19 సెంట్లు కాగా.. తన తండ్రి పాపారావు 2 ఎకరాల 23 సెంట్లు, తన పిన్నమ్మ సత్యవతి ఎకరా 96 సెంట్ల లెక్కన పంచుకున్నారని చెప్పారు. తమ స్థలం పిన్నమరెడ్డి ఈశ్వరుడికి అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఓవైపు ఈ స్థలంపై అనేక ఆరోపణలు వస్తూండగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాత్రం తమ పని కానిచ్చేశారు. పేదలను ఖాళీ చేయించి కంచె వేశారు. పనిలో పనిగా సర్వే నంబర్–725/3ఎ లోని హోలీ ఏంజెల్స్ స్కూల్ వెనుక, పక్కన గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను కూడా ఖాళీ చేయించి, అక్కడ కూడా కంచె వేశారు. దీనిపై గత డిసెంబర్ 26న ‘భూమంత్రం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. నెల రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు తాజాగా ఆ స్థలం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థదేనంటూ హోలీ ఏంజెల్స్ స్కూల్ పక్కన, వెనుక బోర్డులు పెట్టారు. ఆ స్థలం ఆక్రమించిన వారు శిక్షార్హులంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు వేసిన కంచెకు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మిగిలిన ప్రాంతంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వలేదు. -
బల్దియా అధికారులకు వాకీటాకీలు
కోల్‌సిటీ : కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ వైర్లెస్ సెట్టు (వాకీటాకీ) శనివారం పంపిణీ చేశారు. వాకీటాకీలు బృంద సమాచార వ్యాప్తికి ఉపయోగపడుతాయని మేయర్ అన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన 12వ ఆర్థిక సంఘం నిధులతో ఈ వాకీటాకీలను కొనుగోలు చేశామన్నారు. ప్రస్తుతం 40 వాకీటాకీలు, మూడు సంచార వాకీటాకీలను ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. శానిటేషన్, వాటర్ సప్లై, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో కీలక విధులు నిర్వహిస్తున్న వారికి అందజేయనున్నట్లు మేయర్ వెల్లడించారు. వాకీటాకీలతో పనుల్లో జాప్యం జరుగకుండా ఉంటుందన్నారు. తొలివిడతలో పారిశుధ్య సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ జాన్‌శ్యాంసన్, మున్సిపల్ ఈఈ జగన్మోహన్రావు, డీఈఈ మాధవి, మహేందర్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ శంకర్రావు, శానిటరీ సూపర్వైజర్లు కిశోర్‌కుమార్, పవన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
భూసేకరణే అస్త్రం
♦ కడియం పోతవరంలో 28 ఎకరాలు గుర్తింపు ♦ కలెక్టర్‌కు లేఖ రాసిన మునిసిపల్ కమిషనర్ ♦ నెలాఖరు నాటికి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని నిర్ణయం విజయవాడ సెంట్రల్ : డంపింగ్ యార్డు స్థలం కోసం భూసేకరణ (ల్యాండ్ అక్విజేషన్) అస్త్రాన్ని ప్రయోగించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలోని 28 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. భూ సేకరణకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ బాబు కు కమిషనర్ జి.వీరపాండియన్ లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం పోతవరం ఎంపిక రాజధాని నేపథ్యంలో నగరపాలక సంస్థకు డంపింగ్ యార్డు అత్యవసరమైంది. గతంలో కేటాయించిన రూ.9 కోట్లతో భూమిని కొనాలని అధికారులు భావించారు. ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ధర పలకడంతో బేరం కుదరలేదు. చివరి అస్త్రంగా భూసేకరణ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల కిందట అధికారుల బృందం కడియం పోతవరం ప్రాంతంలో భూముల్ని పరిశీలించి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఇండస్ట్రీ జోన్లో ఉన్న 28 ఎకరాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎకరం రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలకు మించకుండా భూ యజమానికి నష్టపరిహారం ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. యజమాని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమి ఒకరిదే కాబట్టి ఇబ్బందులు ఎదురుకావనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు మోక్షం డంపింగ్ యార్డు స్థల సేకరణ కోసం గడిచిన రెండేళ్లుగా అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో స్థలాలను గత ఏడాది అక్టోబర్‌లో నాటి కమిషనర్ సి.హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్ పరిశీలించారు. సైంటిఫిక్ డంపింగ్ యార్డుకు భూమి అనుకూలంగా ఉందని తేల్చారు. రైతులు ఎకరం కోటి రూపాయలపైన ధర చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో స్థల సేకరణ సమస్యగా మారింది. జనవరిలో బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వీరపాండియన్ నెలరోజుల్లో డంపింగ్ యార్డు స్థల సేకరణకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. భూముల ధర పైపైకి ఎగబాకడంతో ల్యాండ్ అక్విజేషన్పై దృష్టిసారించారు. ఈనెలఖరుకు భూసేకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి డెరైక్షన్లోనే.. నగరంలో ప్రస్తుతం 10.74 లక్షల ప్రజలు నివసిస్తున్నారు. రాజధాని నేపథ్యంలో మరో రెండు లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. జనాభా పెరుగుదల నేపథ్యంలో దీని పరిమాణం పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమ ంలో నగరానికి సైంటిఫిక్ డంపింగ్ యార్డు తప్పనిసరైంది. భూ సేకరణ సమస్యపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ వీరపాండియన్లు మునిసిపల్ మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు పావులు కదిపినట్లు సమాచారం. నిధులు రెడీ జేఎన్ఎన్యూఆర్ఎంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు స్థలసేకరణ కోసం 2007లోనే రూ.9 కోట్లు కేటాయించారు. రవిబాబు కమిషనర్‌గా ఉన్న సమయంలోనే ఈ నిధుల్ని రెవెన్యూ అధికారుల వద్ద డిపాజిట్ చేశారు. ప్రస్తుతం అవి ఖజానాలో మూలుగుతున్నాయి. కాబట్టి భూసేకరణకు నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కడియం పోతవరంలోని 28 ఎకరాల భూములు డంపింగ్ యార్డుకు అనుకూలంగా ఉన్నాయని సిటీప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్‌కు లేఖ రాశామని, అనుమతి వచ్చాక భూమి సేకరిస్తామన్నారు. -
ఆగని అక్రమ కట్టడాలు
కార్పొరేషన్ సూచనలు బేఖాతరు రాజకీయ అండతోనే నిర్మాణాలు చర్యలకు ఉపక్రమించని అధికారులు రీ సర్వేతోనైనా తీరు మారుతుందా! నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఎల్లమ్మగుట్ట రైల్వేకమాన్ సమీపంలో ఓ ఐదంతస్తుల భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. సెట్ బ్యాక్ ఏ మాత్రం లేదు. భవనం డ్రైనేజీని ఆనుకొని రోడ్డుపైకి చేరింది. అడ్డంగా ఉన్న ట్రాన్స్‌కో విద్యుత్ స్తంభాన్ని తొలగించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు అమలు కాలేదు. ఇలాంటి భవనాలు నగరంలో వెలుస్తునే ఉన్నాయి. నిర్మాణదారులు బల్దియూ అ ధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహరం ప్రభుత్వ దృష్టికి వెళ్లినా వారు చలించడం లేదు. అపార్టమెంట్లు, భవనాల నిర్మాణాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులు కఠి నంగా వ్యవహరించకపోవడం కూడా ఇందుకు కారణమనే భావన వ్యక్తమవుతోంది. ముడుపుల ఆరోపణలతో అక్రమకట్టడాలకు సంబంధించి ముడుపుల ఆరోపణలు రావడంతో హడావుడి చేసిన అధికారులు చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదు. సుభాష్‌నగర్‌లో ని ఓ బ్యాంకు సమీపంలో అక్రమంగా అపార్టమెంట్ వెలిసినా స్పందించడం లేదు. ఖలీల్‌వాడి ప్రాంతంలో పోచమ్మగల్లికి వెళ్లే దారిలో ఐదంతస్తుల భవనం, మాడ్రన్పబ్లిక్ స్కూల్ సమీపంలో మరో భవనం వెలిసాయి. బస్టాండ్ ప్రాంతం లో షాపింగ్ కాంప్లెక్స్, వినాయక్‌నగర్ రోడ్డులోని మూడు భవనాలు సెల్లా ర్ లు లేకుండా ఉన్నాయి. గంగస్థాన్, ఆ ర్యనగర్, వినాయక్‌నగర్ ప్రాంతాలలో నూతనంగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇందులో కొన్నిం టికి అనుమతి ఉన్నప్పటికీ,నిబంధనల ప్రకారం నిర్మాణాలు కొనసాగడం లే దు. అధికారులు ఇటువైపు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వినాయక్‌నగర్‌లో ఓ అ పార్టమెంట్‌లో నలుగురు కార్మికులు మృతి చెందారు. అప్పుడు హుటాహుటిన స్పందించిన కార్పొరేషన్ అధికారు లు 104 భవనాలకు నోటీసులు జారీ చేశారు. చర్యలు తీసుకోవడంలో ముం దుకు సాగడం లేదు. రాజకీయ ఒత్తిడే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్రమిత స్థలాలలో దుకాణాలను తొలగిస్తున్న అధికారులు అక్రమ అపార్టమెంట్ల, భవనాల నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. బడాబాబులపై చర్య లు తీసుకుంటే అక్రమ నిర్మాణాలు నిలి చిపోయే అవకాశం ఉంది. ఇటీవల అ ర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మే యర్ ఆకుల సుజాత, కమిషనర్ వెంకటేశ్వర్లు అక్రమ కట్టడాలకు సంబంధిం చి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలను గుర్తించి నివేదిక త యారు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే చేపట్టాలని నిర్ణయిం చారు. దీని ఆధారంగానైనా అధికారు లు చర్యలకు కదులుతారా! -
ఒంగోలు అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు అవసరం
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు నగరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలంటే వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని గుర్తించినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి ఇటీవల వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేసినప్పటికీ జిల్లా కేంద్రమైన ఒంగోలు నగర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలోని కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న భవనాలతో పాటు ధ్వంసమైన డివైడర్లు, పైపులైన్ లీకేజీలను కార్పొరేషన్, విద్యుత్ శాఖాధికారులతో కలిసి శనివారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెప్పించి ఒంగోలు నగర అభివృద్ధికి ఏడాదిలోగా బాటలు వేస్తానని పేర్కొన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నగరానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు రోడ్డు విస్తరణకు ఆటంకం కల్పిస్తూ కోర్టును ఆశ్రయించిన భవనాల యజమానులతో సోమవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో సమావేశమై చర్చించనున్నట్లు వెల్లడించారు. గోడు వెళ్లబోసుకున్న మహిళలు... కర్నూలు రోడ్డు, తదితర ప్రాంతాల్లో పర్యటించిన జనార్దన్‌ను స్థానిక వెంకటేశ్వరనగర్, మఠంబజార్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలు కలుసుకుని సమస్యలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని వాపోయారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సాయంత్రంలోగా నీరు సరఫరా చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారు. అదే విధంగా కర్నూలురోడ్డు విస్తరణలో కూలగొట్టిన భవనాలకు సెట్‌బ్యాక్‌కు సంబంధించిన టీడీఎస్ ఫారాలను కార్పొరేషన్ అధికారులు నేటికీ ఇవ్వలేదని వాటి యజమానులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తులతో సంబంధం లేకుండానే కూలగొట్టిన భవనాల యజమానులకు వాటిని అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రోడ్డు విస్తరించిన ప్రాంతాల్లో ఇంకా రోడ్డుపైనే ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఆ శాఖాధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు, కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఎంఈ చెన్నకేశవరెడ్డి, పర్యావరణ డీఈ గిరిధర్ తదితరులు ఉన్నారు. -
నిర్భాగ్యులకు వసతి
నిజామాబాద్ కార్పొరేషన్, న్యూస్‌లైన్: మూడు, నాలుగు రోజులుగా కార్పొరేషన్ అధికారులు నగరంలో తిరుగుతూ నిరాశ్రయుల వివరాలను సేకరిస్తున్నారు.సుప్రీంకోర్టు సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఏ నీడా లేనివారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘షెల్టర్ ఫర్ హోం లెస్’ నిర్వహణ బాధ్యతను నగర, పురపాలక సంస్థలకు అప్పగించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నగరాలలో వాడకుండా వదిలేసిన ప్రభుత్వ భవనాలు, సామాజిక భవనాలను నివాసయో గ్యంగా తీర్చిదిద్ది అభాగ్యులకు వసతి కల్పిస్తారు. అలాంటి భవనాలు లేకపోతే కొత్తవాటిని నిర్మిస్తారు. వీటిలో తాగునీరు, స్నానం గదులు, మరుగుదొడ్లను ఏర్పాటు చే స్తారు. భోజన వసతి కూడా కల్పిస్తారు. నిర్వహణకు కమిటీలు షెల్టర్ల నిర్వహణకు కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీలకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ కమిషనర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఎంహెచ్ఓ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మెప్మా పీఆర్పీలు, మహిళా సంఘాలకు చెందిన పట్టణ సమాఖ్యల బాధ్యులు, ఎన్జీఓలతో కూడిన పదిమంది సభ్యులతో కార్యనిర్వా హక కమిటీ ఉంటుంది. ఒక్కో వసతి గృహంలో 50 మందికి సరిపడా వసతులు కల్పించేందుకు ప్లేట్లు, బకెట్లు, దుప్పట్లు, మంచాలు కొనుగోలు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం రూ. 3.50 లక్షలు ఖర్చు చేయనుంది. భోజన వసతులకు ఏడాదికి రూ. 9.42 లక్షలు కేటాయించనున్నారు. ఇందుకోసం అయ్యే వ్యయంలో 75 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. వసతి గృహంలో ఇద్దరు కేర్ టేకర్లను నియమించి ఒక్కొక్కరికి రూ.5000 వేతనాలు చెల్లిస్తారు. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలో రాత్రి వేళలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రైల్వేబ్రిడ్జి కింది, పార్కులలో ఉన్న వారి వివరాలను సేక రి స్తున్నారు. ఇప్పటి వరకు 90 మంది వివరాలు సేకరించామని, నగరం మొత్తం సర్వే చేసి నిరాశ్రయులను గుర్తిస్తామని అన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పం పిస్తామని అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి మల్లికార్జున్ తెలిపారు. జనాభా లక్షకు పైగా ఉన్న నగరాలు, పట్టణాలలో ఎస్‌యూహెచ్ పథకాన్ని అమలు చేయనున్నటు ఆయన తెలిపారు. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలకు ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.