భూసేకరణే అస్త్రం
♦ కడియం పోతవరంలో 28 ఎకరాలు గుర్తింపు
♦ కలెక్టర్‌కు లేఖ రాసిన మునిసిపల్ కమిషనర్
♦ నెలాఖరు నాటికి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని నిర్ణయం
విజయవాడ సెంట్రల్ : డంపింగ్ యార్డు స్థలం కోసం భూసేకరణ (ల్యాండ్ అక్విజేషన్) అస్త్రాన్ని ప్రయోగించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలోని 28 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. భూ సేకరణకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ బాబు కు కమిషనర్ జి.వీరపాండియన్ లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కడియం పోతవరం ఎంపిక
రాజధాని నేపథ్యంలో నగరపాలక సంస్థకు డంపింగ్ యార్డు అత్యవసరమైంది. గతంలో కేటాయించిన రూ.9 కోట్లతో భూమిని కొనాలని అధికారులు భావించారు. ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ధర పలకడంతో బేరం కుదరలేదు. చివరి అస్త్రంగా భూసేకరణ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల కిందట అధికారుల బృందం కడియం పోతవరం ప్రాంతంలో భూముల్ని పరిశీలించి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఇండస్ట్రీ జోన్‌లో ఉన్న 28 ఎకరాలను ఎంపిక చేసింది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎకరం రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలకు మించకుండా భూ యజమానికి నష్టపరిహారం ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. యజమాని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమి ఒకరిదే కాబట్టి ఇబ్బందులు ఎదురుకావనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఇన్నాళ్లకు మోక్షం
డంపింగ్ యార్డు స్థల సేకరణ కోసం గడిచిన రెండేళ్లుగా అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో స్థలాలను గత ఏడాది అక్టోబర్‌లో నాటి కమిషనర్ సి.హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్ పరిశీలించారు. సైంటిఫిక్ డంపింగ్ యార్డుకు భూమి అనుకూలంగా ఉందని తేల్చారు.
రైతులు ఎకరం కోటి రూపాయలపైన ధర చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో స్థల సేకరణ సమస్యగా మారింది. జనవరిలో బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వీరపాండియన్ నెలరోజుల్లో డంపింగ్ యార్డు స్థల సేకరణకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. భూముల ధర పైపైకి ఎగబాకడంతో ల్యాండ్ అక్విజేషన్‌పై దృష్టిసారించారు. ఈనెలఖరుకు భూసేకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రి డెరైక్షన్‌లోనే..
నగరంలో ప్రస్తుతం 10.74 లక్షల ప్రజలు నివసిస్తున్నారు. రాజధాని నేపథ్యంలో మరో రెండు లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. జనాభా పెరుగుదల నేపథ్యంలో దీని పరిమాణం పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమ ంలో నగరానికి సైంటిఫిక్ డంపింగ్ యార్డు తప్పనిసరైంది.
భూ సేకరణ సమస్యపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ వీరపాండియన్‌లు మునిసిపల్ మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు పావులు కదిపినట్లు సమాచారం.
నిధులు రెడీ
జేఎన్‌ఎన్యూఆర్‌ఎంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పథకం కింద నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు స్థలసేకరణ కోసం 2007లోనే రూ.9 కోట్లు కేటాయించారు. రవిబాబు కమిషనర్‌గా ఉన్న సమయంలోనే ఈ నిధుల్ని రెవెన్యూ అధికారుల వద్ద డిపాజిట్ చేశారు. ప్రస్తుతం అవి ఖజానాలో మూలుగుతున్నాయి.
కాబట్టి భూసేకరణకు నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కడియం పోతవరంలోని 28 ఎకరాల భూములు డంపింగ్ యార్డుకు అనుకూలంగా ఉన్నాయని సిటీప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్‌కు లేఖ రాశామని, అనుమతి వచ్చాక భూమి సేకరిస్తామన్నారు.