
రూ. కోట్ల విలువైన భూములకురూ.25 లక్షలలోపే ఇస్తారా ?
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
ఇటీవల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు 1004.22 ఎకరాల భూమి సేకరణ
మొన్న తిమ్మాపూర్‌లో 567 ఎకరాలు, నాగిరెడ్డిపల్లిలో 195.05 ఎకరాలు
నిన్న కొంగరకుర్దులో 277.06..తిమ్మాపూర్‌లో 366.04 ఎకరాలు
తాజాగా మొండిగౌరెల్లిలో 821.11 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం : ప్యూచర్ సిటీ రాకతో తమ దశ తిరిగిపోతుందని భావించిన రైతుల్లో ఇప్పుడు రంది మొదలైంది. రూ. కోట్లు పలికే భూములకు పరిహారం ఎంతో తేల్చకుండా..వరుసగా వస్తున్న భూసేకరణ నోటిఫికేషన్లు రంగారెడ్డి జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే నోటిఫికేషన్లు జారీ చేస్తూ బలవంతంగా భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ హంగులతో ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీ పేరుతో గత ప్రభుత్వం సేకరించిన 13,973 ఎకరాలుసహా మొత్తం 30 వేల ఎకరాల్లో ఈ ఫోర్త్‌సిటీని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 56 రెవెన్యూగ్రామాలతో ఎఫ్‌సీడీఏ ఏర్పాటు చేసి, ప్రత్యేక పాలక మండలిని కూడా ప్రకటించింది. అయితే ఫోర్త్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు, ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో ప్రభుత్వం మరికొంత భూమిని సేకరిస్తోంది.
» గత డిసెంబర్‌లో కందుకూరు మండలం తిమ్మాపూర్ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.
» ఫిబ్రవరి మొదటివారంలో మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీపార్కు స్థాపనకు 198.21 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావించి, 195.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది.
» మార్చి 13న కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
» రవాణా కోసం ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు 41.05 కిలోమీటర్లు...330 ఫీట్ల రోడ్డు నిర్మించనున్నట్టు ప్రకటించి, ఆ మేరకు ఇటీవల 4,725 మంది రైతుల నుంచి 1004.22 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఇప్పటికే ఆయా భూముల్లో హద్దురాళ్లను కూడా నాటే పని చేపట్టింది. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా హద్దురాళ్లు నాటడం ఏమిటని రైతులు ప్రశి్నస్తున్నారు.
» తాజాగా యాచారం మండలంలో ఇండ్రస్టియల్ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొండిగౌరెల్లి రైతులు ఇదే అంశంపై ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.2 కోట్లకుపైగా పలుకుతుండగా, ప్రభుత్వం రూ.25 లక్షల లోపే నష్ట పరిహారం చెల్లించే పరిస్థితి ఉండటంతో రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు చేయరాదని, బోరుబావులు తవ్వరాదని, నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మంచాల, కడ్తాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment