మీ కాళ్లు మొక్కుతం.. మమ్మల్ని బతకనీయండి
ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా సంస్థలకు భూములివ్వం
అధికారులను వేడుకున్నవికారాబాద్ జిల్లా దుద్యాల్ మండల పరిధిలోని గిరిజన రైతులు
కాంగ్రెస్ మండలాధ్యక్షుడిపై దాడికి యత్నం.. ఉద్రిక్తత
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది.
ఏం జరిగిందంటే..
కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.
ఫార్మా వద్దు.. పరిహారం వద్దు
ఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment