సీఎం ఇలాఖాలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన
పొలాల్లో విషం నింపొద్దని మండిపాటు
భూసేకరణ సభ కోసం వచ్చిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌పై రైతుల ఆగ్రహం
కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై చేయి చేసుకున్న ఓ మహిళా రైతు..
ఇతర అధికారులపై కర్రలు, రాళ్లతో రైతుల దాడి.. పలు వాహనాలు ధ్వంసం
పరుగులు పెట్టిన కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి
బలగాల మోహరింపు.. ఉద్రిక్తత
కొడంగల్/ దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు కన్నెర్ర జేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు.
కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా అదనపు బలగాలను మోహరించారు.
అసలేం జరిగింది?
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో భాగంగా సోమవారం గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. భూములు తీసుకునే లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో దుద్యాల– హకీంపేట మార్గంలో సభ ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకించిన నిర్వాసిత రైతులు.. తమ గ్రామంలోనే సభ నిర్వహించాలని అధికారులను కోరారు. రైతుల పక్షాన ఓ వ్యక్తి గ్రామసభ వేదిక వద్దకు వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఈ విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామంలోనే సభ నిర్వహిద్దామంటూ లగచర్లకు బయలుదేరారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి కలెక్టర్ వాహనాన్ని అనుసరించారు. అధికారులు లగచర్లకు చేరుకోగానే గ్రామస్తులు భూసేకరణకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రయత్నించారు. కానీ కొందరు గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు.
పోలీసుల వైఫల్యం!
గ్రామసభ కోసమని ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు 200 మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నారు. కలెక్టర్, ఇతర అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మినహా పోలీసులెవరూ వెంట వెళ్లలేదు. ఆగ్రహంతో దాడికి దిగిన గ్రామస్తులు, నిర్వాసిత రైతులను అదుపు చేయడం వీలుకాలేదు. నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యం కారణంగానే.. ఈ ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.
మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న రైతులు
దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో మొత్తం 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఐదు నెలల క్రితం చర్యలు ప్రారంభించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 రైతులు భూములు కోల్పోనున్నారు. వారంతా పేద రైతులే. చాలా వరకు గిరిజనులే.
ఈ భూముల్లో వ్యవసాయం తప్ప వేరే జీవనోపాధి లేదని వారు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్తున్నా... చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విషం చిమ్మే ఫార్మా కంపెనీలను అనుమతించేది లేదంటూ ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణపై ముందుకు వెళ్తుండటం, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో.. జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ఆగ్రహాన్ని గమనిస్తూనే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకరం సగటు ధర రూ.30 లక్షలకుపైగా ఉందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, కోల్పోయే ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా.. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులపై దాడి వరకు వెళ్లింది.
అనుకోకుండా జరిగింది.. అందరూ మనవాళ్లే..
లగచర్ల ఘటనను కలెక్టర్ ప్రతీక్ జైన్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఘటనా స్థలం నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వారందరూ మన ప్రజలే, మన రైతులే.. మాట్లాడుదామని మమ్మల్ని పిలిస్తేనే వెళ్లాం.. కొందరు వ్యక్తులు అనుకోకుండా తోసుకుని ముందుకు వచ్చి అలా చేశారు. దయచేసి ఈ ఘటనకు దాడి అనే పదం వాడకండి..’’ అని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజకీయ కుట్రతోనే దాడి: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్మా కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు తీసుకువస్తున్నారన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment