
ఎగుమతులు మొదలైనా తీరని ఆక్వా రైతుల వెతలు
అమెరికా సుంకాల పేరుతో కేజీకి రూ.40 నుంచి రూ.60 వరకు కోత
టారిఫ్‌లు వెనక్కి తీసుకున్నా కేజీకి రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెరిగిన ధర
సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా.. నిలిచిపోయిన ఎగుమతులు మొదలైనా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్‌కు రూ.40 నుంచి రూ.60 వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వీడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి.
30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర కేజీ రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ.415కు పెరిగింది. స్థానికంగా రొయ్యల పట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు.
ఇలా ప్రతి కౌంట్‌కు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ రూ.250 ఉన్న 100 కౌంట్ సుంకాల విధించిన తరువాత రూ.190కి తగ్గించారు.
టారిఫ్ వాయిదా పడినా..
అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ.. పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్‌కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్‌కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్‌కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్‌కు రూ.40 తగ్గించి ఇప్పుడు రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు.