‘రొయ్యో’ మొర్రో
* వైరస్.. ఫంగస్ దాడులు
* ఏటా ఇదే దుస్థితి
* దిక్కుతోచని రైతులు
* అందుబాటులో లేని ల్యాబ్‌లు
ఆకివీడు : రొయ్య రైతులు కుయ్యోమొర్రోమంటున్నారు. ఒక పక్క వైరస్, మరోపక్క ఫంగస్ వ్యాధులు విజృంభించడంతో కలవరపడుతున్నారు. ఆక్సిజన్‌తోపాటు, చెరువులోని నీటిలోపాల వల్ల ఈ వ్యాధులు సోకుతున్నాయి. వనామి రొయ్యకు వచ్చే ఈ వ్యాధులను నిర్మూలించడం రైతులు, శాస్త్రవేత్తల తరం కావడంలేదు.
వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఇవి సోకుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రతిఏటా ఇదే దుస్థితి తలెత్తుతోందని, ఒక్కసారిగా విజృంభిస్తున్న వ్యాధులు రూ.వేల కోట్ల రూపాయలను దిగమింగేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. రొయ్య డొప్పపై బూడిద రంగు, ఆకుపచ్చని జిగురు వంటి పొర ఏర్పడడాన్ని పాకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తోంది. దేహంపై నల్లని తుప్పు రంగు ఏర్పడడాన్ని బ్రౌన్ స్పాట్ వ్యాధి అని, మోప్పలు నలుపు రంగులోకి మారడాన్ని బ్లాక్గిల్ అని, ఎరుపు రంగులోకి మారడాన్ని రెడ్ గిల్ అని, రొయ్య మీసాలు, తోక కుళ్లడాన్ని రాట్ వ్యాధి అని, బాక్టీరియా పట్టడాన్ని విబ్రోయోసిస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా అక్కడక్కడ చెరువుల్లో కనబడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని నియంత్రణకు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు.
అత్యంత ప్రమాదకరమైంది వైరస్
రొయ్యలకు సోకే వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైంది వైరస్. ఇది సోకిన రొయ్యలు నిర్విరామంగా గట్టు వెంబడి తిరుగుతాయి. దేహంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నీలిరంగులోకి మారిన రొయ్యలకు పూర్తిగా వైరస్ సోకినట్టు నిర్ధారిస్తారు. ఇవి జీర్ణగ్రంధి పాడై గుట్టలుగుట్టలుగా చనిపోతాయి. ఈ వైరస్ సోకిన రొయ్యలను వెంటనే గుర్తించకపోతే రైతుకు పెట్టుబడులు కూడా దక్కవు. చెరువుల్లో ఒక్క రొయ్య కూడా కన్పించదు. ఈ వ్యాధి నివారణ కూడా కష్టమే.
ఫంగస్ వ్యాధి(ఈహెచ్‌పీ)
రొయ్య ఫంగస్ వ్యాధికి గురైతే ఎదుగు దల ఉండదు. ఈహెచ్‌పీ ఫంగస్ జీర్ణ గ్రంధికి వస్తోంది. చెరువుల్లో పెరిగిన రొయ్యలకు ఎంత మేత వేసినా ఎదుగుదల లేకపోవడంతో రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ఈ వ్యాధి పిల్ల దశలోనే రొయ్యకు సోకుతోంది. ఆ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ వ్యాధిని ప్రభుత్వం గత ఏడాది గుర్తించింది.
అందుబాటులో లేని ల్యాబ్‌లు
రొయ్యలు వ్యాధులకు గురైతే నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కనీసం ల్యాబ్ సౌకర్యాన్ని కూడా కల్పించడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతోంది. రైతులే శాస్త్రవేత్తలుగా ఆయా వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు అక్కడక్కడా ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.
పన్ను వసూళ్లకు యత్నాలు
అసలే వ్యాధులు, ప్రతికూలవాతావరణంతో సతమతమవుతున్న రైతులకు సహాయసహకారాలు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా యత్నాలు సాగించడం లేదు. పెపైచ్చు ఆక్వా రంగంపై పన్ను విధించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆక్వా జోన్లను ఏర్పాటు చేసి చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి భారీగా అనుమతులు మంజూరు చేసేందుకు యత్నిస్తోంది. తదనంతర చర్యగా రొయ్య, చేపల అమ్మకంపై పన్ను, ఎక్సైజ్ సుంకం, ఇతరత్రా సవా లక్ష పనులు విధించే యోచనలో ఉంది. ఇంతవరకూ ఆహారోత్పత్తుల కేటగిరిలో చేపలు, రొయ్యల సాగు, అమ్మకాలు, ఎగుమతులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో పన్ను విధింపునకు సిద్ధపడుతున్న ప్రభుత్వం ఆక్వా రైతుల బాగోగులనూ పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు.
సకాలంలో గుర్తించాలి
ప్రస్తుతం 50శాతం చెరువుల్లో ఫంగస్, 30 శాతం చెరువుల్లో వైరస్ వ్యాధులు కనిపిస్తున్నాయి. సీడ్ దశలో ఈ వ్యాధులు సోకితే నష్టం తీవ్రంగా ఉంటుంది. రొయ్యలు ఎదిగిన తర్వాత వస్తే ప్రభావం తక్కువగా ఉంటుంది. సీడ్ దశలో సకాలంలో గుర్తిస్తేనే నివారణ సాధ్యం.
- ఎ.రవికుమార్ శాస్త్రవేత్త