తెగుళ్లకు తోడు వర్షాలు
ఖాళీ అవుతున్న చెరువులు
ఆందోళనలో సాగుదారులు
నందివాడ (కృష్ణా) వనామీ రొయ్యకు రెడ్‌స్పాట్ తెగులు రైతులను నిండా ముంచేస్తోంది. టైగర్ రొయ్యకు తెగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని మండలంలోని బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని చెరువుల్లో వనామీ రొయ్యల సాగును రైతులు చేపట్టారు. అయితే వీటికీ రెడ్ స్పాట్ రావటంతో చాలా చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు కూడా రొయ్యల సాగు రైతులను నానా ఇబ్బందులు పెడుతోంది. ఇప్పటికే రెడ్‌స్పాట్ వైరస్ వల్ల రొయ్యలు చనిపోవడంతోపాటు ఎకరాల్లో రొయ్యలను కౌంట్‌కు రాకుండానే పట్టేస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదు. ఎండలు పుష్కలంగా కాస్తూ, పొడి వాతావరణం ఉంటే కొంత వరకు రొయ్యలు ఆరోగ్యంగా ఉంటూ కాస్తా లాభాలు తీసుకువచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనపడటం లేదు. అల్పపీడనం కారణంగా వాతావరణం చల్లబడటంతో వ్యాధి తీవ్రత పెరిగి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో రైతులకు అపారనష్టం జరుగుతోంది. వేసిన పది రోజులకే వైరస్ మండలంలోని ఎల్.ఎన్ పురం, పోలుకొండ, రుద్రపాక, కుదరవల్లి, పెదలింగాల, చినలింగాల,
నందివాడ గ్రామాల్లో రొయ్య పిల్ల వేసిన 10 రోజులకే చెరువులు వైరస్ బారిన పడుతున్నాయి. పూర్తి స్థాయి కౌంట్‌కు రాకుండానే రొయ్య వైరస్ బారిన పడుతోంది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులయినా వస్తాయని భావించి ముందుగానే పట్టి అయినకాడికి అమ్ముకుంటున్నారు. పట్టుబడి పడుతున్న చెరువుల్లో 60 నుంచి 70 కౌంట్ కూడా ఉండడం లేదు. దీంతో తీవ్ర నష్టం రైతులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రొయ్య 40 కౌంట్ ధర రూ.400 వరకూ ఉండడంతో 40 కౌంట్ పట్టిన కొందరు రైతులు ఒక మోస్తరుగా గట్టెక్కుతున్నారు. వనామీ రొయ్య వ్యాధులను తట్టుకుంటుందన్న ఆక్వా టెక్నీషియన్ సూచనలతో దీన్ని సాగు చేసి నష్టాలు చూస్తున్నట్లు ఆక్వా రైతులు వాపోతున్నారు. రెడ్‌స్పాట్ వైరస్ నుంచి రొయ్యలను కాపాడుకోవటం కోసం ఏరియేటర్స్ వినియోగిస్తున్నారు. ఈ చర్యల వలన వైరస్ నుంచి కొంత వరకూ రొయ్యను కాపాడుకోవటానికి అవకాశం ఉంటుందని టెక్నీషియన్లు చెబుతున్నారు. ఇలా అయితే ఆర్థిక భారం అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం రొయ్యల సాగుకు బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
రెడ్‌స్పాట్ వైరస్‌కు మందు లేదు. స్పాట్ రాకుండా ముందు చర్యలు తీసుకోవటం తప్ప వచ్చిన తరువాత మందులు వాడినా ఉపయోగం ఉండదు. స్పాట్ రాకుండా నీటిలో ఆక్సిజన్ శాతం చూసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చెరువులో ఆక్సిజన్ శాతం పెంచటం కోసం ఏరియేటర్స్ ఏర్పాటు చేయక తప్పదు. రెడ్‌స్పాట్ వస్తే వెంటనే పట్టుకోవటం మంచిది. ఇలా చేయటం వలన రైతులకు ఎంతో కొంత నష్టం తగ్గుతుంది. నందివాడ మండలంలో ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో వనామీ సాగు చేశారు. అయితే ఇప్పటికే చాలా గ్రామాల్లో చెరువులు దెబ్బతిన్నాయి. చాలా మంది రొయ్యల సాగు మానేసి చేపల పిల్లల సాగు చేస్తున్నారు. బాగా నష్టపోయిన వారు చెరువులను లీజులకు ఇచ్చేసి వలస వెళ్లిపోతున్నారు.
- పి.రామకృష్ణారాజు,
మత్స్యశాఖ ఏడీఏ, కైకలూరు
వనామీ రొయ్యకు రెడ్‌స్పాట్
Published Fri, Nov 20 2015 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement
Advertisement