పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పౌల్ట్రీలో వైరస్‌తో చనిపోయిన కోళ్లను పాతిపెడుతున్న నిర్వాహకులు
అంతుచిక్కని లక్షణాలతో ప్రతి పౌల్ట్రీలో నిత్యం వేలాదిగా మృత్యువాత
ఆరోగ్యంగా ఉన్నా అంతలోనే కళ్లు తేలేసి మరణం
పౌల్ట్రీల్లో మరణాల శాతం 0.05 నుంచి 4కు పెరుగుదల ఒక కోడి మరణంతో రైతుకు రూ.300 వరకు నష్టం
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 2.65 కోట్ల కోళ్లు
నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్‌లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి.
ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం
అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది.
ఊహించని రీతిలో మరణాలు
సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్‌డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది.
కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు.
బర్డ్‌ఫ్లూ తరహాలోనే..
బర్డ్‌ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది.
గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పతనమవుతున్న గుడ్డు ధర
శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్‌లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది.
స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ
కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్‌చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్‌డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ముందుజాగ్రత్తలే నివారణ
కోళ్లకు సోకుతున్న వైరస్‌లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి.
– చరణ్, పశువైద్యాధికారి, పెరవలి
Comments
Please login to add a commentAdd a comment