broiler chickens
-
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్‌తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్‌ఫ్లూ తరహాలోనే.. బర్డ్‌ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్‌ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్‌లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
చికెన్ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్ లాక్డౌన్?
ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కార్పొరేట్ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్డౌన్ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్డౌన్ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చదవండి👉🏼 రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం మార్కెట్‌పై పట్టు సాధించి.. గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి. చికెన్ ధర రూ.300 దాటినా.. మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడి, బ్రాయిలర్ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్డౌన్ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్ల ఖర్చు, విద్యుత్ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. ఖాళీగా ఫారాలు ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్డౌన్ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు బ్రాయిలర్ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి గ్రోయింగ్ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, ఊక, విద్యుత్ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ సరిపోవడం లేదు. – యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం లాక్డౌన్ తప్పదు 10 వేల కోడి పిల్లల బ్యాచ్‌ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్‌కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి. – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల చదవండి👇 క్వింటాల్ పసుపు రూ. 6,850 ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి -
కోళ్లకు కొరత!
సాక్షి, అమరావతి బ్యూరో: వైరస్ భయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని ఫౌల్ట్రీ రైతులు తగ్గించడంతో.. మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దీంతో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న చికెన్(స్కిన్లెస్) కిలో ధర రూ.200 ఉండగా.. ఇప్పుడది రూ.300 దగ్గరకు చేరుకుంది. స్థానిక పౌల్ట్రీల నుంచి రోజూ మూడు లక్షల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కోళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్ కోళ్లు లభ్యం కాక ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వరరావు(నాని) ‘సాక్షి’కి చెప్పారు. -
రెండు వేల కోళ్ల సజీవ సమాధి
చెన్నారావుపేట: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన చాపర్తి రాజు 25 రోజుల క్రితం సహకార సంఘం పరిధిలోని కోళ్ల షెడ్డు కిరాయికి తీసుకొని బ్రాయిలర్ కోళ్లను పెంచుతున్నాడు. కోవిడ్ దెబ్బకు కోడి మాంసానికి డిమాండ్ పడిపోయింది. దీంతో రాజు మంగళవారం ప్రజలకు ఉచితంగా కోళ్లను పంపిణీ చేశాడు. మరో 2వేలకు పైగా కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టాడు. -
విద్యుత్ కోతలతో ప్రత్యక్ష నరకం
అర్ధరాత్రివేళా గంటల తరబడి కోతలు అల్లాడుతున్న పిల్లలు, వృద్ధులు, మహిళలు నిద్రలేమితో అవస్థలు పడుతున్న ప్రజలు పనులు లేక అల్లాడుతున్న మెకానిక్‌లు కోళ్లఫారాల్లో చనిపోతున్న బ్రాయిలర్ కోళ్లు ఉత్పత్తి తగ్గడం వల్లే కోతలంటున్న అధికారులు చల్లపల్లి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు జిల్లా ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. గత నాలుగురోజుల నుంచి రాత్రి వేళలో గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో ప్రజల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. పగలు ఎండ వేడిమి వల్ల వచ్చే వేడిగాలులకు, రాత్రి వేళలో కరెంట్‌లేక దోమలతో మహిళలు, పిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు. గతంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో వారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్‌కోత విధించేవారు. గత పది రోజులుగా పగలు విద్యుత్‌కోతను పెంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కోతలు విధిస్తుండటంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒకరోజు రాత్రి 9.30 నుంచి 11.30 వరకు, అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ తీసేస్తుండటంతో ఉక్కపోత, దోమలతో చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి విద్యుత్‌కోత వల్ల నిద్రలేమితో పలువురు రోగాలబారిన కూడా పడుతున్నారు. చనిపోతున్న కోళ్లు... జిల్లాలో గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీలకు పెరగడంతో పలు ప్రాంతాల్లో కోళ్లఫారాల్లోని బ్రాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లపై నీళ్లు చల్లుతూ ఎండవేడిమి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కోళ్లఫారాల కప్పుపై వరిగడ్డి కప్పి నీళ్లు చల్లుతున్నారు. పనులు లేక అల్లాడుతున్న మెకానిక్‌లు... పగటివేళల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్‌కోతలు విధించడం వల్ల వ్యాపారాలు జరగడం లేదని పలువురు మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌పై ఆధారపడి నిర్వహించే రేడియో, టీవీ, ఫ్యాన్లు, కూలర్లు, సెల్ఫోన్లు మరమ్మతు చేసేవారికి వ్యాపారాలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాపారాలను మూసేస్తున్నారు. కరెంట్ కోత వల్ల వ్యాపారాలు పడిపోయాయని, అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని పలువురు వ్యాపారులు, మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పగటి వేళ నిర్దేశిత సమయంలోనే విద్యుత్‌కోత విధించడంతో పాటు రాత్రివేళలో విద్యుత్‌కోతను ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు.