విద్యుత్ కోతలతో ప్రత్యక్ష నరకం
- అర్ధరాత్రివేళా గంటల తరబడి కోతలు
- అల్లాడుతున్న పిల్లలు, వృద్ధులు, మహిళలు
- నిద్రలేమితో అవస్థలు పడుతున్న ప్రజలు
- పనులు లేక అల్లాడుతున్న మెకానిక్‌లు
- కోళ్లఫారాల్లో చనిపోతున్న బ్రాయిలర్ కోళ్లు
- ఉత్పత్తి తగ్గడం వల్లే కోతలంటున్న అధికారులు
చల్లపల్లి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు జిల్లా ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. గత నాలుగురోజుల నుంచి రాత్రి వేళలో గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో ప్రజల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. పగలు ఎండ వేడిమి వల్ల వచ్చే వేడిగాలులకు, రాత్రి వేళలో కరెంట్‌లేక దోమలతో మహిళలు, పిల్లలు, వృద్ధులు నరకయాతన పడుతున్నారు.
గతంలో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరో వారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్‌కోత విధించేవారు. గత పది రోజులుగా పగలు విద్యుత్‌కోతను పెంచేశారు.
ఎప్పుడు పడితే అప్పుడు కోతలు విధిస్తుండటంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. ఒకరోజు రాత్రి 9.30 నుంచి 11.30 వరకు, అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ తీసేస్తుండటంతో ఉక్కపోత, దోమలతో చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. గత నాలుగు రోజుల నుంచి విద్యుత్‌కోత వల్ల నిద్రలేమితో పలువురు రోగాలబారిన కూడా పడుతున్నారు.
చనిపోతున్న కోళ్లు...
జిల్లాలో గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 37 డిగ్రీల నుంచి 41 డిగ్రీలకు పెరగడంతో పలు ప్రాంతాల్లో కోళ్లఫారాల్లోని బ్రాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. దీంతో కోళ్ల ఫారాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోళ్లపై నీళ్లు చల్లుతూ ఎండవేడిమి నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కోళ్లఫారాల కప్పుపై వరిగడ్డి కప్పి నీళ్లు చల్లుతున్నారు.
పనులు లేక అల్లాడుతున్న మెకానిక్‌లు...
పగటివేళల్లో ఇష్టారాజ్యంగా విద్యుత్‌కోతలు విధించడం వల్ల వ్యాపారాలు జరగడం లేదని పలువురు మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌పై ఆధారపడి నిర్వహించే రేడియో, టీవీ, ఫ్యాన్లు, కూలర్లు, సెల్‌ఫోన్లు మరమ్మతు చేసేవారికి వ్యాపారాలు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాపారాలను మూసేస్తున్నారు. కరెంట్ కోత వల్ల వ్యాపారాలు పడిపోయాయని, అద్దెలు చెల్లించే పరిస్థితి కూడా లేదని పలువురు వ్యాపారులు, మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పగటి వేళ నిర్దేశిత సమయంలోనే విద్యుత్‌కోత విధించడంతో పాటు రాత్రివేళలో విద్యుత్‌కోతను ఎత్తివేయాలని ప్రజలు కోరుతున్నారు.