హై అలర్ట్‌.. చికెన్‌ తినడం తగ్గించాలి.. ఆ జిల్లాలో రెడ్‌జోన్‌ | First Bird Flu Case Detected In East Godavari, Established Red Zone And Officials Issued Warning To People | Sakshi
Sakshi News home page

హై అలర్ట్‌.. చికెన్‌ తినడం తగ్గించాలి.. ఆ జిల్లాలో రెడ్‌జోన్‌

Published Tue, Feb 11 2025 12:19 PM | Last Updated on Tue, Feb 11 2025 1:19 PM

First Bird Flu Case Detected In East Godavari

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్‌గా ల్యాబ్‌లో నిర్ధారణ అయ్యింది. కానూరు పది కిలోమీటర్ల పరిధిలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వై లెన్స్ జోన్‌ ఏర్పాటు చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నివారణ, నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు.

కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు సూచించారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్(95429 08025) ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్‌.. చివరకు కోళ్లఫారాలనే చుట్టేసింది. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 30 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్క నిడదవోలు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అప్రమత్తమైన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ.. నివారణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యాని­మ­ల్‌ డిసీజెస్‌(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపింది.

Bird Flu : చికెన్ తినకండి

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చి­మగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్‌ ఇన్‌ఫ్లూయింజ్‌(హెచ్‌5ఎన్‌1)గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్‌ ల్యాబ్‌ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌కు అందించారు.

వైరస్‌ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్‌ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement