- సంక్రాంతి వేళ గుర్తుకు వచ్చేవి ఇక్కడి అతిథి మర్యాదలే
- కొత్తగా పెళ్లయిన ఇంట పెద్ద పండుగే
- సంక్రాంతికి ఇంటికొచ్చే అల్లుడికి అబ్బురపర్చే స్వాగత ఏర్పాట్లు
- రకరకాల వంటకాలతో విందు భోజనాలు
సాక్షి, భీమవరం: సినిమా షూటింగ్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం(Bhimavaram) వచ్చిన ప్రముఖ సినీనటుడు వీరమాచనేని జగపతిబాబు ఇక్కడి ఆతిథ్యం గురించి పోస్టు చేసిన వీడియో చాలానే వైరల్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నన్నాళ్లూ ఓ అభిమాని ప్రతిరోజూ రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తనకు విందు భోజనం పంపారని చెప్పుకొచ్చారు. వాటిని చూపిస్తూ ‘బకాసురుడిలా తింటాను.. కుంభకర్ణుడిలా పడుకుంటా’నంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు గోదావరి జిల్లాల(Godavari Districts) ఆతిథ్యాన్ని ఎన్నో వేదికలపై గుర్తుచేసుకున్న సందర్భాలెన్నో..
ఆయ్.. అండి.. రండీ
భాషలో ‘ఆయ్..’ అనే యాస ఉన్నా.. మాటనిండా మమకారమే దాగి ఉంటుంది. దారి చెప్పమంటే నేరుగా ఇంటికే తీసుకెళ్లేంత మర్యాద ఉంటుంది. తిండి పెట్టి చంపేస్తారన్నది నానుడైతే.. పెట్టుపోతలతో మైమరచిపోయేలా చేయడం వీరి నైజం. అడుగడుగునా వెటకారమే అనిపించినా.. అణువణువునా ఆప్యాయతే కనిపిస్తుంది. అరమరికలు లేని వ్యక్తిత్వాలు.. అబ్బురపరిచే సంప్రదాయాలు.. గోదావరి వాసుల పడికట్లు. అందుకే.. గోదారోళ్ల పిల్లను చేసుకోవడానికి ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. గోదారోళ్ల ఆతిథ్యం చూడాలంటే వారి ఇంటి అమ్మాయిని వివాహమాడాల్సిందే. పెళ్లిచూపులు లగాయితు అప్పగింతల వరకు అడుగడుగునా వారి అతిథి మర్యాదలు, సంప్రదాయాలు అబ్బురపరుస్తాయి.
సంక్రాంతి వస్తోందంటే
సంక్రాంతి(Sankranti Festival) వస్తోందంటే గోదావరి మర్యాదలే గుర్తొస్తాయి. ఎక్కడెక్కడో ఉన్న బంధువులను పండక్కి వారం ముందే రమ్మని పిలిచి.. ఉన్నన్ని రోజులూ వారికి ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు గుమ్మం వద్దే చెంబులతో చేతికి నీళ్లందించి కాళ్లు కడుక్కోమని మర్యాదలు చేస్తారు. చేతులు తుడుచుకోవడానికి భుజాలపై తుండు (టవల్) అందిస్తారు. ప్రయాణం బాగా సాగిందా అంటూ మనసు నిండా అభిమానంతో స్వాగతం పలుకుతారు. కోడి పందేలు, జాతరలు, సినిమాలు, పల్లె అందాలను తిప్పి చూపిస్తుంటారు. సరదా పడాలే గానీ తాటికల్లు రుచి చూపిస్తారు. ఉన్నన్ని రోజులూ నచ్చిన వంటకాలను వండి వారుస్తుంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే అరిటాకులో విందు భోజనం చేస్తుంటారు.
అత్తల హడావుడి అంతాఇంతా కాదు
కొత్త అల్లుడు మొదటిసారిగా పండుగకు ఇంటికి వచ్చే అల్లుళ్ల కోసం పల్లెల్లో అత్తలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, పోకుండలు, గోరుమిటీలు వంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తుంటారు. తలుపు చాటున నిల్చుని అల్లుడు గారికి అవి పెట్టు.. ఇవి పెట్టు అంటూ కూతురికి చెబుతూ అత్తలు సంబరపడిపోయే దృశ్యాలు అనేకం. తామేమీ తక్కువ కాదన్నట్టు కొంటె మరదళ్లు గాజులతో గారెలు.. గోళీలతో పొంగడాలు.. ఘాటైన మిరపకాయలతో బజ్జీలు చేసి బావలను ఆట పట్టించడం ఇక్కడ షరా మామూలే.
వియ్యపురాలా.. నీవొచ్చెవేళ
కొందరు అల్లుడితో పాటు వియ్యపురాలిని సైతం ఇంటికి ఆహ్వానించి కానుకలు, కొత్త దుస్తులు అందిస్తారు. వియ్యపురాలు సైతం వస్తూవస్తూ ఇంటిల్లిపాదికీ కొత్త దుస్తులు తెచ్చి ఇవ్వడం ఇక్కడి ఆచారం. తద్వారా ఇరు కుటుంబాల మధ్య బంధాలు బలపడతాయని గోదారోళ్ల నమ్మకం. పండుగలు ముగిసి స్వస్థలాలకు తిరిగి వెళ్లే బంధువులకు ఇంటిలో చేసిన పిండివంటలను ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీధి చివరి దాకా వచ్చి వీడ్కోలు చెబుతూ వచ్చే ఏడాది ముందుగానే రావాలంటూ మాట తీసుకుని మరీ సాగనంపడం గోదారోళ్ల ప్రత్యేకత.
కొత్త అల్లుడికి గుర్తుండిపోయేలా..
సంక్రాంతి వస్తోందంటే కొత్తగా పెళ్లయిన ఇళ్లల్లో సందడికి అంతే ఉండదు. తమ స్తోమతకు తగ్గట్టుగా అల్లుడికి తొలి పండుగ కలకాలం గుర్తుండిపోయేలా అత్తింటి వారు మర్యాదలు చేస్తారు. వినూత్న రీతిలో అల్లుడికి స్వాగతం పలుకుతారు. విందులో ఎన్నెన్నో (కొందరైతే వందకు పైగా) వంటకాలను వడ్డించి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. గత ఏడాది భీమవరానికి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంబం తమ అల్లుడికి ఏకంగా 173 రకాల వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరో కుటుంబం వారు తమకు కాబోయే అల్లుడికి వంద రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. పండక్కి మొదటిసారి వస్తున్న అల్లుడిని భీమవరానికి చెందిన అత్తింటివారు డోలు, సన్నాయి మేళంతో ఎడ్ల బండిపై ఊరేగిస్తూ ఇంటికి ఆహ్వానించారు. భారతదేశం మ్యాప్‌పై దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన 29 వంటకాలతో అల్లుడికి విందు ఏర్పాటు చేసి అబ్బురపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment