మనసులు కలిపే వంతెన.. | Iconic Godavari Road Cum Railway Bridge Completes 50 Years | Sakshi
Sakshi News home page

Road Cum Railway Bridge: మనసులు కలిపే వంతెన..

Published Sun, Dec 1 2024 7:51 AM | Last Updated on Sun, Dec 1 2024 6:31 PM

Iconic Godavari Road Cum Railway Bridge Completes 50 Years

రాజమండ్రి గోదారి బ్రిడ్జికి యాభయ్యేళ్ళు

యాండే.. గోదారి బ్రిడ్జి ఎప్పుడు వస్తుందండీ పడుచుపిల్ల ఉత్సాహంగా అడిగింది.. లేదే  లక్ష్మి రాగానే చెప్తాను నువ్ కాస్త పడుకో.. ఓహ్.. ఇంకా టైముందా... సరే రాగానే మర్చిపోకు మరి అంటూ అటు తిరిగింది అమ్మాయి.. ఇంకో పాతికేళ్ల కుర్రాడు పై బెర్త్ నుంచి కిందికి చూస్తూ రాయమండ్రి బిర్జి వచ్చేహిందా అన్నాడు.. లేదండీ.. బండింకా సామాల్కోట దాట్లేదు .. ఇంకా టైముంది అన్నాడు కిందిబెర్త్ అంకుల్.. ఓహో.. ఐతే రైల్ బ్రిడ్జి మీదకు ఎంటరవగానే చెప్పండే అంటూ కుర్రాడు మళ్ళీ ఫోన్లో బుర్ర దూర్చేసాడు. ఓలమ్మి.. రామండ్రి గోదారి బ్రిడ్జి వచ్చిండేటి అంది వరాలమ్మ..  లేదమ్మమ్మా.. ఇంకా రానేదు.. వచ్చినప్పుడు దడదడదడ సప్పుడొస్తది.. అందరికి తెలుస్తాదిలే.. నేను లేపుతాను నువ్వు తొంగోయే అని చెప్తోంది మనవరాలు మంగ... ఐడ్రాబాడ్ .. విశాపట్నం.. లేదా ఇసాపట్నం మద్రాస్.. ఈరూట్లో వెళ్ళేవాళ్ళకు గోదారి బ్రిడ్జి ఒక ఎమోషన్. 

ఒక బంధం.. అంతవరకూ నిప్పులుగక్కుతూ యుద్ధానికి వెళ్తున్న వైజయంతి యుద్ధ ట్యాంక్ మాదిరిగా దూసుకెళ్లే రైళ్లన్నీ గోదారిని చూడగానే.. ఎక్కడలేని సిగ్గును పులుముకున్న పడుచుపిల్ల పెళ్ళిచూపుల్లో నడిచినట్లు వగలుపోతూ స్లో అయిపోతాయి. అక్కడికి వచ్చేసరికి అడుగులు తడబడినట్లు.. అడుగులో అడుగేసినట్లు.. వాలుజడ ఊగినట్లు.. జడలోని మల్లెలు నవ్వినట్లు.. అంత సొగసుగా నడుస్తుంది ట్రైన్ అదంతే .. గోదారి.. దానిమీద వంతెన.. ఈ దక్షిణభారతంలోనే ఒక ఐకానిక్ నిర్మాణం...

అది కేవలం తూర్పు.. పశ్చిమ గోదావరి జిలాలలను మాత్రమే కలిపే వంతెన కాదండి.. ఎన్నో మనసులతో ముడేసుకున్న బంధం.. కాదనుకున్నా వెంటాడే అనుబంధం. 1964 లో మూడో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది. 1974లో వంతెన నిర్మాణం పూర్తవగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దాన్ని జాతికి అంకితం చేసారు. ఆ మహా మహా నిర్మాణం ప్రారంభోత్సవాన్ని అప్పటి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని నిర్మాణంతో రాజమండ్రి, కొవ్వూరు మధ్య లాంచీల ప్రయాణం స్థానే బస్సులను నడపడం మొదలైంది. రెండు గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సులువయ్యాయి.  ఈ ఏడాదితో గోదారి రైల్. రోడ్ బ్రిడ్జికి యాభయ్యేళ్ళు నిండాయి..

ఇక ఈ మార్గంలో ట్రైన్ మీదుగా ప్రయాణించే కోట్లాదిమందికి ఈ వంతెన మీదుగా ట్రైన్ నడవడం.. దాన్ని కిటికీలోంచి చూడడం ఒక అద్భుత భావన. ఒరేయ్.. బుడ్డోడా.. గోదారొచ్చింది.. చిల్లర పైసలు ఉంటే ఇవ్వరా అంటూ తీసుకుని కిటికీలోంచి గోదారమ్మకు దక్షిణ సమర్పించి ఒక దండం పెట్టుకుని సంతృప్తి పడని జీవులు లేనట్లే లెక్క. రాత్రి పూలతో బెర్త్ మీద నిద్దరోయి తెల్లారి వాటిని బయటపడేయకుండా గోదారి వచ్చేవరకూ ప్రేమగా చేతిలో పట్టుకుని కూర్చునే నవవధువులు.. సాయం సంధ్యవేళ దూరంగా కొండల్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆదిత్యుని.. గోదారిని కలిపి చూడడం.. అందులోని భావుకత్వాన్ని ఆనందించడం కవులకే సాధ్యం.. అమ్మా కిందికి చూడు ఎన్ని బోట్లో... అంటూ ముద్దుముద్దుగా చెబుతున్న పిల్లాడిని దగ్గరకు పొదుముకుంటూ అవున్నన్నా గోదారిలో అన్నీ ఉంటాయి.. వాళ్లంతా చేపలు పడుతున్నారు అని వివరించే తల్లి. బ్రిడ్జి రాగానే... నోట్లో నీళ్లూరుతుండగా యాండే ఈ సీజన్లో గోదారిలో పులస దొరుకుతుందండీ... అది పులుసూపెట్టుకుని మర్నాడు తింటే ఉంటుందండీ అని వివరించే ఇంకో ఫుడీ నేరేషన్.. ఇంకో లెవెల్..

ఇలా గోదావరి వంతెన కేవలం ఒక నది మీద కట్టిన ఇనుప నిర్మాణం కాదండి.. అందులో బంధం.. ఆత్మీయత.. ఒక తీయని అనుభూతి.. ఇలా చెబుతూ వెళ్తే ఇంకెంతైనా రాయొచ్చు..
- సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement