సమీపిస్తున్నవేసవి
కొబ్బరి బొండాల అమ్మకాలపై రైతులు, వ్యాపారుల భారీ ఆశలు
ప్రస్తుతం రైతు ధర రూ.12
కొబ్బరికాయ ధర రూ.15
సాక్షి, అమలాపురం: మండు వేసవిలో దాహం తీర్చాలన్నా, వేడెక్కిన శరీరాన్ని చల్లబరచాలన్నా, అనారోగ్యం బారిన పడితే త్వరగా కోలుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండాం. కొనుగోలుచేసేవారికే కాదు.. ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది అమృత బాండమే. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధరలు నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో కొబ్బరి రైతులు (Coconut Farmers) ఇదే తమకు మేలని భావిస్తుంటారు. వేసవి సమీపిస్తుండటంతో బొండాల ధరలపైన, ఎగుమతులపైన రైతులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు.
కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్‌లు అధికంగా ఉంటాయి. ఒక కొబ్బరి బొండాం (Coconut) ఒక సెలైన్‌తో సమానం. బొండాంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా సోడియంను ఇది అందిస్తుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్షణం శక్తిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో బొండాం తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు పెరిగాయి.
మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కొబ్బరి బొండాలకు ఒకప్పుడు వేసవి (Summer) మాత్రమే సీజన్‌గా ఉండేది. ఇప్పుడు ఏడాది పొడవునా ఎగుమతులు జరుగుతున్నాయి.
ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాగల్లు, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, తుని పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది.
ప్రస్తుతం రోజుకు 50 లారీలకు పైగా ఎగుమతి అవుతుండగా, వేసవి సీజన్‌లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్కో కొబ్బరి బొండాం ధర రూ. 12 పలుకుతోంది. కొబ్బరి కాయ ధర రూ. 14 నుంచి రూ. 15 పలుకుతోంది. దీని వల్ల బొండాం అమ్మకాలకన్నా రైతులు కాయపై దృష్టి పెట్టారు. సాధారణంగా కొబ్బరి కాయ కన్నా బొండాం ధర రూ.4 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటుంది.
చదవండి: పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
» మార్చి నుంచి కొబ్బరి బొండాలకు వేసవి సీజన్ మొదలవుతుంది. కొబ్బరి కాయకు ఇప్పుడున్న ధర మరికొద్దిరోజులు ఉంటే బొండాం ధర రూ.18 నుంచి రూ.20 వరకు చేరుతుంది. కాని దిగుబడి అధికంగా ఉండటం వల్ల బొండానికి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
» కాయతో పోల్చుకుంటే బొండాం అమ్మకాలే రైతులకు లాభసాటిగా ఉంటాయి. బొండాం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే కొబ్బరికాయ పక్వానికి రావడానికి సుమారు 12 నెలలు పడుతుంది. కాయతో పోల్చితే బొండాల వల్ల రైతులు త్వరితగతిన ఉత్పత్తి అందుకుంటారు.
» కొబ్బరి కాయ రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రెండు రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే బొండాలను వ్యాపారులే సొంత ఖర్చులు పెట్టుకుని దింపించుకుంటారు. దీంతో రైతులకు సేకరణ ఖర్చు తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment