Coconut farmers
-
సహకరిస్తే సాగు.. విస్మరిస్తే ఉద్యమం
సాక్షి, అమలాపురం: ‘కొబ్బరి మార్కెటింగ్‌లో మాకు ఎదురవుతున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సాగుబాట పడతాం. కాదని వాటిని విస్మరిస్తే ఉద్యమ బాట పడతాం’ అని అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సులో రైతులు తేలి్చచెప్పారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో అమలాపురంలో రెండు రోజుల అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు రెండవ రోజైన బుధవారం పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యల పరిష్కారం కోసం కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తామని సభలో వక్తలు ప్రకటించారు. సదస్సు అధ్యక్షుడు, బీకేఎస్ ఆలిండియా కోకోనట్ కనీ్వనర్ సుందరరాజన్ మాట్లాడుతూ.. కొబ్బరి సాగులో సమస్యలను తెలుసుకునేందుకు.. వాటి పరిష్కారాల కోసం జాతీయ స్థాయిలో కొబ్బరి రైతుల ఫోరం ఏర్పాటు చేశామని, దీనిలో భాగంగా ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో సదస్సులు పూర్తి చేశామని తెలిపారు. బీకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో కొబ్బరి సాగు చేసే ఎనిమిది రాష్ట్రాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఆ రాష్ట్రాల రైతు ప్రతినిధులతో చర్చించాక అజెండా రూపొందించి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ.. మన సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సరే, లేకుంటే మనమంతా సంఘటితమై ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. కోనసీమ రైతులు 2011లో చేసిన సాగుసమ్మె ఉద్యమం వల్ల రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ. మూడు లక్షల వరకు పావలా వడ్డీ రుణం, సమీకృత వ్యవసాయానికి నిధులు పొందిన విషయాన్ని రైతులు గుర్తించుకోవాలని తెలిపారు. దక్షిణ భారత రైతులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.కొబ్బరి సమస్యలకు ఏఐ పరిష్కారం..కొబ్బరి బోడకాయను కేజీ రూ. 45 చేసి కొనుగోలు చేయాలని, ఎఫ్‌పీవోలు, సహకార సంఘాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేయించాలని, యాంత్రీకరణకు రాయితీలు ఇవ్వడంతో పాటు కొబ్బరి దింపు సమస్య పరిష్కారానికి ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ)లో ప్రయోగాలకు ఐఐటీ, ఇస్రో వంటి సంస్థల సహకారం తీసుకోవడం వంటి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఐక్యరాజ్య సమితి 2026ను కొబ్బరి సంవత్సరంగా గుర్తించాలని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేయాలనే తీర్మానాన్ని సైతం రైతులు ఆమోదించారు. సదస్సుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొబ్బరి ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. -
ధాన్యంలాగే కొబ్బరీనూ..
సాక్షి అమలాపురం/ అంబాజీపేట : కొబ్బరి కొనుగోలులో దళారుల వ్యవస్థను తొలగించడంతోపాటు రైతులకు రవాణా, కూలి ఖర్చుల భారం తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ధరలు తగ్గిన నేపథ్యంలో నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ఆధ్వర్యంలో శనివారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లుగానే ఈ కేంద్రాల్లో కూడా కొబ్బరి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గతంలో మార్కెట్ యార్డుల కేంద్రంగా కొబ్బరి కొనుగోలు చేయగా, ఈసారి ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో ఇలా.. గతంలో రైతులు మార్కెట్ యార్డులకు ఎండుకొబ్బరిని తీసుకువెళ్లాల్సి వచ్చేది. రోజుంతా అక్కడే కళ్లాలలో ఎండబెట్టేవారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే కొనేవారు. లేదంటే వెనక్కి తెచ్చుకోవాల్సిందే. ఇది రైతులకు నష్టాన్ని కలగజేసేది. ఒకవేళ కొనుగోలు చేసినా నాఫెడ్‌కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చుతోపాటు ఎండబెట్టడం, మూటలు కట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాల్సి వచ్చేది. ప్రస్తుతం రోజుకు కూలి ఖర్చు రూ.600లు కాగా.. యార్డు వరకు తీసుకొస్తే రూ.వెయ్యి వరకు కూలి ఇవ్వాల్సి వచ్చేది. అధికారులే కళ్లాలు వద్దకు వచ్చి నాణ్యత నిర్ధారించి, అక్కడే కొనుగోలు చేయనున్నారు. ఇలా కొన్న కొబ్బరిని రైతులే సమీపంలోని నాఫెడ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. రైతులపై ఈ భారం మాత్రమే పడనుంది. కూలి ఖర్చులు కలిసిరావడం అంటే రైతులకు క్వింటాల్‌కు రూ.500ల నుంచి రూ.800లు వరకు మిగలనుంది. రైతులే సొంతంగా ఎగుమతి చేస్తే కూలి ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ విధానంవల్ల దళారుల పాత్ర దాదాపు లేనట్లే. గతంలో ఈ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన కొబ్బరి 90 శాతం దళారులదే. ఇప్పుడు రైతులు నేరుగా లబ్ధిపొందనున్నారు. ♦ నాఫెడ్ కేంద్రాలు సేకరించిన కొబ్బరిని ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ♦ రైతులు ముందుగా ఆర్బీకేల్లో పేరు, ఇతర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేల ద్వారా కళ్లాల్లోనే కొనుగోలు.. ♦ ఎకరాకు నెలకు రెండు కొబ్బరి బస్తాల (క్వింటాల్) చొప్పున కొనుగోలుకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు రైతులకు ధ్రువీకరణ పత్రాలిస్తారు. ♦ రైతుల వివరాలతో పాటు, కొబ్బరి విక్రయాలకు సంబంధించి కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైనిస్ అండ్ ప్రొక్యూర్మెంట్ (సీఎం యాప్)లో నమోదు చేస్తారు. ♦ దీని ఆధారంగా నాఫెడ్‌కు ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉన్న ఆయిల్ ఫెడ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి కొబ్బరి కొనుగోలు చేస్తారు. సర్కారు ప్రత్యేక చొరవతో కేంద్రం అనుమతి.. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇక్కడ సగటున 106.90 కోట్ల కాయలు దిగుబడిగా వస్తాయని అంచనా. తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి పోటీవల్ల ఉత్తరాదికి ఎగుమతులు క్షీణించడంతో కొబ్బరి ఉత్పత్తుల ధరలు తగ్గాయి. వెయ్యి కాయల ధర రూ.7 వేలు ఉంది. ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకొచ్చింది. జిల్లాలో తొలుత అంబాజీపేటలోను, తరువాత కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ముమ్మిడివరం, తాటిపాక, రావులపాలెం, నగరం మార్కెట్ యార్డుల్లో వీటిని ప్రారంభించనున్నారు. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి)ని క్వింటాల్‌కు రూ.10,860లు, బాల్‌కోప్రా (కురిడీ కొబ్బరి గుడ్డు) క్వింటాల్ రూ.11,750 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఎండు కొబ్బరి ధర రూ.8 వేలు, కురిడీ కొబ్బరి గుడ్డు రూ.తొమ్మిది వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. ఈ కేంద్రాల ఏర్పాటువల్ల బహిరంగ మార్కెట్లో కొబ్బరికాయకు ధర వస్తోందని, స్థానికంగా నిల్వ ఉన్న కొబ్బరి మార్కెట్‌కు వెళ్తే వచ్చే దసరా, దీపావళికి డిమాండ్ వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. షెడ్యూలు ప్రకారం కొనుగోలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీకే స్థాయిలో కొబ్బరి కొనుగోలు చేస్తాం. రైతులు మార్కెట్ యార్డుల వద్దకు వచ్చి కొబ్బరి ఎండబెట్టి అమ్మకాలు చేయాల్సిన అవసరం ఉండదు. మేం కొనుగోలు చేసిన తరువాత సమీపంలో యార్డుకు తరలిస్తే సరిపోతోంది. సీఎం యాప్‌లో నమోదును బట్టి ఆయా ఆర్బీకేలకు ఒక షెడ్యూలు పెట్టుకుని కొబ్బరి కొనుగోలు చేస్తాం.– యు. సుధాకరరావు, మేనేజర్, ఆయిల్‌ఫెడ్ -
World Coconut Day: రైతుకు సిరి.. ఉపాధికి ఊపిరి
సాక్షి అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం): కొబ్బరి అనగానే కోనసీమ గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, సుమారు 93 వేల ఎకరాలకు పైగా కోనసీమలోనే ఉంది. 70 వేల మందికిపైగా రైతులు కొబ్బరి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యాన పంటల్లో ఒకటిగా... నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే పంటగా పేరొందింది. అంతేకాదు కొబ్బరి నుంచి సుమారు 160 రకాలకు పైగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇంత విలువైన బంగారు పంటపై రైతులే కాకుండా దింపు, వలుపు, తరుగు కార్మికులుగా, మోత, రవాణా కూలీలుగా వేలాది మంది జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు ఐదు వేల మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్నారు. కాయర్ ఉత్పత్తి పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుండగా, కూలీలుగానే కాకుండా పీచుతో కళాత్మక ఉత్పత్తుల తయారీతో మహిళలు జీవనం సాగిస్తున్నారు. కొబ్బరి ఎగుమతి, దిగుమతుల చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు దళారులు, ట్రాన్స్‌పోర్టు యాజమానులు ఇలా వేలాది మంది ఉపాధికి కొబ్బరి ఊపిరిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నారికేళంతో వివిధ వర్గాల జీవనం పెనవేసుకుపోయిన తీరుపై కథనం... చిన్ననాటి నుంచి అనుబంధం కొబ్బరితో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. మా కొబ్బరి తోటల్లో ఇంచుమించు ప్రతీ చెట్టు చిన్నప్పుడు నేను సేకరించి విత్తనాల నుంచి మొలక వచ్చినదే. అందుకే వీటితో నాకు సొంత పిల్లలతో ఉన్నంత అనుబంధం ఉంది. బహుశా అందుకేనేమో పెద్దలు కొబ్బరి చెట్టును కన్న కొడుకుతో పోలుస్తారు. 1960ల నుంచి కోనసీమలో కొబ్బరిసాగు బాగా పెరిగింది. మా లంక గ్రామాల్లో ఇది 1980 నుంచి ఆరంభమైంది. – గోదాశి నాగేశ్వరరావు, కొబ్బరి రైతు, లంకాఫ్ ఠాన్నేల్లంక మాది నాలుగవ తరం కురిడీ వ్యాపారంలో మాది నాలుగవ తరం. 60 ఏళ్లకు పైగా మా కుటుంబం ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ వ్యాపారాన్ని ఇష్టపడి చేయాలని, నిజాయితీగా ఉండాలని మా పెద్దలు చెప్పేవారు. దేశంలో కురిడీ వ్యాపారంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటే దీని వల్లే. వ్యాపారం కన్నా ముందు రైతులుగా కొబ్బరి చెట్టును ప్రేమిస్తాం. బహుశా దాని వల్లనేమో కొబ్బరి మా జీవితాల్లో ఇంతగా కలిసిపోయింది. మా తరువాత తరం కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. – అప్పన బాలాజీ, కురిడీ కొబ్బరి వ్యాపారి, మాచవరం, అంబాజీపేట మండలం మూడున్నర దశాబ్దాలుగా ఆయిల్ వ్యాపారం మాది కొబ్బరి నూనె వ్యాపారం. మూడున్నర దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నాం. అంబాజీపేటలో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో మాది ఒకటిగా పేరొచ్చింది. గతంలో రైతులు కొబ్బరి ఎండబెట్టి సొంతంగా ఆయిల్ తయారు చేయించుకునేవారు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే మా పిల్లలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. – గెల్లి నాగేశ్వరరావు, కొబ్బరి నూనె వ్యాపారి, అంబాజీపేట 60 ఏళ్లుగా ఇక్కడే రాజస్థాన్‌లోని నాగూర్ మాది. మా తండ్రితోపాటు మా కుటుంబ సభ్యులు 60 ఏళ్లకు ముందే ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాం. అప్పుడు నా వయస్సు రెండేళ్లు. తొలి నుంచి మాది కొబ్బరి కమీషన్ వ్యాపారం. కోనసీమ కొబ్బరి ఉత్తరాదికి పంపడంలో మా కుటుంబం కీలకంగా ఉండేది. అన్నదమ్ములమంతా ఇక్కడ కమీషన్ వ్యాపారం చేసేవాళ్లం. 1980 నుంచి 1996 వరకు కోనసీమ కొబ్బరి దేశీయ మార్కెట్లో ఉజ్వలంగా ఎదిగింది. తుపాను వచ్చిన తరువాత బాగా దెబ్బతింది. ఇప్పటికీ కమీషన్ వ్యాపారం జరుగుతున్నా అంతగా లేదు. – సంపత్ కుమార్ ఫారిక్, కొబ్బరి కమీషన్ వ్యాపారి, అంబాజీపేట కొబ్బరి వలుపే జీవనాధారం ఇప్పుడు నా వయస్సు 49. నా పదిహేనవ ఏట నుంచి కొబ్బరి వలువులో జీవనోపాధి పొందుతున్నాను. ఈ పని తప్ప మరొకటి రాదు. కుటుంబాన్ని పెంచి పోషించింది కూడా ఈ వృత్తిలోనే. నేనే కాదు చాలామంది మా వలుపు కార్మికులకు మరోపని రాదు. ఇన్నేళ్లుగా కొబ్బరితోనే మా జీవనం సాగిపోతోంది. – విప్పర్తి సత్యనారాయణ (బంగారి), పోతాయిలంక, అంబాజీపేట మండలం పరాయి రాష్ట్రమైనా కొబ్బరే ఆధారం మాకు స్థానికంగా పనులు లేక తమిళనాడులోని కాంగేయం వెళ్లిపోయాం. పరాయి రాష్ట్రానికి వెళ్లినా జీవనోపాధికి కొబ్బరి మీదనే ఆధారపడాల్సి వస్తోంది. నేను గడిచిన ఆరు ఏళ్లుగా తమిళనాడులో ఎండు కొబ్బరి తరిగే పనిచేస్తున్నాను. – దోనిపూడి దుర్గాప్రసాద్, తరుగు కార్మికుడు -
Coconut: కొబ్బరికి కరోనా దెబ్బ
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రభావం కొబ్బరి ధరలపైనా పడింది. కొబ్బరిని ఉత్పత్తి చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో 15 రోజులుగా ధరల్లో ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కొబ్బరిని ఎక్కువగా ఉత్పత్తి చేసే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ సంకట స్థితి తలెత్తినట్టు వ్యాపార, రైతు వర్గాలు చెబుతున్నాయి. మిల్లింగ్ కొబ్బరి (డ్రై కోప్రా) కొనుగోళ్లు ప్రారంభం కానున్న తరుణంలో మిల్లింగ్ కొబ్బరి ధర తగ్గింది. కొబ్బరి గుండ్రాల (బాల్ కోప్రా) ధర మాత్రం నిలకడగా ఉంది. 15 రోజుల్లో మిల్లింగ్ కోప్రా ధర క్వింటాల్‌కి రూ.600కు పైగా తగ్గినట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో రెండు వారాల కిందట రూ.13,100 ఉన్న క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి ధర ఇప్పుడు రూ.12 వేల నుంచి రూ.12,550 మధ్య ఉంది. కొబ్బరి మార్కెట్‌కు పేరుగాంచిన కేరళ, తమిళనాడుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త కొబ్బరి మార్కెట్‌కు వస్తున్న సమయంలో ధరలు పతనం కావడం రైతుల్ని కలవరపెడుతోంది. తెల్లదోమ దెబ్బ మరువక ముందే.. ఇప్పటికే తెల్లదోమ తెగులుతో కొబ్బరి పంట బాగా దెబ్బతింది. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఇదే సమయంలో వ్యాపారులు నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల సాకుతో కొబ్బరి ధర తగ్గిస్తున్నారు. దీనికి కరోనా రెండోదశ విజృంభణ, జాతీయ, అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు తోడుకావడంతో కొబ్బరి ధర మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే నాఫెడ్ ద్వారా కొబ్బరిని కొనుగోలు చేయించాలని రైతులు కోరుతున్నారు. తగ్గిన వినియోగం.. కొబ్బరి నూనె ధర పెరుగుదలతో మార్కెట్లో అమ్మకాలు కూడా తగ్గాయని కొబ్బరి నూనె వ్యాపారి టి.సుబ్బారావు చెప్పారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇటీవలి కాలంలో కొబ్బరి నూనె వాడకం పెరిగినా ధరల పెంపుతో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా చౌకగా దొరికే నూనెల వైపు మళ్లారని పేర్కొన్నారు. అయితే కోవిడ్ మహమ్మారితో ఎగుమతి దిగుమతుల్లో ఏర్పడిన ఇబ్బందులతో అన్ని రకాల వంట నూనెల ధరలు పెరిగాయి. వర్జిన్ కోకోనట్ ఓకే.. మరోపక్క స్వచ్ఛమైన కొబ్బరి నూనె (వర్జిన్ కోకోనట్ ఆయిల్) కోవిడ్ చికిత్సకు పనికి వస్తుందని పరిశోధనల్లో తేలడంతో క్రూడ్ కోకోనట్ ఆయిల్‌కు ప్రధాన కేంద్రమైన ఫిలిప్పీన్స్‌లో ధరలు పెరిగాయి. టన్ను వర్జిన్ కోకోనట్ ఆయిల్ ధర ఈ నెలలో 1,400 డాలర్ల నుంచి 1,800 డాలర్లకు చేరింది. వియత్నాం, థాయ్‌లాండ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దాదాపు అదేవిధంగా ఉన్నట్లు ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్ తెలిపింది. నిలకడగా బాల్ కోప్రా.. బాల్ కోప్రా ధరలు మాత్రం నిలకడగానే ఉన్నాయి. కర్ణాటకలోని తిప్తూర్ మార్కెట్లో బాల్ కోప్రా క్వింటాల్ ధర రూ.15,600 నుంచి రూ.15,900 మధ్య ఉంది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం కొబ్బరిలో 39 శాతం మాత్రమే కొబ్బరిగా మారుతుంది. అది సుమారు 15 మిలియన్ టన్నులు. ఇందులో 23 శాతాన్ని ఎండు కొబ్బరిగా గృహ అవసరాలకు వినియోగిస్తారు. మిగతా 77% వంట నూనెల తయారీకి వాడతారు. -
ఈ ఏడాది కొబ్బరినామ సంవ్సతరం : కన్నబాబు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కొబ్బరి సాగు, ఆ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంపై అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రం నిర్వహించిన వెబినార్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శుక్రవారం విజయవాడ నుంచి పాల్గొన్నారు. కొబ్బరి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. కొబ్బరి నామ సంవత్సరం : డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ ఏడాది (2020–21)ని కొబ్బరి సంవత్పరంగా ప్రకటించిన నేపథ్యంలో కొబ్బరి రైతుల పట్ల ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి రైతులకు మేలు చేసేందుకు అంబాజీపేట పరిశోధన కేంద్రం ద్వారా పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రక్రియలో రైతులకు కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎంతో సహాయకారిగా నిలవనుందని చెప్పారు. (చదవండి : సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం) నాణ్యమైన పరిశోధనలు : కొబ్బరి రైతుల ఆదాయం పెరగడంతో పాటు, ఉత్పత్తిలో వారు ఇతర రాష్ట్రాల రైతలతో పోటీ పడే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం మరింత నాణ్యమైన పరిశోధనలు జరపాలని మంత్రి కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన అన్నారు. సమస్యలపై దృష్టి : గ్రామాలలో అన్ని విధాలుగా రైతులకు అండగా నిలుస్తోన్న రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) వద్ద ఉన్న వ్యవసాయ సహయకుల ద్వారా కొబ్బరి రైతుల సమస్యలను తెలుసుకోవాలని కొబ్బరి పరిశోధన కేంద్రానికి మంత్రి కన్నబాబు సూచించారు. అదే విధంగా ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపాలని ఆయన కోరారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1953లో 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం, ఇన్నేళ్లుగా రైతులకు సేవలందిస్తోందని మంత్రి ప్రశంసించారు. దశాబ్ధాలుగా సంస్థ పరిశోధనలు కొనసాగించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో అభివృద్ధి చేసిన గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో గతంలో ‘గౌతమి గంగ’ గా విడుదల చేశారని గుర్తు చేశారు.కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందుల వినియోగాన్ని ఈ పరిశోధన కేంద్రం రూపొందించగా, ఆ పద్ధతి రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని మంత్రి తెలిపారు. కొబ్బరి తోటల సాగులోనూ ఆ విధానం చౌకగానూ, సమర్ధవంతంగానూ నిల్చిందని చెప్పారు. కొబ్బరి ఉత్పత్తిలో మన స్థానం : కొబ్బరి ఉత్పత్తిలో దేశ వ్యాప్తంగా రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉండగా, కొబ్బరి ఉత్పాదకత రంగంలో తొలి స్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. కొబ్బరి ఉత్పత్తిలో కూడా రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ దిశలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేసి, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ చర్యలు : కొబ్బరిలో మేలైన రకాల ఉత్పత్తి సాధించడం, ఉత్తమ యాజమాన్యం ద్వారా దిగుబడి, నాణ్యత పెంచడంతో పాటు, కొబ్బరి రకాలకు తగిన యాజమాన్య పద్ధతులను రూపొందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. అదే విధంగా రైతులకు ఆధునిక ఉద్యాన పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జీవ నియంత్రణపై పరిశోధనలు : జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడ పీడలు, తెగుళ్ల నివారణపై పరిశోధనతో పాటు, తెల్లదోమ నివారణకు జీవ నియంత్రక శిలీంధ్రం (ఇసారియా), మిత్ర పురుగులు (ఎక్కార్సియా డైకో కైసా)పై రైతులకు అవగాహన కల్పిస్తామని వెబినార్‌లో పాల్గొన్న డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్ తెలిపారు. మిత్ర పురుగులను ఎక్కువ సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. కొబ్బరిని కొత్తగా ఆశిస్తున్న పురుగులు, తెగుళ్ళను జీవ నియంత్రణ ద్వారా సమర్ధవంతంగా నివారించే ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఈ వెబినార్‌లో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
తెల్లదోమను తట్టుకున్న కొబ్బరి తోట
కోనసీమ పొత్తిళ్లలో పంటలను రూగోస్ తెల్లదోమ చావు దెబ్బ తీస్తోంది. అమెరికా నుంచి కేరళ, తమిళనాడు మీదుగా మన రాష్ట్రంలోకి వచ్చిన ఈ కొత్తరకం తెల్లదోమ పూర్తి పేరు వలయాకారపు తెల్లదోమ లేదా సర్పిలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరలింగ్ వైట్ఫ్లై). గత ఏడాది నుంచి కొబ్బరి రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల కొబ్బరి తోటలు దీని బారిన పడి విలవిల్లాడుతున్నాయి. గాలి ద్వారా, అంటు మొక్కల ద్వారా వ్యాపించే ఈ తెల్లదోమ అంతటితో ఆగలేదు. ఆయిల్ పామ్, అరటి, మామిడి, కరివేపాకు, జామ తోటలనూ చుట్టేస్తోంది. రామాఫలం, పనస మొక్కలను, కడియం నర్సరీల్లో పూల మొక్కలను సైతం ఆశిస్తోంది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతున్నా అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రసాయనిక పురుగుమందులు వాడితే ఫలితం ఉండకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తోటల్లో బదనికలు వదలడం ద్వారా జీవనియంత్రణ పద్ధతులను అవలంబించడమే మార్గమని సూచిస్తున్నారు. అయితే, తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు అనుభవం భిన్నంగా ఉంది. తమ వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఉన్న రసాయనిక సేద్యం జరుగుతున్న తోటలన్నీ తెల్లదోమతో 100% దెబ్బతింటే.. తన చెట్లకు 10%కి మించి నష్టం జరగలేదని పచ్చగా అలరారుతున్నాయని ఆయన తెలిపారు. ఇంతకీ ఆయన విజయరహస్యం ఏమిటి? ఆ వివరాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్, అగ్నిహోత్రంతో కూడిన ప్రకృతి సేద్యమే తన తోట పచ్చగా నిలబడటానికి కారణమని తమిళనాడుకు చెందిన కొబ్బరి రైతు అరుసు సగర్వంగా చెబుతున్నారు. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి 20 కిలోమీటర్ల దూరంలో గల తన గురుకృప గ్రీన్ ఫామ్‌లో మూడు, నాలుగేళ్లుగా ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు అనుబంధంగా ఉన్న వ్యవసాయ విభాగం నిపుణులు ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో రైతులకు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తుంటారు. ఆమె అందించిన సమాచారం ప్రకారం.. అరుసు కొబ్బరి తోట పరిసరాల్లోని ఇతర కొబ్బరి తోటలను రూగోస్ తెల్లదోమ తీవ్రంగా దెబ్బతీసింది. మంగు కారణంగా ఆకులు నల్లగా మారి రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెల్లదోమ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే కొందరు రైతులు కొబ్బరి చెట్లు కొట్టేసి వరి సాగు ప్రారంభించారు. అయితే, పక్కనే ఉన్న అరుసుకు చెందిన కొబ్బరి తోట మాత్రం పచ్చగా అలరారుతోంది. ఈ తోటకు కూడా రూగోస్ తెల్లదోమ సోకింది. అయితే, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నందున నష్టం 10 శాతానికే పరిమితమైందని ఉమమహేశ్వరి తెలిపారు. అరుసు అనుసరిస్తున్న సాగు పద్ధతి అరుసు కొబ్బరి చెట్లకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడటం లేదు. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. కొబ్బరి చెట్ల మొదళ్లకు చుట్టూ ఎండు ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. చెట్ల మొదళ్లకు దూరంగా చుట్టూ గాడి తీసి నీటితో పాటు 15 రోజులకోసారి జీవామృతం ఇస్తున్నారు. పండ్లు, కూరగాయ తొక్కలను మురగబెట్టి తయారు చేసుకున్న గార్బేజ్ ఎంజైమ్‌ను లీటరుకు 100 లీటర్ల నీరు కలిపి వారానికోసారి పిచికారీ చేస్తున్నారు. ఆవు పేడ పిడకలతో రోజూ అగ్నిహోత్రం నిర్వహిస్తున్నారు. తద్వారా హానికారక వాయువులు తోట దరి చేరకుండా ఉంటాయని ఉమామహేశ్వరి(90004 08907) తెలిపారు.] జీవామృతం, గార్బేజ్ ఎంజైమే కాపాడుతున్నాయి ప్రకృతి వ్యవసాయంలో బెంగళూరు తదితర చోట్ల శిక్షణ పొందాను. కొబ్బరి, అరటి తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మూడు, నాలుగేళ్లుగా సాగు చేస్తున్నాను. మా ప్రాంతంలో తెల్లదోమ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నేను మాత్రం జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌ను మాత్రమే వాడుతున్నాను. మా పొరుగు తోటల్లో తెల్లదోమ తీవ్రత 100% ఉంటే నా తోటలో కేవలం 10%కి పరిమితమైంది. మా కొబ్బరి చెట్లు చాలా ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తుండటం చూసి ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యపోతున్నారు. జీవామృతం, గార్బేజ్ ఎంజైమ్‌లే నా తోటను రక్షిస్తున్నాయని నేను భావిస్తున్నాను. తెల్లదోమ ఆశించినప్పటికీ తీవ్రత పది శాతానికి మించి లేదు. చెట్లు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. మా కొబ్బరి చెట్ల ఆకులు ఎండాకాలంలో కూడా రాలిపోవు. ప్రకృతి వ్యవసాయం వల్ల కాయల బరువు కూడా 350 గ్రాముల నుంచి 500 గ్రాములకు పెరిగింది. అరుసు (97509 29185) (తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), కొబ్బరి రైతు, పొలాచ్చి,కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు ఇన్పుట్స్: ఎన్. సతీష్‌బాబు, సాక్షి, అమలాపురం జీవ నియంత్రణే మేలు ►మిత్రపురుగులు ►బదనికలు ►గంజి ద్రావణం ►ఫంగస్ ►కొబ్బరి, ఆయిల్‌పామ్, అరటి పంటలలో, ఈ దోమ ఆశించిన తోటల్లో పసుపురంగు జిగురు అట్టలను కట్టాలి. పసుపురంగుకు ఆకర్షించే ఈ పురుగు అట్టలకు అంటుకుని చనిపోతోంది. అట్టలు ఏర్పాటు చేయడం వల్ల పురుగు ఉంటే దాని ఆచూకీని కనిపెట్టే అవకాశముంది. ►పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లార్వా (పిల్ల), ప్యూపా (నిద్రావస్థ) దశలకు సంబంధించి ఎన్కార్సియా గ్వడలోపే జాతి బదనికలు తోటల్లో వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రాంతం నుంచి అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మిత్రపురుగులను తీసుకు వచ్చి దోమ ఉన్న తోటల్లో వదులుతున్నారు. ►తెల్లదోమ వల్ల వచ్చే మసిమంగు నివారణకు ఒక శాతం గంజి ద్రావణాన్ని మసి ఆశించిన మొక్కలపై భాగాలపై పిచికారీ చేయాలి. లేదా ఉధృతంగా మంచినీటిని ఆకుల మీద పడేలా చేయాలి. ఇలా చేస్తే నల్లని మసిమంగు వదిలిపోతుంది. ►వేప నూనెను ప్రతీ పదిహేను రోజులకు మొక్క ఆకు అడుగుభాగం తడిచేలా పిచికారీ చేయాల్సి ఉంది. ఒక్క శాతం వేప నూనెకు పది గ్రాముల డిటర్జెంట్ పౌడరు కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. ►వేప నూనెకు ప్రత్యామ్నాయంగా అంబాజీపేట ఉద్యాన పరిశో«ధనా స్థానం ఐసోరియా ఫ్యూమోసోరోసే ఫంగస్‌ను ఆకుపై పిచికారీ చేయాలి. ఈ ఫంగస్‌ను తయారు చేసుకోవడం ఎలాగో రైతులకే నేర్పిస్తున్నాం. ►కొత్తగా డైకోక్రై సా ఆస్టర్ మిత్రపురుగులను తోటల్లో విడుదల చేయాల్సి ఉంది. తెల్లదోమ గుడ్డు, పిల్ల పురుగు దశలో తెల్లదోమను ఈ మిత్రపురుగు తింటుంది. ►దోమ ఆశించిన తోటలు, నర్సరీల నుంచి మొక్కలు తెచ్చుకోకూడదు. డా. ఎన్.బి.వి.చలపతిరావు (98497 69231), ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగం), కొబ్బరి పరిశోధనా కేంద్రం, అంబాజీపేట, తూ.గో. జిల్లా -
కొబ్బరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కురసాల కన్నబాబు ముమ్మిడివరం : తీవ్రంగా నష్టపోయిన కోనసీమ కొబ్బరి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ 4వ వార్డులో బుధవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కొబ్బరిధర పతనమై రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా సీఎం చంద్రబాబునాయుడు గోదావరి, కృష్ణా పుష్కరాలపై ప్రచార ఆర్భాటం చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలో 56వేల ఎకరాలలో రైతులు పంట విరామం ప్రకటించినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వ్యవసాయశాఖ మంత్రిని ఈ ప్రాంతానికి పంపించి పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. నాఫెడ్ కేంద్రాల ద్వారా కేవలం రూ.15 కోట్ల ఎండు కొబ్బరిని కొనుగోలు చేసిందని, రైతులకు ఇంకా రూ.7కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. గత నెల 8న ప్రారంభించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ డైరెక్టర్ జిన్నూరి రామారావు(బాబీ), నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ తదితరులున్నారు. సత్యనారాయణచౌదరికి పరామర్శ రాయవరం : మాతృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ నేత రిమ్మలపూడి వీరవెంకటసత్యనారాయణచౌదరి(సత్తిబాబు)ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు బుధవారం పరామర్శించారు. సత్తిబాబు తల్లి లక్ష్మీకాంతం ఈనెల 17న కన్నుమూశారు. సత్తిబాబు, ఆయన సోదరుడు సుబ్బారావుచౌదరిలను కన్నబాబు పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సత్యనారాయణచౌదరిని ఫో¯Œ లో పరామర్శించి సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు మిందిగుదిటిమోహన్, గుత్తులసాయి, పార్టీ ప్రచార సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి, పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. -
కొబ్బరికి మద్దతు ధర పెంపు
మిల్లింగ్ కొబ్బరిపై రూ.400, గుండు కొబ్బరిపై రూ.410 ♦ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం ♦ దేశవ్యాప్తంగా ఒకే విద్యుత్ ధర: పీయూష్ గోయల్ సాక్షి, న్యూఢిల్లీ: కొబ్బరి రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం ఎండు కొబ్బరి మద్దతు ధర పెంచింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. భేటీ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సగటు నాణ్యత కలిగిన మిల్లింగ్ ఎండు కొబ్బరి 2015లో క్వింటా రూ.5,550 ఉండగా, 2016 సీజన్‌కు రూ. 400 చొప్పున పెంచనున్నట్లు చెప్పారు. గుండు కొబ్బరి (గుండ్రంగా ఉండే ఎండు కొబ్బరి) ధరను 2016కు రూ. 6,240కి (రూ. 410 పెంపు) పెంచారు. కొబ్బరి పెంచే రాష్ట్రాల్లో నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ధర అమలు అంశాలను పర్యవేక్షిస్తాయి. దక్షిణాన 71 శాతం ట్రాన్స్మిషన్ లైన్లు గడిచిన 18 నెలల్లో దక్షిణ భారత దేశానికి విద్యుత్తు సరఫరా మౌలిక వ్యవస్థను 71 శాతం అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రస్తుత వ్యవస్థకు రెట్టింపుగా విద్యుత్తు ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంటుందన్నారు. గతంలో దక్షిణ భారత దేశంలో రూ. 18 ధరకు యూనిట్ విద్యుత్తు దొరికేదని, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ధరకు అందుబాటులో ఉందని వెల్లడించారు. ఎయిర్ మార్షల్స్ సంఖ్య పెంపు: వైమానిక దళంలో ఎయిర్‌మార్షల్స్ ర్యాంకు పోస్టుల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సాయుధ బలగాల ట్రిబ్యునల్ (ఏఎఫ్‌టీ) ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ.. 17 నెలల కాలానికి ఆమోదం తెలిపింది. డిసెంబర్ 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 వరకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎయిర్ మార్షల్స్ పెంపునకు ఇచ్చిన సమయం ముగిసిపోనుంది. దీనికితోడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఎయిర్ వైస్ మార్షల్ సంజయ్ శర్మ ఏఎఫ్‌టీని ఆశ్రయించారు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్.. సూపర్ న్యూమరరీ పోస్టులను మరో 17 నెలలు పెంచాలని సాయుధ బలగాల ట్రిబ్యునల్ సిఫారసు చేసింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారుచేయడం కోసం రాజ్‌నాథ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ గురువారం సమావేశం కానుంది. -
కల్లోల కడలి
డోకులపాడు(వజ్రపుకొత్తూరు): కడలి కల్లోలమైంది. మత్స్యకారుని గుండె చెరువైంది. వేట సాగక అలల ఉధృతికి పూడగడవని పరిస్థితి నెలకొంది. పైగా గత 20 ఏళ్లుగా లేని పరిస్థితులు నేడు ఉత్పన్నమవుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు నుంచి బైపల్లి వరకు తీరం కోతకు గురవ్వడమే గాకుండా తీరం వెంబడి ఉన్న సరుగుడు వనాలు ధ్వంసమయ్యాయి. జీడి, కొబ్బరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. అల్పపీడ ప్రభావంతో తీరం వెంబడి అలలు 20 మీటర్లు ఎత్తున ఎగసిపడి కల్లోలం సృష్టించిందని, 70మీటర్ల ముందుకు సముద్రం వచ్చేసిందని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటివరకూ లోతట్టు ప్రాంతాలైన మంచినీళ్లపేట, దేవునల్తాడ, బైపల్లి తీరాల్లో మాత్రమే గతంలో సముద్రకోత ఉండేది. ఈసారి ఇక్కడ సముద్రం ముందుకు రావడం ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. సరుగుడు వనాలకు నష్టం మండలంలో గ్రీన్ బెల్టు ప్రాంతం ఉంది. తీరం వెంబడి అప్పట్లో అటవీశాఖ, రైతులు సంయుక్తంగా సరుగుడు వనాలు పెంచారు. ఇంకా రైతులు తమ జీడి, కొబ్బరి తోటలకు ఆనుకుని అలల ఉధృతినుంచి రక్షణగా ఇసుక దిబ్బలపై సరుగుడు వనాలు పెంచారు. ఉవ్వెత్తున ఎగసిన అలలు 20 అడుగులు ఎత్తులో ఉన్న ఇసుక దిబ్బలను, సరుగుడు వనాలను తాకడంతో ఏడుకిలో మీటర్లు మేర తీరం కోతకు గురైంది. సుమారు 20 మంది రైతులకు చెందిన సరుగుడు తోటల్లోని 40 వరకు చెట్లు సముద్రంపాలై నీటిలో కొట్టుకుపోయి వివిధ తీరాలకు చేరాయని రైతులు చెబుతున్నారు. ఉప్పు నీటి ప్రభావం వల్ల తమ జీడి, కొబ్బరి చెట్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ చర్యలు శూన్యం వజ్రపుకొత్తూరు తీర ప్రాంతంలో ఐదే ళ్లుగా సముద్రం ముందుకు వచ్చి నష్టం కలిగిస్తున్న విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి పరిశ్రమల స్థాపనకు సర్వేలు చేస్తున్నారు తప్ప తీర ప్రాంతంలో ప్రజలకు ఎదురవుతున్న ముప్పుపై ఎలాంటి పరిశోధనలు జరగడం లేదని వాపోతున్నారు. ఎన్నడూ చూడలేదు నాకు 36 ఏళ్లు. 15 ఏళ్లుగా సంద్రంలో చేపల వేట చేస్తున్నాను. ఎప్పుడూ ఈ స్థాయిలో అలల ఉధృతి చూడలేదు. పైగా ఈ స్థాయిలో తీరం కోతకు గురవడం చూస్తే భయమేస్తోంది. ప్రస్తుతం తీరం కల్లోలంగా ఉంది. దీని వల్ల వేట సాగడం లేదు. -వై. పాపారావు, మత్స్యకారుడు, డోకులపాడు. -
కష్టాల్లో కొబ్బరి రైతు..!
కొబ్బరి రైతుల కష్టాలు తీరడం లేదు. కొబ్బరి డొక్కల నుంచి పీచు తీసిన వారికి కాయిర్ బోర్డు మొండిచేయే చూపిస్తోంది. ఏటా శిక్షణల పేరుతో నిధులు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం శూన్యంగానే ఉంది. రైతులకు పైసా రుణం కూడా మంజూరు కావడం లేదు. రైతులు మురికి కూపాల్లోనే కొబ్బరి డొక్కలను నానబెట్టి బాగా కుళ్లిన అనంతరం డొక్క పైన ఉన్న పొరను తీసేసి పీచుతయారు చేస్తున్నారు. దీంతో రోగాలు, చర్మవ్యాధుల భారిన పడుతున్నారు. -వజ్రపుకొత్తూరు పీచు పరిశ్రమ కలేనా..? పలాస నియోజక వర్గంలో వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో సుమారు 25,000 హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. వీటి నుంచి 15 రోజులకోసారి సుమారు 70 టన్నుల కొబ్బరి డొక్కలు లభ్యమవుతున్నాయి. అత్యధికంగా 30 టన్నుల పైబడి కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్న వజ్రపుకొత్తూరు మండలంలో పీచు పరిశ్రమ ఏర్పాటు చేస్తే 70 టన్నుల కొబ్బరి డొక్కల నుంచి పీచుతీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. పీచు ఉత్తత్తులు తయారు చేసే పరిశ్రమలు కూడా వెలసే అవకాశం ఉంది. ఇప్పటికే నూకలవానిపేట, దున్నవాని పేట, అమలపాడు, పూడిజగన్నాథపురం, పల్లివూరు, హుకుంపేట, శెగిడిపేట గ్రామాల్లో పీచుతో వివిధ రకాల ఉత్పత్తులు తయారుచేసి పూండి, పలాస మార్కెట్లలో విక్రయిస్తున్నారు. పీచుపరిశ్రమ ఏర్పాటుచేస్తే యంత్రాలతో సులభంగా పీచు తయారు చేయవచ్చని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ ప్రాంతీ యులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. పరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలిందంటూ రైతులు వాపోతున్నారు. కాయిర్ బోర్డు అధికారులు స్పందించి పీచు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్థిక సహకారం లేదు... వజ్రపుకొత్తూరు మండలంలో పీచు పరిశ్రమ ఏర్పాటుచేసి పీచు తీసేందుకు యంత్రాలు అందజేస్తామని వెలుగు, గ్రామీణాభివృద్ధి సంస్థలు చెప్పినా ఇంతవరకు యంత్రాలు అందించలేదు. కనీసం ఆర్థిక సహకారం కూడా చేయలేదు. తాము ఉప్పుటేరులో డొక్కలు నానబెట్టి పీచు వడుకుతూ వస్తువులు తయారు చేస్తున్నాం. బ్యాంకులు కూడా రుణాలు అందించడం లేదు. నాబార్డు సహా యం ఇస్తుందని సమావేశాలు పెట్టారు. తరువాత వాళ్లు కనిపించడమే మానేశారు. - కె.ఢిల్లేశ్వరరావు, కొబ్బరి రైతు, పూడిలంక ప్రతిపాదించాం... వజ్రపుకొత్తూరు మండలంలోని అమలపాడు గ్రామంలో పీచు పరి శ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించాం. సహకార సంఘం ఏర్పాటు చేసి అందులో 20 మంది వరకు సభ్యులను చేర్చి నాబార్డు సహకరాంతో 60 శాతం సబ్సిడీ ద్వారా కాయిర్ బోర్డు స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. రైతులు సహకరించి ఫీజుబిలిటీ లభిస్తే పరిశ్రమ ఏర్పాటు అవుతుంది. - ఎం.లావణ్య, ఉద్యానవనశాఖ అధికారి, వజ్రపుకొత్తూరు -
చెట్టంత నష్టానికి..చిగురంత పరిహారమా?
- నగరం కొబ్బరిరైతుల ఆక్రోశం - పేలుడుతో కాలిన మానులు పేదలవే - రూ.25 వేలు చెల్లించాలని మొత్తుకోలు - అన్నీ కలిపి రూ.9,600లే అంటున్న అధికారులు నగరం (మామిడికుదురు) : కోనసీమ కల్పవృక్షం కొబ్బరిచెట్టు. సదా హరితంతో నిండి ఉండే ఈ గడ్డ సమున్నతంగా ఎగరేసిన పచ్చని కేతనం కొబ్బరిచెట్టు. చల్లనినీడనూ, అంతకన్నా చల్లనైన, తియ్యనైన నీటినీ ఇచ్చే ఈ మానులే నగరంలో.. గెయిల్ పైపులైన్ కక్కిన మహాగ్ని కీలల్లో మాడిమసైపోయాయి. ‘కొబ్బరిచెట్టుంటే కొడుకు పెట్టు, పది కొబ్బరి చెట్లుంటే కడుపులో చల్లకదలకుండా బతికేయవచ్చు అనే ఈ సీమ భరోసాను వమ్ము చేస్తూ క్షణాల్లో వట్టి కట్టెల్లా మారిపోయాయి. మండలంలోని నగరం గ్రామంలో గత నెలలో జరిగిన గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఇరవై మందిని పైగా పొట్టన పెట్టుకుంది. వందలాది కొబ్బరిచెట్లనూ నిలువునా దగ్ధం చేసింది. కొన్ని వందల చెట్టు దెబ్బ తిన్నాయి. దెబ్బ తిన్న చెట్లు, పుంజుకుని, కాపు కాసేందుకు మరో రెండు మూడేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలైన ఆ కొబ్బరి రైతుల గుండె.. నష్టపరిహారం కోసం ప్రభుత్వాధికారులు కడుతున్న లెక్కలను చూసి భగ్గున మండుతోంది. చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని మొత్తుకుంటున్నా పాలకుల్లో, అధికారుల్లో చిరుగాలికి ఊగే కొబ్బరాకు పాటి కదలిక కానరావడం లేదు. చెట్టుకు రూ.ఆరు వేలు మాత్రమే ఇస్తామంటున్న సర్కారు మాటలు.. రైతులను హతాశులను చేస్తున్నాయి. ఒక్కో చెట్టుకు రూ.50 వేల నష్టం ఒక్కో కొబ్బరి చెట్టు ఏడాదికి 500 నుంచి 600 కాయల దిగుబడినిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక చెట్టు నుంచి సంవత్సరానికి రూ.3,500 నుంచి రూ.4 వేల ఆదాయం వస్తుంది. కొబ్బరి మొక్క నాటాక పూర్తిస్థాయిలో కాపు కాసేందుకు 15 ఏళ్లు పడుతుంది. ఈ లెక్కన ఒక చెట్టు ద్వారా 15 ఏళ్లకు వచ్చే ఆదాయం రూ.50 వేలకు పైబ డే ఉంటుంది. కానీ అధికారులు ఇంత పరిహారం చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. పేలుడు వల్ల దెబ్బతిన్న చెట్టుకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. కాలిపోయిన చెట్టును గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొలగించి, దాని స్థానే కొత్త మొక్కను పాతి ఇస్తామని, కాలిపోయిన మట్టిని తీసి కొత్త మట్టిని వేస్తామని చెబుతున్నారు. దీనికి మొక్కకు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. దీంతో పాటు మొక్క పాతిన ఏడేళ్ల వరకు పోషణకు రూ.1600 వరకు చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే చెట్టుకు ప్రభుత్వం చెల్లించే పరిహారం రూ.9,600 అవుతోంది. అంటే రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్న మాట. వేసవిలో మండిపడ్డ ఎండలు తమను ఉక్కపోతకు గురి చేస్తే, గెయిల్ అధికారుల నిర్లక్ష్యం రేపిన మంటలు తమ బతుకుల్నే చిక్కుల్లోకి నెట్టాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. రైతులు ఆశిస్తున్న రూ.25 వేల నష్ట పరిహారం న్యాయబద్ధమైనదేనని పలువురు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు. వారి మాటలు, రైతుల గోడు ఆలకించి, పరిహారం రైతులు తేరుకునేలా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రూ.25 వేలు చెల్లించకుంటే ఉద్యమిస్తాం.. చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాల్సిందే. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమిస్తాం. గెయిల్ అధికారులు పరిహారం చెల్లించేందుకు సిద్దంగానే ఉన్నా జిల్లా అధికారులే అందుకు సమ్మతించడం లేదు. మా న్యాయమైన డిమాండ్‌ను అర్థం చేసుకుని, ఆదుకోవాలి. - వానరాశి వీరశంకరరావు, కొబ్బరి రైతు, నగరం నామమాత్రపు పరిహారం ఇస్తామంటే చెల్లదు గ్యాస్ పైపులైన్ పేలుడు మమ్మల్ని పాతాళంలోకి నెట్టేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరి ప్రాణాలు పోయాయి. కొబ్బరిచెట్లు మాడి పోయాయి. మా భూముల్ని కొనే నాథుడు కనిపించడం లేదు. కొబ్బరి చెట్లకు నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తాం. - వానరాశి వీరరాఘవులు, కొబ్బరి రైతు, నగరం