చెట్టంత నష్టానికి..చిగురంత పరిహారమా?
- నగరం కొబ్బరిరైతుల ఆక్రోశం
- పేలుడుతో కాలిన మానులు పేదలవే
- రూ.25 వేలు చెల్లించాలని మొత్తుకోలు
- అన్నీ కలిపి రూ.9,600లే అంటున్న అధికారులు
నగరం (మామిడికుదురు) : కోనసీమ కల్పవృక్షం కొబ్బరిచెట్టు. సదా హరితంతో నిండి ఉండే ఈ గడ్డ సమున్నతంగా ఎగరేసిన పచ్చని కేతనం కొబ్బరిచెట్టు. చల్లనినీడనూ, అంతకన్నా చల్లనైన, తియ్యనైన నీటినీ ఇచ్చే ఈ మానులే నగరంలో.. గెయిల్ పైపులైన్ కక్కిన మహాగ్ని కీలల్లో మాడిమసైపోయాయి. ‘కొబ్బరిచెట్టుంటే కొడుకు పెట్టు, పది కొబ్బరి చెట్లుంటే కడుపులో చల్లకదలకుండా బతికేయవచ్చు అనే ఈ సీమ భరోసాను వమ్ము చేస్తూ క్షణాల్లో వట్టి కట్టెల్లా మారిపోయాయి. మండలంలోని నగరం గ్రామంలో గత నెలలో జరిగిన గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఇరవై మందిని పైగా పొట్టన పెట్టుకుంది.
వందలాది కొబ్బరిచెట్లనూ నిలువునా దగ్ధం చేసింది. కొన్ని వందల చెట్టు దెబ్బ తిన్నాయి. దెబ్బ తిన్న చెట్లు, పుంజుకుని, కాపు కాసేందుకు మరో రెండు మూడేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలైన ఆ కొబ్బరి రైతుల గుండె.. నష్టపరిహారం కోసం ప్రభుత్వాధికారులు కడుతున్న లెక్కలను చూసి భగ్గున మండుతోంది. చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని మొత్తుకుంటున్నా పాలకుల్లో, అధికారుల్లో చిరుగాలికి ఊగే కొబ్బరాకు పాటి కదలిక కానరావడం లేదు. చెట్టుకు రూ.ఆరు వేలు మాత్రమే ఇస్తామంటున్న సర్కారు మాటలు.. రైతులను హతాశులను చేస్తున్నాయి.
ఒక్కో చెట్టుకు రూ.50 వేల నష్టం
ఒక్కో కొబ్బరి చెట్టు ఏడాదికి 500 నుంచి 600 కాయల దిగుబడినిస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక చెట్టు నుంచి సంవత్సరానికి రూ.3,500 నుంచి రూ.4 వేల ఆదాయం వస్తుంది. కొబ్బరి మొక్క నాటాక పూర్తిస్థాయిలో కాపు కాసేందుకు 15 ఏళ్లు పడుతుంది. ఈ లెక్కన ఒక చెట్టు ద్వారా 15 ఏళ్లకు వచ్చే ఆదాయం రూ.50 వేలకు పైబ డే ఉంటుంది. కానీ అధికారులు ఇంత పరిహారం చెల్లించేందుకు ససేమిరా అంటున్నారు. పేలుడు వల్ల దెబ్బతిన్న చెట్టుకు రూ.6 వేలు పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు.
కాలిపోయిన చెట్టును గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తొలగించి, దాని స్థానే కొత్త మొక్కను పాతి ఇస్తామని, కాలిపోయిన మట్టిని తీసి కొత్త మట్టిని వేస్తామని చెబుతున్నారు. దీనికి మొక్కకు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు. దీంతో పాటు మొక్క పాతిన ఏడేళ్ల వరకు పోషణకు రూ.1600 వరకు చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే చెట్టుకు ప్రభుత్వం చెల్లించే పరిహారం రూ.9,600 అవుతోంది. అంటే రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్న మాట. వేసవిలో మండిపడ్డ ఎండలు తమను ఉక్కపోతకు గురి చేస్తే, గెయిల్ అధికారుల నిర్లక్ష్యం రేపిన మంటలు తమ బతుకుల్నే చిక్కుల్లోకి నెట్టాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. రైతులు ఆశిస్తున్న రూ.25 వేల నష్ట పరిహారం న్యాయబద్ధమైనదేనని పలువురు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు. వారి మాటలు, రైతుల గోడు ఆలకించి, పరిహారం రైతులు తేరుకునేలా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
రూ.25 వేలు చెల్లించకుంటే ఉద్యమిస్తాం..
చెట్టుకు రూ.25 వేలు పరిహారం చెల్లించాల్సిందే. లేని పక్షంలో తీవ్రంగా ఉద్యమిస్తాం. గెయిల్ అధికారులు పరిహారం చెల్లించేందుకు సిద్దంగానే ఉన్నా జిల్లా అధికారులే అందుకు సమ్మతించడం లేదు. మా న్యాయమైన డిమాండ్‌ను అర్థం చేసుకుని, ఆదుకోవాలి. - వానరాశి వీరశంకరరావు, కొబ్బరి రైతు, నగరం
నామమాత్రపు పరిహారం ఇస్తామంటే చెల్లదు
గ్యాస్ పైపులైన్ పేలుడు మమ్మల్ని పాతాళంలోకి నెట్టేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరి ప్రాణాలు పోయాయి. కొబ్బరిచెట్లు మాడి పోయాయి. మా భూముల్ని కొనే నాథుడు కనిపించడం లేదు. కొబ్బరి చెట్లకు నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తాం.
- వానరాశి వీరరాఘవులు, కొబ్బరి రైతు, నగరం