Rural Employment Guarantee Scheme
-
గ్రామీణ భారత వెన్ను విరుస్తారా?
భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయదారులపైన, వ్యవసాయ సంస్కృతి పైన చూపిన నిర్లక్ష్యం. దానికి విరుగుడుగా దేశంలో కోట్ల మందిగా ఉన్న గ్రామీణ కూలీలకు కనీస బతుకుదెరువు కల్పించడం కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగ అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం అని గుర్తించాలి.భారతదేశంలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక వర్గానికి, అందునా దళిత బహుజన వర్గాలకు ఆచారణాత్మక విరో ధాన్ని ప్రకటిస్తున్నాయి. దానికి రుజువు ఏమిటంటే, పేద ప్రజలకు మేలు కలిగించి వారి పొట్ట నింపుతూ వారికి గ్రామాల్లో నివసించే పరిస్థితిని కల్పించిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని(ఎంజీ–ఎన్ఆర్ఈజీఎస్) నీరు గార్చడం. ఇది పేద లను గ్రామాల నుంచి తరిమేసి, గ్రామాలను కార్పొరేట్లకు అప్పజెప్పే దుష్ట యత్నం. దేశంలో కోట్ల మందిగా వున్న గ్రామీణ కూలీలకు ఉపాధి హామీ ఇవ్వడం కోసం స్వాతంత్య్రానంతరం వచ్చిన ఒకే ఒక్క పథకం – గ్రామీణ ఉపాధి హామీ. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి నాడు వామపక్షాల మద్దతు అనివార్యమైంది. దాంతో వామపక్షాలు డిమాండ్ చేసినట్టుగా గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సి వచ్చింది. 2005 ఆగస్ట్ 23న దేశ పార్లమెంట్ చారిత్రాత్మకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఆమోదించింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండమీదపల్లి గ్రామంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఈ పథకం అమలు కావడం వల్ల పేదల కడుపులోకి నాలుగు మెతుకులు పోవడంతో పాటు ఆత్మ గౌరవం పెరిగింది.నిజానికి మన్మోహన్ భారతదేశానికి ఉపకరించే అనేక ఉపయో గకరమైన పనులు నిర్వర్తించారు. ఉపాధి హామీ పథకం రూపకల్ప నలో ఆంధ్ర క్యాడర్‌కు సంబంధించి ఢిల్లీలో పనిచేసిన కొప్పుల రాజు ప్రభావం ఉంది. ఆయన మీద ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పోరా టాల ఫలితం ఉంది. ఈ పథకం రూపకల్పనలో మానవతా స్ఫూర్తి ఉంది. కరుణాభావం ఉంది. రాజ్యాంగపు అధ్యయనం ఉంది. అయితే ఈ పథకాన్ని కేంద్ర, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం బాధాకరమైన విషయం.అంతర్జాతీయస్థాయిలో మానవాభివృద్ధిని గణించినట్లు, భారత దేశంలో కూడా లెక్కించడానికి ప్రణాళికాసంఘం ఆధ్వర్యంలో ప్రయ త్నాలు జరిగాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మానవాభి వృద్ధిలో మెరుగైన పనితీరును ప్రదర్శించాయి. కానీ ఆర్థికాభివృద్ధికీ, మానవాభివృద్ధికీ మధ్య ఉండే ధనాత్మక సహసంబంధం మధ్యంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్వయించడం లేదు. అయితే కేరళ రాష్ట్రం మానవాభివృద్ధిలోనూ, ఆర్థికాభివృద్ధిలోనూ సమాన మెరుగుదల కనబరుస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా మొదలైనవాటి పనితీరుతో కేరళ రెండింతల మెరుగుదల కన బరిచింది. పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా మొదలైన రాష్ట్రాలు చెప్పుకోతగ్గ పురోగతిని సాధించాయి. క్లుప్తంగా చెప్పాలంటే చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మానవాభివృద్ధిలో మంచి ఫలితాలను సాధించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మానవాభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తున్నప్పటికీ, వాటి మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి భారతదేశ ఆర్థిక సంక్షోభానికి కారణం వ్యవసాయ దారులపైన, వ్యవసాయ సంస్కృతిపైన చూపిన నిర్లక్ష్యం. భారతదేశంలో కుల కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ రూపొందడానికి కారణాలను అంబేడ్కర్ ఆనాడే పసిగట్టారు. పేద ప్రజలను కులం ద్వారా విభజించి వారికి రాజ్యాధికారం రాకుండా చేయడానికే ప్రయత్నాలు జరి గాయి. అంబేడ్కర్ 1942లోనే మహరాష్ట్ర ‘కొలాబా’ జిల్లాలో అణ గారిన వర్గాల సభలో మాట్లాడుతూ, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు, ఆర్థిక పెత్తందారులు, భూస్వాములు కలిసి శ్రామిక వర్గాలను ఏకం కాకుండా చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారన్నారు. ‘‘అణగారిన వర్గాల వారి ఉద్యమం ఇతర శ్రామికజనంతో కలిసి ముందుకు సాగాలని నేను ఆత్రుత పడుతున్నాను. ఈ లక్ష్యాన్నిదృష్టిలో ఉంచుకునే, బ్రాహ్మణేతర వర్గానికి చెందిన శ్రమజీవులు తమ స్వేచ్ఛకోసం ఎప్పుడో ఒకప్పుడు మహత్తర పోరాటం చేస్తారన్న ఆశ తోనే గత పదేళ్ళుగా బ్రాహ్మణేతర పార్టీలో కొనసాగుతున్నారు. మా పార్టీకి తన అంతరాంతరాలలో ప్రజాస్వామ్య బీజాలు ఉన్నాయి. దుర దృష్టవశాత్తు ఈ పార్టీ నాయకులు తమ బాధ్యతలను గుర్తించకుండా ఒకవైపున ప్రభుత్వం, మరోవైపున కాంగ్రెస్ ప్రభావం వల్ల ఈ పార్టీ ఛిన్నాభిన్నం కావడానికి దోహదం చేశారు. ఇప్పటికైనా ఈ విషయంలో వారు ఏమైనా చేయగలిగితే నేను ఆహ్వానిస్తాను. బ్రాహ్మణే తరులైన శ్రమజీవులు మా పార్టీలో చేరాలని నేను పట్టబట్టడం లేదు. కావాలనుకుంటే వారు వేరే పార్టీ పెట్టుకోనివ్వండి. అయినా బ్రాహ్మ ణులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా మనందరం కలిసి ఉమ్మడి పోరాటం చేయవచ్చు. అణగారిన వర్గాల వారు విడిగా ఒక రాజకీయ పార్టీ నడిపితే శ్రామికజన ప్రయోజనాలు దెబ్బతింటాయని కొందరు అంటున్నారు. దానివల్ల అలాంటిది ఏమీ జరగదు. అట్టడుగున ఉన్న మన పోరాటం నిజానికి ఇతర శ్రామిక వర్గాల వారి కష్టాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. భవనంలోని అట్టడుగున ఉన్న పునాదిరాయి కదిలితే, పైన ఉన్నవి పట్టు సడలుతాయి. కేవలం సవర్ణ హిందు వులతో మాత్రమే కూడిన కార్మిక సంస్థ ఉంటే హిందువులకు మేలు కలుగుతుందని ఏమీ లేదు. ఒకవేళ ఆ కార్మిక సంస్థకు సరైన మార్గ దర్శనం లేకపోతే ఆ అణగారిన వర్గాల హిందువులకు మేలు కలుగు తుందని గ్యారెంటీ కూడా ఏమీ లేదు. పైగా హాని కూడా జరగొచ్చు. అనేక సందర్భాలలో జరిగినట్టు వారి హక్కులను కాలరాయడానికి ఉపయోగపడవచ్చు.’’ అంబేడ్కర్ ఆలోచనలు విశాలమైనవి. దీర్ఘ దర్శనంతో కూడు కున్నవి. ఇకపోతే ఉపాధి చట్టం కింద పని చేసిన కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ పని చేస్తే తప్ప పూట గడవని కూలీలకు ఆరేడు నెలలుగా బిల్లులు ఎందుకు బకాయి ఉంటున్నాయి? కూలీలకు సకాలంలో డబ్బులు అందకపోతే అనివార్యంగా ఈ పని నుండి తప్పు కొంటారు. పని దినాలు కల్పించాలనే డిమాండ్ చేయడం తగ్గిపోతుంది. తిరిగి మరలా గ్రామీణ వేతన దోపిడీకి గురికావలసి వస్తుంది. ఎన్నికల ముందు అనేక పథకాలు ప్రకటించి గద్దెనెక్కే పాలకులు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకపోవడం వెనుక గ్రామీణ ప్రాంతాల నుండి పేదలను తరిమివేసే కుట్రలేదని భావించగలమా? ఈ కూలీలు ఇతర రాష్ట్రాల వ్యవసాయ పనులకు, మహా నగరాలకు పెద్ద ఎత్తున వలస వెళితే తప్ప అక్కడ చౌకగా శ్రమను అమ్ముకునే కార్మికులు దొరకరని సామా జిక విశ్లేషకులు చెబుతున్నారు.రాజ్యాంగం కార్మిక, శ్రామిక పక్షపాతంతో కూడుకుని ఉన్నదని పాలకులు గుర్తించలేకపోతున్నారు. పేద ప్రజలు తమ గ్రామంలో బతికితే ఆ గ్రామానికి వెలుగు, ఆ గ్రామానికి జీవం. ఈ పథకం వల్ల దళిత స్త్రీలు సూర్యోదయాన్నే కొంత కూలీని సంపాదించుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ రోడ్ల పక్కన కాలువలు తీయబడ్డాయి. ఈ పథకం వల్ల గ్రామీణ స్కూళ్లు బలపడ్డాయి. పిల్లలను చదివించు కోగలిగారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో రాజ్యాంగ నిరాకరణ ఉంది. మానవతా స్ఫూర్తికి విరుద్ధమైన ఆచరణ ఉంది. సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారమే ఈ యుగ ధర్మం. అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం. బలమైన గ్రామీణ భారతదేశాన్ని నిర్మిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులుమొబైల్: 98497 41695 -
చెల్లింపు పూర్తయిన పనులకు మళ్లీ బిల్లులు!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన పనులకు సంబంధించి వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేందుకు బుధవారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత టీడీపీ ప్రభుత్వంలో నిబంధనలను పక్కన పెట్టి, ఇష్టారాజ్యంగా చేసిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పనులపై విజిలెన్స్ విచారణ జరిపించింది. అనంతరం విజిలెన్స్ సిఫార్సులకు అనుగుణంగా ఒక్కో పనికి చెల్లించాల్సిన మొత్తంలో 6.33 శాతం నుంచి 21.2 శాతం చొప్పున కోత పెట్టి బిల్లులు చెల్లించింది. ప్రస్తుతం ఆ పనుల్లో చాలా వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆన్లైన్ రికార్డుల ప్రకారం మూసివేశారు. అంటే ఆయా పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని అధికారులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం ఒకసారి క్లోజ్డ్ జాబితాలో చేర్చిన పనులకు ఎలాంటి బిల్లుల చెల్లింపులకు తావు ఉండదు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో మూసి వేసిన పనులు ఇంకా పురోగతిలో ఉన్నట్టు పేర్కొంటున్న పనులను కలిపి.. అప్పట్లో కోత పెట్టిన బిల్లులు కూడా చెల్లించేందుకు సిద్ధమైంది. మొత్తంగా రూ.331 కోట్లు చెల్లించనుంది. అవకతవకలు ఇలా.. ⇒ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిధులు అందుబాటులో లేకపోయినా టీడీపీ కార్యకర్తలకు నామినేషన్ పద్దతిన పనులు కల్పించింది. రూ.1,795.31 కోట్ల విలువ చేసే సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగినట్టు అంచనా. ⇒ 2020–21లో కరోనా సమయంలో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారు. 11,573 సిమెంట్ రోడ్డు పనులపై మాత్రమే తనిఖీలు చేయగలిగారు. వాటిలోనే 7,326 పనుల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయింది. 1,644 పనులు నాసి రకమైనవిగా గుర్తించారు. ⇒ నూజెండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.25.62 కోట్లతో 253 సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగితే, అందులో 213 రోడ్లను పరిశీలించి.. 196 రోడ్లు నాసిరకమైనవి తేల్చారు. అన్ని పనులపై విజిలెన్స్ విచారణ సాధ్యం కాని పరిస్థితుల్లో పనులు చేసిన వారు బిల్లుల చెల్లింపుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల ప్రక్రియను చేపట్టింది. ⇒ మొత్తం 4.41 లక్షల ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి రూ.331 కోట్ల మొత్తం చెల్లింపులు జరపాలని బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పనులన్నీ క్లోజ్ అయినట్లు కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ పనులన్నింటినీ తిరిగి తెరిచి.. బిల్లుల చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రం కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం. -
‘ఉపాధి’లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వంద రోజుల వ్యవధిలోనే పేదలకు వారి గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,554.34 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. పని కావాలని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడంతో పాటు సగటున రోజువారీ వేతనంగా రూ. 246 చొప్పున అందజేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాథమికంగా 15 కోట్ల పని దినాలు కేటాయించింది. ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం పని కావాలని అడిగిన ప్రతి వారికి తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధనకు అనుగుణంగా జూన్ నెలాఖరు నాటికే ఆ 15 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తయినా.. అదనపు పనుల కేటాయించాలని కోరుతూ కేంద్రానికి సమాచారం తెలియజేసి, ఆ తర్వాత పని కావాల్సిన వారికి పనులు కల్పిస్తూ వస్తోంది. శనివారం (జూలై 22వ తేదీ) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 42.27 లక్షల కుటుంబాలు 18.47 కోట్ల పని దినాలను పూర్తి చేసుకుని లబ్ధి పొందినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం కల్పించలేని స్థాయిలో.. దేశవ్యాప్తంగా మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతుండగా... అత్యధికంగా పనుల కల్పనలో మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 69.26 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కార్డులు ఉండగా, అందులో 56.76 లక్షల కుటుంబాలు గత మూడేళ్లలో అవసరమైన రోజు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకొని లబ్ధి పొందినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. గత వంద రోజులలో మన రాష్ట్రంలో మొత్తం æ74,092 మంది దివ్యాంగులు కూడా ఉపాది హామీ పథకం పనులకు హాజరై లబ్ధి పొందారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 24 కోట్ల పని దినాలు సాధించే దిశగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు పూర్తికాక మునుపే.. 18.47 కోట్ల పని దినాలు కల్పించిన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 24 కోట్ల పనిదినాలు కల్పించేలా లేబర్ బడ్జెట్ కేటాయింపులను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. -
ఉధృతంగా ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని, పనులపై కలెక్టర్లు పర్యవేక్షణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తి కాగా రూఫ్ లెవల్, ఆపై దశల్లో ఉన్న 5.27 లక్షల నివాసాలను కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలని నిర్దేశించారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండో దశ సమగ్ర భూ సర్వేలో భాగంగా మరో 2 వేల గ్రామాల్లో సెప్టెంబర్ 30 నాటికి భూపత్రాలు అందించాలని, అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కావాలని నిర్దేశించారు. స్పందనలో భాగంగా సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి పనులు, గృహ నిర్మాణం, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు–భూరక్ష, విద్యా కానుక కిట్ల పంపిణీపై అధికార యంత్రాంగానికి సీఎం మార్గ నిర్దేశం చేశారు. ప్రతి జిల్లాలో రోజూ 75 వేల పనిదినాలు ఉపాధిహామీ పనులపై కలెక్టర్ల పర్యవేక్షణ అవసరం. ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. అందులో 60 శాతం అంటే 14.4 కోట్ల పనిదినాలు ఈ నెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతి రోజూ ప్రతి జిల్లాలో కనీసం 75 వేల పనిదినాలు కల్పించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం. పనిచేస్తున్న ప్రాంతాల్లో షెడ్లు, తాగునీరు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లు సమకూర్చాలి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎలాంటి పనులు చేపట్టవద్దు. ఈ విషయాలన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. రోజుకు కనీసం రూ.272 వేతనం వచ్చేలా చూడాలి. డిసెంబర్‌కు డిజిటల్ లైబ్రరీలు.. ఉపాధిహామీకి సంబంధించిన బిల్లులన్నీ పూర్తిగా చెల్లించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వేగంగా పూర్తి చేయాలి. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం కోసం అవి చాలా ఉపయోగపడతాయి. గ్రామంలో చదువుకున్న ఏ వ్యక్తి అయినా అక్కడకు వెళ్లి కంప్యూటర్లో పని చేసుకోవచ్చు. మంచి బ్యాండ్‌విడ్త్ అందించడం చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్ అన్నీ సెప్టెంబరు కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలు డిసెంబర్ చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. ఇళ్ల నిర్మాణాలకు రూ.1,475 కోట్లు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. వీటిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వేగం పెరగాలి. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.1,475 కోట్లు ఇచ్చాం. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహించాలి. అధికారులు తప్పనిసరిగా లే అవుట్లలో పర్యటించాలి. సీఆర్డీఏలో 8 నుంచి పనులు సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసి జూలై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణం వెంటనే మొదలు కావాలి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు ఈమేరకు చర్యలు తీసుకోవాలి. జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల నిర్మాణాల్లో వాడే సామగ్రి నాణ్యతతో ఉండాలి. క్రమం తప్పకుండా క్వాలిటీ పరీక్షలు చేయాలి. వేగంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 1,43,600 ఇళ్లను ఉచితంగా పేదలకు ఇస్తున్నాం. ఇప్పటికే 61 వేల ఇళ్లను అందించాం. మరో 89,216 ఇళ్లను ఆగస్టులోగా అందచేస్తాం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి. మిగిలిన కేటగిరీ ఇళ్లకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది. ఆ కేటగిరీ లబ్ధిదారులకు బ్యాంకులతో అనుసంధానించాలి. ఇప్పటికే రూ.1,962.15 కోట్లు బ్యాంకుల ద్వారా అందించాం. మిగిలిన వారికి కూడా రుణాలు టైఅప్ చేసేలా చర్యలు తీసుకోవాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు కొరత రాకూడదు ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల పరిధిలోని 19 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి విడుదల ప్రారంభమైంది. మిగిలిన 29 మేజర్ ప్రాజెక్టుల పరిధిలో జూన్ 15 నుంచి జూలై 20 వరకు నీటి విడుదల షెడ్యూల్ ఖరారైంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడాలి. నాణ్యత చాలా ముఖ్యం. నకిలీల కారణంగా రైతులు ఎక్కడా నష్టపోయిన సందర్భాలు కనిపించకూడదు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ఖరీఫ్ 2023 సంబంధించి జూలై 1 నుంచి ఈ–క్రాప్ బుకింగ్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చేయాలి. సోషల్ ఆడిట్ చేపట్టి సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీసీఆర్సీ కార్డులు కేవలం 11 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగదనే విషయాన్ని వివరించాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆర్బీకేల స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలి. రైతులు అక్కడకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు 17 వేల రెవెన్యూ గ్రామాలకుగాను మొదటి ఫేజ్‌లో 2 వేల గ్రామాల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు సహా జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం పూర్తైంది. 7.86 లక్షల భూహక్కు పత్రాలు పంపిణీ చేశాం. 25.7 లక్షల సరిహద్దు రాళ్లు పాతాం. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఆయా గ్రామ సచివాలయాల్లో కనీసం ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం ద్వారా ఏవైనా సమస్యలుంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. జూలై 1 నాటికి ఇది పూర్తి కావాలి. ఆ గ్రామాల నుంచి రైతులు ఎవరూ తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. సబ్‌డివిజన్, మ్యుటేషన్, ల్యాండ్ కన్వర్షన్ తదితరాలన్నీ గ్రామ సచివాలయాల్లోనే జరగాలి. రెండో దశ కింద మరో 2 వేల గ్రామాల్లో తుది ఆర్వోఆర్ ఆగస్టు 31 కల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. సెప్టెంబర్ 30 కల్లా రాళ్లు పాతడం పూర్తి చేసి భూ పత్రాలు అందించాలి. అక్టోబరు 15 నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. విద్యాకానుక కిట్ల పంపిణీని కలెక్టర్లు సమీక్షించాలి జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువులు బాగా లేకున్నా వెంటనే సమాచారం తెప్పించుకోవాలి. హెచ్ఎంల నుంచి సమాచారాన్ని సేకరించి వెంటనే చర్యలు చేపట్టాలి. నాణ్యత విషయంలో ఎక్కడా సమస్య ఉన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. నాడు– నేడు తొలిదశ పనులు పూర్తైన 15,750 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 30,249 తరగతి గదుల్లో జూలై 12 కల్లా ఐఎఫ్‌పీ ప్యానెళ్లు ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. మానిటర్లను వినియోగించుకుంటూ పిల్లలకు చక్కటి బోధన అందించాలి. ఆమేరకు టీచర్ల సామర్థ్యాన్ని పెంచాలి. -
‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్ సరోవర్ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ అశోక్ పంకజ్, ఎస్సీఏఈఆర్ ఎన్డీఐసీ డైరెక్టర్ సోనాల్డ్ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ప్రవీణ్ మెహతా, ఎన్ఐఆర్డి–పీఆర్ ప్రొఫెసర్ జ్యోతిస్ పాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం -
‘ఉపాధి’లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ పని దినాలు కల్పించడంలోనే కాకుండా వేతనాల చెల్లింపులోనూ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఆంధ్రప్రదేశ్ ఏకంగా 15.11 కోట్లకు పైగా పని దినాలను కల్పించింది. వీరికి వేతనాల రూపంలో రూ.3,084.94 కోట్లు చెల్లించింది. మరే రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం, వేతనాలు చెల్లించడం చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. కేవలం ఉపాధి హామీ పథకం అమలులోనే కాకుండా ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు మంజూరులోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనబరిచిందని నివేదిక పేర్కొంది. లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు చూపినవాటిగా తెలిపింది. 80 శాతం నుంచి 90 శాతం మేర అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచినట్టు పేర్కొంది. ఇక లక్ష్యాల అమలులో 80 శాతం లోపు నిలిచినవాటిని పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా వర్గీకరించింది. పెద్ద రాష్ట్రాలను మించి.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సామాజిక ఆస్తుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్, వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను కూడా చేపడుతోంది. మరోవైపు నాడు–నేడు కింద విద్య, వైద్య రంగాల్లో ఆస్తుల కల్పన పనులను చేపట్టింది. దీంతో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 11.66 కోట్ల పని దినాలు, రాజస్థాన్‌లో 10.26 కోట్ల పని దినాలను కల్పించినట్టు నివేదిక తెలిపింది. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలైనప్పటికీ ఏపీలోనే అత్యధికంగా పనిదినాలు కల్పించడం గమనార్హం. ఎస్సీ ఉప ప్రణాళిక అమల్లోనూ ఏపీ భేష్.. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను కూడా ఏపీ బాగా అమలు చేసిందని నివేదికలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రశంసించింది. 23 రాష్ట్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద మొత్తం 20,61,846 ఎస్సీ కుటుంబాలకు సాయం అందగా.. అందులో ఒక్క ఏపీలోనే 20,29,192 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించినట్లు వెల్లడించింది. అలాగే 23 రాష్ట్రాల్లో తొలి త్రైమాసికంలో మొత్తం 7.62 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద సాయం అందగా.. ఇందులో ఒక్క ఏపీలోనే 3.98 లక్షల మందికి అందించడం విశేషం. అలాగే రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఏపీ చాలా మంచి పనితీరు చూపినట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి త్రైమాసికంలో 6,123 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి ఏకంగా 285 శాతం మేర 17,708 కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. -
5 నెలల్లో పేదలకు రూ.3,400 కోట్ల ఉపాధి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు నెలల మధ్య ఐదునెలల్లో రాష్ట్రమంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనుల కల్పన ద్వారా ప్రభుత్వం పేదలకు రూ.3,400.46 కోట్ల లబ్ధి కలిగించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజు సైతం పనుల కోసం ఎవరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఆ గ్రామంలోనే అడిగిన వారికల్లా పనులు కల్పించింది. రాష్ట్రంలో దాదాపు 98 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో 40.36 లక్షల కుటుంబాలు ఈ ఐదునెలల్లో సొంత ఊళ్లోనే ఉపాధిహామీ పథకంలో పనులు చేసుకున్నాయి. ఒక్కో కుటుంబం సరాసరి రూ.8,425 చొప్పున ప్రయోజనం పొందింది. 40.36 లక్షల కుటుంబాలకు చెందిన 65.74 లక్షలమంది కూలీలు 16.02 కోట్ల పనిదినాలపాటు ఈ పథకంలో పనిచేసుకుని లబ్ధిపొందారు. అందులో అత్యధికంగా 23.71 శాతం మేర ఎస్సీ కుటుంబాల వారున్నారు. ఈ పనులతో 9.44 శాతం ఎస్టీ కుటుంబాలు లబ్ధిపొందాయి. ఉపాధిహామీ పథకం ద్వారా పేదలకు పనుల కల్పనలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. మన రాష్ట్రంతో పోలిస్తే మూడురెట్ల కన్నా ఎక్కువ ఉండే ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య 17.73 కోట్ల పనిదినాలు కల్పించి రూ.3,818 కోట్ల మేర పేదలకు లబ్ధికలిగించింది. ఇదే కాలంలో మన రాష్ట్రం 16.56 కోట్ల పనిదినాలపాటు పేదలకు పనులు కల్పించి రూ.3,400.46 కోట్ల ప్రయోజనం చేకూర్చి రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య పేదలకు అత్యధికంగా ఉపాధి పనులు కల్పించిన పది రాష్ట్రాలు -
‘ఉపాధి’కి పరిమితి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. కొత్త పనులకు అనుమతిని క్లిష్టతరం చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో పంచాయతీలో ఒకే సమయంలో 20 పనులకు మాత్రమే వీలు కల్పిస్తూ నిబంధన విధించింది. వాటిలో మాత్రమే కూలీలు, ఇతర కార్యకలాపాలకు, బిల్లులు పెట్టడానికి వీలుంటుంది. ఈ 20 పనుల్లో ఒకటి పూర్తయిన తర్వాతే మరో కొత్త పని మంజూరవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ధర్మవీర్ ఝా రెండు రోజుల క్రితం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, పర్యవేక్షణ మొత్తం ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ (నరేగా సాఫ్ట్) ద్వారా ఆన్లైన్లో జరుగుతుంది. గ్రామాల్లో పనులు జరిగిన తర్వాత కూలీల వేతనాలు సహా అన్నిరకాల బిల్లులను సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. వీటి ప్రకారం కేంద్రం కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాల డబ్బు జమ చేస్తుంది. నూతన నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఆ 20 పనులకు మాత్రమే బిల్లుల నమోదుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 2.69 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 1.64 కోట్ల ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. వాటిలో 1.44 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 53 పనులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ 13,113 గ్రామ పంచాయతీల్లో 9.73 లక్షల పనులు మంజూరవగా, వాటిలో 9.67 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే రాష్ట్రంలోనూ ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 73 పనులు జరుగుతున్నాయి. నూతన నిబంధన ప్రకారం ఈ పనులను 20కి పరిమితం చేయడం చాలా కష్టమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మంజూరైన పనులకు కొత్త నిబంధన వర్తించకపోవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త పని మంజూరులో ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికే ఉపాధి పథకం పనులు గడువులోగా పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిబంధన తెచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లు కొనసాగే మొక్కల పెంపకం, గృహ నిర్మాణ పథకం వంటి పనులకు కొత్త నిబంధన వర్తించదని కేంద్రం పేర్కొందని వివరించారు. తప్పనిసరి, ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామాల్లో స్థానిక ఎంపీడీవో సవివరమైన వివరణ, జిల్లా కలెక్టర్ అనుమతితో 20 పరిమితికి మించి పనులు మంజూరుకు అవకాశం కల్పించిందని తెలిపారు. -
కనీస ‘ఉపాధి’ రూ.240
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనం కనీసం రూ.240 వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం సమగ్ర సర్వే ప్రక్రియకు సంబంధించి నిర్దేశించుకున్న గడువులను గుర్తు చేస్తూ వీటిని ప్రతి కలెక్టర్ నోట్ చేసుకోవాలని సీఎం సూచించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ, పేదల గృహ నిర్మాణాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లపై ముఖ్యమంత్రి జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. తనిఖీలతో పనుల్లో నాణ్యత కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీవోలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ తనిఖీలు చేయాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నందున వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి. జాప్యాన్ని అనుమతించేది లేదు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి. కలెక్టర్లు వీటిపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. వీటి నిర్మాణాల విషయంలో వెనకబడ్డ జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి పనితీరు మెరుగుపరుచుకోవాలి. కోర్టు కేసులున్న స్థలాల్లో ప్రత్యామ్నాయాలు కోర్టు కేసుల కారణంగా పంపిణీ కాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తారు. న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్న స్థలాలపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఒక్కో కేసు వారీగా పరిశీలించి ప్రణాళిక రూపొందిస్తారు. 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా అందిన 2,11,176 దరఖాస్తులను అర్హత కలిగినవిగా గుర్తించారు. ఇందులో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ చేశాం. మరో 98,914 మందికి వీలైనంత త్వరగా పట్టాలు పంపిణీ చేసేలా భూములను గుర్తించాలి. టిడ్కో ఇళ్ల పనులు నాణ్యంగా ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. గడువులోగా సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది. నిర్దేశించుకున్న గడువులోగా సర్వే పూర్తి చేయాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్యాలను కలెక్టర్లు సరి చూసుకోవాలి. రోజువారీ సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి. నిరంతరం సమీక్షిస్తూ ముందుకు సాగితేనే సమగ్ర సర్వే లక్ష్యాలను చేరుకోగలం. ఇళ్ల పనులకు ఈ వారమే నిధులు పేదల ఇళ్లకు సంబంధించి కొన్ని లే అవుట్లకు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్లను, ల్యాండ్ లెవలింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి. దీనికి కావాల్సిన నిధులను ఈ వారంలోనే అందుబాటులోకి తెస్తున్నాం. సుమారు రూ.700 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్ 28న విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం. ఇక్కడ గృహ నిర్మాణాలు వేగం పుంజుకునేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతినెలా కనీసం 75 వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. కరెంటు, తాగునీరు, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీ కాలనీల్లో కల్పించేందుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. -
ఉవ్వెత్తున ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పేదలకు పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, బిహార్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో పేదల వలసలను నివారించడం, వ్యవసాయ పనులు లేని వేసవి సీజన్లో సొంతూరిలో పనులు కల్పించడం. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రోజుల్లోనే రాష్ట్రంలో 2,84,03,576 పనిదినాల పాటు ప్రభుత్వం పేదలకు పనులు కల్పించింది. మధ్యప్రదేశ్ నెల రోజుల వ్యవధిలో 2.06 కోట్ల పనిదినాలు కల్పించగా తెలంగాణ 1.65 కోట్లు, బిహార్ 1.48 కోట్ల పనిదినాలను కల్పించగలిగాయి. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రాష్ట్రాలు పేదలకు తాజాగా కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. నెలలో 17.07 కోట్ల పనిదినాలు ► దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ నెల రోజుల వ్యవధిలో 17.07 కోట్ల పనిదినాలను కల్పించగా రూ.4,288 కోట్లు పేదలకు కూలీగా చెల్లించారు. ఏపీలో 20.01 లక్షల కుటుంబాలకు చెందిన 29.84 లక్షల మంది పేదలు పనులకు హాజరై రూ.474.98 కోట్లు వేతనాల రూపంలో పొందారు. పనులకు హాజరైన వారిలో 60.04 శాతం మంది మహిళలే ఉన్నారు. ► వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎండల వల్ల కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయమే 6.30 నుంచి పనులకు వీలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులకు హాజరయ్యేలా ఉదయం, సాయంత్రం రెండు పూటలా వీలు కల్పించారు. ► పనులకు వచ్చే పేదలు రోజువారీ ఎక్కువ మొత్తంలో కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా వీలున్న సమయంలో నిర్దేశిత పనులు చేసేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు రోజులో చేయాల్సిన పనులను ముందే మార్కు చేసి ఉంచుతారు. ► గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉపాధి పథకం పనులకు హాజరయ్యే కూలీలకు సరాసరిన రోజుకు రూ.181.58 చొప్పున వేతనం అందుతోంది. ► వేసవిని దృష్టిలో పెట్టుకొని గత రెండేళ్ల పాటు ఏప్రిల్, మే, జూన్‌లో 20 – 30 శాతం తక్కువ పనిచేసినా నిర్ణయించిన కూలీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానానికి కేంద్రం అభ్యంతరం తెలపడంతో ప్రస్తుత ఏడాది అమలులో లేదు. దీంతో గతంతో పోల్చితే కూలీ నామమాత్రంగా తగ్గింది. ► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 16–17 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రోజు రోజుకూ ఇది పెరుగుతోంది. గత నెల రోజుల్లో 2.84 కోట్ల పని దినాలను కల్పించగా అందులో కోటి పనిదినాలు దాకా గత వారం రోజుల్లో జరిగినవేనని అధికారులు వెల్లడించారు. తండాలకు ‘ఉపాధి’ అండ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని జనంగూడ తండాకు చెందిన డంబున్ నాయుడు కుటుంబం ఉపాధి హామీ పనులకు వెళ్లి నెల రోజుల్లో రూ.13,620 సంపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మే 1 వరకు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు 66 పనిదినాలను పొందారు. ఇదే పంచాయతీ పరిధిలోని వివిధ తండాలలో నివసించే 481 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్లి కూలీ కింద రూ.16.02 లక్షలు వేతనం పొందాయి. -
‘ఉపాధి’ బిల్లుల చెల్లింపు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతుభరోసా కేంద్రాల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను సిద్ధంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో జరిగే ఈ పనులకు సంబంధించి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు విడుదల రావాల్సి ఉన్నప్పటికీ.. పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో రూ.1,000 కోట్లను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించింది. వీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో జమయ్యే అవకాశం ఉందని ఆ శాఖాధికారులు వెల్లడించారు. రావాల్సింది రూ.3,350 కోట్లు ఇక ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి మొత్తం రూ.3,350 కోట్ల వరకు రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు నెలాఖరు వరకు జరిగిన పనులకు సుమారు రూ.1,510 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడ్వాన్స్ రూపంలో విడుదల చేసిన రూ.1,000 కోట్లకు తోడు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా గత ఏడాదికి సంబంధించి విడుదలైన రూ.320 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలా మొత్తంమీద గత ఏడాది నవంబరు వరకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,510 కోట్లకు గాను ప్రస్తుతం రూ.1,320 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వద్ద సమకూరడంతో చాలావరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లింపు 2019లో నాటి టీడీపీ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధులు లేకపోయినా ఆ పార్టీ నేతల కోసం పెద్దఎత్తున పనులు మంజూరు చేసింది. వీటికి సంబంధించి దాదాపు రూ.1,500 కోట్ల బకాయిలను గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. -
‘ఉపాధి’లో అక్రమాలకు చెక్
పెద్దతిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ఉపాధి పనులు చేయకున్నా చేసినట్లు ఇష్టానుసారంగా బిల్లులు చేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా తనిఖీ చేసినా, గ్రామసభల ద్వారా అవినీతి నిగ్గు తేల్చాలని శ్రమించినా పెద్దగా ప్రయోజనం లేదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడేది. దీంతో అవినీతి అక్రమాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తే కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఇట్టే దొరికిపోతారు. అందుబాటులోకి ఎన్ఐసీ సాఫ్ట్వేర్ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అదే విధంగా దాదాపుగా అడిగిన వారందరికీ పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న టీసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పనుల గుర్తింపు, బిల్లుల మంజూరు, వేతనదారుల కూలీల చెల్లింపులు తదితర పనులు నిర్వహించేవారు. తాజాగా దాని స్థానంలో ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) సాఫ్ట్‌వేర్‌ను తీసుకు వచ్చారు. ఇందులో ఎన్నో రకాల కొత్త ఆప్షన్లున్నాయి. పథకానికి సంబంధించి డ్వామా అనుబంధ శాఖలైన పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖ సిబ్బందికి కొత్త సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ ఇచ్చారు. ఉపాధి ఉద్యోగుల రిజిస్ట్రేషన్ పూర్తి కాగా, ఎంపీడీవోలు, ఏపీవోలకు కొత్త లాగిన్ ఐడీలు అందజేసారు. ఇప్పటి వరకు ఇలా.. పాత సాఫ్ట్‌వేర్‌లో 160 రకాల పనులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పటి వరకు చెరువులు, ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు), అవెన్యూ ప్లాంటేషన్స్, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు, హార్టికల్చర్, పంట కాల్వలు, పూడిక తీత, స్మశానానికి రోడ్డు సదుపాయం తదితర పనులు చేసేవారు. ఇప్పుడు ఇలా.. కొత్త సాఫ్ట్‌వేర్‌లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి 264 రకాల పనులను చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి, రాళ్ళతో గట్లు వేసుకోవడం, కాలువల్లో పూడిక తీత, సామాజిక బీడు భూముల అభివృద్ధి, సిమెంటు, కాంక్రీట్లతో చెక్‌డ్యాంలు నిర్మించడం, చెత్త కేంద్రాల నుంచి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ విధానం లాంటి పనులను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి పనులు చేపట్టవచ్చు. అక్రమాలకు చెక్ పాత సాఫ్ట్‌వేర్‌లో చేసిన పనులనే పదే పదే చూపిస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనులు నమోదు చేస్తే ఆ పనుల స్థానంలో మళ్ళీ పనులు చేసేందుకు మూడేళ్ళ వరకూ అవకాశం ఉండదు. పని జరిగిన చోట దాదాపు 25 అడుగుల విస్తీర్ణం వరకు కొత్త పనులు చేసేందుకు అనుమతి ఇచ్చే సమస్యే లేదు. ఒక గ్రామంలో జరిగిన పనులను మరో గ్రామంలో జరిగినట్లు చూపించి అక్రమంగా బిల్లులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు. అక్రమాలకు తావు ఉండదు ‘ఉపాధి’లో ప్రభుత్వం అమలు చేసిన కొత్త సాఫ్ట్వేర్ విధానంపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఎస్టిమేషన్స్ లాంటి అంశాలపై వివరించాం. ఇప్పుడు పనుల గుర్తింపు, చెల్లింపులు కూడా కొత్త సాఫ్ట్వేర్ విధానం ద్వారానే చేస్తున్నాం. పథకం లక్ష్యాలను పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం. అక్రమాలకు తావు లేకుండా పనులను పారదర్శకంగా చేపడుతున్నాం. కూలీల సంఖ్య పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాం. – గిరిధర్‌రెడ్డి. ఎంపీడీవో. పెద్దతిప్పసముద్రం మండలం -
‘ఉపాధి’ కూలి పెంపు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఉపాధి కూలీలకు గరిష్టంగా చెలిస్తున్న రోజు వారీ కూలి రూ. 245 నుంచి రూ.257కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుతమిస్తున్న కూలి కంటే రూ.12 అదనంగా పెరిగింది. కేంద్రం ప్రతి ఏటా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లించే రోజు వారీ కూలిరేటు వివరాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు మార్చి నెల చివరి వారంలో ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ పథకం ఏర్పాటు నుంచి రాష్ట్రానికొకరకమైన రేటును కేంద్రం అందజేస్తుంది. ఇందుకనుగుణంగా ఏప్రిల్ ఒకటినుంచి ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా ఉపాధి కూలీలకు చెల్లించే కొత్త రోజువారీ వేతనాల రేటు వివరాలతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కూలీలకు ఏప్రిల్ నుంచి గరిష్టంగా రోజు వారీ కూలి రూ. 257లకు పెంచగా.. తమిళనాడులో రూ. 281, కర్ణాటకలో రూ. 309 చొప్పున కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో రూ.213, పశ్చిమ బెంగాల్లో రూ. 223, మధ్యప్రదేశ్‌లో రూ. 204, మహారాష్ట్రలో రూ. 256కు రోజు వారీ వేతనాన్ని పెంచింది. -
ఉపాధి పనిదినాలను 26 కోట్లకు పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధిహామీ పథకం (నరేగా)లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పనిదినాలను 26 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డిల నేతృత్వంలో పార్టీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి ఆ శాఖలో పెండింగ్ అంశాలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఎంపీల బృందంలో మార్గాని భరత్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, ఆదాల ప్రభాకరరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వైఎస్ అవినాష్‌రెడ్డి, మద్దెల గురుమూర్తి, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రికి అపరిష్కృతంగా ఉన్న అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. విజయసాయిరెడ్డి మంత్రికి నివేదించిన అంశాలు.. బడ్జెట్లో గణనీయంగా తగ్గిన ఉపాధి నిధులు ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు తగ్గించారు. 2020–21 బడ్జెట్లో రూ.1.10 లక్షల కోట్లు ఉపాధిహామీ పనులకు కేటాయిస్తే 2021–22 బడ్జెట్లో రూ.98 వేల కోట్లు, 2022–23 బడ్జెట్లో రూ.73 వేల కోట్లకు కుదించారు. ఈ మొత్తంలో పెండింగ్ బకాయిలు రూ.18,350 కోట్లు తీసేస్తే మిగిలింది కేవలం 54,650 కోట్ల రూపాయలే. అంటే 2021–22 బడ్జెట్‌తో పోల్చుకుంటే నరేగాకు నిధుల కేటాయింపు 50 శాతం కంటే తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు 2021–22లో 23.68 కోట్ల పనిదినాలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పనిదినాలను కల్పించింది. రూ.2,828 కోట్ల పెండింగ్ నిధులు విడుదల చేయండి ఉపాధి హామీ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో మెటీరియల్ కాస్ట్, అడ్మిన్ కాస్ట్ కింద రెండో విడత విడుదల చేయాల్సిన రూ.2,888.64 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తద్వారా రాష్ట్రంలో ఈ పథకం నిరాటంకంగా అమలు చేయడానికి సహకరించాలి. కాఫీ తోటల పనులు చేర్చండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009–10 నుంచి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో కాఫీ తోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటుంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కాఫీ తోటల పెంపకంలో భాగంగా నరేగా కింద వేతనానికి సంబంధించిన గుంతల తవ్వకం, మొక్కలు నాటడం వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చులను ఐటీడీఏ, కాఫీ బోర్డు భరిస్తున్నాయి. అయితే నరేగా పనులు కాఫీ తోటల పనులకు వర్తించవని 2020లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీ రైతులకు వేతనాల చెల్లింపును ఉపసంహరించడంతో అరకు కాఫీసాగు కష్టసాధ్యంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాఫీని వాణిజ్య పంటగా మాత్రమే గుర్తించి నరేగా కింద దానిని పరిగణించడం సరికాదు. కాఫీ తోటలు విరివిగా ఉండే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీసాగు వాణిజ్య పంటగా ఎస్టేట్లలో సాగవుతుంది. కానీ గిరిజన ప్రాంతమైన పాడేరు వంటి ప్రాంతాల్లో కాఫీసాగు కేవలం గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతోంది. అందువల్ల దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి గిరిజన ప్రాంతాల్లో కాఫీ తోటల పనులను నరేగా కింద అనుమతించాలి. ఉద్యాన సాగును అనుమతించాలి కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమలో ఉద్యానపంటల సాగుకు ఉపాధి నిధులు అనుమతించాలి. కరువు పీడిత ప్రాంతాల్లో రైతుకు ఉన్న మొత్తం భూమి విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా.. ఐదెకరాలు సాగుకు వీలైన భూమి ఉన్న రైతులు నరేగా కింద ఉద్యాన పంటలు సాగుచేసుకోడానికి అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానవాటికల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఉపాధి నిధులు వినియోగించుకునేలా అనుమతించాలి. 90 రోజుల పనిదినాలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి అవాస్ యోజన–గ్రామీణ (పీఎంఏవై–జీ) కింద లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా 90 రోజుల పనిదినాలు పొందడానికి అర్హులు. నరేగా కింద పొందే 100 రోజుల పని హామీకి అదనంగా లబ్ధిదారులకు 90 రోజులు పనిదినాలు కల్పించాలి. పీఎంఏవై–జీ కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ధరలకు అనుగుణంగా సవరించాలి. 26 కోట్ల పనిదినాలు అడిగితే 14 కోట్లే ఇచ్చారు ఉపాధి పనిదినాల కేటాయింపుపై గత ఫిబ్రవరిలో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్షలో 26 కోట్ల పనిదినాలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం కేవలం 14 కోట్ల పనిదినాలే కేటాయించారు. ఇది గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సుమారు కోటిమంది పేదలకు నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు 26 కోట్ల పనిదినాలు కేటాయించాలి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిలాలకు డ్రిప్, స్ప్రింక్లర్ల సాగు వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
ఉపాధిలో కేంద్రం భారీ కోత
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలవారీగా కేటాయించే లేబర్ బడ్జెట్‌కు భారీ కోతలు పెట్టింది. ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి 23.68 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించగా 2022–23లో ప్రాథమికంగా కేవలం 14 కోట్ల పనిదినాలనే కేటాయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.27 కోట్ల పనిదినాలు కల్పించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాథమికంగా 10 కోట్ల పనిదినాలే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తరహాలోనే మిగిలిన రాష్ట్రాలకూ లేబర్ బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రం కోరిన దాంట్లో సగమే.. రాష్ట్రంలో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి 30 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించేందుకు జిల్లాలవారీగా లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 తేదీన జరిగిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో కనీసం 26 కోట్ల పనిదినాలను రాష్ట్రానికి కేటాయించాలని అధికారులు కోరారు. తెలంగాణ కూడా తమకు 15 కోట్ల పనిదినాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్రాలు కోరిన దాంట్లో దాదాపు సగం రోజులు కోతలు విధించి కేంద్రం లేబర్ బడ్జెట్ కేటాయింపులు చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు. జూన్‌లో మళ్లీ సమీక్ష... లేబర్ బడ్జెట్లో భారీగా కోతలు విధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవసరమైతే జూన్ చివరిలో మరోసారి రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి అదనపు కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి మొదట 20 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 23.50 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా తొలుత 13 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 14.25 కోట్లకు పెంచారు. ఈ లెక్కన 20 – 25 శాతానికి మించి లేబర్ బడ్జెట్లో అదనపు కేటాయింపులు ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తగ్గుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏడాది చివరకు అదనపు నిధుల కేటాయింపు అవసరం లేకుండా కేంద్రం ముందస్తుగా రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్లో కోతలు విధిస్తూ వస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కోటి మంది పేదలపై ప్రభావం.. రాష్ట్రంలో 97.76 లక్షల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధి కూలీలు పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 57.49 లక్షల కుటుంబాలకు చెందిన 99.48 లక్షల మంది యాక్టివ్ కూలీలు.గత మూడేళ్లలో కనీసం ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైతే యాక్టివ్ కూలీలుగా పరిగణిస్తారు. 2020–21లో రాష్ట్రంలో 47.71 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మంది ఉపాధిహామీ ద్వారా ప్రయోజనం పొందగా 2021–22లో 46.60 లక్షల కుటుంబాలకు చెందిన 77 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉపాధి పథకానికి బడ్జెట్లో కోతలతో దాదాపు కోటి మంది కూలీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కరోనాతో రాబడి తగ్గినా సంక్షేమం ఎక్కువగానే..
సాక్షి, అమరావతి: కరోనా కష్ట సమయంలో రాష్ట్ర ఆదాయ వనరులు తగ్గినా పేదల అభివృద్ధికి ప్రభుత్వం మునుపటి కన్నా ఎంతో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన ప్రతి పథకాన్ని అమలు చేస్తూ, మీట నొక్కి నేరుగా మహిళా లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ము జమచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా మేట్ (గ్రామాల్లో పనులకు కావాల్సిన కూలీలను సమీకరించే వారు)లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం మంగళవారం అవార్డులు అందజేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో నూరుశాతం మేట్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్రం మనదేనని చెప్పారు. నిజాయితీ, బాధ్యతాయుతంగా పనిచేసే మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం నిర్ణయంలో భాగంగా ఉపాధి హామీలో మేట్లుగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షలమంది మహిళలు మేట్లుగా ఉపాధి హామీ పథకానికి కీలకమైన స్థానంలో ఉండి పనిచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 91 లక్షల జాబ్ కార్డులు ఉంటే అందులో 64 లక్షల మంది మహిళలే ఉన్నారని చెప్పారు. మహిళా మేట్లపై నమ్మకంతో ఎక్కువమంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 22 కోట్ల పనిదినాల పాటు పేదలకు ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం అన్ని రంగాల్లోను ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తనకు ఇద్దరు ఆడపిల్లలున్నందుకు తండ్రిగా గర్వపడుతున్నానని స్వయంగా చెప్పడం మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం, నమ్మకాన్ని చాటుతున్నాయన్నారు. తమ ప్రభుత్వం ఆర్థిక, సంక్షేమ పథకాలను మహిళల ద్వారానే ప్రతి కుటుంబానికి అందిస్తోందని గుర్తుచేశారు. స్కోచ్ అవార్డుల్లో గ్రామీణాభివృద్ధి శాఖకే ప్రథమ స్థానం జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరుకు ఇచ్చే స్కోచ్ అవార్డులు గత ఏడాది మనకు మూడు వచ్చాయని తెలిపారు. తాజాగా ప్రకటించిన స్కోచ్ అవార్డుల్లోను ఏపీకి మొదటిస్థానం దక్కిందని, అందులోను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇదంతా ఈ శాఖలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరి కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఉపాధి హామీలో కొత్త చిక్కులు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం మెటీరియల్ విభాగంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలు వచ్చాయి. ప్రస్తుతం గ్రామాల్లో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లతో పాటు డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున సాగుతోంది. ఆ పనుల నిధులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి పంపేది. పంచాయతీ ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగేవి. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే సాఫ్ట్వేర్ ద్వారా పనుల అంచనాలు మొదలు, బిల్లుల చెల్లింపు వరకు జరిగేది. అయితే, గత ఏడాది నవంబరు నుంచి పథకం అమలు అంతా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సాఫ్ట్వేర్ పరిధిలోకి మారింది. పథకం బిల్లులు ఏవైనా గ్రామ పంచాయతీ పేరుతో విడుదల చేసేందుకు కేంద్ర సాఫ్ట్వేర్ అనుమతించదు. పంచాయతీలు బిల్లుల పూర్తి వివరాలతో ఫండ్ ట్రాన్స్ఫర్ వోచరు (ఎఫ్‌టీవో)లను తయారు చేసి, మెటీరియల్ సరఫరా చేసిన వారి బ్యాంకు అకౌంట్ వివరాలను కొత్త సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ఆ బిల్లులను పంచాయతీలతో సంబంధం లేకుండా నేరుగా ఆయా బ్యాంకు అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. పథకం మెటీరియల్ విభాగంలో ప్రతి ఏటా రాష్ట్రంలో రూ. 3,000 నుంచి రూ.4,500 కోట్ల మధ్య పనులు జరుగుతాయి. వీటిలో 90 శాతం పనుల బిల్లులు పంచాయతీల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక మీదట సరఫరాదారులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విధానం వల్ల ఇంతకు ముందులా పని మొత్తానికి ఒకేసారి బిల్లు పెట్టకుండా, ఎప్పటికప్పుడు ప్రతి మెటీరియల్‌కు ఒక బిల్లు చొప్పున పలుమార్లు బిల్లులు పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టీడీపీ నేతల ఫిర్యాదులతో దేశంలోనే తొలిసారిగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు సాఫ్ట్్టవేర్ రూపొందించింది. ఈ విధానం మంచి ఫలితాలివ్వడంతో కేంద్రం దేశమంతటా ఇదే విధానంలో పథకం పర్యవేక్షణ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ పరిధిలోకి రావాలని 2016 నుంచి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. అయితే రాష్ట్రంలో అమలవుతున్న విధానం మరింత పారదర్శకంగా ఉందని చెబుతూ రాష్ట్ర అధికారులు ఆ ప్రక్రియ వాయిదా వేశారు. రాష్ట్ర విధానానికి ప్రతి ఏటా పారదర్శకత కేటగిరిలో కేంద్ర అవార్డులు కూడా వస్తున్నాయి. ఈ పథకంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నిబంధనలు, విధానాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఇటీవల రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర అధికారులు కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి మారాలంటూ ఒత్తిడి తేవడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇదే ఇప్పుడు తిప్పలు తెచ్చిపెడుతోంది. కేంద్రం నిర్ణయాలతో నష్టపోతున్నాం బి.కొత్తకోట (చిత్తూరు): కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, తక్షణమే ఉపశమన చర్యలు చేపట్టకుంటే ఉపాధి పనులు ముందుకు సాగడం కష్టమని పథకం కూలీలు కేంద్ర బృందానికి తెగేసి చెప్పారు. మంగళవారం బి.కొత్తకోట మండలం కోటావూరులో ఈ పథకం కింద జరుగుతున్న కందకాల పనులను కేంద్ర నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వయిజరీ మెంబర్ వందన శర్మ, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎంకే గుప్తా బృందం పరిశీలించింది. ఈ పనుల అంచనా వ్యయం, జరిగిన పని విలువ, కూలీల సంఖ్యను ఉపాధి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్.మధుబాబు వివరించారు. కూలీలతో బృందం ముఖాముఖి మాట్లాడింది. కూలీలు వారి సమస్యలను సూటిగా చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు పనులకు ఇబ్బందిలేదని, కేంద్ర ప్రభుత్వ సాఫ్ట్వేర్ కారణంగా పనులు లేవని తెలిపారు. గతంలో సమ్మర్ అలవెన్సు ఇచ్చేవారని, కేంద్రం దానినీ తొలగించిందని చెప్పారు. గడ్డపార పదునుకు రూ.60, పార పదునుకు రూ.30 ఇచ్చేవారని.. దీన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో కేటాయించిన పనిని రోజులో ఒక పూట చేసేవాళ్లమని.. ఇప్పుడు కేంద్రం రోజుకు రెండు పూటల పనులు చేయాలని నిర్దేశించిందన్నారు. వంద రోజుల పనిదినాలు సరిపోవడంలేదని, దీన్ని 150 రోజులకు పెంచాలని కోరారు. ఈ సమస్యలను కేంద్రానికి నివేదిస్తామని బృంద సభ్యులు తెలిపారు. వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతులు, ప్రజాప్రతినిధులు కేంద్ర బృందాన్ని కోరారు. బి.కొత్తకోట మండలం అమరనారాయణపురంలో ఉపాధి సిబ్బంది, అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులను అనుసంధానం చేయాలని కోరారు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో కూలీలకు నష్టం ఉపాధి హామీ పనులకొచ్చే కూలీ కుటుంబాలకు కొత్త సాఫ్ట్వేర్ నష్టం కలిగించేలా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌లో రోజువారీ పనికి వచ్చే కూలీల సంఖ్యను స్థానిక ఫీల్డు అసిస్టెంట్లు (ఎఫ్ఏ)లు యాప్ ద్వారా తెలియజేసి, ఆ రోజు పనికివచ్చిన కూలీల అటెండెన్స్ తీసుకొనేవారు. పనికి వచ్చిన వారికి కూలీ చెల్లించేవారు. ఈ ప్రక్రియలో పనికి హాజరైన వారి వివరాలతో ఆ కుటుంబం వంద రోజుల పని దినాలను లెక్కించే వారు. కొత్త విధానంలో ఎఫ్‌ఏలు యాప్ ద్వారా ముందస్తుగా తెలియజేసే వివరాల ప్రకారం ఏ కుటుంబం ఎన్ని రోజులు పనికి హాజరయ్యారన్నది లెక్కిస్తారు. కూలీ మాత్రం పనికి హాజరయ్యే వారికే చెల్లిస్తారు. నిబంధనల ప్రకారం ఏడాదికి వంద పనిదినాలు మాత్రమే పనులు ఇస్తారు. ఫలితంగా ముందుగా పనికి వస్తామని చెప్పి, ఏ కారణంతోనైనా హాజరు కాకపోతే, వారు కూలీ నçష్టపోతారని అధికారులు చెబుతున్నారు. వారు హాజరవుతామని చెప్పిన రోజుకు బదులుగా వేరొక రోజు పని చేసుకునే అవకాశం కూడా ఉండదు. అంటే, వారు పనికి వచ్చినా, రాకపోయినా ముందస్తు సమాచారం ప్రకారం 100 రోజుల పని దినాలు లెక్కిస్తారు. దీనివల్ల ఒక కూలీ రెండు రోజులు పనికి హాజరు కాకపోతే, ఆ పని దినాలతో పాటు కూలీ కూడా నష్టపోతారు. ఈ అన్యాయంపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. -
Andhra Pradesh: వడివడిగా నిర్మాణాలు
నా పాదయాత్ర సమయంలో గ్రామాల దుస్థితి చూసి ఆవేదన కలిగింది. అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించకూడదు. నివాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండరాదు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలి. ఎఫ్ఎస్టీపీ (మురుగు వ్యర్థాల శుద్ధి) ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రాధాన్యత క్రమంలో ఉపాధి హామీ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలపైనా దృష్టి సారించాలని సూచించారు. అమూల్ పాల సేకరణ చేస్తున్న జిల్లాలు, ప్రాంతాలకు అనుగుణంగా బీఎంసీయూలను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్ కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, మంచినీటి సరఫరా తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మురుగు నీటి శుద్ధి ప్రణాళిక జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ప్రాసెసింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం కాగా ప్రస్తుతం 61.5 శాతానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు కల్లా పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మురుగు నీరు నిల్వ ఉన్న దాదాపు 582 ప్రాంతాలను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించి బయో, వెట్ ల్యాండ్ ట్రీట్మెంట్, వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ తదితర విధానాల్లో రూపొందించిన శుద్ధి ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఏడాదిలోగా పనులు పూర్తి కావాలని, నిర్వహణపై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రూ.50 కోట్ల చెక్కును ఏపీ అధికారులకు అందిస్తున్న తమిళనాడు అధికారులు వైఎస్సార్ జలకళ.. వైఎస్సార్ జలకళ పురోగతిపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గు అప్పగించి వాటి ద్వారా రైతుల పొలాల్లో బోర్లు తవ్వాలని సూచించారు. బోరు తవ్విన వెంటనే మోటారు కూడా బిగించాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణ.. గత సర్కారు హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికి వదిలేశారని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు విస్తారంగా వర్షాలు కురిశాయని, అప్పటికే అధ్వానంగా ఉన్న రోడ్లు దీంతో బాగా దెబ్బతిన్నాయన్నారు. క్రమం తప్పకుండా చేపట్టాల్సిన నిర్వహణను గత సర్కారు విస్మరించడంతో అన్ని రహదారులకు ఒకేసారి మరమ్మతులు, నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉత్పన్నమైందన్నారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, నిర్మాణంపై అత్యుత్తమ కార్యాచరణ రూపొందించి ఏ దశలోనూ నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో రక్షిత తాగునీరు జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికి మౌలిక సదుపాయాల కల్పనపై ధ్యాస పెట్టాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మంచినీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విధానం తేవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్‌కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఖర్చవుతుంది మరి.. సహ’ దరఖాస్తుదారుడికి షాకిచ్చిన ఏపీవో ఆశారాణి
ఎర్రావారిపాళెం: ఉపాధి పనులకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి రూ.4.53 లక్షల డీడీ పంపాలంటూ ఏపీవో తిరుగుటపా పంపారు. చిత్తూరు జిల్లా చింతగుంట పంచాయతీ పసుపులేటివారిపల్లికి చెందిన చెన్నయ్య తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి 2009వ సంవత్సరం నుంచి వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. సదరు వ్యక్తికి ఏపీవో ఆశారాణి.. సమాచారం పంపేందుకు రూ.4.53 లక్షలు డీడీ పంపాలని తిరుగుటపా పంపడంతో దరఖాస్తు దారుడు నివ్వెరపోయాడు. దీనిపై ఏపీవోను వివరణ కోరగా.. 2009 నుంచి అన్ని ప్రింట్ల జిరాక్స్‌లు తీసి ఇవ్వాలంటే అంతే అవుతుందని సూపరింటెండెంట్ లెక్కించినట్టు చెప్పారు. చెన్నయ్యకు ఏపీవో నుంచి అందిన నోటీసు -
చెల్లించాల్సింది రూ.126 కోట్లే
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి కేవలం రూ.126 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. మిగిలిన మొత్తాలను చెల్లించేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యంలో ఇక విచారించేందుకు ఏమీ లేదని, దీన్ని పరిష్కరిస్తామని తెలిపింది. బకాయిలను 12 శాతం వార్షిక వడ్డీతో చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం చెల్లిస్తోందని ప్రజల డబ్బు అని, ప్రజల డబ్బును కాంట్రాక్టర్లకు పంచడం ఏమిటని ప్రశ్నించింది. మీరు ఇంట్రస్ట్ (వడ్డీ) గురించి మాట్లాడితే.. మేం ఈ వ్యాజ్యాల వెనుక మీకున్న ఇంట్రెస్ట్ (ప్రయోజనాలు) ఏమిటన్న దానిపై దృష్టి పెడతామని తేల్చి చెప్పింది. బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్టు తెలిపింది. నాలుగు వారాల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం చేసిన పనులకు సరఫరా చేసిన మెటీరియల్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. -
మేమింతే.. మారమంతే!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై తమకున్న రాజకీయ దుగ్ధతో నిరుపేదల పొట్టకొట్టేందుకు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుయాయులు వెనుకాడటం లేదు. ఏటా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులకు తెరతీశారు. రాష్ట్రంలో పథకం అమలు తీరుపై కేంద్ర అధికారులు గురువారం మధ్యంతర సమీక్ష నిర్వహించనుండగా సరిగ్గా రెండు రోజుల ముందు విషం చిమ్మారు. రాష్ట్రంలో ఉపాధి హామీ అమలులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ‘ఈనాడు’ దినపత్రిక ‘నాకింత.. నీకింత’ శీర్షికన మంగళవారం పతాక కథనాన్ని ప్రచురించింది. టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన ఘటనలను ఇప్పుడే చోటు చేసుకున్నట్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను వెలువరించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రానికిచ్చిన ఉపాధి హామీ నిధులను వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. టీడీపీ ఎంపీలు సైతం ఫిర్యాదులు చేశారు. ఇలా అడ్డుపుల్లలు వేస్తూ రాష్ట్రానికి కేటాయించిన నిధుల విడుదలలో జాప్యం జరిగేలా అడ్డుకుంటున్నారు. టీడీపీ హయాంలోనే.. ప్రకాశం జిల్లా పెద్దరావీడు మండలం రేగుమానుపల్లి, సుంకేసుల, తంగిరాలపల్లి గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులు ఉపాధి హామీ పనులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి వారి పేరుతో రూ.2,949 ఆయా కుటుంబాలకు చెల్లింపులు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. వాస్తవానికిæ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందే 2019 ఏప్రిల్, మే నెలలో ఆ మూడు గ్రామాల్లో అంతకుముందెప్పుడో చనిపోయిన వ్యక్తులు ఆ సమయంలో పనిచేసినట్లు చూపి డబ్బులు డ్రా చేసుకున్నారు. అప్పటి సంఘటనకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో విచారణ అనంతరం అవినీతికి పాల్పడిన వారికి నోటీసులు జారీ చేసి డబ్బులు రికవరీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పది రోజుల క్రితం నోటీసులిచ్చారు. వాస్తవాలు ఇలా ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి జరిగినట్లుగా చిత్రీకరిస్తూ ఆ పత్రిక కథనాలను వెలువరించింది. పనులు కాగానే ఫ్యాక్టరీకి మరింత ఆదాయం కోసం గ్రామాల్లో పేదలు పగలు ఉపాధి పనులు, సాయంత్రం ఇతర కూలి పనులకు వెళ్లడం సాధారణమే. వేసవి, కరోనా దృష్ట్యా ఈ ఏడాది మే, జూన్, జూలైలో రాష్ట్రంలో చాలా చోట్ల నిబంధనల ప్రకారం ఎండ బాగా పెరగకముందే ఉపాధి హామీ కూలీలు తిరిగి వెళ్లేలా అ«ధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే తరహాలో విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండకు చెందిన పలువురు కూలీలు ఉదయం ఉపాధి హామీ పనులకు, తర్వాత స్థానికంగా జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనులకు వెళ్లారు. దీన్ని ఉదాహరణగా చూపిస్తూ మరో చోట పనులకు వెళ్లిన వారు అదే రోజు ఉపాధి పనులకు కూడా వచ్చి అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు ఆ పత్రిక కథనాన్ని వెలువరించింది. ఆయా రోజుల్లో తాము రెండు చోట్ల పనులకు హాజరైనట్లు తెలియచేయడంతోపాటు కొందరు లిఖితపూర్వకంగా ఆ వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అందచేసినట్లు తెలిసింది. ఆ మస్టర్లు అంతా ఉత్తదే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరానికి చెందిన వేతనదారులు విదేశాలకు వెళ్లిన వారి పేర్లతో మస్టర్లు వేసి డబ్బులు వారి ఖాతాల్లో వేసినట్లు ఈనాడు పత్రిక పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జిల్లా అధికారులు అసలు అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. ఆ కథనంలో పేర్కొన్న పేర్లతో ఉపాధి హామీ ద్వారా ఎలాంటి చెల్లింపులు జరగలేదని అధికారులు తేల్చారు. జగన్నాథపురంలో మృతి చెందిన వారి పేర్లతో మస్టర్లు వేసి చెల్లింపులు జరిపినట్లు వచ్చిన వార్తల్లోనూ నిజం లేదని తేల్చారు. కరోనాలోనూ పనుల కల్పనలో టాప్.. కరోనా మహమ్మారి దేశమంతా ప్రజల జీవితాలను అతలాకుతలం చేయగా మన రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకుంది. ఒక పక్క కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే పని చేసుకోవడానికి ముందుకొచ్చే కుటుంబానికి రూ.20 వేలకు పైబడి ఆదాయాన్ని కల్పించింది. 2019–20లో 40.41 లక్షల కుటుంబాలకు పథకం ద్వారా పనులతో రూ.4,081 కోట్ల మేర ఉపాధి కల్పించగా 2020–21లో 47.77 లక్షల కుటుంబాలకు రూ.5,953 కోట్లు ఉపాధి కూలీ కింద చెల్లించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత ఆరున్నర నెలల్లో 45.32 లక్షల కుటుంబాలకు కూలీ రూపంలో రూ.4,769 కోట్లు చెల్లించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే పేదల్లో 71 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే కావడం గమనార్హం. ఉపాధి పథకం అమలులో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పనులు పొందడంలో పేదలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎక్కడికక్కడే సమస్య పరిష్కారం కోసం కొత్తగా ప్రతి జిల్లాలోనూ అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవస్థే లేదు. అవినీతి జరిగితే వెంటనే గుర్తించేందుకు సోషల్ ఆడిట్ ప్రక్రియను సైతం మెరుగుపరిచారు. ఆ పత్రికకు లీగల్ నోటీసుల జారీకి నిర్ణయం.. గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు రాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కూలీలను అవినీతిపరులుగా చిత్రీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను సైతం దెబ్బతీసే తప్పుడు సమాచారంతో కథనం ప్రచురించిన ఈనాడు దినపత్రికకు లీగల్ నోటీసు జారీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయపరమైన సలహాలు తీసుకున్నారని, గురు లేదా శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధి బకాయిలు చెల్లించాం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే రూ.1,121 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.372 కోట్లను ఈ నెల 4న విడుదల చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ తెలిపారు. ఈ మొత్తాలను ఆయా గ్రామ పంచాయతీలకు జమ చేశామన్నారు. గతంలో చెల్లించిన రూ.1,121 కోట్లలో రూ.1,061 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని, పలు కారణాలతో రూ.60 కోట్లు పంచాయతీల ఖాతాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలను చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. -
రూ.756 కోట్లను వారంలో చెల్లిస్తాం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో రూ.5 లక్షలకు పైగా విలువైన పనులకు సంబంధించిన బకాయిల్లో రూ.756 కోట్లను వారం రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల్లో రూ.571 కోట్లు అందాయని, ఈ మొత్తానికి రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన రూ.185 కోట్లు కలిపి వారం రోజుల్లో ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. బకాయిల కింద చెల్లించాల్సిన మొత్తం రూ.1,117 కోట్లలో ఈ రూ.756 కోట్లు పోను మిగిలిన రూ.361 కోట్లను కేంద్రం నిధులు విడుదల చేయగానే చెల్లిస్తామంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బకాయిల చెల్లింపునకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బు అందిందా? లేదా? కూడా ఆ అఫిడవిట్లో చెప్పాలంది. రాష్ట్రానికి అదనపు నిధుల విడుదలకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ కొందరు కాంట్రాక్టర్లు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై కొద్ది వారాలుగా విచారణ జరుపుతూ వస్తున్న ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ నిర్వహించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్, కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు. -
ఉపాధి హామీ బిల్లులు రెండు వారాల్లో చెల్లించండి
సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన బకాయిలను రెండు వారాల్లో పిటిషనర్లందరికీ చెల్లించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బకాయిలు చెల్లించకపోవడం పౌరులు హుందాగా జీవించే హక్కును హరించే విధంగా ఉందంది. కొందరికి బకాయిలు చెల్లించామని, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లులను చెల్లించడంలేదంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం మరోసారి విచారణ జరిగింది. బకాయిల డబ్బు పిటిషనర్ల ఖాతాల్లో జమ కాలేదని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ న్యాయవాది వడ్లమూడి కిరణ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖర్చు చేయని నిధులు ఉన్నాయన్న కేంద్రం వాదన సరికాదన్నారు. రాష్ట్రం అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని కేంద్రం నిధుల విడుదల సమయంలో సర్దుబాటు చేసుకుందని తెలిపారు. ఇప్పటికే బకాయిలను ఆయా పంచాయతీల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. బకాయిలను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేసిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ, పిటిషనర్లకు బకాయిలను మాత్రం రెండు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు. -
వారి బకాయిలు చెల్లించేశాం
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించి పిటిషనర్లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు మెమో దాఖలు చేశామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ దేవానంద్ మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, 32 వ్యాజ్యాల్లోని పిటిషనర్లకు బకాయిలు చెల్లించామని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కొందరు తమకు బకాయిలు పూర్తిగా చెల్లించారని, మరికొందరు పాక్షికంగా చెల్లించారని, మరికొందరు తమ డబ్బు అందలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎవరెవరికి బకాయిలు అందలేదో తెలుసుకుని చెప్పాలని న్యాయమూర్తి వారిని ఆదేశించారు.