సాక్షి, అమరావతి: పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వంద రోజుల వ్యవధిలోనే పేదలకు వారి గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,554.34 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. పని కావాలని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడంతో పాటు సగటున రోజువారీ వేతనంగా రూ. 246 చొప్పున అందజేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాథమికంగా 15 కోట్ల పని దినాలు కేటాయించింది.
ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం పని కావాలని అడిగిన ప్రతి వారికి తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధనకు అనుగుణంగా జూన్ నెలాఖరు నాటికే ఆ 15 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తయినా.. అదనపు పనుల కేటాయించాలని కోరుతూ కేంద్రానికి సమాచారం తెలియజేసి, ఆ తర్వాత పని కావాల్సిన వారికి పనులు కల్పిస్తూ వస్తోంది. శనివారం (జూలై 22వ తేదీ) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 42.27 లక్షల కుటుంబాలు 18.47 కోట్ల పని దినాలను పూర్తి చేసుకుని లబ్ధి పొందినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రం కల్పించలేని స్థాయిలో..
దేశవ్యాప్తంగా మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతుండగా... అత్యధికంగా పనుల కల్పనలో మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 69.26 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కార్డులు ఉండగా, అందులో 56.76 లక్షల కుటుంబాలు గత మూడేళ్లలో అవసరమైన రోజు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకొని లబ్ధి పొందినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. గత వంద రోజులలో మన రాష్ట్రంలో మొత్తం æ74,092 మంది దివ్యాంగులు కూడా ఉపాది హామీ పథకం పనులకు హాజరై లబ్ధి పొందారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.
24 కోట్ల పని దినాలు సాధించే దిశగా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు పూర్తికాక మునుపే.. 18.47 కోట్ల పని దినాలు కల్పించిన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 24 కోట్ల పనిదినాలు కల్పించేలా లేబర్ బడ్జెట్ కేటాయింపులను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర అధికారులు సమావేశం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment