Rural Development Department
-
పవన్ శాఖలో చీలిక పీలికలు ఎందుకో!
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన మంత్రిత్వ శాఖలనూ చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలను వేర్వేరు శాఖలుగా విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను వేరు చేసి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడం చర్చకు దారితీసింది. ఈ రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్నా రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన శాఖల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత వేధిస్తోందని ఆయన చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా ఫింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలోనే సాగుతోంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అలాంటిది సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్‌కు కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సెర్ప్‌కే అధికంగా నిధులుపంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్‌పరంగా చూసినా నిధుల కేటాయింపు సెర్ప్‌కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు రూ.27 వేల కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తోంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటూ తప్పనిసరి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే నిధులే. అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. ఓవైపు నిధుల కేటాయింపులోనూ అధిక వాటా కలిగి ఉండి, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యక్షంగా ప్రజల నుంచి మంచి పేరును తెచి్చపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్‌ను పవన్ కళ్యాణ్‌కు కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. నారాయణకు ప్రత్యేకం గ్రామాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ ఉన్నట్టే.. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మెప్మా పేరుతో ఒక విభాగం ఉంది. అయితే, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న మెప్మాను ఆ శాఖ మంత్రి నారాయణ పరిధిలోనే ఉంచడం గమనార్హం. -
మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’?
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కొత్త పద్ధతుల్లో ‘పనికి ఆహార పథకం’ అమలు కానుందా? జాతీయ స్థాయిలో బియ్యం నిల్వలు పేరుకుపోవడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార సమస్య ల పెరుగుదలతో కొత్త రూపంలో ఈ పథకాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగు తోంది. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్) కింద చేసే ఉపాధి పనులకు ఇచ్చే కూలీలో కొంత (పార్ట్ పేమెంట్) బియ్యం ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తోంది. భారీగా పెరిగిన నిల్వలు..: గతేడాది బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషే ధం, పారాబాయిల్డ్ రైస్‌పై 20 శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీ వంటి చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలతో దేశంలో బియ్యం నిల్వలు 1.4 కోట్ల టన్నులకు చేరుకోవడంతో గిడ్డంగి ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో ‘పనికి ఆహార పథకం’కింద గ్రామీణభివృద్ధి శాఖకు బియ్యం కేటాయింపును ఒక మార్గాంతరంగా కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వివిధ కాంబినేషన్లు, రూపాల్లో దీన్ని ఇచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. ప్రయోజనం ఉండదంటున్న నిపుణులు కూలీ మొత్తంలో కొంత భాగాన్ని బియ్యంగా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కూలీలు ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే ఆస్కారం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి రావడానికి ముందు ‘పనికి ఆహార పథకం’కింద అనేక అక్రమాలు, కుంభకోణాలు జరిగిన తీరును గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ‘ఫుడ్ ఫర్వర్క్ స్కీం’లో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలు చోటుచేసుకోవడం, ఈ పథకం కింద కేటాయించిన బియ్యం నేరుగా బహిరంగ మార్కెట్‌కు చేరుకోవడం వంటివి జరిగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అదీగాకుండా ఉపాధి హామీ పథకం కింద కూలీని నగదు రూపంలో ఇవ్వాల్సి ఉండటం, ఇచ్చే బియ్యానికి లెక్క కట్టడం, ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయని చెబుతున్నారు. -
ఇక జెడ్పీలు, మండలాల్లో ‘ప్రత్యేక’ పాలన
సాక్షి, హైదరాబాద్: జిల్లా, మండల పరిషత్‌లలో ‘ప్రత్యేక’ అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. జూలై 4తో 32 జిల్లా పరిషత్‌లు, 538 మండల పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. టర్మ్ ముగిసేలోగా ఎన్నికలు జరిపే అవకాశం లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు వీలుగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. మెజారిటీ జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే ఉండటంతో ఎన్నికలు జరిగే దాకా పాత పాలక మండళ్లనే కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై 5 కల్లా కసరత్తు పూర్తిచేసి, పీఆర్, రెవెన్యూ, మున్సిపల్,విద్య, వైద్య, ఆరోగ్య శాఖల నుంచి ఉద్యోగుల హోదాలకు అనుగుణంగా ప్రత్యేక అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. గత ఫిబ్రవరి 1తో రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామపంచాయతీల కాలపరిమితి ముగిసింది. మరుసటి రోజు నుంచే పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. ఇవీ సమస్యలు... పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా వివిధ కారణాలు, ఆయా అంశాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వపరంగా అటు గ్రామపంచాయతీలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడుగు ముందుకుపడలేదు. ⇒ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, ఉపకులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అయితే ఈ వాగ్దానం అమలు చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ ద్వారా చర్యలు చేపట్టాల్సి ఉండగా, దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో కసరత్తు మొదలు కాలేదు. ⇒ బీసీ కులగణన ఆధారంగా గ్రామీణ స్థానికసంస్థల్లో స్థానికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కులగణనకు ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ⇒ బీసీ కమిషన్పరంగా ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణ, రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు సమాచారం. ⇒ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓటర్ల జాబితా ప్రకారమా లేక క్షేత్రస్థాయిలో చేపట్టే సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా ముందుకెళ్లాలా అనే దానిపై ప్రభుత్వపరంగా స్పష్టత కొరవడినట్టు చెబుతున్నారు. ⇒ ఓటర్ల లిస్ట్‌కు అనుగుణంగా అయితే పెద్దగా శ్రమ లేకుండా త్వరగానే క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చొచని, సామాజిక, ఆర్థిక కులసర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ మరో రెండునెలల్లో (ఆగస్టు నాటికి) ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిషన్న్ద్వారానే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేస్తారా లేక కొత్త కమిషన్‌ను నియమించేదాకా ఆగుతారా అనేదానిపై స్పష్టత లేదు. ట్రిపుల్ టెస్ట్..మరో మెలిక సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై మార్గదర్శకాలు నిర్దేశించింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిపై తేల్చాలని స్పష్టం చేసింది. ⇒ మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి) 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. ⇒ ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహ¯న్‌రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. ⇒ ఓటర్ల జాబితా ప్రకారం కసరత్తు పూర్తిచేసి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లినట్టు తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందిగ్ధత నెలకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ⇒ రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆ వివరాలు, ఎన్నికల నిర్వహణకు తేదీలు తెలియజేస్తే 15, 20 రోజుల అంతరంలో గ్రామపంచాయతీ, జిల్లా, మండలపరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
‘ఉపాధి’లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత వంద రోజుల వ్యవధిలోనే పేదలకు వారి గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,554.34 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. పని కావాలని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడంతో పాటు సగటున రోజువారీ వేతనంగా రూ. 246 చొప్పున అందజేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదలయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రాథమికంగా 15 కోట్ల పని దినాలు కేటాయించింది. ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం పని కావాలని అడిగిన ప్రతి వారికి తప్పనిసరిగా పనులు కల్పించాలన్న నిబంధనకు అనుగుణంగా జూన్ నెలాఖరు నాటికే ఆ 15 కోట్ల పని దినాల లక్ష్యం పూర్తయినా.. అదనపు పనుల కేటాయించాలని కోరుతూ కేంద్రానికి సమాచారం తెలియజేసి, ఆ తర్వాత పని కావాల్సిన వారికి పనులు కల్పిస్తూ వస్తోంది. శనివారం (జూలై 22వ తేదీ) నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 42.27 లక్షల కుటుంబాలు 18.47 కోట్ల పని దినాలను పూర్తి చేసుకుని లబ్ధి పొందినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రం కల్పించలేని స్థాయిలో.. దేశవ్యాప్తంగా మొత్తం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులు కొనసాగుతుండగా... అత్యధికంగా పనుల కల్పనలో మన రాష్ట్రమే దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం తర్వాత తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 69.26 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కార్డులు ఉండగా, అందులో 56.76 లక్షల కుటుంబాలు గత మూడేళ్లలో అవసరమైన రోజు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకొని లబ్ధి పొందినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. గత వంద రోజులలో మన రాష్ట్రంలో మొత్తం æ74,092 మంది దివ్యాంగులు కూడా ఉపాది హామీ పథకం పనులకు హాజరై లబ్ధి పొందారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. 24 కోట్ల పని దినాలు సాధించే దిశగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు పూర్తికాక మునుపే.. 18.47 కోట్ల పని దినాలు కల్పించిన నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం 24 కోట్ల పనిదినాలు కల్పించేలా లేబర్ బడ్జెట్ కేటాయింపులను పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. -
సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా వ్యవహార శైలిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన వ్యవహారశైలి మార్చుకునేలా జోక్యం చేసుకోవాలని మంత్రి దయాకర్‌రావును తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం విన్నవించింది. ఈ మేరకు ఓ వినతిపత్రం మంత్రికి సమర్పించింది. సానుకూల వాతావరణం చెడిపోతోంది తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి తీసుకున్న చర్యలతో దీర్ఘకాలంగా ఉన్న సర్వీసు, పరిపాలనా పరమైన సమస్యలు పరిష్కారమై అన్ని స్ధాయిల్లో ప్రమోషన్లు, పోస్టింగ్‌లతో అధికారులు, ఉద్యోగుల్లో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆ సంఘం సభ్యులు వెల్లడించారు. అయితే కొంతకాలంగా సుల్తానియా వ్యవహారశైలి, అధికారులు, ఉద్యోగుల పట్ల ప్రదర్శిస్తున్న అనుచిత వైఖరితో ఈ సానుకూల వాతా వరణమంతా దెబ్బతిందని మంత్రి దృష్ఖికి తీసుకొచ్చారు. టెలీ, వీడియో కాన్ఫ రెన్స్లలో అధికారులు, ఉద్యోగుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి అధికారుల స్పందన, వారి వైపు నుంచి అభిప్రా యాలు తీసు కోకుండానే పరుషంగా వ్యవహరిస్తుండడంతో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. చిన్న చిన్న కారణాలతో డీఆర్డీవోలు, డీపీవోలను సైతం సస్పెన్షన్ లేదా ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి పరిణామాలు అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు, అయోమయానికి గురి చేస్తున్నాయని తెలియజేశారు. పీఆర్ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, తక్షణమే మంత్రి ఎర్రబెల్లి జోక్యం చేసుకుని పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు. పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం telangana ceo ఎర్రబెల్లికి తెలంగాణ సీఈవోలు, డిప్యూటీ సీఈవోల సంక్షేమ సంఘం వినతిపత్రం -
ఇక కొండలపై మొక్కల పెంపకం
సాక్షి, అమరావతి : గ్రామీణ ప్రాంతాల్లోని కొండలపై ఈ వర్షాకాలంలో ఒకే రోజు కోటి పండ్ల మొక్కలు నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. ఉపాధి హామీ పథకంలో.. కొండలపై మొక్క బతికేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి ఖర్చుతో అధికారులు ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సాధారణంగా మొక్కల పెంపకంలో ఒక్కో మొక్క నాటాలంటే.. గుంత తీసేందుకు కనీసం రూ.25, మొక్క కొనుగోలుకు రూ.25 నుంచి రూ.50.. ఇలా ఒక్కో మొక్కకే రూ.50 నుంచి 100 దాకా ఖర్చవుతుంది. అయితే సీడ్ బాల్స్ విధానంలో ఒక్కో మొక్కపై కేవలం అర్థరూపాయి మాత్రమే ఖర్చుపెట్టేలా కొండలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సేంద్రియ ఎరువులతో కూడిన షోషకాలు ఎక్కువగా ఉండే మట్టిని సిద్ధం చేసుకుని.. ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేస్తారు. ఒక్కో ఉండలో నాటాల్సిన మొక్కకు సంబంధించిన విత్తనాన్ని ఉంచుతారు. ఎలాంటి నేలలోనైనా నామమాత్రపు తేమకే ఆ విత్తనం మొలకెత్తేలా ఆ మట్టి ఉండలు(సీడ్స్ బాల్స్) అత్యంత నాణ్యంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం, మట్టి ఉండల తయారీకి అయ్యే ఖర్చు కూడా ఒక్కో దానికి అర్ధరూపాయి లోపే ఉంటుందంటున్నారు. కనీసం వెయ్యి కొండల్లో పదివేల చొప్పున.. ఈ వర్షాకాలంలో కొండలపై కోటి మొక్కలు పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ.. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు మండలానికి రెండేసీ కొండలను ఎంపిక చేసుకోనుంది. మండలానికి కనీసం ఒక్క కొండపైనైనా ఈ సీడ్ బాల్స్ విధానంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇలా రాష్ట్రంలో 660 మండలాల్లో కనీసం వెయ్యి కొండల్లో ఒక్కో కొండపై పది వేల చొప్పున మొక్కల పెంపకాన్ని చేపడతారు. ఉపాధి హామీ పథకం, వాటర్‌హెడ్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో కూలీల ద్వారా వర్షం నీరు నిల్వలకు స్ట్రెంచ్‌ల తవ్వకం జరిపిన కొండలను ఎక్కువగా ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కాగా, సీతాఫలం, ఉసిరి, రేగు వంటివాటితో పాటు కుంకుడు, వెలగ వంటి వాటినే ఈ మొక్కల పెంపకం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. నీడకు పనికొచ్చే వేప, కానుగ మొక్కలను కూడా పెంచుతారు. కొండల గుర్తింపు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వర్షాకాలం మధ్య కల్లా కార్యక్రమాన్ని చేపడతామని అధికారులు వెల్లడించారు. -
గిరిజనులకు అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రతియేటా రూ.151 కోట్ల మేర అదనపు ‘ఉపాధి’ చేకూర్చేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఆయా కుటుంబాలన్నింటినీ ఉపాధి హామీ పథకంలో ఏటా 150 రోజుల చొప్పున పనులు పొందే వారి జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం.. సాధారణ కుటుంబాలకు ఏటా గరిష్టంగా వంద రోజుల చొప్పున పనులు కల్పిస్తున్నప్పటికీ, అటవీ భూహక్కు పట్టాదారులకు కుటుంబానికి ఏటా 150 రోజులు పనులు కల్పించే వెసులుబాటు ఉంది. దీంతో.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్ఓఎఫ్ఆర్ లబ్దిదారులు మొత్తం 1,82,316 కుటుంబాలు ఉండగా.. నెలరోజుల క్రితం వరకు ఈ సంఖ్య 72,646 కుటుంబాలు మాత్రమే 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హత ఉన్న జాబితాల్లో పేర్లు నమోదు చేసుకున్నాయి. నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్.. ఈ నేపథ్యంలో.. అర్హత ఉన్న మిగిలిన కుటుంబాలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా గిరిజన గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లే తమ పరిధిలోని ఆయా అర్హులను గుర్తించి, వారి వివరాలను మండల కేంద్రంలో అప్డేట్ చేస్తారు. గత 15 రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లే ఆయా లబ్ది దారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,424 కుటుంబాలను కొత్తగా 150 రోజుల పనిదినాలు పొందేందుకు అర్హుల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇంకా 55,246 కుటుంబాలను ఈ పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని.. ఈ నెలాఖరుకల్లా అర్హులందరినీ ఈ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. ఇక ప్రస్తుతం గరిష్టంగా ఏటా వంద రోజుల చొప్పున ఉపాధి హామీ పథకం పనులు పొందుతున్న ఆయా కుటుంబాలు అదనంగా 50 రోజుల ఉపాధి పొందితే ఒక్కో పనిదినానికి గరిష్టంగా రూ.272 చొప్పున రూ.13,600ల వరకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. -
AP: గ్రామీణాభివృద్ధిశాఖకు మరో స్కోచ్ అవార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మరో స్కొచ్ అవార్డును సొంతం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటిని పెద్ద ఎత్తున నిల్వచేసుకునే ప్రక్రియలో భాగంగా అమృత్ సరోవర్ కార్యక్రమం అమలుకుగాను 2023 సంవత్సరానికి స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఒక్కో జిల్లాలో 75 వంతున రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 1,950 చెరువులను ఈ కార్యక్రమంలో ఉపాధి పథకం ద్వారా నిరి్మంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,810 చెరువుల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా మిగిలిన 140 చెరువుల నిర్మాణం పూర్తవుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. స్కోచ్ సిల్వర్ అవార్డుకు రాష్ట్రం ఎంపికైన విషయాన్ని స్కోచ్ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలకు గత ఏడాది గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)తో పాటు వివిధ జిల్లాల డీఆర్డీఏలకు ఆరు స్కోచ్ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుచ్లర్ -
జేపీఎస్‌ల సమ్మె ఉధృతం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్/ఓపీఎస్) సమ్మె తీవ్రరూపం దాల్చుతోంది. తమ సర్వీసు రెగ్యుల రైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటిదాకా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలు తెలిపిన జేపీఎస్‌లు, ఇకముందు ఆందోళన కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నారు. వినూత్న పద్ధతుల్లో నిరసనలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామస్తుల నుంచి వీరికి మద్దతు పెరుగుతోంది. మరోవైపు ఓ మహిళా జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన ఉద్యోగం ఇక పర్మినెంట్ కాదనే బెంగతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని జేపీఎస్‌లు చెబుతున్నారు. ఇదిలాఉండగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరసన కార్యక్రమాలు వరుసగా 15వ రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఆడి, ర్యాలీ తీసి ప్రదర్శనలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘భద్రాద్రి రామయ్యా.. రెగ్యులరైజేషన్ జీవో ఇప్పించయ్యా’ అనే బ్యానర్‌ను ప్రదర్శిస్తూ గోదావరి నదిలో దిగి నిరసన తెలిపారు. కాగా 15 రోజులుగా జేపీఎస్‌లు విధులకు గైర్హాజరు అవుతుండటంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. తొమ్మిది వేల మందికిపైగా సమ్మెలోనే.. రాష్ట్రంలోని మొత్తం 12,769 పంచాయతీలకు గాను మూడువేల మందికిపైగా పంచాయతీ కార్యదర్శులు (పర్మినెంట్ ఉద్యోగులు) ఉన్నారు. మిగతా 9,350 గ్రామపంచాయతీల్లో 8 వేలకుపైగా జేపీఎస్‌లు, వెయ్యిమంది దాకా ఓపీఎస్లు విధులు నిర్వహిస్తున్నారు. గతనెల 11వ తేదీతో దాదాపు 6వేల మంది జేపీఎస్‌లు నాలుగేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన ప్రక్రియపై ప్రభుత్వపరంగా ఎలాంటి కసరత్తు మొదలెట్టకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమ్మె నోటీస్ ఇవ్వడంతో పాటు గత నెల 28 నుంచి సమ్మె ప్రారంభించారు. వీరితో పాటు మిగతా జేపీఎస్‌లు, ఓపీఎస్లు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. టర్మినేషన్ హెచ్చరికలు బేఖాతర్.. గత మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్చరించారు. దీంతో అయిదారు వందల మంది జేపీఎస్‌లు తిరిగి విధుల్లో చేరినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే వారిలో పలువురు తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. జేపీఎస్‌ల డిమాండ్ల పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేకపోవడం, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే చట్ట, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ఉద్దేశంతో సమ్మె చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో కీలక విధులు నిర్వర్తించే కార్యదర్శులపై ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలు వ్యతిరేకతకు దారితీయవచ్చనే ఆందోళన కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఏ హామీ లభించినా సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేపీఎస్‌లు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం గోదావరిలో దిగి నిరసన తెలుపుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. అనంతరం భద్రాద్రి రామయ్యకు వినతిపత్రం సమర్పించారు. – భద్రాచలం అర్బన్ అన్ని పనులకూ వారే.. గ్రామాల్లో దాదాపు అన్ని పనులు పంచాయతీ కార్యదర్శుల ద్వారానే జరుగుతుంటాయి. రోజువారీ పారిశుధ్యం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధిత పనులన్నీ పర్యవేక్షిస్తుంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ సర్టిఫికెట్లు, ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు, మ్యుటేషన్ల జారీ వంటి అనేక విధులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరి సమ్మెతో గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. జేపీఎస్‌ల స్థానంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, కారోబార్లు, సెర్ప్ సిబ్బంది, ఇతర గ్రామ స్థాయిల్లోని కాంట్రాక్ట్, ఇతర విధులు నిర్వహిస్తున్న వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. మరోపక్క ఉద్యోగ ఆందోళనతోనే జేపీఎస్ సోనీ ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.. జేపీఎస్, ఓపీఎస్లు ఆత్మస్థైర్యం కోల్పోయి తీవ్రమైన చర్యలకు దిగొద్దని తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సోని ఆత్మహత్య దురదృష్టకరమని, ఆమె మొన్నటి దాకా సమ్మెలో పాల్గొని మళ్లీ ఉద్యోగంలో చేరిందని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ తెలిపింది. జేపీఎస్‌ల డిమాండ్లు ఇవీ.. – సర్వీసుల క్రమబద్ధీకరణ జీవో జారీచేయాలి. – నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసుగా పరిగణించాలి. – ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జేపీఎస్‌లుగా ప్రమోట్ చేయాలి. – వారు పనిచేసిన కాలాన్ని ప్రొబేషన్గా పరిగణించి పర్మినెంట్ చేయాలి. -
Andhra Pradesh: సాధికారత సుస్థిరం
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి మార్గాలను మరింత విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. చేయూత లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు క్రమం తప్పకుండా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్దేశిత వ్యవధి ప్రకారం ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు. ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి కోసం తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా.. లబ్ధిదారులు పథకాన్ని అందుకున్న మొదటి ఏడాది నుంచే స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను పెంచడం వల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అర్హులైన మహిళలకు అవగాహన పెంపొందించి బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఉపాధి మార్గాలను సమర్థంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేసే వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్ వ్యవస్ధ ఉండాలని, దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలని సూచించారు. చేయూతతో 9 లక్షల మందికి స్వయం ఉపాధి 45 – 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటివరకూ 9 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హిందుస్తాన్ యూనీ లీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహీంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్ జీ లాంటి అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టులు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్, లేస్ పార్కు, ఇ–కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్ యార్డు పౌల్ట్రీ, ఆనియన్ సోలార్ డ్రయ్యర్ల లాంటివి చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది ‘ఉపాధి’ వ్యయం రూ.8,800 కోట్లు ఉపాధి హామీపై సమీక్ష సందర్భంగా ఈ ఏడాది 1,500 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 215.17 లక్షల పనిదినాలు కల్పించారు. ఉపాధి హామీ పనిదినాల రూపంలో రూ.5,280 కోట్లు ఖర్చు చేయనున్నారు. మెటీరియల్ రూపంలో రూ.3,520 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,800 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు సుమారు రూ.880 కోట్లు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా దీనిపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్నారు. మన్నికగా నాణ్యమైన రోడ్లు.. రహదారుల నాణ్యతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కనీసం ఐదేళ్లపాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. రహదారుల పనులు చేసిన మరుసటి ఏడాదే మళ్లీ మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి తలెత్తకూడదన్నారు. ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంజనీర్లు రోడ్ల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాల నాయుడు, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్ కుమార్, సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు రెండు మహిళా సూపర్ మార్కెట్లు గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లను నెలకొల్పుతున్నట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. జిల్లాకు కనీసం రెండు సూపర్ మార్కెట్లను ఏర్పాటు కానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటయ్యాయని వివరించారు. ఒక్కో సూపర్ మార్టును నెలకు కనీసం రూ.30 లక్షలు టర్నోవర్ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్లైన్ బుకింగ్, వాట్సాప్ బుకింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్ ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ‘వస్త్ర’ పేరుతో ఏర్పాటైన దుస్తుల తయారీ యూనిట్లో 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని, ట్రెండ్స్, అజియో లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుమారు 3 వేల కుటుంబాలకు చేయూత లభిస్తున్నట్లు వివరించారు. -
నిధులు కోసి, కార్డులు తగ్గించేసి 'ఇదేం పని'! గడ్డు రోజులు మొదలయ్యాయా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్ట కాలంలో, తీవ్రమైన కరువుల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకుని, వారి జీవితాలకు భరోసాగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గడ్డు రోజులు మొదలయ్యాయా? పలు రాష్ట్రాల్లో ఇది క్రమంగా నిర్వీర్యమైపోతోందా? పేదలకు కనీస వేతనంతో కూడిన వంద రోజుల ఉపాధి కల్పనకు గుర్తింపు పొందిన ఈ పథకం కాస్తా.. నెమ్మది నెమ్మదిగా తన ప్రాధాన్యతను, గుర్తింపును కోల్పోతోందా?..అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ పథకం మార్గదర్శకాలకు భిన్నంగా అమలు చేస్తున్న విధానాలు, కొత్తగా విధిస్తున్న కఠిన నిబంధనలు, బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించడం, జాబ్‌కార్డుల కోత.. ఇందుకు ప్రధాన కారణాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు గతంలో ఉపాధిహామీ అమల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలోనూ ఈ పథకం ప్రాబల్యాన్ని కోల్పోతూ నీరుగారిపోతోంది. అన్నీ అవరోధాలే..: కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల తీసుకొచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు ఉపాధి హామీ పథకానికి ప్రతిబంధకంగా మారినట్టు నిపుణులు చెబుతున్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)లో భాగంగా మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ప్రదేశాల్లోనే రోజుకు రెండుసార్లు కూలీల అటెండెన్స్ నమోదు (ఉదయం ఒకసారి, మధ్యాహ్నం తర్వాత రెండోసారి), ఆధార్ కార్డుతో జాబ్ కార్డుల సీడింగ్, అథెంటికేషన్, బ్రిడ్జి పేమెంట్స్ లాంటి విధానాల కారణంగా ఉపాధి వర్కర్లు పని, కూలీ పొందడంలో ఇబ్బందులు పడడం.. ఈ పథకం మౌలిక సూత్రాలకే ఉల్లంఘనగా నిలుస్తోంది. దాదాపు 15 ఏళ్ల పాటు పనుల నమోదు, కూలీ లెక్కింపు, జాబ్ కార్డుల జారీ, ఇతర అంశాల నమోదుకు రాష్ట్రస్థాయిలో ఉపయోగించిన రాష్ట్ర వెబ్సైట్ రాగా సాఫ్ట్‌కు బదులు, జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రంలో కూలీల సమస్యలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ విధంగా సాంకేతికంగా చోటు చేసుకున్న మార్పు, చేర్పులు రాష్ట్రంలో ఈ పథకం అమలుకు, పని కోసం కూలీలు ముందుకు వచ్చేందుకు ఆటంకంగా మారాయి. మరోవైపు రాష్ట్రంలో దీని అమలు పూర్తి సామర్థ్య స్థాయిలో జరగడం లేదు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఇండికేటర్లు (ఉద్యోగిత సూచిలు) కూడా దిగజారాయి. అత్యధిక స్థాయిలో జాబ్ కార్డుల్లో కోతతో పాటు ఆధార్ సీడింగ్, అథెంటికేషన్, ఆధార్ బ్రిడ్జి పేమెంట్స్ విధానం, ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తప్పనిసరి చేయడం వంటివి ప్రభావం చూపినట్టుగా ఉపాధి హామీ పథకం అమలు, పర్యవేక్షక, పరిశీలన సంస్థ ‘లిబ్టెక్ ఇండియా’ జరిపిన కూలంకష పరిశీలనలో వెల్లడైంది. 5 లక్షల జాబ్ కార్డుల కోత ఈ నెల 7వ తేదీ వరకు ఉపాధిహామీ పథకం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన గణాంకాలు, సమాచారం ఆధారంగా గత మూడేళ్ల డేటాను విశ్లేషిస్తూ లిబ్టెక్ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత మార్చి 31తో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 5 లక్షల జాబ్ కార్డుల కోత (ఇది ఇక్కడి మొత్తం జాబ్ కార్డుల్లో 8.2 శాతం) పడింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 24.3 శాతం, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా 2.7 శాతం తొలగింపునకు గురయ్యాయి. 17.3 లక్షల కూలీల పేర్లు కూడా ఈ కార్యక్రమంలో లేకుండా పోయాయి. జాబ్ కార్డుల కోత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కార్‌పైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి, సామర్ధ్యం పెంపుదలకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులకు ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడలేదు. అధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ కంటే కూడా బ్యాంక్ ఖాతా ఆధారిత పేమెంట్ సిస్టమే మెరుగైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ సర్కార్ తప్పుబడుతోంది. కేంద్రం నిరుపేదల పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోందని, పేదలను కొట్టి పెద్దలకు పంచే పద్ధతిని అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గడిచిన రెండేళ్లలో బడ్జెట్లో రూ.55 వేల కోట్ల మేర కోత విధించడాన్ని గుర్తు చేస్తోంది. మరోవైపు పని దినాలు తగ్గిపోవడం, పని దినాల ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ కూడా తరిగిపోవడంపై కేంద్ర మంత్రులను కలిసి మౌఖికంగా, లేఖల ద్వారా విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ధ్వజమెత్తుతోంది. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని, ఉపాధి హామీ పని దినాలను పెంచాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించిన ఉపాధి హామీపై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఇటీవల ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి వంద రూపాయలకు మించడం లేదని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలైన టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, తట్టలు వంటివి అందించడం లేదని విమర్శలు గుప్పించారు. ఆన్లైన్ పద్ధతి వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అటెండెన్స్ అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేక పోతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి గుర్తు చేశారు. గణనీయంగా తగ్గిన పని దినాలు తెలంగాణలో గత రెండేళ్లతో పోల్చితే 2022–23లో హోస్‌హోల్డ్ పనులు, పర్సన్ డేస్, సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి. కేంద్రం తగిన ప్రణాళిక లేకుండా క్లిష్టమైన సాంకేతిక అంశాలను ప్రవేశపెట్టడం సమస్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఉపాధి పనులు చేసే కుటుంబాల సంఖ్య తగ్గడం శ్రేయస్కరం కాదు. తెలంగాణలో కనీసం వందరోజుల పనిదినాల కల్పన భారీగా పడిపోవడందారుణం. ఇది ఎందుకు జరిగిందనే దానిపై లోతైన పరిశీలన జరపాల్సిన అవసరముంది. జాబ్ కార్డుల పునరుద్ధరణ, పనికి డిమాండ్ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యామ్నాయ అవకాశాల కల్పన ప్రభుత్వం చేపట్టాలి. – చక్రధర్ బుద్ధా, డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేందం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చింది. కోట్లాది మంది రైతు కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హమీ పథకానికి (నరేగా) ప్రతి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం సిగ్గుచేటు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నరేగా సంఘర్షణ మోర్చా అధ్వర్యంలో ఉపాధి హమీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల ధర్నా జరుగుతోంది. సోమవారం నాటికి 54 రోజులు పూర్తయ్యాయి. ధర్నాలో తెలంగాణ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలు పాల్గొన్నారు. – పి.శంకర్, జాతీయ కార్యదర్శి, దళిత బహుజన ఫ్రంట్ -
గ్రామాలను పట్టణాలకు కలుపుతూ మరో 976 కి.మీ. రోడ్లు
సాక్షి, అమరావతి: గ్రామాలను సమీప పట్టణాలకు కలుపుతూ రాష్ట్రంలో మరో 976 కిలోమీటర్ల పొడవున కొత్త రోడ్ల నిర్మాణం జరగనుంది. పీఎంజీఎస్వైలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 40:60 నిష్పత్తిన మొత్తం రూ.1,110.1 కోట్లు వెచ్చించనున్నాయి. దీన్లో రూ.607.87 కోట్లతో 976 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనుండగా, రూ.502.23 కోట్లతో 76 బ్రిడ్జిలు నిర్మిస్తారు. జిల్లాల వారీగా కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలతో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. దీనికి తుది ఆమోదం కోసం ఉగాది పండుగ రోజు (ఈ నెల 22న) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం లాంఛనమేనని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలన్నింటికీ కేంద్రం ఇప్పటికే సూత్రపాత్రయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పీఎంజీఎస్‌వై ద్వారా రాష్ట్రంలో 1,291 కిలోమీటర్ల పొడవున 268 కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిచేసినట్టు తెలిపారు. వాటికి సంబందించి జనవరి నెలాఖరు వరకు బిల్లులను కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించిందని చెప్పారు. -
పోషకాల్లో మునగండి
సాక్షి, అమరావతి: క్యాన్సర్ నివారణతో పాటు అత్యధిక పోషకాలుండే మునగ చెట్లను ఉపాధి హామీ పథకం కూలీల ఇళ్లు, పొలాల్లో సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఐదేసి మొక్కల చొప్పున పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2 వేల ఎకరాలలో కూలీలు మునగ పంటను సాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మునగ చెట్లు, ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను మొక్కల పంపిణీ సమయంలోనే కూలీలకు అవగాహన కల్పిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కూలీలకు పంపిణీ చేసే మునగ మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 నర్సరీలలో ఇప్పటికే మునగ మొక్కల పెంపకం చేపట్టగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 250 నర్సరీలలో మునగ మొక్కల్ని ఉత్పత్తి చేయనున్నారు. కూలీలు తమకు ఉండే కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో మునగ పంట సాగు చేసుకోవడానికి ముందుకొస్తే రెండేళ్లలో ఎకరానికి రూ.85 వేల వరకు చెల్లిస్తారు. -
ఏపీకి రెండు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్ గోల్డ్, మరో నాలుగు స్కోచ్ సిల్వర్ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్ సంస్థ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 6 అవార్డులు మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని çసద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ గోల్డ్ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను రుణాలుగా అందజేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పొదుపు సంఘాలు సగటున రూ.5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలు పొందాయి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఇప్పటికే రూ. 12,758 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి వైఎ స్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆయా పొదుపు సంఘాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు బ్యాం కుల నుంచి తీసుకుంటున్న రుణాలను 99.5 శాతం మేర సకాలంలో చెల్లిస్తూ రికార్డు సాధించారు. ‘స్త్రీ నిధి’కి మరో గోల్డ్ అవార్డు ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అనుబం« దంగా పనిచేస్తున్న ‘స్త్రీ నిధి’ సంస్థ బ్యాంకులిచ్చే రుణాలకు తోడు అత్యంత సులభ విధానంలో అదనంగా రుణాలు అందజేస్తుండటంతో స్కోచ్ సంస్థ స్త్రీ నిధిని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొదుపు సంఘాల విజయ గాథలను ‘మహిళా నవోదయం’ పేరిట ప్రతినెలా ప్రత్యేక మాసపత్రిక రూపంలో ప్రచురిస్తూ సభ్యులందరికీ తెలియజేస్తున్న ఆ జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. ► ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్దఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నందుకు ఆ జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, పాడి గేదెల పెంపకం ద్వారా ఆధిక ఆదాయం సాధించేలా చేస్తున్న చిత్తూరు జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రోత్సాహకాల కారణంగా మహిళలు కీలకంగా ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసే అర్థిక సహాయానికి తోడు బ్యాంకుల నుంచి అందే రుణ మొత్తాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన వారు పెద్ద సంఖ్యలో పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారు. ఇలా లాభదాయక కార్యకలాపాలు సాగిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందజేసే ప్రోత్సహకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సైకిల్ చాలా వేగంగా తిరుగుతోంది. ఇలాంటి విజయాలను నమోదు చేయడంతో సెర్ప్ కార్యక్రమాలకు ఈ ఏడాది ఆరు అవార్డులు దక్కాయి. – ఇంతియాజ్ అహ్మద్, సీఈవో, సెర్ప్ -
మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోం చేసుకొనే ఐటీ ఉద్యోగులకు అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు, వారికి అవసరమైన సమాచారాన్ని గ్రామ గ్రామాన అందుబాటులో ఉంచేలా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష వేగంగా కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,960 డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు జరుగుతోంది. వీటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన ప్రతి చోటా డిజిటల్ లైబ్రరీ ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాల్లో వీటి ఏర్పాటుకు అనుమతి తెలిపింది. వీటితో మొత్తం 10,925 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. ఉద్యోగులు.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఇవి వరమనే చెప్పాలి. వర్క్ ఫ్రంహోమ్ చేసే ఉద్యోగులు వారి స్వగ్రామం నుంచే ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవడానికి, వారికి అవసరమైన సమాచారాన్ని ఆన్లైన్, డిజిటల్ పద్ధతుల ద్వారా సేకరించుకోవడానికి ఈ లైబ్రరీలు ఉపయోగపడతాయి. ఒక్కొక్క లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇతరత్రా సదుపాయాలకు మరింత ఖర్చు పెడుతోంది. వీటి భవనాలకు స్థల సేకరణ చేయాలని ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణానికే ప్రభుత్వం రూ. 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటితో కలిపి గత మూడున్నర సంవత్సరాల్లో రూ. 9,630 కోట్ల ఖర్చుతో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, వంటి వాటితో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 44 వేల భవన నిర్మాణాలు సాగుతున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
పండ్ల తోటలకు ప్రభుత్వ తోడ్పాటు
ఈ రైతు పేరు ఉడుముల పిచ్చిరెడ్డి. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రాచకొండ స్వగ్రామం. 2019 వరకు తనకున్న రెండెకరాల్లో మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలు సాగు చేసేవాడు. నాటుకునే మొక్కలు మొదలు.. పండ్ల తోట ద్వారా ఫలసాయం వచ్చే దాకా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలుసుకుని 2020లో తైవాన్ జామ పంట సాగు చేశాడు. మొక్కలు తెచ్చుకోవడానికి ప్రభుత్వమే డబ్బులిచ్చింది. నాటేటప్పుడు గుంతల ఖర్చు, తర్వాత కలుపు తీసేందుకు కూలి డబ్బులు, అవసరమైనప్పుడు నీళ్లకు డబ్బులిచ్చింది. మొక్కలు నాటిన ఏడు నెలల నుంచే ఫలసాయం రావడం మొదలైంది. కాయల కోత ఖర్చులు పోను ఏటా రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల దాకా మిగులుతోంది. గతంలో మిర్చి, పత్తి పంటలు వేసినప్పటి కంటే ఇప్పుడే నికర ఆదాయం వస్తోందని పిచ్చిరెడ్డి ఆనందంగా చెబుతున్నాడు. ఇదే జిల్లా పీసీపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరపునేని బాలచెన్నయ్య తన పొలం, తన సోదరుడి పొలం.. మొత్తం రెండెకరాల్లో 2021 జూన్‌లో 800 తైవాన్ జామ మొక్కలు నాటాడు. గుంతలు తీసేందుకు ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసింది. కాపలా, నీటి తడుల కోసం ఇప్పటి దాకా రూ.72 వేలు ఇచ్చింది. ప్రస్తుతం పంట తీరును బట్టి ఎకరాకు రూ.50 వేలకు పైగా నికర ఆదాయం వస్తుందని సంతోషంగా చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: మెట్ట భూముల్లో వర్షాధారంగా కంది, పత్తి వంటి పంటలు పండించుకునే రైతులు 1,18,842 మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడేళ్లుగా పండ్ల తోటల పెంపకానికి పూర్తి స్థాయిలో ఆర్థిక తోడ్పాటును అందజేసింది. మొక్కలు నాటుకోవడానికి గుంతలు తవ్వడం మొదలు.. మొక్కల కొనుగోలు, నాటిన మొక్కలకు నీటి తడుల ఖర్చు, పెంపకంలో అవసరమయ్యే ఎరువు ఖర్చుల వంటిì వాటన్నింటికీ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం చేసింది. మూడేళ్లలో రైతులకు ఎకరాకు రూ.1,35,141 దాకా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అందజేస్తోన్న ఆర్థిక సహాయంతో ఆగస్టు 2019 – 2022 మార్చి మధ్య 1,18,842 మంది రైతులు 1,75,493 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా దాదాపు రూ.400.28 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కూడా పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులను గుర్తించే ప్రక్రియ అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. మూడో వంతు మామిడి సాగే మామిడి, జీడిమామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, కొబ్బరి, దానిమ్మ, రేగు, సీతాఫలం, నేరేడు, ఆయిల్ పామ్, అంజూర వంటి పండ్ల మొక్కల పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తోంది. పండ్ల తోట సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుకు తొలి ఏడాది రూ.65 వేల దాకా, రెండో ఏడాది మరో రూ.35 వేలు, మూడో ఏడాది రూ.33–34 వేల మధ్య ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని అధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ పథకం ద్వారా 33 శాతం మంది రైతులు మామిడి తోటలనే సాగు చేశారని అధికారులు వెల్లడించారు. 2019లో 20,824 ఎకరాల్లో, 2020లో 22,147 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. ఏటా రూ.1000 కోట్ల ఆదాయం మామిడి, జీడి, కొబ్బరి పంటలను సాగు చేసుకునే రైతులకు ఏటా ఎకరాకు రెండు లక్షల దాకా నికర ఆదాయం ఉంటుంది. మార్కెట్లో వివిధ రకాల పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు పంట తక్కువ వచ్చే ఏడాది కూడా ఎకరాకు లక్ష ఆదాయం గ్యారంటీగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. పండ్ల తోటలు సాగు చేసిన వారిలో దాదాపు మూడో వంతు మంది రైతులు ఏటా నికర ఆదాయం పొందుతున్నారు. వీరి ఆదాయం ఏటా రూ.1,000 కోట్లకు తక్కువ లేదన్నది అంచనా అని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. -
నిరుద్యోగులకు 'స్మార్ట్'గా టోకరా.. కాల్ లెటర్లు, పథకాలపై సర్వేలంటూ డ్రామా
‘కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో ఫీల్డ్ ఆపీసర్.. రైల్వేలో జూనియర్ అసిస్టెంట్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్.. నేషనల్ హైవేస్ అథారిటీలో సూపర్వైజర్ జాబ్.. ఏది కోరుకుంటే అది.. మీరు అలా లక్షలు ఇస్తే.. మేము ఇలా జాబ్ ఇస్తాం.. ఇదిగో జాయినింగ్ లెటర్..’ స్మార్ట్‌గా ఎరవేసి వేలాది నిరోద్యోగులను బురిడీ కొట్టించి, కోట్లు కొల్లగొట్టిన స్మార్ట్ యోజన వేల్ఫేర్ సొసైటీ ఘరానా మోసం ఇది. – సాక్షి, అమరావతి అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్లా ఈ సంస్థ వేలాది నిరుద్యోగులను మోసం చేసింది. బండారం బయటపడటంతో సొసైటీ స్థాపించిన ఇండిపూడి సుధాకర్ పత్తా లేకుండా పోయారు. దాంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసం వివరాలు.. 2018లో అప్పటి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం అనకాపల్లి జిల్లా)లోని అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ అదే జిల్లాలోని నర్సీపట్నం కేంద్రంగా ‘స్మార్ట్ యోజన వెల్పేర్ సొసైటీ’ని స్థాపించాడు. తాను చైర్మన్‌గా ఉన్న ఆ సొసైటీ పేరుతో నర్సీపట్నంలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన ప్రాజెక్టులు చేస్తున్నట్లు చెప్పాడు. ఢిల్లీ పెద్దలకు సన్నిహితులైన స్థానిక నేతలతో ఉన్న పరిచయాలను అనుకూలంగా మలచుకొని, తనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందర్నీ నమ్మించాడు. 2021లో అసలు దందాకు తెరతీశాడు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు, రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఎయిర్పోర్ట్ అథారిటీ మొదలైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో థర్ట్ పార్టీ ద్వారా ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టు వచ్చినట్లు చెప్పాడు. ఈ సంస్థల్లో తాము ఉద్యోగులను నియమిస్తామని, కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కూడా చెప్పాడు. సొసైటీ తరపున జిల్లాకు ఓ ఇన్చార్జిని నియమించాడు. అప్పటికే ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు కాల్ లెటర్లు కూడా చూపించాడు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.10లక్షలు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రూ.5 లక్షలు చెల్లించాలని రేటు పెట్టాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనే ఆశతో సుధాకర్ మాటలను చాలా మంది నిరుద్యోగులు నమ్మి డబ్బు ముట్టజెప్పారు. వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాల్ లెటర్లు ఇచ్చారు. కొందరితో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వేలు చేయించినట్టుగా డ్రామా నడిపించారు. దాంతో ఆ సంస్థను చాలామంది నమ్మారు. అప్పులు చేసి మరీ అడిగినంత చెల్లించారు. ఇలా శ్రీకాకుళం జిల్లాతో మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు 6,500 మంది నుంచి రూ.50 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు అంచనా. డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు సుధాకర్‌ను నిలదీశారు. కేసు పెడతామని బెదిరించారు. వారిని సుధాకర్ మరోసారి మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. ప్రస్తుతం ఉద్యోగానికి రానవసరం లేదని, జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామని చెప్పాడు. రెండు నెలల జీతాలు కూడా చెల్లించాడు. ఆ తరువాత నుంచి జీతాలు రాలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు నర్సీపట్నంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. దాంతో సొసైటీ చైర్మన్ సుధాకర్ మెల్లగా జారుకున్నాడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ కార్యాలయం కేసులు నమోదు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ, సంస్థ చైర్మన్ ఇండిపూడి సుధాకర్‌పై అనేకమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా విచారించిన అనంతరం నర్సీపట్నం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 506 ఆర్/డబ్లూ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుధాకర్‌పై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కూడా తాజాగా కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసును సత్వరం దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించింది. పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
‘ఉపాధి’కి పరిమితి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. కొత్త పనులకు అనుమతిని క్లిష్టతరం చేసింది. ఈ పథకం ద్వారా ఒక్కో పంచాయతీలో ఒకే సమయంలో 20 పనులకు మాత్రమే వీలు కల్పిస్తూ నిబంధన విధించింది. వాటిలో మాత్రమే కూలీలు, ఇతర కార్యకలాపాలకు, బిల్లులు పెట్టడానికి వీలుంటుంది. ఈ 20 పనుల్లో ఒకటి పూర్తయిన తర్వాతే మరో కొత్త పని మంజూరవుతుంది. ఈ ఏడాది ఆగస్టు 1నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ధర్మవీర్ ఝా రెండు రోజుల క్రితం అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల నిర్వహణ, పర్యవేక్షణ మొత్తం ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ (నరేగా సాఫ్ట్) ద్వారా ఆన్లైన్లో జరుగుతుంది. గ్రామాల్లో పనులు జరిగిన తర్వాత కూలీల వేతనాలు సహా అన్నిరకాల బిల్లులను సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేస్తారు. వీటి ప్రకారం కేంద్రం కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాల డబ్బు జమ చేస్తుంది. నూతన నిబంధన ప్రకారం ఆన్లైన్లో ఆ 20 పనులకు మాత్రమే బిల్లుల నమోదుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని మొత్తం 2.69 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 1.64 కోట్ల ఉపాధి హామీ పనులు మంజూరయ్యాయి. వాటిలో 1.44 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 53 పనులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనూ 13,113 గ్రామ పంచాయతీల్లో 9.73 లక్షల పనులు మంజూరవగా, వాటిలో 9.67 లక్షల పనులు పురోగతిలో ఉన్నాయి. అంటే రాష్ట్రంలోనూ ఒక్కో గ్రామ పంచాయతీలో సరాసరిన 73 పనులు జరుగుతున్నాయి. నూతన నిబంధన ప్రకారం ఈ పనులను 20కి పరిమితం చేయడం చాలా కష్టమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మంజూరైన పనులకు కొత్త నిబంధన వర్తించకపోవచ్చని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త పని మంజూరులో ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికే ఉపాధి పథకం పనులు గడువులోగా పూర్తి చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిబంధన తెచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రెండు మూడేళ్లు కొనసాగే మొక్కల పెంపకం, గృహ నిర్మాణ పథకం వంటి పనులకు కొత్త నిబంధన వర్తించదని కేంద్రం పేర్కొందని వివరించారు. తప్పనిసరి, ప్రత్యేక పరిస్థితుల్లో గ్రామాల్లో స్థానిక ఎంపీడీవో సవివరమైన వివరణ, జిల్లా కలెక్టర్ అనుమతితో 20 పరిమితికి మించి పనులు మంజూరుకు అవకాశం కల్పించిందని తెలిపారు. -
ఉవ్వెత్తున ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పేదలకు పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, బిహార్ తరువాత స్థానాల్లో నిలిచాయి. ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో పేదల వలసలను నివారించడం, వ్యవసాయ పనులు లేని వేసవి సీజన్లో సొంతూరిలో పనులు కల్పించడం. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రోజుల్లోనే రాష్ట్రంలో 2,84,03,576 పనిదినాల పాటు ప్రభుత్వం పేదలకు పనులు కల్పించింది. మధ్యప్రదేశ్ నెల రోజుల వ్యవధిలో 2.06 కోట్ల పనిదినాలు కల్పించగా తెలంగాణ 1.65 కోట్లు, బిహార్ 1.48 కోట్ల పనిదినాలను కల్పించగలిగాయి. ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రాష్ట్రాలు పేదలకు తాజాగా కల్పించిన పనిదినాల వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. నెలలో 17.07 కోట్ల పనిదినాలు ► దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ నెల రోజుల వ్యవధిలో 17.07 కోట్ల పనిదినాలను కల్పించగా రూ.4,288 కోట్లు పేదలకు కూలీగా చెల్లించారు. ఏపీలో 20.01 లక్షల కుటుంబాలకు చెందిన 29.84 లక్షల మంది పేదలు పనులకు హాజరై రూ.474.98 కోట్లు వేతనాల రూపంలో పొందారు. పనులకు హాజరైన వారిలో 60.04 శాతం మంది మహిళలే ఉన్నారు. ► వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎండల వల్ల కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయమే 6.30 నుంచి పనులకు వీలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులకు హాజరయ్యేలా ఉదయం, సాయంత్రం రెండు పూటలా వీలు కల్పించారు. ► పనులకు వచ్చే పేదలు రోజువారీ ఎక్కువ మొత్తంలో కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా వీలున్న సమయంలో నిర్దేశిత పనులు చేసేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు రోజులో చేయాల్సిన పనులను ముందే మార్కు చేసి ఉంచుతారు. ► గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉపాధి పథకం పనులకు హాజరయ్యే కూలీలకు సరాసరిన రోజుకు రూ.181.58 చొప్పున వేతనం అందుతోంది. ► వేసవిని దృష్టిలో పెట్టుకొని గత రెండేళ్ల పాటు ఏప్రిల్, మే, జూన్‌లో 20 – 30 శాతం తక్కువ పనిచేసినా నిర్ణయించిన కూలీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానానికి కేంద్రం అభ్యంతరం తెలపడంతో ప్రస్తుత ఏడాది అమలులో లేదు. దీంతో గతంతో పోల్చితే కూలీ నామమాత్రంగా తగ్గింది. ► ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 16–17 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రోజు రోజుకూ ఇది పెరుగుతోంది. గత నెల రోజుల్లో 2.84 కోట్ల పని దినాలను కల్పించగా అందులో కోటి పనిదినాలు దాకా గత వారం రోజుల్లో జరిగినవేనని అధికారులు వెల్లడించారు. తండాలకు ‘ఉపాధి’ అండ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోని జనంగూడ తండాకు చెందిన డంబున్ నాయుడు కుటుంబం ఉపాధి హామీ పనులకు వెళ్లి నెల రోజుల్లో రూ.13,620 సంపాదించింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మే 1 వరకు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు 66 పనిదినాలను పొందారు. ఇదే పంచాయతీ పరిధిలోని వివిధ తండాలలో నివసించే 481 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్లి కూలీ కింద రూ.16.02 లక్షలు వేతనం పొందాయి. -
పచ్చగా.. పరిశుభ్రంగా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాగునీటి కష్టాలు తలెత్తకుండా.. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు. కాలువలతో అనుసంధానం.. గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు. రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు.. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్లకు మరమ్మతులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. -
ఉపాధిలో కేంద్రం భారీ కోత
సాక్షి, అమరావతి: గ్రామీణ పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వతేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలవారీగా కేటాయించే లేబర్ బడ్జెట్‌కు భారీ కోతలు పెట్టింది. ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి 23.68 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించగా 2022–23లో ప్రాథమికంగా కేవలం 14 కోట్ల పనిదినాలనే కేటాయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.27 కోట్ల పనిదినాలు కల్పించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాథమికంగా 10 కోట్ల పనిదినాలే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తరహాలోనే మిగిలిన రాష్ట్రాలకూ లేబర్ బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రం కోరిన దాంట్లో సగమే.. రాష్ట్రంలో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి 30 కోట్ల పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించేందుకు జిల్లాలవారీగా లేబర్ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 తేదీన జరిగిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమీక్షలో కనీసం 26 కోట్ల పనిదినాలను రాష్ట్రానికి కేటాయించాలని అధికారులు కోరారు. తెలంగాణ కూడా తమకు 15 కోట్ల పనిదినాలు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. అయితే రాష్ట్రాలు కోరిన దాంట్లో దాదాపు సగం రోజులు కోతలు విధించి కేంద్రం లేబర్ బడ్జెట్ కేటాయింపులు చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు. జూన్‌లో మళ్లీ సమీక్ష... లేబర్ బడ్జెట్లో భారీగా కోతలు విధించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవసరమైతే జూన్ చివరిలో మరోసారి రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి అదనపు కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి మొదట 20 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 23.50 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా తొలుత 13 కోట్ల పనిదినాలు కేటాయించి తర్వాత 14.25 కోట్లకు పెంచారు. ఈ లెక్కన 20 – 25 శాతానికి మించి లేబర్ బడ్జెట్లో అదనపు కేటాయింపులు ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా చూసినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కేటాయింపులు తగ్గుతున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏడాది చివరకు అదనపు నిధుల కేటాయింపు అవసరం లేకుండా కేంద్రం ముందస్తుగా రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్లో కోతలు విధిస్తూ వస్తోందని భావిస్తున్నారు. రాష్ట్రంలో కోటి మంది పేదలపై ప్రభావం.. రాష్ట్రంలో 97.76 లక్షల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధి కూలీలు పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 57.49 లక్షల కుటుంబాలకు చెందిన 99.48 లక్షల మంది యాక్టివ్ కూలీలు.గత మూడేళ్లలో కనీసం ఒక్క రోజైనా ఉపాధి పనులకు హాజరైతే యాక్టివ్ కూలీలుగా పరిగణిస్తారు. 2020–21లో రాష్ట్రంలో 47.71 లక్షల కుటుంబాలకు చెందిన 80 లక్షల మంది ఉపాధిహామీ ద్వారా ప్రయోజనం పొందగా 2021–22లో 46.60 లక్షల కుటుంబాలకు చెందిన 77 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఉపాధి పథకానికి బడ్జెట్లో కోతలతో దాదాపు కోటి మంది కూలీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
పల్లెకు తగ్గని ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో ఈసారి కూడా పల్లెకు పట్టం కట్టారు. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు. 57 ఏళ్ల అర్హత వయసుతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎస్టీ పంచాయతీ భవనాలకు నిధులు గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ కింద రూ.800 కోట్లు కేటాయించింది. -
2022–23లో 30 కోట్ల పనిదినాల ఉపాధి
సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉపాధిహామీ పథకం ద్వారా 30 కోట్ల పనిదినాల పాటు పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు గ్రామాల వారీగా పనులు కావాలని కోరుకుంటున్న వారిని గుర్తించిన గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రతిపాదిత లేబర్ బడ్జెట్ రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా ఒక్కో జిల్లాలో మూడుకోట్లకుపైగా పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో పనిదినానికి 60:40 నిష్పత్తిన కూలీకి ప్రస్తుత రేట్ల ప్రకారం గరిష్టంగా రూ.245 వేతన రూపంలో చెల్లించడంతోపాటు మెటీరియల్ విభాగంలో మరో రూ.163 కేటాయిస్తారు. కూలీలు వారు కోరుకున్నప్పుడు వారి సొంత గ్రామంలోనే పనులను కల్పించేందుకు వీలుగా ఆయా గ్రామాల్లో కొత్త పనులు గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలోని ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతోంది. ఇలా గుర్తించిన పనులకు మొదట గ్రామసభ, తరువాత పంచాయతీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత లేబర్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే.. ప్రసుత ఉపాధి పథకం కూలీరేట్ల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కూలీలకు గరిష్టంగా రూ.7,350 కోట్లు వేతనాల రూపంలో లభించే అవకాశం ఉంది. కూలీలకు గిట్టుబాటయ్యే సరాసరి వేతనాల మొత్తం ఆధారంగా గరిష్టంగా మరో రూ.4,890 కోట్లు మెటీరియల్ కోటాలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. 56.98 లక్షల కుటుంబాలకు ప్రయోజనం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 97.73 కోట్ల కుటుంబాలకు చెందిన 1.95 కోట్ల మంది ఉపాధిహామీ పథకం కూలీలుగా నమోదయ్యారు. వీరిలో 56.98 లక్షల కుటుంబాల వారు క్రియాశీలకంగా ఏటా పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 45.45 లక్షల కుటుంబాలకు 21.73 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. రూ.4,817 కోట్లను కూలీలకు వేతనాల రూపంలో చెల్లించింది. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల ఇప్పటి నుంచి మళ్లీ ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి 26 కోట్ల పనిదినాల పాటు పనుల కల్పన పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
ఎంపీడీవోలకు నెరవేరుతున్న పాతికేళ్ల కల
సాక్షి, అమరావతి: పాతికేళ్లుగా ఎంపీడీవోలు కంటున్న కలలు నెరవేరుతున్నాయి. 25 సంవత్సరాల కిందట ఎంపీడీవోలుగా ఉద్యోగంలో చేరినవారు కూడా అప్పటి నుంచి పదోన్నతులు లేకుండా ఇంకా అలాగే కొనసాగుతున్నారు. ఉద్యోగ విరమణ చేసేలోగా ఒక్క పదోన్నతి వస్తుందా అని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వారి కల ఇప్పుడు నేరవేరబోతుంది. ఎంపీడీవోలకు పదోన్నతి కల్పించడానికి వారి క్యాడర్‌కు పైస్థాయిలో తగినన్ని పోస్టులు లేకపోవడంతో వారి పదోన్నతి ప్రక్రియ ఇన్నాళ్లు నిలిచిపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణాభివృద్ధిశాఖలో 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ రూపంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతులపై నియమించేలా సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణాభివృద్ధిశాఖలోని కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పథకం, వాటర్‌షెడ్ పథకం విభాగాల్లో 9 కేటగిరీల్లో 15 పోస్టులు, జిల్లాల్లోని డ్వామా పీడీ కార్యాలయాల్లో మరో 9 కేటగిరీల్లో 134 పోస్టులు కలిపి మొత్తం 149 పోస్టుల్లో ఆన్‌డ్యూటీ లేదా డిప్యుటేషన్ విధానంలో ఎంపీడీవోలను మాత్రమే పదోన్నతి ద్వారా నియమించనున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ 149 పోస్టుల్లో ప్రస్తుతం డిప్యుటేషన్, ఆన్‌డ్యూటీలో కొనసాగుతున్నవారు నిర్ణీత సర్వీసు కాలం ఆ పోస్టుల్లోనే కొనసాగుతారని, భవిష్యత్‌లో ఆ పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లోనే ఎంపీడీవోలను పదోన్నతిపై నియమించనున్నట్లు తెలిపారు. 200 మందికిపైగా ఒకేసారి పదోన్నతి.. పాతికేళ్లుగా ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోని అంశంపై జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దృష్టి పెట్టారు. దీంతో పదోన్నతులకు వేచి ఉన్నవారికి ఒకేసారి పెద్దసంఖ్యలో పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఇప్పటికే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) పోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి కొత్తగా 51 డీఎల్డీవో పోస్టులను ఎంపీడీవోలకు పదోన్నతి ద్వారా భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో 149 పోస్టుల కోసం పదోన్నతికి వీలు కల్పించింది. ఒకేసారి 200 మందికిపైగా ఎంపీడీవోలకు పదోన్నతి దక్కేలా కసరత్తు చేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు.