సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో గల ఉపాధి హామీ విభాగం హరితహారం సెక్షన్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన సెక్షన్‌లో పని చేసిన ఓ ఉద్యోగి హరితహారానికి సంబంధించిన గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ ఈ సెక్షన్‌లో పని చేసిన సదరు ఉద్యోగిని ప్రస్తుతం మొక్కలు నాటే కీలక సమయంలో సెక్షన్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనుకోకుండా సెక్షన్ తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చడంతో అక్రమ వసూళ్లు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఉపాధి హామీ విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది.
జిల్లాలో ఈ ఏడాది డ్వామా శాఖ ఆధ్వర్యంలో కోటి వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేయడానికి టేకు స్టంపులను టెండరు ద్వారా కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే హరితహారం విభాగానికి మొన్నటి వరకు జిల్లా పరిషత్‌కు చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ డ్వామాకు డిప్యూటేషన్‌పై వచ్చి పని చేశారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, పాలిథిన్ కవర్లు, టేకు స్టంపులు, నీటి ట్యాంకుల కొనుగోలు ఇతర విషయాలను మొదటి నుంచీ సదరు ఉద్యోగే చూశారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు వసూల్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
సెక్షన్ ఉద్యోగి పర్సంటేజీలు అడుగుతున్నట్లు నేరుగా డీఆర్‌డీవోకే గుత్తేదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అప్పటికే సదరు ఉద్యోగిపై అనేక ఫిర్యాదులు రావడం, విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి ఆరోపణలున్నాయి. కమీషన్లకు ఆశపడి డీఆర్‌డీవోనే తప్పుదోవ పట్టించి హరితహారంలో తెరచాటుగా వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగి వ్యవహారంపై సీరియస్ అయిన డీఆర్‌డీవో నెల క్రితం హరితహారం సెక్షన్ నుంచి తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చారు. సదరు ఉద్యోగిని సొంత శాఖ జిల్లా పరిషత్‌కు సరెండర్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఉపేక్షించని డీఆర్‌డీవో..
హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై డీఆర్‌డీవో చర్యలు ఉపక్రమిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న వివిధ మండలాల్లోని ఐదారుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అయితే, డీఆర్‌డీవో కళ్లుగప్పి హరితహారం విభాగంలో గుత్తేదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో సెక్షన్ నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది.
సెక్షన్ మార్చిన విషయం వాస్తవమే..
హరితహారం విభాగం చూస్తున్న ఉద్యోగిని వేరే సెక్షన్‌కు మార్చిన విషయం వాస్తవమే. అయితే, ఆ ఉద్యోగిపై అవినితీ ఆరోపణలు లేవు. సహజంగానే ఇతర సెక్షన్‌కు బదిలీ చేశాం. ఆరోపణలున్నాయనే విషయం నా దృష్టికి రాలేదు.
– రమేశ్ రాథోడ్, డీఆర్‌డీవో, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment