MGNREGA
-
ఉపాధి కూలీ అవతారమెత్తిన IRS అధికారి
-
Union Budget 2023-24: బడ్జెట్లో 'ఉపాధి హామీ'కి భారీ కోత.. నాలుగేళ్లలో..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీపీ).. కోవిడ్ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది వలస కూలీలకు ఉపాధి కల్పించి ఆదుకుంది. ఈ బృహత్తర పథకానికి కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో కేటాంపులను భారీగా తగ్గించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించారు. గతేడాది సవరించిన అంచనా కేటాయింపు రూ.89,400 కోట్లలో ఏకంగా 32 శాతం తగ్గించింది. 2022-23 బడ్జెట్లో కూడా మోదీ సర్కార్ 25 శాతం మేర కోత విధించింది. రూ.98 వేల కోట్లు అంచనా కాగా రూ.73వేల కోట్లే కేటాయించింది. ఈ ఏడాది జనవరి 6 నాటికి దేశవ్యాప్తంగా 5.6 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి పొందగా 225.8కోట్ల వ్యక్తి పనిదినాలు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి 24 నాటికి 6.49 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద ఉపాధి కోరగా 6.48 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. 5.7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక కూలీలు వలసలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పథకానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. గత నాలుగు బడ్జెట్లలో కేటాయింపులు ఇలా.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఎలా తగ్గిస్తోందో గత నాలుగు బడ్జెట్లలో ఈ పథకానికి చేసిన కేటాయింపులను చూస్తే అర్థమవుతుంది. 2020-21 బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి రూ.61,500 కోట్లు కేటాయించిన బీజేపీ సర్కారు 2021-22, 2022-23 బడ్జెట్లలో రూ.70 వేల కోట్ల చొప్పున కేటాయించింది. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.60వేల కోట్లు. గత నాలుగు బడ్జెట్లలో ఇదే అత్యల్ప కేటాయింపు కావడం గమనార్హం. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
కొత్త నిబంధనలు.. మీ ‘ఉపాధి’ జాబ్‌కార్డుతో ఆధార్ లింక్ అయి ఉందా?
హుజూర్నగర్ (సూర్యాపేట): జాతీయ ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కూలీ హాజరు నమోదు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)ను అమలులోకి తెచ్చిన కేంద్రం తాజాగా కూలిల చెల్లింపుల్లోనూ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఉపాధి కూలీల జాబ్‌కార్డును వారి ఆధార్‌తో అనుసంధానం చేస్తోంది. దీంతో బోగస్ కూలీలకు చెక్ పడడమే కాకుండా కేంద్రం విడుదల చేసే నిధులు నేరుగా కూలీల ఖాతాలో జమకానున్నాయి. అయితే ఆధార్ సీడింగ్‌లో జిల్లా మెరుగైన స్థానంలో ఉన్నా జాబ్ కార్డు, ఆధార్ వివరాలు సరిపోలకపోవడం సమస్యాత్మకంగా మారుతోంది. ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. దీంతో కూలీలు ఉపాధికి దూరమయ్యే అవకాశం ఉంది. చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుతం బ్యాంక్, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూలి డబ్బులు చెల్లిస్తోంది. అయితే కొందరికి రెండేసి చొప్పున జాబ్‌కార్డులు ఉండడంతో పాటు, మరికొంత మంది పనులకు హాజరు కాకున్నా కూలి పొందుతున్నారు. రాజకీయ పలుకుబడి, నాయకుల అండదండలలతో పనులకు హాజరువుతున్నట్లుగా పేర్లు నమోదు చేసుకుని డబ్బులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని గుర్తించిన కేంద్రం కూలి చెల్లింపుల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని సంకల్పించింది. కూలి చెల్లింపుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఆధార్ బేస్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే కూలీల జాబ్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తోంది. దీంతో ఇకపై ఆధార్ లింకైన బ్యాంక్, పోస్టల్ బ్యాంక్ ఖాతాల్లో మాత్రమే కూలి డబ్బులు జమ కానున్నాయి. పబ్లిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్) ద్వారా డబ్బులు ఎటు వెళ్తున్నాయనేది కేంద్రం నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. జిల్లాలో 6,31,156 మంది ఉపాధి కూలీలు.. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 2,71,992 జాబ్ కార్డులు ఉండగా వాటిలో 6,31,156 మంది కూలీలు నమోదై ఉన్నారు. వారిలో పనికి వచ్చే వారు 3,72,666 మంది ఉన్నారు. ముమ్మరంగా సాగుతున్న ప్రక్రియ జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 96.83 శాతం జాబ్‌కార్డులకు ఆధార్‌ను లింక్ చేశారు. అయితే రెండింటి (ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు)లో కూలీల పేర్లు, చిరునామా వంటి వివరాలు సరిపోలకపోవడంతో భారీ సంఖ్యలో కార్డులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటి వరకు 3,18,832 కార్డులు తిరస్కరణకు గురికావడంతో అప్రూవల్ కోసం పెండింగ్‌లో ఉంచారు. వాటిని మళ్లీ అథెంటికేషన్ కోసం పంపనున్నారు. దీంతో మరికొన్ని సవరణలతో కొన్ని కార్డులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం 29,770 మందికి ఆధార్ బేస్డ్ పేమెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆధార్‌ను బట్టి జాబ్‌కార్డును మారుస్తాం జాబ్ కార్డులో ఉన్న వివరాలకు ఆధార్ కార్డులో ఉన్న వివరాలు సరిపోలకపోవడంతోనే కొన్ని కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని మళ్లీ అథెంటికేషన్‌కు పంపనున్నారు. కార్డులో ఉన్న వాటి వివరాలు 40 శాతం వరకు సరిపోలితే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే ఆధార్‌కార్డు వివరాలను బట్టి జాబ్ కార్డును సవరణ చేసి వినియోగంలోకి తెస్తాం. – డాక్టర్ పెంటయ్య, డీఆర్డీఓ, సూర్యాపేట -
‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఓర్వకల్లు: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సభ్యులు అమర్‌జిత్‌సిన్హా నేతృత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లెలో బుధవారం పర్యటించింది. ఆ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకం, అభివృద్ధి పనులను పరిశీలించింది. రైతు వెంకటేశ్వర్లు సాగు చేసిన మునగ తోటను పరిశీలించి పంట దిగుబడి, పెట్టుబడుల ఖర్చుల వివరాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మునగ సాగు లాభసాటిగా ఉందని, దిగుబడులకు తగ్గట్టు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతు వివరించారు. సమీపంలో ఉపాధి హామీ పథకం కింద తవ్విన అమృత్ సరోవర్ (నీటి కుంట)ను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ కుంట ద్వారా ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం ప్రయోజనాలు, పనితీరుపై గ్రామస్తులతో బృంద సభ్యులు సమీక్ష నిర్వహించారు. పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఉపాధి పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, రైతుల పంట పొలాలను అభివృద్ధి చేయాలని, పొలం రస్తాల వెంటవున్న కంపచెట్లను తొలగించాలని పలువురు కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి పథకమే తమను ఆదుకుందని, లేకపోతే ఎంతో మంది పస్తులుండాల్సి వచ్చేదని లక్ష్మీదేవి, శారదమ్మ అనే మహిళలు చెప్పారు. కేంద్ర బృందంలో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ అశోక్ పంకజ్, ఎస్సీఏఈఆర్ ఎన్డీఐసీ డైరెక్టర్ సోనాల్డ్ దేశాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ ప్రవీణ్ మెహతా, ఎన్ఐఆర్డి–పీఆర్ ప్రొఫెసర్ జ్యోతిస్ పాలన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోటేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, డీఆర్డీఏ పీడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. ఇదీ చదవండి: సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం -
రూ.152 కోట్లు వెంటనే చెల్లించండి!
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగించారంటూ రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ పథకం కింద అనుమతించని పనులు చేపట్టినందుకు, నిధులు దారి మళ్లించినందుకు ఈ నెల 30వ తేదీలోగా కేంద్రానికి రూ.151.9 కోట్లు తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసులకు స్పందించకపోయినా, దారి మళ్లించిన మేర నిధులు తిరిగి కేంద్రానికి చెల్లించక పోయినా తదుపరి ఉపాధి నిధులు విడుదల చేయబోమని స్పష్టంచేసినట్టు సమాచారం. అదేవిధంగా ఇకపై భూమి అభివృద్ధి పనులకు సంబంధించి అన్నింటికీ ఒకేవిధమైన అనుమతి (బ్లాంకెట్ పర్మిషన్ ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్) జారీచేయొద్దని రాష్ట్రానికి సూచించినట్టు తెలుస్తోంది. ఇవీ ఉల్లంఘనలు..? మార్గదర్శకాలకు భిన్నంగా ఆయా పనుల అంచనావ్యయం, వాటికి ఆమోదం, ధాన్యం ఆరబెట్టే కల్లాల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో పూడికతీత, అటవీ ప్రాంతాల్లో ‘స్టాగర్డ్ ట్రెంచేస్’తదితర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు వినియోగించినట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారని సమాచారం. ఉన్నతస్థాయి సాంకేతిక బృందం (సుపీరియర్ టెక్నికల్ అథారిటీ) ఆమోదం పొందాల్సిన పరిధి నుంచి తప్పించేందుకు అధిక వ్యయమయ్యే వివిధ పనులను చిన్నచిన్న పనులుగా విభజించడం, పనులు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన, జాబ్‌కార్డుల నిర్వహణ, గ్రామపంచాయతీల్లో ఆయా పనులకు సంబంధించిన డాక్యుమెంటేషన్, వాటి నిర్వహణ వంటి అంశాల్లో లోపాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. తెలంగాణలోని కొన్ని బ్లాక్‌లలో అత్యధికంగా ఉపాధి హామీ నిధుల వెచ్చింపు జరుగుతున్నట్టు కేంద్రం దృష్టికి రాగా గత జూన్, సెప్టెంబర్లలో వివిధ జిల్లాల్లో ఈ పనుల క్షేత్రస్థాయి పరిశీలనకు పలు బృందాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిశీలన అనంతరం ఆయాజిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనులు చేపట్టారంటూ, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పంపించాల్సిందిగా గతంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి లేఖలు వచ్చాయని తెలుస్తోంది. ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’లు అడిగారు ఇదిలా ఉండగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి నోటీసులు కావని, గతంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’లు, ఇతర వివరణలు మాత్రమే అడిగారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్రం నుంచి వచ్చిన తాఖీదులపై రాష్ట్ర పీఆర్ శాఖలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే ఓ అధికారి తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, పనుల్లో తేడాలకు సంబంధించి పూర్తి నివేదికలు సిద్ధంగా ఉంచాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరో పక్క ఈ వివరాలను తాము ఇప్పటికే సమర్పించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఆయా పనుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరగలేదని, సాంకేతిక పరమైన ఏవైనా అంశాలు ఉంటే పాటించకపోవడం వంటిదే జరిగిందని వారు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఉపాధి నిధులు నిలిపేసేంత స్థాయిలో ఈ పథకం అమల్లో ఉల్లంఘనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు. -
భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ!
చెన్నై: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. మూడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శనివారం తమిళనాడు కన్యాకుమారిలోని మార్తాండం చేరుకున్నారు. ఇక్కడ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మహిళా కార్యకర్తలు ఆయనతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తమిళనాడు అంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. అందుకే ఆయన పెళ్లి చేసుకునేందుకు ఓ తమిళ అమ్మాయిని చూసిపెడతాం అని అంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్ జోడో యాత్రలో ఇది వినోదాత్మకమైన క్షణం అన్నారు. పెళ్లి ప్రస్తావన రాగానే రాహుల్ గాంధీ ఎలా నవ్వుతున్నారో చూడండి అని ఓ ఫోటో కూడా షేర్ చేశారు. A hilarious moment from day 3 of #BharatJodoYatra During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH — Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022 దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ఇతర సమస్యలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను బుధవారం కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ యాత్ర 150 రోజుల పాటు 3వేలకు పైగా కీలోమీటర్లు సాగనుంది. కశ్మీర్లో ముగుస్తుంది. ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సోనియాకు షాకిచ్చిన ఐదుగురు ఎంపీలు! -
విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు...కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుల నిరీక్షణ ఫలించింది. రెండున్నరేళ్ల క్రితం 7,561 మంది ఈజీఎస్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు వెళ్లడంతో వారిని విధుల నుంచి తప్పించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో గతంలో వారిని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈనెల 11వ తేదీ నుంచి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తొలిసారిగా 2007 ఫిబ్రవరిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి వారికి ఉపాధి హామీ కూలీల మస్టర్ రోల్స్ రాయడం, పనులను పర్యవేక్షించడం, తదితర బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆ తర్వాత జాబ్ కార్డులున్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, తప్పనిసరిగా విధుల్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఆ తరువాత తమకు జీతాలు సబ్‌ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, తమను శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే పలు రకాల డిమాండ్లతో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం వారి సేవలను రద్దు చేసింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. ఈ అంశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ... తామంతా విధుల్లో చేరతామని ప్రకటించారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
వేసవి ‘ఉపాధి’లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత వేసవిలో ఏ పనులు దొరక్క అల్లాడుతున్న గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా 32,26,429 కుటుంబాలకు ఏప్రిల్ – మే నెలలో పనులు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ పనిదినాల పాటు పనులు కల్పన.. ఎక్కువ కుటుంబాలకు పనులు కల్పన.. రెండు కేటగిరిల్లోనూ దేశంలో మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో నిలిచింది. వేసవిలో 2.51 కోట్ల పనులు కల్పించగా... అందులో 32.26 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలవగా.. తమిళనాడు, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వరుసగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, గడిచిన రెండు నెలల్లో 7,60,48,307 పనిదినాల పాటు పేదలకు పనులు కల్పించి దేశంలోనే అత్యధిక పనిదినాలు కల్పించిన రాష్ట్రంగా ముందంజలో ఉంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. రెండు నెలల్లో రూ. 1392 కోట్లు లబ్ధి.. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లోనూ పేదలు ఈ రెండు నెలల్లో రూ. 1392.72 కోట్ల మేరకు లబ్ధి పొందారు. ఇందులో మూడో వంతు ఎస్సీ, ఎస్టీ వర్గాలే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పనులకొచ్చే కూలీలు ఎండల కారణంగా ఉదయం 6.30 గంటలకే పనులు మొదలుపెట్టి 9 గంటల కల్లా ఒక విడత ముగిస్తున్నారు. కూలీలకు ఇష్టమైతే సాయంత్రం మరో విడత కూడా పనులు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. దీంతో రోజుకు సరాసరిన ఒక్కొక్కరికీ రూ.195 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతుంది. మూడో విడతగా మరో రూ. 670 కోట్లు ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన కూలీలకు వేతనాల రూపంలో చెల్లించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్– మే)లో మూడో విడతగా శుక్రవారం మరో రూ. 670.58 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి విడతగా రూ. 929.20 కోట్లు, రెండో విడతగా రూ. 228.91కోట్లను మదర్ శాంక్షన్‌గా మంజూరు చేసిందని, అంటే ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 1828.69 కోట్లకు మదర్ శాంక్షన్ ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు. కాగా ఇప్పటివరకు రూ. 955.49 కోట్లు రోజువారీ వేతన ఎఫ్టీవోల అప్లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని తెలిపారు. పనిచేసిన మూడు రోజుల్లోనే కూలీల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. -
‘ఉపాధి హామీ’ని మెరుగుపరచాలి!
‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు 100 రోజుల పని దినాలను కల్పించే లక్ష్యంతో అమల్లోకి వచ్చింది. యంత్రాలు వినియోగించ కుండా, కాంట్రాక్టర్లతో పనులు చేయించకుండా పూర్తిగా ప్రజల తోనే పనులు చేయించేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. 2005లో పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సందర్భంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం చట్టపరంగా ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయింది. ఉపాధిహామీ చట్టం 2005 ప్రకారం...18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో వంద రోజుల పాటు ప్రభుత్వం పని కల్పించాలి. పనిచేస్తామని దరఖాస్తు చేసుకున్న వారం దరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. వికలాంగులు, అంతరించిపోతున్న ఆదివాసి జాతులకు ప్రత్యేకంగా జాబ్ కార్డు ఇచ్చి, రెండు వారాలలోపు కచ్చితంగా పని కల్పించాలి. పని కోరినవారందరికీ పనులు చూపించాలి. పనిస్థలాలలో నీడ ఏర్పాటు చేయాలి. కార్మికులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలి. కార్మికులకు పనికి అవ సరమైన సామగ్రిని ప్రభుత్వమే కార్మికులకు ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులు చేసిన పనికి ఏ రోజుకారోజు కొలతలు తీసుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి వేతనాలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ఆ 15 రోజులు చేసిన పనికి రోజువారీ వేతనం ఎంత పడిందో వేతన రశీదు(పే స్లిప్)ను ముందే కార్మికులకు ఇవ్వాలి. చట్టప్రకారం ఉపాధి హామీ కార్మికుడు మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, అంగ వైకల్యం పొందితే 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. అర్హత గలవారు పనికావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి జాబ్‌కార్డ్ ఇవ్వడంలేదు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది జాబ్ కార్డుకు అర్హత కలిగి ఉన్నప్పటికీ 13 కోట్ల మందికి మాత్రమే జాబ్ కార్డులు ఇచ్చారు. వందరోజుల పని కల్పిం చకుండా 50 నుండి 75 రోజుల పాటే పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రత్యేక యంత్రాంగం లేదు. చాలా చోట్ల కూలీలకు నీడ కల్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు, సౌకర్యాల కోసం ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించడంతో జరిగిన పనిని రోజూ కొలతలు, లెక్కలు వేయడంలేదు. పదిహేను రోజులకు ఇవ్వ వలసిన వేతనాలు 12 వారాలు దాటినా ఇవ్వడంలేదు. ఉపాధిహామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం కేటాయింపులు బడ్జెట్లో 4 శాతం నుండి 1.5 శాతానికి క్రమంగా తగ్గించారు. 2021లో మోదీ ప్రభుత్వం ఉపాధి హామీపనులకు బడ్జెట్ కేటాయింపులు పెద్ద మొత్తంలో తగ్గించటమే కాకుండా చట్టంలో సవరణలు చేసింది. పనిచేసిన కార్మికులందరికీ ఒకే దఫా వేతనాలు ఇప్పటి వరకు ఖాతాలలో వేసేవారు. చట్ట సవరణ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వేరువేరుగా వేతనాలు వేస్తున్నారు. ఇది కలిసిమెలిసి ఉండే కార్మికుల మధ్య కులాల పేర, మతాలపేర చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రలో భాగమే అనుకోవాలి! (క్లిక్: అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?) దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో కొంత ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకం కింద పనిచేస్తున్నవారిని కూలీలుగా చూడకుండా కార్మికులుగా గుర్తించాలి. నైపుణ్యతలేని (అన్ స్కిల్డ్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వేతనాల జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి. సమస్యల పరిష్కారానికై కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. (క్లిక్: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) – జె. సీతారామయ్య ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు -
Photo Feature: ‘ఉపాధి’కి రండి..
కమ్మర్పల్లి (నిజామాబాద్): మండలంలోని హాసాకొత్తూర్‌లో శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి పనులకు రావాలని కోరుతూ గ్రామంలో ఇంటింటా బొట్టు పెట్టి పిలిచే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఏనుగు పద్మ, ఉపాధి హామీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కూలీలకు బొట్టు పెట్టి ఉపాధి హామీ పనులకు రావాలని ఆహ్వానించారు. ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, జీపీ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, సిబ్బంది రమణ, వార్డు సభ్యులు కుందేటి పుష్ప, మేట్లు పాల్గొన్నారు. -
ఉపాధి.. మరింత పెరిగేలా
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఇప్పుడు అందుతున్న కూలి కంటే ఎక్కువ మొత్తం దక్కేందుకు వీలుగా పనిగంటలు పెంచుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల డ్వామా పీడీలకు, ఉపాధి హామీ పథకం సమన్వయకర్తలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకం కింద పనిచేసే వారికి సరాసరిన రూ. 221ల చొప్పున కూలి అందుతోంది. అయితే, మన రాష్ట్రంలో గరిష్టంగా రూ.245 చొప్పున కూలి ఇచ్చే అవకాశముంది. ఇందుకనుగుణంగా రోజు వారీ కూలీ రూ.245 వచ్చేలా కూలీల పనిగంటలు పెంచుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీచేశారు. వేసవిలో రెండు పూటలా హాజరయ్యేలా.. ఇక రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉ.6 గంటల నుంచి 10 గంటల మధ్య.. మళ్లీ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు కూలీలు హాజరయ్యేలా చూస్తే మంచిదని జిల్లా అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు.. కూలీలకు ఎక్కువసేపు పనిచేసి, ఎక్కువ మొత్తంలో వేతనం పొందేలా ప్రతి శ్రమశక్తి సంఘం (ఎస్ఎస్ఎస్ గ్రూపు)లో 40 మంది కూలీలు సభ్యులుగా ఉండేలా చర్యలు చేపట్టాలని కూడా కమిషనర్ జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి గ్రూపులో చదువుకున్న మహిళను మేట్‌గా నియమిస్తే ఆమెను వర్క్‌సైట్ సూపర్వైజరుగా గుర్తిస్తారు. కూలీల సమీకరణ, ప్రతి కూలీకి రూ.245 చొప్పున వేతనం దక్కేలా ఆయా కూలీలకు పనిని మార్కింగ్ చేసి ఇవ్వడం, పనికి హాజరయ్యే కూలీల మస్టర్లు నమోదు వంటి విధులను మేట్ నిర్వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మేట్ నమోదు చేసే మస్టర్లను గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్ ధృవీకరించి సంతకం చేయాల్సి ఉంటుంది. రోజూ లక్ష మందికి పని.. గ్రామాల్లో వ్యవసాయ పనులు తగ్గుముఖంపడుతుండడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన పెంపుపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టి పెట్టింది. ఇక నుంచి వచ్చే 40 రోజులతోపాటు ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం లక్ష మందికి ఉపాధి పనుల కల్పనకు సిద్ధంగా ఉండాలని గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా 13 జిల్లాల్లో మార్చి నెలాఖరులోగా ఐదు కోట్ల పనిదినాల పనుల కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ అధికం, కేంద్రం ప్రశంసల వర్షం
అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో పసల వెంకటేసులు కుటుంబం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉపాధిహామీ పథకంలో పనులు చేసింది. ఈ 4 నెలల్లో రూ.24,504 సంపాదించుకుంది. ఇదే కాలంలో ఆ గ్రామంలో మొత్తం 1,341 కుటుంబాలకు ప్రభుత్వం పనులు కల్పించింది. ఆ ఒక్క గ్రామంలోనే కూలీలు రూ.2.41 కోట్లను వేతనాల రూపంలో పొందారు. సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కువమంది గ్రామీణ పేదలకు ప్రభుత్వపరంగా పనులు కల్పిస్తున్నది మన రాష్ట్రంలోనే. దేశంలోనే ఉపాధిహామీ పథకం కింద ఎక్కువమందికి పనికల్పించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు జవాబుగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై నెలాఖరు వరకు 4 నెలల కాలంలో ఉపాధిహామీ పథకం ద్వారా మన రాష్ట్రంలో 71.90 లక్షల మందికి ప్రభుత్వం పనులు కల్పించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో 65.53 లక్షల మందికి అక్కడి ప్రభుత్వం పనులు కల్పించింది. కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 34 రాష్ట్రాలు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్ సహా 6 రాష్ట్రాలు మాత్రమే ఈ 4 నెలల కాలంలో వారి రాష్ట్రాల్లో 50 లక్షల మంది కన్నా ఎక్కువమంది పేదలకు పనులు కల్పించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ పేర్కొంది. రాష్ట్రంలో 1.03 కోట్ల మంది ఉపాధి హామీ పథకంలో కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకుంటే, అందులో 70 శాతం మందికి పైగా ప్రభుత్వం ఈ కరోనా విపత్తు కాలంలో పనులు కల్పించడం గమనార్హం. రోజుకు సరాసరి కూలి రూ.221 రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు ఈ 4 నెలల్లోనే రూ.4,485 కోట్లను వేతనాల రూపంలో చెల్లించినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు తెలిపారు. ఒకరోజు పనిచేసినందుకు ఒక్కొక్క కూలీకి సరాసరిన రూ.221 వంతున గిట్టుబాటు అయినట్టు చెప్పారు. -
దారుణం: ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో సర్పంచ్ దాడి
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాధి హామీ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజుపై పాత సావ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన తోటి ఉద్యోగులు మంటలను అర్పారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపటంతో చికిత్స కోసం బైంసాకు తరలించారు. ఉపాధి పనుల విషయంలో సంకతం చేయాలని సర్పంచ్ సాయినాథ్ కోరగా, రాజు నిరాకరించడంతో పెట్రోల్ పోసి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పెట్రోల్ దాడిపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. సర్పంచ్ సాయినాథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘ఉపాధి’లో గోల్మాల్ : జాబ్ కార్డులపై దీపికా, జాక్వెలిన్ ఫోటోలు
భోపాల్ : జాతీయ ఉపాథి హామీ పథకానికి సంబంధించి మధ్యప్రదేశ్‌లో మరో గోల్మాల్ చోటుచేసుకుంది. జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్, కార్యదర్శి కలిసి బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటోలతో పథకం లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఆయా ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్ కార్డులను ఉపయోగించారు. మోనూ దూబే జాబ్ కార్డుపై దీపికా పడుకోన్ ఫోటోను ఉపయోగించారు. మోనూ దూబే పనికి వెళ్లకపోయినా ఆయన పేరుతో నకిలీ జాబ్ కార్డు ఉపయోగించి 30 వేల రూపాయలను డ్రా చేశారు. ప్రతినెలా ఈ నిర్వాకం యదేచ్ఛగా సాగించారు. ఇక సోను అనే మరో లబ్ధిదారు పేరిట జాబ్ కార్డుపై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో ఉపయోగించారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంతో అక్రమ వ్యవహారం గుట్టు రట్టయింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద తమకు ఎలాంటి పనులు రాకపోయినా సర్పంచ్, కార్యదర్శి, ఉపాథి హామీ అసిస్టెంట్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని కార్మికులు వాపోయారు. నకిలీ జాబ్ కార్డులు సృష్టించి ఆయా ఖాతాల నుంచి సొమ్మును మాయం చేసిన ఘటనపై జిల్లా పంచాయితీ సీఈవో గౌరవ్ బెనల్ విచారణకు ఆదేశించారు. చదవండి : ఒంటరి మహిళపై సామూహిక లైంగిక దాడి -
16న కలెక్టర్లతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొననున్నారు. వ్యవసాయం తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. -
ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు: సోనియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్జీఎన్ఆర్ఈజీఏ) విషయమై ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని బీజేపీ అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారని సోనియా గాంధీ ఆరోపించారు. ఈ పథకాన్ని మూసివేయడం ఆచరణాత్మకం కాదని గ్రహించి అపహాస్యం చేయడానికి మోదీ ప్రత్నించారని ఓ ఆంగ్లపత్రికలో తన అభిప్రాయాన్ని సోనియా గాంధీ వ్యక్తం చేశారు.(‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు) లాక్డౌన్లో పేద ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలో ఉండగా ఈ పథకం తన ప్రాముఖ్యతను కొనసాగించిందన్నారు. అనంతరం బీజేపీ అధికారంలో వచ్చాక దీన్ని అణగదొక్కడానికి ప్రయత్నించి, చివరకు అయిష్టంగానే కొనసాగించిందని చెప్పారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి సజీవ స్మారక చిహ్నం ఎమ్జీఎన్ఆర్ఈజీఏ అని పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొన్న ప్రభుత్వం, యూపీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధిహామీ పథకం విషయంలో నిర్లక్ష్యాన్ని వదలాలని హితవుపలికారు. (పీఐబీ ఛీఫ్‌కు కరోనా పాజిటివ్..) ‘ఇది జాతీయ సంక్షోభ సమయం, రాజకీయాలు చేసే సమయం కాదు. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సమస్య కాదు. మీ చేతిలో శక్తివంతమైన యంత్రాంగం ఉంది. దయచేసి భారతదేశ ప్రజలకు అవసరమైన సమయంలో వారికి సహాయపడటానికి దీనిని ఉపయోగించండి’ అని సోనియా గాంధీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.(ఢిల్లీ నిర్ణయంపై మాయవతి అభ్యంతరం) -
‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు
లక్నో : కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పోయి సొంతూరుకు చేరుకున్న నిరుద్యోగులు ‘ఉపాధి హామీ’ పనులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా, ఏప్రిల్ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్జీఎన్ఆర్ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 లక్షల మంది వలస కార్మికుల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అయితే వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. యూపీ రాజధాని లక్నోకి150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునైద్‌పుర్ గ్రామానికి చెందిన రోషన్ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాడు. పీజీ చదువుకున్న రోషన్ రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేయడానికి ముందుకొచ్చాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోవడంతో ఇంటికొచ్చానని ఎంఏ డిగ్రీ చేసిన కుమార్ అన్నాడు. బీబీఏ డిగ్రీ పట్టా ఉన్నా, సరైన పని దొరకలేదు. చివరకు 6నుంచి 7వేల జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, లాక్‌డౌన్‌తో అదికూడా పోయింది. అందుకే తిరిగి ఇంటికి వచ్చానని తెలిపాడు. తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే లాక్డౌన్ వచ్చిందని సుర్జిత్ కుమార్ అన్నాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారని జునైద్‌పుర్ గ్రామపెద్ద వీరేంద్ర సింగ్తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి 2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం కానుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. -
ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలి
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్డౌన్ ప్రకటించి, అందరూ ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తూనే మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఏప్రిల్ నుంచి వేగవంతం చేసింది. కూలీలు 20–25 మంది బృందాలుగా ఏర్పడి ఒకేచోట పనులు చేస్తున్నారు. భౌతికదూరాన్ని పాటించేందుకు అవ కాశం లేదు. కుటుంబ పోషణకు గత్యంతరం లేకనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొనైనా వీరు పనులకు వెళ్లక తప్పడం లేదు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 13.65 కోట్ల జాబ్‌కార్డులున్న కుటుంబాలున్నాయి. తెలంగాణలో 52.46 లక్షల కుటుంబాలున్నాయి. ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా రూ. 211 నుంచి రూ. 237కు నామమాత్రంగా పెంచుతూ ఈ మేరకు మార్చి 26న ప్రధానమంత్రి ప్రకటన చేశారు. రోజుకు ఏడు గంటలు పని చేస్తేనే పెరిగిన కూలి వర్తిస్తోంది. ఈ పెంపు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా తమకు రోజూ రూ. 100–150 లోపే అందుతోందని కూలీలు వాపోతున్నారు. పైగా పని ప్రదేశాలకు సుమారు 5–6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. కనీసం రూ. 500 వరకూ చెల్లించాలని వీరు కోరుతున్నారు. పైగా వీరికి పని ప్రదేశాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. వేసవి కావడంతో ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో టెంట్ సౌకర్యం కల్పించాలి. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ వైద్యం కోసం మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలి. ఇవన్నీ కల్పించాలని ఉపాధి చట్టంలో పేర్కొన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తాగడానికి నీటి ఏర్పాటు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచే కూలీలు తెచ్చుకుంటున్నారు. రైతుబంధు పథకం లాగానే కూలీబంధు పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. వ్యవసాయ, ఇతర అన్ని రకాల పనులు ఎక్కువగా కష్టపడి పని చేస్తున్న శ్రామికవర్గం ఈ కూలీలే. ఎక్కువ పేదరికం అనుభ విస్తుంది కూడా వీరే. వీరికి బీమా సౌకర్యం కల్పించాలి. పని లేని సమయంలో నెలకు రూ.7500 భృతి అందించాలి. ప్రస్తుతం సంవత్సరంలో వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు. కనీసం 150–200 రోజులకు పొడిగించాలి. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. వృద్ధ కూలీలకు పెన్షన్ కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకూ వర్తింపజేయాలి. పట్టణాల్లోనూ అత్యధిక సంఖ్యలో కూలీలున్నారు. ఏడాదిలో కొన్ని మాసాలు ఎలాంటి పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వికలాంగ కూలీలకు కూడా ఉపాధి హామీలో తీరని అన్యాయమే జరుగుతోంది. వీరితో స్థానికంగా గ్రామ శివారుల్లోనే పనులు చేయించాలి. కానీ దూర ప్రాంతాల్లో రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో నున్న లోతైన కాల్వ పనులు, వారు చేయలేని పనులు చేయిస్తున్నారు. పైగా వీరు చేసే పనికి అదనంగా 40 శాతం కూలి కలిపి ఇవ్వాల్సి వుండగా, చేసిన పనికి మాత్రమే ఇస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో న్యాయంగా రావాల్సింది అందించాలి. రాష్ట్రంలో 7,800 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గత 14–15 ఏళ్లనుంచి నామ మాత్రపు వేత నాలతో పని చేస్తున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ చదు వుకున్నా ఉద్యోగావకాశాలు లేక ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేస్తున్నారు. వారి న్యాయమైన డిమాండ్లయిన నెలకు 10 వేల రూపాయల వేతనం ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలనీ మార్చి 12 నుంచి 23 వరకూ సమ్మెలో ఉన్నారు. కానీ ప్రభుత్వం వారిని నిరంకుశంగా సస్పెండ్ చేయడంతో వీధిన పడ్డారు. గతంలో చేసిన పనులకు సైతం జీతాలు నిలుపుదల చేశారు. దీంతో ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనులు ఫీల్డ్ అసి సెంట్లు లేకుండానే జరుగుతున్నాయి. ఆ బాధ్యతను ఎలాంటి అనుభవం లేని గ్రామ కార్యదర్శులకు బల వంతంగా అప్పజెప్పారు. ఇన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్ ఎత్తివేసి, వారిని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించే బడ్జెట్‌తోపాటు, ప్రతి సంవ త్సరం అదనంగా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తోంది. కొలతతో సంబంధం లేకుండా గిట్టుబాటు కూలీ లను చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా పనులు కల్పిస్తోంది. ఈ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా తగు చర్యలు చేపట్టాలి. – వ్యాసకర్త: జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు -
రికార్డు స్థాయిలో ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పో యి సొంతూరుకు చేరుకున్న సామాన్యులకు ‘ఉపాధి హామీ’లభించింది. చేతినిండా పని కల్పించింది. వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరుకోవడం, లాక్డౌన్ కారణంగా మిగతా పనులు బంద్ కావడంతో ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. (చదవండి:సహజీవనం చేయాల్సిందే) రికార్డు స్థాయిలో.. ఉపాధి హామీ పనులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి 16 లక్షల మంది కూలీలు పనిచేయగా.. ఈసారి ఏకంగా 23 లక్షల మంది పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌తో కొన్నాళ్లు పనులకు బ్రేక్ పడినా గత నెలాఖరు నుంచి జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి నెలాఖరులో కేంద్రం ఉపాధి హామీలను తాత్కాలికంగా నిలిపేసింది. గుంపులు గుంపులుగా పనిచేసే వీలుండటంతో వైరస్ ప్రబలే అవకాశముందని భావించిన కేంద్రం.. కొన్నాళ్లు ఆపేసింది. ఆ తర్వాత ఉపాధి పనుల నిర్వహణకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడమే కాకుండా కూలి మొత్తాన్ని కూడా పెంచింది. రోజువారీ కూలిని వివిధ అలవెన్స్‌తో కలిపి రూ.237 చేసింది. తొలుత కరోనా భయంతో పనులు చేసేందుకు కూలీలు వెనుకడుగు వేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల మొదటివారంలో పనులకు వచ్చే కూలీల సంఖ్య 10 వేలు కూడా దాటలేదు. అయితే పంచాయతీ కార్యదర్శులు, మేట్లు అవగాహన కల్పించడం, జాగ్రత్తలు తీసుకోవడంతో క్రమేణా కూలీల సంఖ్య పెరిగింది. వ్యవసాయ పనులు చివరి దశకు చేరడం, లాక్‌డౌన్‌తో ఇతర పనులన్నీ బంద్ కావడంతో గ్రామాల్లోని కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. దీంతో పక్షం రోజుల క్రితం 12.51 లక్షలున్న కూలీల సంఖ్య.. తాజాగా 23 లక్షలకు చేరువైంది. గ్రామాల్లో జాబ్ కార్డుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇన్నాళ్లూ వలస వెళ్లిన గ్రామీణులు తిరిగి రావడం.. ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం కొత్త జాబ్ కార్డులు జారీ చేస్తోంది. (చదవండి: ఇక పరీక్షల్లేకుండానే..!) -
ఉపాధి పనులు.. అవినీతి పుట్టలు
సాక్షి, చిట్టమూరు (నెల్లూరు): మండలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతి జరిగినట్లు సోషల్ ఆడిట్ బృందాలు బట్టబయలు చేశాయి. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం డ్వామా అడిషనల్ పీడీ నాసర్‌రెడ్డి ఆధ్వర్యంలో 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జరిగిన పనుల్లో మండలంలోని 23 పంచాయతీల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 1,699 పనులకు రూ.6,75,20,524 మేర పనులు జరిగాయని అధికారులు ధ్రువీకరించారు. మండలంలో ప్రధానంగా యాకసిరి, మెట్టు, ఎల్లసిరి, ఆలేటిపాడు, అరవపాళెం, ఆరూరు, మొలకలపూడి పంచాయతీల్లో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు తనిఖీ బృందాలు సమావేశంలో చదివి వినిపించారు. యాకసిరి పంచాయతీలో సుమారు 25 మంది పనికి రాకపోయినా, వారికి మస్టర్లు వేసి కూలి నగదు దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. చేసిన పనుల్లో కూడా రికార్డులో చూపిన క్యూబిక్ మీటర్లు పని క్షేత్రస్థాయిలో అంత పని జరక్కపోగా నిధులు మాత్రం డ్రా చేశారన్నారు. ఇదే పంచాయతీ కృష్ణనాయుడుకండ్రిగ గ్రామస్తులకు కావాలనే పనులు కల్పించలేదని కూలీలు తెలిపారన్నారు. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించకుండా పనులు చేశారన్నారు. ఎల్లసిరి, మొలకలపూడి పంచాయతీల్లో చెట్లు నాటకుండా నాటినట్లు రికార్డులు చూపడంతో పాటు, చెట్ల చుట్టూ ట్రీగార్డులు ఏర్పాటు చేసినట్లు రికార్డులు చూపి నిధులు దిగమింగినట్లు పేర్కొన్నారు. మస్టర్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేశారన్నారు. అరవపాళెంలో పనులకు రాకుండా వచ్చినట్లు హాజరు వేసి నగదు చెల్లింపులు చేశారన్నారు. గుంత పూడిక తీతకు సంబంధించి 144 క్యూబిక్ మీటర్లు పనులు చేయకుండా నిధులు డ్రా చేశారన్నారు. చెట్లు నాటకుండానే చెట్లు నాటినట్లు రికార్డుల్లో చూపి నగదు చెల్లింపులు చేశారన్నారు. ఆరూరు పంచాయతీలో పక్కాగృహాలకు సంబంధించి ఇంటింట నిర్మాణాలు పూర్తి కాకుండానే ఉపాధి పథకంలో కూలీల పేరుతో పూర్తి నగదు చెల్లింపులు చేశారన్నారు. పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదని తనిఖీ బృందాలు పేర్కొన్నాయి. పనులకు సంబంధించి గ్రామంలో గ్రామ సభ నిర్వహించకుండా ఇష్టానుసారంగా పనులు చేశారన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిధులు దుర్వినియోగం జరిగిన పనులకు సంబంధించి రికవరీ చేస్తామన్నారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ సురేష్ బాబు, ఐఎంపీ దుర్గమ్మ, ఎస్ఆర్పీ కనకారావు పాల్గొన్నారు. -
13 మంది ఉపాధి సిబ్బంది సస్పెన్షన్
సాక్షి, ఎర్రావారిపాళెం: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ఎర్రావారిపాళెం మండలానికి చెందిన 13 మంది ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ అడిషనల్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ సోమవారం ఆదేశాలిచ్చారు. మరోవైపు మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించి పది మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. సామాజిక తనిఖీల్లో భాగంగా మండల వ్యాప్తంగా జరిగిన 800 ఉపాధిహామీ పనుల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. 2018–19 వార్షిక సంవత్సరానికి రూ.7.5కోట్ల మేర ఎర్రావారిపాళెం మండలంలో ఉపాధి నిధులు ఖర్చుచేశారు. ఈ పనులను తనిఖీ చేయడానికి పది రోజుల నుంచి మండలంలో ఎస్ఆర్పీ వెంకటేష్ నాయక్ సారధ్యంలో 12 మందితో కూడిన 12వ సామాజిక తనిఖీ బృందం పరిశీలించింది. ఈ తనిఖీల్లో భారీ కుంభకోణాలు వెలుగుచూశాయి.ఉపాధిహామీ పథకంలో జరిగిన పలు అక్రమాలు, అవకతవకలను సోమవారం జరిగిన ఆడిట్ ఓపెన్ ఫాంలో బహిర్గతం చేశారు. పనులు లేకుండా బిల్లులు చేయడం, యంత్రాలతో పనులు చేసి కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్టు ఆడిట్ బృందం గుర్తించింది. పనుల వద్ద పనికి సంబంధించి వివరాలతో కూడిన బోర్డులు నిర్మించకపోవడం, ఎస్‌డబ్ల్యూపీసీ పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ బిల్లులు చేసినట్టు కనిపెట్టింది. నిర్దేశిత పనికి మంజూరైన బిల్లులకు మించి అదనంగా బిల్లులు చెల్లించినట్టు నిర్ధారిం చింది. అనేక పనులను యంత్రాలతో చేసినట్లు అధికారులు వెల్లడించారు. పనులకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించక పోగా గ్రామ సభ తీర్మానాలు ఒక్క పనికి ఇవ్వనట్లు పేర్కొన్నారు. ఫాం పాండ్లు, ఫీడర్ చానల్, ఫిష్ పాండు, పొలాలకు రోడ్డు పనుల్లో అవకతవకలు బయటపెట్టారు. గతంలో సస్పెండైన వారివే అవకతవకలు గత ఆడిట్లో సస్పెండ్ అయిన ఉపాధి సిబ్బందిని టీడీపీ ప్రభుత్వం మళ్లీ కొనసాగించడంతో అవే తప్పులు మళ్లీ పునరావృతం కావడం విశేషం. గత ఆడిట్లో ఆరుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. అయితే ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న టీడీపీ నాయకులు పంతం పట్టి అదే సిబ్బందిని ఒత్తిడి చేసి విధుల్లో కొనసాగించారు. అప్పట్లో కొనసాగిన ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ మళ్లీ అంతకు మించి తప్పులు చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆరు నెలలు సస్పెన్షన్‌లో ఉన్న బీఎఫ్టీతో చెక్‌డ్యాంలకు ఏపీఓతో పాటు ఈసీలు సంతకాలు చేయించిన విషయాన్ని అడిషనల్ పీడీ గుర్తిం చారు. సస్పెన్షన్‌లో ఉండగా ఎలా సంతకాలు చేస్తారంటూ ఏపీఓను అడిషనల్ పీడీ ఆగ్రహించారు. తమ ప్రమేయం లేదు ఏపీడీ ఆదేశాల మేరకే అనుమతించామంటూ ఏపీఓ బదులిచ్చారు. అలానే రిపోర్ట్ ఇస్తే ఏపీడీని కూడా సస్పెండ్ చేస్తానంటూ సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరాధం, సస్పెన్షన్ వేటు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కమళ్ల, బోడేవాండ్లపల్లి, నెరబైలు, చెరుకువారిపల్లి, ఉస్తికాయలపెంట, యల్లమంద, వీఆర్ అగ్రహారం, ఉదయమాణిక్యం, కూరపర్తివారిపల్లి పంచాయతీలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓ, టీఏ, ఈసీ, బీఎఫ్టీలు మొత్తం 13 మందిని సస్పెండ్ చేశారు. అదేవిధంగా రూ.12.29 లక్షల రికవరీకి ఆదేశించారు. పనుల్లో జరిగిన కొలతలు, బిల్లులు మంజూరులో లోపాలు, తప్పుడు మస్టర్లు, బినామీ మస్టర్లు సృష్టించడం వంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. చెరువులో పూడిక తీత పనులు, చెక్‌డ్యాంలో కొలతలు తేడా, చెక్‌డ్యాంలు రాళ్లతో కట్టినట్టు గుర్తించడం, అంగన్వాడీ వర్కర్ల పేర్లతో బిల్లులు చేసినట్లుగా గుర్తించారు. పది మంది వెలుగు సిబ్బందిపై వేటు మండలంలో పలుచోట్ల మామిడి చెట్లు లేకుండానే వెలుగు సిబ్బంది బిల్లులు చేసినట్లుగా గుర్తించారు. దీంతో పదిమందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. మరోవైపు యంత్రాలతో చేసిన పనులకు కూలీల పేర్లతో బిల్లులు తీసుకున్నట్లుగా ఆధారాలను ఆడిట్ బృందం బహిర్గతం చేసింది. చింతగుంట పంచాయతీలో అవకతవకలు జరిగాయంటూ ప్రజలు విన్నవించారు. అక్కడ చేసిన పనులన్నీ పూర్తిస్థాయిలో లేకపోగా పలు పనులను పాత వాటికే బిల్లులు చేశారంటూ అడిషనల్ పీడీకి ఫిర్యాదుచేశారు. చింతగుంటలో రీ ఆడిట్‌కు అడిషనల్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ఆదేశాలిచ్చారు. ముందే చెప్పిన సాక్షి ఎర్రావారిపాళెం మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై సాక్షి దినపత్రిక పలు కథనాలను ప్రచురించింది. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని స్వార్థపరులకు కమీషన్‌కు అమ్మేస్తున్నారంటూ పలు కథనాల్లో పేర్కొంది. సాక్షి చెప్పినట్లే సోమవారం జరిగిన బహిరంగ సభలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. -
చేసింది చాలు..!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో గల ఉపాధి హామీ విభాగం హరితహారం సెక్షన్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన సెక్షన్లో పని చేసిన ఓ ఉద్యోగి హరితహారానికి సంబంధించిన గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ ఈ సెక్షన్లో పని చేసిన సదరు ఉద్యోగిని ప్రస్తుతం మొక్కలు నాటే కీలక సమయంలో సెక్షన్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనుకోకుండా సెక్షన్ తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చడంతో అక్రమ వసూళ్లు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఉపాధి హామీ విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో ఈ ఏడాది డ్వామా శాఖ ఆధ్వర్యంలో కోటి వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేయడానికి టేకు స్టంపులను టెండరు ద్వారా కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే హరితహారం విభాగానికి మొన్నటి వరకు జిల్లా పరిషత్‌కు చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ డ్వామాకు డిప్యూటేషన్‌పై వచ్చి పని చేశారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, పాలిథిన్ కవర్లు, టేకు స్టంపులు, నీటి ట్యాంకుల కొనుగోలు ఇతర విషయాలను మొదటి నుంచీ సదరు ఉద్యోగే చూశారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు వసూల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సెక్షన్ ఉద్యోగి పర్సంటేజీలు అడుగుతున్నట్లు నేరుగా డీఆర్‌డీవోకే గుత్తేదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అప్పటికే సదరు ఉద్యోగిపై అనేక ఫిర్యాదులు రావడం, విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి ఆరోపణలున్నాయి. కమీషన్లకు ఆశపడి డీఆర్డీవోనే తప్పుదోవ పట్టించి హరితహారంలో తెరచాటుగా వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగి వ్యవహారంపై సీరియస్ అయిన డీఆర్డీవో నెల క్రితం హరితహారం సెక్షన్ నుంచి తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చారు. సదరు ఉద్యోగిని సొంత శాఖ జిల్లా పరిషత్‌కు సరెండర్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉపేక్షించని డీఆర్డీవో.. హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై డీఆర్డీవో చర్యలు ఉపక్రమిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న వివిధ మండలాల్లోని ఐదారుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అయితే, డీఆర్డీవో కళ్లుగప్పి హరితహారం విభాగంలో గుత్తేదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో సెక్షన్ నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది. సెక్షన్ మార్చిన విషయం వాస్తవమే.. హరితహారం విభాగం చూస్తున్న ఉద్యోగిని వేరే సెక్షన్‌కు మార్చిన విషయం వాస్తవమే. అయితే, ఆ ఉద్యోగిపై అవినితీ ఆరోపణలు లేవు. సహజంగానే ఇతర సెక్షన్‌కు బదిలీ చేశాం. ఆరోపణలున్నాయనే విషయం నా దృష్టికి రాలేదు. – రమేశ్ రాథోడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
ఉపాధి పేరుతో స్వాహా!
పిఠాపురం: ఎప్పుడూ కూలికి వెళ్లని గృహిణి పేరున వేల రూపాయలు బ్యాంకు అక్కౌంటులో జమవుతున్నాయి ... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మందికి పైగా పనులు చేయకుండానే ఉపాధి కూలీలుగా రికార్డుల్లో నమోదవుతూ బ్యాంకు అకౌంట్లలో వేలకువేల రూపాయలు జమవుతున్నాయి. జాబ్ కార్డు ఉండి కూడా సంవత్సరాల తరబడి పని లేక అధికారుల చుట్టూ తిరుగుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నా వారికి పని కల్పించడం లేదు. పని చేసి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ మరెందరో రోదన. స్నేహాన్ని బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని కావల్సిన వారికి జాబ్ కార్డులు ఇప్పించి వారి పేరున రూ.కోటికిపైగా దోపిడీ చేసినా ఆ విషయం సామాజిక తనిఖీల్లో బయటపడినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు మండిపడుతున్నారు. బహిరంగంగా అవినీతికి పాల్పడినా అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడం... ఏ ఒక్క అధికారీ చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుండడంతో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరిలో అవినీతి చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఉపాధి పనుల్లో ఇలా అక్రమాలు చోటుచేసుకున్నా తనిఖీలకు వచ్చిన కేంద్ర బృందానికి మాత్రం అధికారులు అరచేతిలో స్వర్గం చూపించారు. బాగా చేసిన పనుల వద్దకు తీసుకువెళ్లి చూపించి అహో అనిపించారన్న విమర్శలున్నాయి. సామాజిక తనిఖీలలోనూ మసిపూసి మారేడుకాయ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిగో అవినీతి : కొత్తపల్లి మండలం కొమరగిరిలో 1139 జాబ్ కార్డులున్నాయి. ఈ ఏడాది 366 పనులు నిర్వహించగా రూ.1,07,17, 157 గ్రూపులకు చెందిన 1806 మంది కూలీలకు 37,255 పని దినాలు కల్పించినట్టు రికార్డుల్లో రాసి వేతనాలుగా చెల్లించారు. ∙సన్నిబోయిన కృష్ణ కుమార్. ఈయన ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. కానీ ఇతని పేరున ఉపాధి కూలీ జాబ్ కార్డు సృష్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన పేరున బ్యాంకు అక్కౌంటు నంబరు 32500283855 (ఎస్బీఐ కొమరగిరి)లో ఉపాధి కూలీగా సుమారు రూ.30 వేల సొమ్ము జమయింది. ∙కొమరగిరి శివారు ఆనందనగరానికి చెందిన బర్రె శిరీష. ఈమె వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తోంది. ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 33541674172 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ. 25 వేలు జమ చేశారు. ∙పిఠాపురంలోని ఓ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్న సాకా ప్రేమ సూర్యావతికి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 31942977225 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.40 వేలు జమ చేశారు. ఎప్పుడు కూలికి వెళ్లని గృహిణి కె.ఝాన్సీరాణి ఈమె ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆమె అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 20128460793 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు రూ.20 వేలు జమ చేశారు. ∙గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న నక్కా లోవ ప్రసాద్ ఉపాధి కూలీగా పని చేసినట్లు ఆయన అక్కౌంటుకు (అక్కౌంటు నంబరు 3273997893 ఎస్బీఐ కొమరగిరి) ఉపాధి నిధులు సుమారు రూ.15 వేలు జమ చేశారు. ఇవి కొన్ని మాత్రమే ఇలాంటివి కొమరగిరిలో కోకొల్లలు. ఎవరి పేరున జాబ్‌కార్డు ఉందో ఎంతమందికి ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉపాధి పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబ్ కార్డుల్లోనూ మాయాజాలం... కొందరు ఉద్యోగులు, ఆటో వాలాలు, గృహిణులు తదితరుల పేరున జాబ్‌కార్డులు సృష్టించి వారి ఖాతాలకు ఉపాధి నిధులు మళ్లించి వాటిని ఆయా కార్డు హోల్డర్ల ద్వారానే నిధులు డ్రా చేయించి స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి ఉపాధి హామీ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నేతల అండదండలతో తమకు నమ్మకమైన వ్యక్తులు బంధువులు, స్నేహితులకు జాబ్‌కార్డులు ఇప్పిస్తున్నారు. వారి ఖాతాలకు ఉపాధి పని చేసినట్లుగా కూలీ డబ్బులు వేయించి వారి సహకారంతో డ్రా చేసుకుంటున్నట్లు ఒక ఆటో డ్రైవరు ఉన్నతాధికారుల సమక్షంలో నిజాలను బయటపెట్టినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో సంబంధితాధికారులు నోరు మెదపడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. -
వానమబ్బు వెక్కిరిస్తే ‘ఉపాది’ మేఘం కురిసింది..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు మందగించడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో పనులు లేక.. కైకిలి రాక ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదరువుగా నిలుస్తోంది. ఈ కష్టకాలంలో పట్టెడన్నం పెడుతూ కల్పతరువుగా మారింది. సాగు పనులు లేకపోవడంతో రైతులు, కూలీలు ఎర్రటి ఎండల్లోనూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 1,547 జాబ్ కార్డులు ఉండగా.. వారిలో 740 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. అంటే దాదాపు సగం మంది ఉపాధి పనులనే నమ్ముకుని బతుకు బండి లాగిస్తున్నారు. రెంజల్ ఒక్కటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామీణ వ్యవసాయ కార్మిక, రైతు కుటుంబాలకు ఉపాధి పనులే అండగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఉపాధి పనుల నిమిత్తం చేసిన ఖర్చు చూస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఈ పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అత్యధికంగా 2018–19లో ఏకంగా రూ.3,026 కోట్లు ఖర్చు కావడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ చిన్న, సన్నకారు రైతాంగానికి కరువు కాలంలో ఉపాధి హామీ పనులు అండగా నిలుస్తున్న వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..! రబీ వట్టిపోయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది రబీ సీజన్ నిరాశాజనకంగా మారింది. 17 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు గతేడాది నైరుతి రుతుపవనాలు నిరాశాజనకంగా ఉండటం, ఆ తర్వాత వచ్చిన ఈశాన్య రుతుపవనాలూ అలాగే ఉండటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో నీటి వనరులు కూడా అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతో తాగు, సాగునీటికి కటకట ఏర్పడింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో కూడా గత మూడు నెలలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తేల్చి చెప్పింది. వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, సూర్యాపేట, నల్లగొండల్లో తీవ్ర వర్షాభావం ఉన్నట్లు తెలిపింది. గతేడాది మార్చిలో రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.88 మీటర్ల లోతులో లభించగా, ఈ ఏడాది మార్చిలో 13.40 మీటర్ల లోతుకి వెళ్లిపోయాయి. దీంతో నీళ్లు లేక చాలా పంటలు ఎండిపోయాయి. రబీలో సాగు చేసిన మొత్తంలో 30 శాతం మేర పంటలు ఎండిపోయినట్టు అంచనా. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.67 లక్షల (89%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.65 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 17.50 లక్షల (99%) ఎకరాల్లో నాట్లు పడ్డాయి. కానీ నీటి వనరులు లేకపోవడంతో పరిస్థితి ఘోరంగా మారింది. వ్యవసాయశాఖ తాజాగా వేసిన అనధికారిక అంచనా ప్రకారం దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయింది. రాష్ట్రంలో గత ఖరీఫ్, ప్రస్తుత రబీ సీజన్లలో కలిసి ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 92.35 లక్షల టన్నులు కాగా, 2017–18లో ఇది 96.20 లక్షల టన్నులుగా ఉంది. అత్యధికంగా రబీలో 15.65 లక్షల టన్నులు తగ్గింది. ఆదుకున్న ఉపాధి... వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరగకపోవడంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు పనులు దొరకడంలేదు. దీంతో అలాంటివారందరికీ ఉపాధి హామీ పనులే జీవనాధారంగా మారాయి. ఏకంగా రోజుకు రూ.4.5 కోట్ల మేర చెల్లింపులు జరుపుతూ వారిని అక్కున చేర్చుకున్నాయి. రాష్ట్రంలో 51.3 లక్షల జాబ్‌కార్డులుండగా.. 42.4 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 11.7 కోట్ల పనిదినాలు కల్పించగా, 25.2 లక్షల కుటుంబాలు ఈ పనులపై పూర్తిగా ఆధారపడ్డాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతుల్లో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. రబీలో పంటలు ఎండిపోవడం, సాగు పనులు సరిగా సాగకపోవడంతో వీరంతా ఉపాధి హామీ వైపు చూస్తున్నారని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఉపాధి పనులకు వెళుతున్నవారిలో చిన్న, సన్నకారు రైతులే కాకుండా.. 5 నుంచి పదెకరాలున్న అన్నదాతలు కూడా ఉన్నారని తేలింది. వీరితోపాటు నిరుద్యోగులకు కూడా ఉపాధి హామీయే భరోసా కల్పిస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న యువత కూడా ఉపాధి పనులకు వెళుతోంది. వ్యవసాయ పనులు లేక పట్టణాలకు వచ్చిన రైతులు, కూలీలు ఏవో చిన్నపనులు చేసుకుంటూ బతుకు బండి లాగిస్తుండగా.. గ్రామాల్లోనే ఉన్నవారు మాత్రం ఉపాధి హామీ పనులకు వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు. ఉపాధి పనులే ఆసరా ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్తున్న. వ్యవసాయ పనులు ముగియడంతో ఉపాధి హామీ పథకంలో కూలి పని ఆసరాగా ఉంది. రోజువారి కూలి కింద రూ.210 ఇస్తుండ్రు. అధికారులు చూపిన కొలతల ప్రకారం వారం రోజులు పనిచేస్తే రూ.1400 వస్తయి. అదే నెల రోజులకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు కూలి పడుతుంది. ఇప్పుడు వేసవికాలం కావడంతో వ్యవసాయ పనులు దొరకడం కష్టంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో దినసరి కూలీగా వెళ్లి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నాను. – కౌసల్యబాయి, ఉపాధి కూలీ, ఖిర్డి వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా నాకూ ఉపాధి దొరికింది నేను కూడా ఉపాధి కూలీ పనులకే పోతున్నా. చదువుకున్నప్పటికీ సరైన పనులు దొరకడంలేదు. వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి. అందువల్ల నాలాంటి యువత కూడా ఉపాధి హామీ పనుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఊరికే ఉండడం బదులు ఈ పనికి పోతే ఊరికి కొంత మేలు చేసిన సంతృప్తి కూడా మిగులుతుంది. – బొడపట్ల రమేష్, ఉపాధి కూలీ డిగ్రీ చదివినా ఉపాధే దిక్కైంది నేను డిగ్రీ చదివాను. నాన్నకు వ్యవసాయంలో చేదోడువాదోడుగానే ఉంటూ నా మిత్రులతో కలిసి ఉపాధి పనులకు వెళ్తున్నాను. దాదాపు పదేళ్లుగా ఉపాధి పనులు చేస్తున్నాను. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే మరింత బాగుంటుంది. అటు రైతుల కష్టాలు, ఇటు కూలీల కష్టాలు తీరతాయి. – సంజీవ్, జైనథ్ మండలం లక్ష్మీపూర్, ఆదిలాబాద్ జిల్లా వంద రోజుల పనే తిండి పెడుతోంది ఎండా కాలంలో ఉపాధి హామీ పథకమే వంద రోజుల తిండి పెడుతోంది. ఇప్పుడు వ్యవసాయ పనులు లేవు. వేసవి కావడం వల్ల ఉదయం 6 గంటలకు పనికి వెళ్లాల్సి వస్తుంది. రోజుకు రూ.200 వరకు కూలి వస్తుంది. వంద రోజుల పని లేకుంటే మా కుటుంబం పస్తులు ఉండాల్సి వస్తుంది. – జి.వనమ్మ, సీతానాగారం కరువు పనులతోనే కైకిలి నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. వరి వేసినం. నీరులేక ఎండిపోయింది. చేసేందుకు వేరే పని ఏదీ లేకపోవడంతో ఉపాధి పనికి పోతున్నాను. కరువు పనులతోనే కైకిలి దొరుకుతోంది. నిరుడు 100 రోజుల పనిపూర్తి చేసిన. ఈ పని దినాలను 150 రోజులకు పెంచితే నాలోంటోళ్లకు మరింత ఉపాధి కల్పించినట్లు అవుతుంది. – వంగపెల్లి మల్లవ్వ, నిజామాబాద్ పూడిక పనులకు వెళ్తున్నా నెల రోజుల నుంచి నల్ల చెరువుల పూడిక తీత పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు లేని కరువు పరిస్థితుల్లో వంద రోజుల పనితో ఉపాధి పొందుతున్నాం. నాలుగు వారాల నుంచి వంద రోజుల పనికి పోతున్నా. – టి.సాంబయ్య, కానిపర్తి, వరంగల్ అర్బన్ జిల్లా సరిపడా పరదాలు లెవ్వు వంద రోజుల పనికి రోజుకు 200 మంది దాకా పోతున్నాం. ఉన్న రెండు పరదాలు ఇంత మందికి సరిపోతలెవ్వు. ఇంకో వారం పది రోజులైతే ఇంకా ఎక్కువ మంది వత్తరు. వంద రోజుల పని కాడ నీడ కోసం అందరికి సరిపడా పరదాలు లేక ఇబ్బంది అవుతుంది. ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లెవ్వు. రెండేండ్ల నుంచి గడ్డపారలు ఇయ్యనేలేదు. – కన్నెబోయిన సరోజన, కానిపర్తి ఈ పని లేకపోతే డొక్క ఎండుడే కరువు కాలం మోపయింది. వానలు పడక చెరువులు, కుంటలు మొత్తం ఎండిపాయే. తాగుదామంటనే నీళ్లు దొరుకుతలేవాయే. ఇగ వ్యవసాయం ఎట్ల చేసుడు. ఉపాధి హామీ పథకంతోనే ఇంత పనులు దొరికి ఇళ్లు గడుస్తోంది. ఈ పని కూడా లేకపోతే ఆకలితో మాడి డొక్కలు ఎండుడే. – రెడ్డి శంకర్, ఉపాధి కూలి -
అరకొర వేతనాలు..అర్ధాకలి బతుకులు
నెల రోజులు పడిన కష్టానికి ఒకటో తేదీనే వేతనం అందితే ఉద్యోగులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్నాళ్లూ పడిన కష్టాన్ని ఆ క్షణంలో కాసేపు మరచిపోతారు. కానీ, చిరు వేతన జీవులకు చంద్రబాబు సర్కారు ఆ ఆనందాన్ని దక్కనివ్వడంలేదు. వేతనాలే కాదు.. బిల్లులు, ఇతర ఖర్చులు ఇవ్వకుండా వారిని ఏడిపిస్తున్నారు. టార్గెట్ చేరుకోలేదన్న కారణంతో జిల్లాలోని 255 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. జిల్లాలోని 10,500 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చేతి చమురు వదిల్చే ప్రచారం ప్రభుత్వం ప్రచారం కోసం అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుందనే ఆరోపణలున్నాయి. కేంద్రాల్లో తల్లులు, పిల్లలకు అవగాహన పేరుతో వివిధ రకాల ఈవెంట్లు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటి నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో అంగన్వాడీ కార్యకర్తలకు చేతి చమురు వదులుతోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. నెలకు రెండు కార్యక్రమాల వంతున ఆరు నెలలుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలను గత ఏడాదిగా నిర్వహిస్తున్నారు. నెలకు రూ.500 వంతున చెల్లించాల్సి ఉండగా, ఎనిమిది నెలలుగా చెల్లించాల్సిన ఈవెంట్ బకాయిలు రూ.2.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే రవాణా భత్యం రెండేళ్లుగా రూ.6.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలంటూ గతంలో పలుమార్లు అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా ఫలితం లేదు. మూడు నెలలుగా వేతనాలకు నోచని ‘ఆశ’ వర్కర్లు పీహెచ్‌సీల పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు గత మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. గతేడాది డిసెంబరు వరకు మాత్రమే వీరికి వేతనాలు చెల్లించారు. ఒక్కో ఆశ కార్యకర్తకు రూ.3 వేల గౌరవ వేతనం ఇస్తుండగా, మిగిలింది పనికి తగ్గ పారితోషికం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా పనికి తగ్గ పారితోషి కం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన. ఒక్కో ఆశ కార్యకర్త రూ.5 వేల పారితోషికానికి సరిపడా పనిచేసినా, కేవలం మూడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 4,500 మంది ఆశ వర్కర్లు ఉన్నారు. వివాహితలు గర్భవతులైనప్పటి నుంచి ఆరోగ్యపరంగా వారి బాగోగులు చూడడం, ఆస్పత్రికి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించడం, ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడడం వీరి బాధ్యత. చిన్నారుల ఆరోగ్య రక్షణకు టీకాలు వేయించేందుకు బాధ్యత వహిస్తారు. టీబీ పేషెంట్లకు మందులు సక్రమంగా అందజేయడం కూడా చేస్తారు. అయినా పనికి తగ్గ పారితోషికం రావడం లేదన్నది వీరి ఆవేదన. బిల్లుల కోసం గొల్లుమంటున్న అంగన్వాడీలు జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,113 అంగన్వాడీ, 433 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 10,500 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. ఇప్పటికే 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే వర్కర్లు, ఆయాలకు కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బిల్లులు బకాయిలున్నాయి. వేతనాలు రెగ్యులర్‌గా రావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ ఒక నెల వేతనం బకాయి ఉండగా, జిల్లావ్యాప్తంగా 800 మంది వరకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నాలుగైదు నెలల వేతనాలు వారి వేతన ఖాతాలకు జమ కాలేదు. ఇందుకు సాంకేతిక అవరోధాలే కారణమని పై అధికారులు చెబుతున్నట్లు అంగన్వాడీ వర్కర్లు, ఆయాల సంఘం నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గ్యాస్ బిల్లు, అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు, కాయగూరల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ రూపేణా కార్యకర్తలు, ఆయాలకు రూ.7.92 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు యూనియన్ నేతలు చెబుతున్నారు. అలాగే గత రెండేళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలకు రవాణా భత్యం చెల్లించడం లేదు. రవాణా ఖర్చులుగా సుమారు రూ.6.65 కోట్ల బకాయిలున్నట్లు సమాచారం. ప్రభుత్వం కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు గతంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదు. టార్గెట్ల పేరుతో ‘ఉపాధి’ సిబ్బందికి వేధింపులు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ల పేరుతో వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కూలీలకు ఉపాధి కల్పించేందుకు పనులు వెదకడం, జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉపాధి కల్పించడం ఫీల్డ్ అసిస్టెంట్ల విధి. ఏడాదిలో ఫీల్డ్ అసిస్టెంట్ పరిధిలో ఉన్న కూలీలకు 7,500 పనిదినాలు కల్పించక పోతేను జూనియర్ మేట్‌గా డిమోట్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విధంగా జిల్లాలో 2017–18లో 115 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు జూనియర్ మేట్లుగా మారగా, అంతకు ముందు సంవత్సరం మరో 120 మంది ఈ విధంగా డిమోట్ అయ్యారు. జిల్లాలో 956 మంది ఫీల్డ్ అసిస్టెంట్లలో 701 మందికి మాత్రమే ఎఫ్టీఏకు అర్హత సాధించారు. టార్గెట్ చేరుకోలేదని కారణంతో 255 మందికి ఎఫ్‌టీఏ ఇవ్వలేదు. అయితే తమను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన చేసినా ఫలితం కానరాలేదు.