లక్నో : కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పోయి సొంతూరుకు చేరుకున్న నిరుద్యోగులు ‘ఉపాధి హామీ’ పనులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా, ఏప్రిల్ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 లక్షల మంది వలస కార్మికుల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అయితే వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు.
యూపీ రాజధాని లక్నోకి150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునైద్‌పుర్ గ్రామానికి చెందిన రోషన్ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాడు. పీజీ చదువుకున్న రోషన్ రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేయడానికి ముందుకొచ్చాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోవడంతో ఇంటికొచ్చానని ఎంఏ డిగ్రీ చేసిన కుమార్ అన్నాడు. బీబీఏ డిగ్రీ పట్టా ఉన్నా, సరైన పని దొరకలేదు. చివరకు 6నుంచి 7వేల జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, లాక్‌డౌన్‌తో అదికూడా పోయింది. అందుకే తిరిగి ఇంటికి వచ్చానని తెలిపాడు.
తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే లాక్‌డౌన్ వచ్చిందని సుర్జిత్ కుమార్ అన్నాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారని జునైద్‌పుర్ గ్రామపెద్ద వీరేంద్ర సింగ్‌తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి 2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం కానుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment