లక్నో: పెళ్లి ఊరేగింపు, విజయోత్సవ ర్యాలీ వంటి వేడుకల్లో డీజే పెట్టడం సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం మిడతల దండును తరిమి కొట్టడం కోసం డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు. అది కూడా పొలాల మధ్యన. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఓ వైపు దేశం కరోనాతో అతలాకుతలమవుతోంటే.. మరోవైపు మిడతల దండు పొలాలపై దాడి చేసి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు మిడతల రూపంలో మరో నష్టం కళ్ల ముందు కనిపిస్తుంది. (వణికిస్తున్న రాకాసి మిడతలు)
గుంపులు గుంపులుగా మిడతలు పొలాల్లో స్వైర విహారం చేస్తూ.. అన్నదాతను అశాంతికి గురి చేస్తున్నాయి. ఆఫ్రికా, యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మిడతలు భారతదేశంలో ప్రవేశించాయి. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో మిడతల దండు వీర విహారం చేస్తుంది. ఇప్పటికే రాజస్తాన్‌లో ఈ మిడతల దండు 50,000 హెక్టార్ల పంటను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతులు ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. మిడతలను తరిమేందుకు పొలాల మధ్యలో డీజే, లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేశారు.(రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే)
ఇప్పుడు గనక ప్రభుత్వాలు మిడతల సమస్యపై దృష్టి సారించకపోతే.. ముందు ముందు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే రానున్నది వర్షా కాలం. వరి, గోధుమ, పత్తి, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసిది ఈ కాలంలోనే. ఒక వేళ ప్రభుత్వాలు గనక ఇప్పుడు ఈ మిడతలను నివారించకపోతే.. రైతలు తీవ్రమైన పంట నష్టం చవి చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment