తాజ్ సందర్శనకు అనుమతి | Taj Mahal Reopens for Public After Six Months | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తాజ్ సందర్శనకు అనుమతి

Published Mon, Sep 21 2020 12:28 PM | Last Updated on Mon, Sep 21 2020 12:53 PM

Taj Mahal Reopens for Public After Six Months - Sakshi

లక్నో, ఆగ్రా: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా చారిత్రక కట్టడం తాజ్‌మహల్ సందర్శనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అన్‌లాక్ 4.0లో ఆరునెలల తరువాత సోమవారం నుంచి తాజ్‌మహల్‌ సందర్శనకు అనుమతించినట్టు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్‌ సంరక్షణ అధికారి అమర్‌నాథ్‌ గుప్తా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తాజ్‌మహల్‌ను మూసివేస్తామని, కోవిడ్-19 నిబంధనలను పర్యాటకులు తప్పనిసరిగా అనుసరించాలని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. అయితే, తాజ్‌మహల్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు టికెట్‌ ధర రూ.1,100 కాగా, స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్‌లో 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. పర్యాటకుల మధ్య దూరం, తనిఖీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది నిర్వహించనున్నారు.  ఇక తాజ్‌మహల్‌లోనికి ఎలాంటి వస్తువులు అనుమతించరు.. అంబులెన్స్‌ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రసిద్ధ ఆగ్రా కోటను సందర్శనకు కూడా సోమవారం నుంచి అనుమతించనున్నారు. (చదవండి: పాక్షికంగా దెబ్బ‌తిన్న తాజ్ మ‌హ‌ల్‌)

లాక్‌డౌన్ కారణంగా దేశంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌ 2.0లో చారిత్రక కట్టడాల సందర్శనకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. జులై 6 నుంచి తాజ్ మహల్‌కు పర్యాటకులను అనుమతిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేసింది. తాజ్‌మహల్‌ సందర్శన నిర్ణయాన్ని యోగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సందర్శకుల రాకతో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో తాజ్ సందర్శన వాయిదా పడింది. ఆరు నెలల తర్వాత తాజ్‌మహల్ తెరుచుకోనుండటంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు సైతం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల తర్వాత దుకాణాలు తెరిచామని, వ్యాపారం స్తబ్దుగా ఉన్నా తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులనైనా చూడగలుగుతామని సమీపంలో మార్బుల్ వస్తువులు దుకాణం యజమాని మునావ్వర్ అలీ (50) అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement