
మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం (ఫైల్‌ఫోటో)
చిన్నారుల మరణంపై చిదంబరం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆకలితో అలమటిస్తూ ముగ్గురు చిన్నారి బాలికలు మరణించిన ఉదంతంపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఉపాథి హామీ పథకం, ఆహార భద్రత చట్టాల అమలులో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఈ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగానే ఆకలి చావులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
ప్రజల క్షుద్బాధను తీర్చేందుకే జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని యూపీఏ సర్కార్ తీసుకువచ్చిందని, పేదలకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడం ఈ పథకం ఉద్దేశమని చిదంబరం వివరించారు. పేదల ఆకలి తీర్చే ఉపాథి హామీ పథకంతో పాటు ఆహార భద్రత చట్టాన్నీ మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని చిదంబరం ట్వీట్ చేశారు.
దేశంలో ఆకలితో చిన్నారుల మరణాలు సంభవించినంత వరకూ మనం సిగ్గుతో తలదించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులగా తిండిలేక ఢిల్లీలో ముగ్గురు మైనర్ బాలికలు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.